🍀🌺🍀🌺🍀🌺🍀
నీకు నువ్వే దీపం
➖➖➖✍️
ఇద్దరు ప్రయాణికులు ఒక దారిలో కలిశారు.
ఒకతని దగ్గర లాంతరు ఉంది. ఇంకొకతని దగ్గరలేదు.
కానీ ఇద్దరూ కలిసి పక్కపక్కనే నడవడం వల్ల కాంతి ఇద్దరి మార్గాల్లో పరుచుకోవడం వల్ల మార్గం సుగమంగా ఉంది.
దీపం ఉన్న వ్యక్తి ఎంత సులభంగా అడుగులు వేస్తున్నాడో లాంతరు లేని వ్యక్తి కూడా అంతే అనాయాసంగా సాగుతున్నాడు.
కారణం దీపమున్న వ్యక్తితో బాటు దీపం లేని వ్యక్తి నడవడమే.
లాంతరు లేని వ్యక్తి తన దగ్గర లాంతరు లేదే అని దిగులు పడలేదు.
కారణం దాని అవసరం అక్కడ లేదు.
అట్లా ఇద్దరూ చాలా దూరం నడిచాక ఒక నాలుగురోడ్ల కూడలికి చేరారు. అప్పటి దాకా ప్రయాణం సాఫీగా సాగింది.
అక్కడినించీ దార్లు వేరయ్యాయి. లాంతరు ఉన్న వ్యక్తి కుడివేపుకి, లాంతరు లేని వ్యక్తి ఎడమవేపుకి వెళ్ళాలి.
లాంతరు ఉన్న వ్యక్తి కుడివేపు తిరిగి వెళ్ళిపోయాడు.
కాంతి అతనితో బాటు అతనికి దారి చూపిస్తూ వెళ్ళింది.
లాంతరు లేని వ్యక్తి ఎడమవేపుకి తిరిగి పది అడుగులు వేశాడో లేదో కాలు ముందుకు కదల్లేదు.
కారణం చీకటి.
అతనికి ఏడుపు వచ్చింది. లాంతరు ఉన్న వ్యక్తిని తలచుకున్నాడు. అతని దగ్గరగా తను నడుస్తున్నంత సేపూ ప్రయాణం అనాయాసంగా జరిగింది. అతను వెళ్ళిపోయాకా తన మార్గం అంధకారబంధురమయింది. తన దగ్గర కూడా కనీసం చిన్న దీపమయినా ఉంటే ప్రయాణం సాఫీగా సాగేది కదా అని బాధ పడ్డాడు.
మనకు ఇతరులు కొంతవరకే మార్గం చూపిస్తారు.
తరువాత మనదారి మనం వెతుక్కోవాలి.
చివరిదాకా ఎవరూ ఎవరికీ దారి చూపరు.
గురువు చేసే పనయినా అదే.
గురువు దగ్గరున్న కాంతి కొంతవరకే దారి చూపుతుంది.
శిష్యుడు తనలోని దీపాన్ని వెలిగించుకున్నపుడు ప్రయాణం చివరిదాకా చేయగలడు.
నీకు నువ్వే దీపం అని బుద్ధుడనడం వెనక అర్థమదే.
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
No comments:
Post a Comment