Tuesday, September 6, 2022

నేను లేకపోతే? ✍️ హిందీ రచనకు స్వేచ్ఛానువాదం

నేను లేకపోతే?
✍️ హిందీ రచనకు స్వేచ్ఛానువాదం
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

✅ అశోక వనంలో రావణుడు సీతమ్మ వారి మీదకి కోపంతో కత్తి దూసి ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడు అనుకున్నాడు 'ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని రావణాసురుని తలను ఖండించాలి' అని.

✅ కానీ... మరుక్షణంలోనే హనుమంతుడు మండోదరి రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు!

💫 హనుమంతుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. 'నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతను ఎవరు రక్షించే వాళ్ళు అని భ్రమలో నేను ఉండేవాడిని' అనుకున్నాడు హనుమంతుడు!

🌈 బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం, 'నేను లేకపోతే ఎలా?' అని.
అయితే ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం...

〰️••••♾️••••〰️

💫 సీతామాతను రక్షించే పనిని, ప్రభువు రావణుని యొక్క భార్యకు అప్పగించాడు. అప్పుడు హనుమంతుడుకి అర్థమైంది 'ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు' అని.

〰️••••♾️••••〰️

💫 మరింత ముందుకు వెళితే త్రిజట తన తోటివారితో..... 'తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుంది. అది లంకను కాల్చివేస్తుంది.. దాన్ని నేను చూశాను.' అని చెప్పింది.
అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు.

💫 అయితే, త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు తను ఇప్పుడు ఏం చేయాలి ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకున్నాడు.

〰️••••♾️••••〰️

💫 హనుమంతుని చంపడానికి రావణుని సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమి చేయలేదు. అలా నిలబడ్డాడు. అయితే, ఆ సమయంలో విభీషణుడు వచ్చి, 'అన్నా! దూతను చంపటం నీతి కాదు' అన్నాడు. అప్పుడు హనుమంతునికి తెలిసింది.. తనను రక్షించే భారం ప్రభువు విభీషణుని పై ఉంచాడు అని.

💫 ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే విభీషణుడు ఆ మాట చెప్పినప్పుడు రావణుడు వెంటనే ఒప్పుకుని 'కోతిని చంపొద్దు. అయితే కోతులకు తోకంటే మహా ఇష్టం కాబట్టి తోకకు నిప్పు పెట్టండి' అని చెప్పాడు.

💫 అప్పుడు, హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. లేకపోతే నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి!

💫 కానీ గమనించండి... పరమాశ్చర్యం ఏంటంటే వాటన్నిటి ఏర్పాటు రావణుడే స్వయంగా చేయించాడు. అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు తన నుండి తనకు కావలసిన పనిని చేయించుకోవడంలో ఆశ్చర్యం ఏముంది!

〰️••••♾️••••〰️

💫 అందుకే, ప్రియ భక్తులారా! ఒకటి గుర్తుంచుకోండి. ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతోంది అని అనుకోండి. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం అని గుర్తు పెట్టుకుని మసలండి.

✅ అందువల్ల ఎప్పుడూ కూడా నేను లేకపోతే ఏమవుతుందో? అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు
'నేనే గొప్పవాడిని' అని అనుకోవద్దు. భగవంతుని కోటానుకోట్ల దాసులలో అతి చిన్నవాడను అని ఎఱుక కలిగి ఉందాం.

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

సేకరణ

No comments:

Post a Comment