Saturday, September 3, 2022

భగవంతుడి చరణాలను చేర్చే మార్గం --- శ్రీ సామవేదం షణ్ముఖశర్మ

అంతర్యామి - 8
✍️🌹🌹🌹🙏💐🙏🌹🌹🌹✍️
భగవంతుడి చరణాలను చేర్చే మార్గం

--- శ్రీ సామవేదం షణ్ముఖశర్మ
♾♾♾♾♾♾️🔘♾️♾♾♾♾♾

మనిషి సాధించవలసిన ఉత్తమ సంస్కారాల్లో మైత్ర్యాది వాసనలు మన శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. మైత్ర్యాది వాసనలున్న వారికే భగవంతుడు లభ్యుడవుతాడు. 'మైత్ర్యాది వాసనాలభ్యా' - అని అమ్మవారి నామం.

భగవదనుగ్రహం కావాలంటే 'మైత్రి' మొదలైన మంచి లక్షణాలుండాలి.

ఏమిటా లక్షణాలు?

అవి మొత్తం నాలుగు -
మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష.

ప్రపంచం పట్ల సుహృద్భావం కలిగి ఉండటమే మైత్రి. ఏ ఒక్కరితోనూ ప్రతికూలభావం పనికిరాదు. ద్వేషం దైవత్వానికి ప్రధాన అవరోధం. అందరిపట్ల సద్భావన ఉంచుతూ, సత్పురుషులతో సంగం కలిగి ఉండే మైత్రీ గుణాన్ని పెంపొందించుకోవాలి. అనుకూల సద్భావనను ఏర్పాటు చేసుకొనే మైత్రి వల్ల మనోప్రసన్నత ఏర్పడుతుంది. మనకున్న పరిచయాలన్నీ మిత్రభావంతో కూడినవైతే అంతకంటే కావలసిందేముంది! ప్రతిదాన్నీ విపరీత కోణాల నుంచి విశ్లేషించేవారికి ఎవరితోనూ మైత్రి సాధ్యంకాదు. సద్భావనవల్ల కలిగే మైత్రీ భావం మనసును నిర్మలం చేస్తుంది.

దీనస్థితిలో, దురవస్థలో ఉన్నవారిని చూసి మనసు కరిగే లక్షణం, సాయపడే స్వభావం 'కరుణ'. మనపై ఆధారపడినవారికి ఏ లోటూ లేకుండా చేయడం, సమాజంలో సాధ్యమైనంత సహాయ సహకార భావాన్ని వివిధ కార్యాల ద్వారా వ్యక్తీకరించడం ఈ గుణం లక్షణం. కలిగినంతలో దీనులకు ఇవ్వాలని ఆది శంకరులు బోధించారు. ఇతరుల దుఃఖాన్ని చూసి స్పందించి సహకరించే గుణం ఉత్తమ సంస్కారం. పదిమందీ బాగున్నప్పడే మనం బాగుండగలం.

ముదిత అనే మాటకు సంతోషంగా ఉండటం' అని అర్థం. ఎప్పుడూ ఏదో అసంతృప్తి, దిగులు అనే గుణాలున్న చోట భగవంతుడు ప్రసన్నుడు కాడు. అన్నీ ఉన్నా ఏదో లేదనే కొరత కొందరిలో ఉంటుంది. చుట్టూ ఉన్న సుఖాలను గమనించక, లేనిదానికోసం విలపిస్తూ, క్షోభపడేవారికి కళాకాంతులుండవు. నవ్వు ముఖం, ఉల్లాసం, ఉత్సాహం... ఇవన్నీ 'ముదిత' అనే గుణంలోని లక్షణాలు. ఎక్కడైనా, ఎవరిలోనైనా కాసింతైనా మంచిని చూడగానే మనసారా అభినందించడం, ప్రోత్సహించడం ముదిత స్వభావం. మంచిని వెతి కేవారికి మంచి తప్పక గోచరిస్తుంది. ఆ కనిపించే 'మంచి'ని గుర్తించి, ప్రజ్వరిల్లజేసుకుంటే అంతా ఆనందాల వెలుగే.

ప్రతికూల భావాలను మనసులోనికి రానీయకపోవడమే ఉపేక్ష గుణలక్షణం. మనల్ని నిందించేవారిని, చెడును కలిగించే వారిని మనం పట్టించుకోరాదు. అలాగని చెడు జరిగినా ప్రతిక్రియ చేయరాదని కాదు. వాటిని మనసు దాకా తీసుకు వెళ్ళకూడదు. సృష్టిలో అందరిచేతా అవుననిపించుకోవడం, ఏ ఒక్కరికీ సాధ్యం కాదు. మెచ్చుకొనే వాళ్ళూ ఉంటారు, నిందించే వాళ్ళూ ఉంటారు. మెచ్చుకోలుకు పొంగిపోవడం, నిందకు కుంగిపోవడం రెండూ పనికిరావు.

శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి మహాత్ములనే ఆరాధించే వారితోపాటు, నిందించేవారు కూడా కనిపిస్తుంటారు. ఈ నిందాదులు విపరీత లక్షణాలు. వాటి పట్ల ఉపేక్ష (పట్టించుకోని లక్షణం) ముఖ్యం. ఏ చిన్నపాటి అవమానాన్నో, గతించిన చిన్ని ఘటననో తలచుకుంటూ, చలించిపోయే చింతన మనసును కలుషితం చేస్తుంది. కలవరపరచే ఆలోచనను మనసులోకి రానీయని స్థితి 'ఉపేక్ష'

సాధకుడికి లోకంకన్నా లోకేశ్వరుడే ప్రధానం. ధర్మం లోకం కోసం కాదు. ఆత్మోద్ధరణ కోసం. మెచ్చుకోలు, నిందావాక్యాలు - ఈ రెండింటినీ పట్టించుకోకుండా ఈశ్వరప్రీతి కోసం ధర్మాన్ని అనుష్ఠించడం ఉపేక్ష. అంతర్యామి గమనిస్తున్నాడనే స్పృహ ఉన్నవాడు అధర్మాన్ని అంతరంగంలోనైనా ఆచరించడు.

కోపం, దుఃఖం, భయం, ఆందోళన, చిరాకు - వంటి విపరీత భావనల్ని మనసుకు పట్టనివ్వని ఉపేక్ష గుణం ప్రశాంతతకు సోపానం.

మైత్రి మొదలైన ఈ నాలుగు సువాసనలను వెదజల్లే కుసుమంగా మారిన మనసే భగవంతుడి చరణాలను చేరడానికి యోగ్యం.

లోకాస్సమస్తా సుఖినోభవంతు

Courtesy : 'ఈనాడు'. 

సేకరణ

No comments:

Post a Comment