👌 *...ఏష ధర్మః సనాతనః*👌
*45. ఆచరణే ఫలం*
✍️ పూజ్యగురువులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు.
🌹💫🌈💫🌈🕉️🕉️💫🌈💫🌈🌹
🙏 *ఆచరణే ఫలం* 🌹
💫 *ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి?* - అని ప్రశ్నిస్తే... *‘ధర్మోరక్షతి రక్షితః'* అని సమాధానం.
💫 అయితే, ఎప్పటికప్పుడే 'ఇన్‌స్టంట్' ఫలితాలు కావాలనుకొనేటప్పుడు ఈ మాట అంతగా రుచించకపోవచ్చు.
💫 ధర్మం వల్ల ఏం లభిస్తుందో? అనే ఫలాపేక్షతో ఉండటం కన్నా ధర్మాచరణయే ఫలంగా భావించడం ఉత్తముల మార్గం. ధర్మం ఆచరిస్తున్నప్పుడు లభించే తృప్తిని అత్యుత్తమ ఫలంగా భావించేవాడు అసలైన ధార్మికుడు.
💫 మనిషి సాధించవలసిన ప్రయోజనాలు నాలుగు - అని విభజించారు భారతీయ మహర్షులు. అవి : *ధర్మ, అర్థ, కామ, మోక్షాలు.* ఇందులో... 'అర్థ కామాల’ గురించి వివరించనవసరం లేదు. ఈ రెండు ప్రయోజనాల చుట్టూ మాత్రమే తిరుగుతుంటాం మనం. కానీ వాటికన్నా ముందు ధర్మాన్ని సంపాదించుకోవాలి. ధర్మం అనే ప్రాతి పదిక మీదనే అర్థ కామ సంపాదన సాగాలి. అర్థ కామ సంపాదన మాత్రమే ధ్యేయంగా సాగితే వ్యక్తికీ, సమాజానికీ కూడా హాని. అందుకే ధర్మం అనే హద్దులో అర్థ కామ సంపాదన జరగాలి - అని శాసించారు. ఇది శాశ్వత ప్రయోజనాన్ని ఉద్దేశించి నిర్దేశించినది.
💫 ధర్మ రహితంగా అర్థ కామ సంపాదన చేస్తే పతనమై తీరతారని చెప్పడానికే రామాయణ భారతాలు ఆవిర్భవించాయి. ధర్మపరుడై బతికేవానికి ఎన్నో సవాళ్లు ఎదురౌతాయి. అది సహజం. ఏ కాలంలోనైనా ఇది తప్పదు. ప్రస్తుత కాలంలో మరీనూ. ఆ సమయంలో ఎటువంటి నిబ్బరాన్ని పాటించాలో మన ప్రాచీన ధార్మిక గ్రంథాలను పరిశీలించి తెలుసుకోవచ్చు.
💫 శ్రీరామచంద్రుడు అరణ్యాలకు వెళ్ళే ముందు కైకతో అన్నమాటలు:
*నాహమర్థపరో లోకే...*
*విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మ మాస్థితమ్.*
💫 *“నేను అర్థపరుణ్ని కాను, కేవలం ధర్మము నందే నిష్ఠ కలిగినవాడను.”*
💫 ధర్మంతో అర్థ కామాలను సంపాదిస్తాను - అనే ధోరణి మంచిదే. అంత కన్నా ఉత్కృష్టం అర్థ కామాల కన్నా ధర్మ సంపాదనమే గొప్పదని భావించడం. ఆ ధర్మపరత్వంలో అర్థ కామాలకు హాని కలిగినా చలించరు. అటు వంటివారినే మహాత్ములని అంటాం.
💫 మహాభారతంలో ధర్మరాజును గమనిస్తే ఆశ్చర్య చకితులవుతాం.
💫 అరణ్యవాస సమయంలో భార్యతో, తమ్ములతో సహా దుర్గమారణ్యాలలో సంచరిస్తున్న ఆ చక్రవర్తిని ఒకరోజు భార్య ద్రౌపది ఇలా అడుగుతుంది.
💫 “మీరెప్పుడూ 'ధర్మం, ధర్మం' అంటుంటారు. ఆ ధర్మం మీకేమిచ్చింది? అధర్మపరుడైనవాడు రారాజై భోగాలనుభవిస్తున్నాడు. ధర్మపరులైన మీరు సపరివారంగా కానల పాలయ్యారు. ధర్మాన్ని ఆచరించి ప్రయోజనం ఏమిటి?” విసుగుదలతో ఆమె అడిగిన ప్రశ్నకు సంయమనంతో సమాధాన మిచ్చాడు యుధిష్ఠిరుడు.
