🌷పరబ్రహ్మ తత్త్వం🌷
(జ్యోతిర్మయం)✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు
ఒకసారి జ్ఞాన యోగాన్ని తెలుపమని బృహస్పతిని కోరాడు మనువు.
“జ్ఞాన యోగానికి మూలం కర్మ మార్గమే. కోరికలు తీర్చుకోవడానికే కర్మలు చేస్తారు మానవులు. కానీ వారు సుఖాలనుకున్నవే దుఃఖాలై బాధిస్తాయి. ఫలాపేక్షతో కర్మలు చేయనివారే సుఖదుఃఖాలకతీతులై అరిషడ్వర్గాలు కలిగించే ఆపదలను తప్పించుకుంటారు.
పరబ్రహ్మ తత్వానికి సాటి మరొకటి లేదు. అదే ఆత్మ ఉనికికి ఆధారమైనది, పంచభూతాలకు, వాటి తన్మాత్రలకు, ఇంద్రియాలకు అందని గొప్ప యోగ స్థితి.
చెట్టులో అగ్ని కనబడకుండా ఉన్నట్టే శరీరంలో పరబ్రహ్మతత్వం గుప్తంగా ఉంటుంది. దాన్ని సరైన మార్గంలో గ్రహించాలి తప్ప అడ్డదారులు లేవు. కర్రలో ఉన్న నిప్పును మరో కర్రతో మదిస్తే బయటపడుతుంది. గొడ్డలితో నరికితే కనిపించదు. పరతత్వమూ అంతే. సరైన మార్గంలోనే శోధించాలి.
మనస్సుకు, ఇంద్రియాలకు అందనంత మాత్రాన శరీరంలో పరతత్వం లేదనుకో రాదు. ఒక వస్తువు యొక్క ముందు భాగాన్ని మాత్రమే చూడగలిగినప్పుడు దానికి వెనుక భాగమే లేదనుకోవడం అవివేకమే.
పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోడానికి తగిన ప్రయత్నం చెయ్యాలి. జంతువు కోసం వల , పక్షి కోసం ఉచ్చు, చేప కోసం గాలాన్ని వినియోగించినట్టే పరబ్రహ్మ తత్వాన్ని కూడా తగిన సాధనంతో గ్రహించాలి.
పాముకి కాళ్ళున్నట్టే బయటకు తెలియదు. అది నడుస్తుందంటే కాళ్ళున్నట్టే కదా. అంటే పాము కాలును పామే గ్రహిస్తుంది. అట్లాగే బుద్ధిమంతుడు జ్ఞానవంతుడైతే పరబ్రహ్మ తత్వాన్ని గ్రహించగలడు.
ఆత్మజ్ఞత, అనాత్మజ్ఞత అనే రెండూ మానసిక చర్యలే. మనసుని నిర్మలంగా ఉంచుకున్నప్పుడే ఆత్మజ్ఞుడవుతారు. మురికిగా ఉన్న నీటిలో ప్రతిబింబం చూడలేనట్టే క్షోభ చెందిన హృదయంతో ఆత్మజ్ఞానాన్ని పొందలేరు.
ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నప్పుడే సుఖసంతోషాలను, శాంతి సౌభాగ్యాలను పొందుతారు. ఇంద్రియాలనే దొంగల నుండి ఆత్మను కాపాడుకున్నప్పుడే పాపాలు నశించి జ్ఞానాన్ని పొందగలరు. అప్పుడే ఆత్మ మెరుగుటద్ధంలాగా ప్రకాశిస్తుందని” బోధించాడు బృహస్పతి.
*****
No comments:
Post a Comment