Tuesday, September 6, 2022

🔥🔥ఆదర్శ జీవనం🔥🔥

 🔥🔥ఆదర్శ జీవనం🔥🔥
                 

🌷ఆదర్శం అంటే, అద్దం అనే అర్థంతో పాటు మేలుబంతి, దృష్టాంతము, అనుకరింపదగినది, ప్రామాణ్యము అనే అర్థాలుకూడా ఉన్నాయి.

 🌷అలంకరించుకొన్న  ముఖం  ఎలా ఉందో చూసుకోవాలంటే, అద్దాన్ని ఆశ్రయించక తప్పదు.

🌷అలంకరణలో లోటుపాట్లను చూపించి, వాటిని సరి చేసు కోవటానికి అద్దం ఒక అవకాశం ఇస్తుంది. ఇది బాహ్య సౌందర్య  ప్రసాధన విషయం.

🌷దీనికి అతీతమైనది , అత్యవసరమైనది శీల సౌందర్యం. ఇది మానవులను ఉన్నతులను చేస్తుంది. అజరామరమైన కీర్తి ప్రతిష్ఠలను సమకూర్చుతుంది.

🌷దీనికి మరింత శోభ కలగాలంటే,  మహర్షుల ప్రవచనాలు, గాథలు, వారి ప్రవర్తనలు మార్గదర్శకాలుగా నిలుస్తాయి.

🌷ఒక తరం మరొక తరానికి అందించిన ఆదర్శాలు - దీపం నుంచి మరో దీపం వెలిగినట్లుగా (“దీప ప్రదీపాదివ”) క్రమంగా ఒక సంస్కృతిగా రూపుదిద్దుకుంటాయి.🪔🪔🪔🪔🪔

🔥🔥“యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః
స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ” 
– అటుంది భగవద్గీత. 🔥🔥

🌷శ్రేష్ఠుడు దేనిని ఆచరిస్తాడో దానినే ఇతరులు ఆచరిస్తారు. అతడు ఒక ప్రమాణాన్ని ప్రతిష్ఠిస్తే  లోకం దానిని అనుసరిస్తుంది. ఈ కారణంవల్ల ప్రతి వ్యక్తీ   శ్రేష్ఠత్వాన్ని నిలుపుకోవటానికి,  తన జీవితాన్ని ఆదర్శవంతంగా మలచుకోవటానికి కృషిచేయటంలో జీవనసార్థక్యం ఉంది.

🌷ఉపాధ్యాయుడు తన శిష్యులకు, తల్లిదండ్రులు తమ సంతానానికి,                 ఒక అధికారి తన తోటి ఉద్యోగులకు,               ఒక పీఠాధిపతి తన అనుయాయులకు, ఒక రాజకీయ నాయకుడు తన సిద్ధాంత ప్రచారకులకు లోకం మెచ్చే వ్యక్తిత్వాన్ని అలవడజేయాలంటే ముందుగా వారు ఆదర్శ జీవనులై ఉండాలి. ఆ జీవనం సమాజానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

🌷తైత్తిరీయోపనిషత్తులో ఆచార్యుడు, విద్యాభ్యాసం ముగించుకొన్న తన శిష్యులకు….

🔥🔥“యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని. నో ఇతరాణి.
యాన్యస్మాకగ్ం సుచరితాని తాని త్వయోపాస్యాని . నో ఇతరాణి🔥🔥

🌷”(నాయనా ! ఏవి దోషరహితాలైన కార్యాలో వాటినే నువ్వు ఉపాసించాలి. ఇతర కార్యాలు చేయవద్దు. మాలో ఏ సత్ప్రవర్తనాంశాలు ఉన్నాయో వాటినే నువ్వు స్వీకరించాలి. ఇతరములను కాదు)  అని మహోన్నతమైన సందేశం ఇస్తాడు.

🔥🔥రామాయణ సందేశం - 
"రామాదివ వర్తితవ్యం. న తు రావణాదివత్"

🌷(రాముని వలె ప్రవర్తించాలి. రావణాదులవలె కాదు) అని.

🌷రాముని సద్గుణాలు సర్వశ్రేష్ఠాలు కనుకనే ఆయన లోకంలో ఆదర్శ మానవునిగా ఆరాధింప బడుతున్నాడు.

🌷“తీర్థానికితీర్థం, ప్రసాదానికి ప్రసాదం” అన్నట్టు చదివిన ఉత్తమగ్రంథాలలోని విషయాలను అధ్యయనానికే పరిమితం చేయకుండా, ఆచరించినప్పుడే ఆదర్శం సుప్రతిష్ఠితమౌతుంది. అలాగే, ఆదర్శ ప్రబోధకులు కూడా  ఆచరణ శీలురు కావాలి. లేకపోతే వారికి విలువ ఉండదు. ప్రబోధించే అధికారమూ ఉండదు.

🌷మానవత్వపు విలువలు, నైతికత, ఆధ్యాత్మిక చింతన, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి ఆదర్శజీవనుడు అనిపించుకుంటాడు.

🌷తన తరువాత తరాలకు సమాదరణీయమైన ఒరవడిని చూపిన ఆ వ్యక్తికి మరణమే ఉండదు. అతడే దైవం అవుతాడు. 

No comments:

Post a Comment