*నాహం ధర్మఫలాకాంక్షీ రాజపుత్రి! చరామ్యుతః*
*ధర్మ ఏవ మనః కృష్ణే!* *స్వభావాచ్చైవమేధృతమ్|*
*ధర్మవాణిజ్యకో హీనో జఘన్యో ధర్మవాదినామ్ ॥*
💫 ధర్మరాజు వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని పట్టి చూపించే మాటలివి.
💫 “ధర్మాచరణ నా స్వభావం. ధర్మం వల్ల ఏదో వస్తుందని, ఏదో రావాలని నేను ధర్మాచరణను అనుసరించలేదు. ధర్మంతో వ్యాపారం చేసేవాడు నీచుడు.” అంటే ధర్మం వల్ల ఏదో వస్తుందనే లాభాపేక్ష ఉన్నవాణ్ణి పురుషాధముడని పేర్కొన్నాడు ధర్మరాజు.
💫 ‘ధర్మాన్ని ఆచరించడం నా స్వభావం' అనగలిగాడంటే ఆయనలో ఎంతటి ధర్మనిష్ఠ ఉందో అర్థం చేసుకోవాలి. అయితే తాము ఫలాన్ని ఆశించకుండా ధర్మాన్ని అనుష్ఠించినా, ధర్మం ఊరుకోదు. తప్పకుండా రక్షిస్తుంది. ఆత్మ ఔన్నత్యాన్ని కాపాడటమే అసలైన రక్షణ వ్యక్తిత్వం మహోన్నతంగా నిలబడటమే అసలైన సిద్ధి. ఆ సిద్ధికోసమే ధర్మపరుడు స్థిరంగా ఉంటాడు. ఆ సిద్ధిలోనే తృప్తిని సాధిస్తాడు.
💫 ధర్మాన్ని స్వభావంగా చేసుకున్నవారే ఆదర్శప్రాయులు. ఫలాపేక్షలేని ధర్మంలోనే పరిపూర్ణత ఉంటుంది. ఇదే లక్షణం అచ్చమైన భక్తియోగంలోనూ సాక్షాత్కరిస్తుంది. కర్మగానీ, భక్తిగానీ యోగంగా పరిణమించాలంటే సుష్టు ఆచరణ, ఫలాపేక్ష రహితత్వమే ప్రధానం. అలా ధర్మనిష్ఠుడైన వాని పక్షాన దైవం శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
💫 అందుకే, భగవానుడు పాండవ పక్షపాతి అయ్యాడు. అంటే - ధర్మపక్షపాతి. భౌతికంగా ధర్మానికి పెద్ద బలగం ఉండకపోవచ్చు గానీ బలం ఉంటుంది. ఆ బలం ఆత్మ బలం, దైవబలం. అది ఎటువంటి దౌర్బల్యాన్నైనా జయించగలదు. అధర్మం వైపు ఎంత బలగమూ, భౌతిక బలమూ ఉన్నా దాని మిడిసిపాటు తాత్కాలికమే.
💫 రావణుడైనా, దుర్యోధనుడైనా భౌతిక బలంలో సమృద్ధి కలవారే. కేవలం వానరులతో వచ్చిన రామలక్ష్మణులు లంకా సామ్రాజ్యాధినేత, సర్వబల సంపన్నుడైన రావణుని జయించారు. అయిదుగురు పాండవులు ఏడు అక్షౌహిణిలతో, పదకొండు అక్షౌహిణుల బలం ఉన్న వందమంది కౌరవులను జయించారు.
💫 *ధర్మానికి లభించే జయం, ప్రాప్తించే ఫలం శాశ్వతం, సుస్థిరం.*
*“యతో ధర్మస్తతోజయః"* - ఇది శాశ్వత సత్యం.
💫 దీనిని నమ్మే సమాజం, దీనికే బద్ధమైన పాలన తప్ప కుండా నిజమైన క్షేమాన్ని ప్రసాదిస్తుంది.
*సేకరణ:*
🌹💫🌈💫🌈🕉️🕉️💫🌈💫🌈🌹
No comments:
Post a Comment