Sunday, September 18, 2022

అహం పోవడమే నిజమైన ఆత్మవిచారణ

 *అహం పోవడమే నిజమైన ఆత్మవిచారణ*
                    ✍️ శ్రీ దేవిశెట్డి చలపతిరావు
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈

*అహమయం కుతో భవతి చిన్వతః*
*అయి పతత్యహం నిజ విచారణం*

🌈 ‘నేను’ (అహం భావన) అనే ప్రథమ తలంపు ఎక్కడ పుడుతోందో వెతికినట్లయితే అది పడిపోతుంది. అదే నిజమైన విచారణ.. ఆత్మవిచారణ అని దీని అర్థం. 

✅ భగవాన్‌ రమణులు మానవాళికి అందించిన 31 శ్లోకాల ఆత్మజ్ఞానం.. *‘ఉపదేశ సారం’* గ్రంథంలోని 19 వ శ్లోకమిది. 

🌈 మనో నాశనం కావాలంటే.. *‘నేను’* అనే అహం భావన తొలగిపోవాలని (పోగొట్టుకోవాలని) తెలిపిన రమణ మహర్షి.. అది ఎలా సాధ్యమో ఈ శ్లోకం ద్వారా వివరించారు. 

🌈 ఇందులోని ‘నేను (అహమయం)’
ఏ ‘నేను’? పూజ, జపం, చింతనం, ప్రాణబంధనం మొదలైనవాటిలో ఏదో ఒక సాధన సాయంతో ఇదం భావనలు, సంకల్పాలు, ఆలోచనలను ఆపుకొన్న తర్వాత, ఆ ఆలోచనలన్నింటికీ ఆధారంగా మిగిలి ఉండే   ‘నేను’ అనే భావన.. ఏది ఉందో అదే రమణులు చెబుతున్న ‘నేను’. 

🌈 దీన్ని పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. పాదరసంలా జారిపోతుంది. అలాగని వదిలేస్తే ఈ ‘నేను’ అనే తలంపు అనేక తలంపులకు, ఆలోచనలకు కారణమై మనను ఈ సుఖదుఃఖాలతో కూడిన ప్రపంచంలో బంధిస్తుంది. ఆనందానికి దూరం చేస్తుంది. 

🌈 ఎంతవరకూ ఈ ‘నేను’ అనే తలంపు ఉన్నదో అంతవరకూ మనకు దుఃఖాలు, బాధలు, భయాలు తప్పవు.

🌈 సాధకుడు తన ప్రయత్నంతో అన్ని ఆలోచనలనూ ఆపివేయగలుగు తాడేగానీ.. ఈ ‘నేను’ అనే ప్రథమ తలంపును (‘అహం’ భావనను) ఎలా తొలగించుకోవాలో తెలియక తికమకపడతాడు. 

🌈 ఇక్కడే ఉపనిషత్‌ గ్రంథాలు, మహాత్ములు, గురువులు వారికి చేయి అందిస్తారు. మార్గం చూపుతారు. అలాంటి ఉపాయాన్నే రమణులు ఇక్కడ చెబుతున్నారు. 

🌈 ఈ ‘అహం’ వృత్తి.. అనగా ‘నేను’ అనే భావన ఎక్కడ పుడుతున్నదో వెతకాలని చెబుతున్నారు. అప్పుడే ఆ భావన పడిపోతుందని చెబుతున్నారు.  దీనికేదైనా శాస్త్రప్రమాణం ఉందా అంటే..  ‘సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్‌’ లో ఇలా ఉంది..

*అహం భావం పరిత్యజ్య జగత్‌ భావం అనీ దృశం*
*నిర్వికల్పే స్థితో విద్వాన్‌ భూయోనాప్యనుశోచతి*

🌈 అన్ని భావాలూ వదిలిపోయిన తర్వాత మిగిలి ఉండే ‘అహం’ భావనను వదలగలిగితే.. జగద్భావం కూడా అదృశ్యమైపోతుంది. అది కూడా తొలగితే ఇక మిగిలేది నిర్వికల్ప స్థితే. అట్టి స్థితిని పొందినవాడు తిరిగి దుఃఖించాల్సిన పని లేదు. ఇప్పటిదాకా జగద్భావన వల్లనే  దుఃఖాలు. అవి తొలగిపోయాక శాశ్వత ఆనందంలోనే ఉండిపోతాడు. కనుక రమణులు చెప్పిన మాట శ్రుతి సమ్మతం.


*సేకరణ:* 
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈

No comments:

Post a Comment