Tuesday, September 6, 2022

అడుగడుగునా భగవాను(ramana maharshi) లో కనిపించే నిరాడంబరత మరే మహాత్మునిలోనూ మనకు కనబడదంటే అతిశయోక్తి కాదు. 🙏🏻

 భగవాన్ ఎప్పుడూ ఎవరికీ పనికిరాని కాగితాలే ఉపయోగిస్తారు. ఒకనాడొక భక్తుడు, భగవానుతో, "నాయనగారు (గణపతిముని) పనికిరాని కుప్పలో పారవేసిన కాగితాలు తమరు ఏరి బైండు చేసారట కదా" అన్నాడు. "అవునవును, నాయన పలాకొత్తు నుండి ఊరికెళుతూ చిత్తుకాగితాలన్నీ బయట పడేసారు. వారెప్పుడూ కాగితంలో సగం వరకే రాసి వదిలేసేవారు. అలాంటివి ఎన్నో కుప్పగా పోశారు. మధ్యాహ్నం భోజనం అయ్యాక నేను, మాధవుడు అటువైపు వస్తూ వాటిని చూసి ఏరి తెచ్చాం. అన్నీ చింపి అతికించి మంచి బైండొకటి తయారు చేసి దాచి వుంచాం.


 అది కొత్త బైండ్ లాగే వుంది. కొన్నాళ్ళకు నాయన తిరిగి వచ్చి వ్రాసేందుకు పుస్తకం కావాలన్నారు. ఆ బైండ్ ఇవ్వమంటే మాధవుడు తీసి యిచ్చాడు. "ఎంత బాగుంది, ఎక్కడిది" అన్నారు నాయన. నేనేమీ మాటాడక నవ్వుతూ ఊరుకున్నాను. అప్పుడు మాధవుడు "నాయనా, మీరు పనికిరావని పారేసిన కాగితాలే యివి. భగవాన్ చూసి ఏరి తెమ్మంటే తెచ్చి బైండ్ చేశాం" అన్నాడు. నాయన ఎంతో ఆశ్చర్యపడ్డారు. "సాధారణంగా నేనెప్పుడూ పాత కాగితాలతోనే పుస్తకాలు కుట్టేవాణ్ణి" అని సెలవిచ్చారు భగవాన్.  భగవాన్ నిరాడంబర వస్తువులు తప్ప తదితరములు వాడరు. కానీ కూడ ఖర్చు కాని వస్తువులంటే వారికి ప్రీతి.


 శ్రీరమణులు తుండుగుడ్డ కౌపీనం తప్ప మరెప్పుడూ ఏదీ వాడలేదు. శ్రీవారి చేత శాలువాలు, పట్టుబట్టలు మొదలైనవి కట్టించుటకు భక్తులెన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. శ్రీ భగవానులు చివరికన్న మాటలివి: "ఇంకా పెద్దదెందుకోయ్ అర్ధగజం వెడల్పు, ముక్కాలు గజం పొడగూ ఉన్నది చాలు. చెమట పోస్తే తుడుచుకునేందుకు, ఎండలో వెళితే తలమీద కప్పుకునేందుకు, చలివేస్తే కంఠానికి చుట్టుకునేందుకు, అవసరమైతే క్రింద పరుచుకుని కూర్చునేందుకు, ఇది సరిపోతుందే, ఇంకా పెద్ధది పెట్టుకొని ఏం చేస్తాం" అన్నారు భగవాన్.


1942 ప్రాంతంలో ఒక భక్తుడు ఎలక్ట్రక్ టేబుల్ ఫాన్ తెచ్చి భగవానుని ఊపయోగించుకోవలసిందిగా ప్రార్దించాడు. "ఎందుకయ్యా ఈ విసనకర్ర ఉంది, చేతులున్నాయి. కావలసినప్పుడు విసురుకుంటాను, నాకెందుకివన్నీ" అన్నారు భగవాన్. "అది శ్రమ కదా. ఫాన్ అయితే బాధ లేదు" అన్నాడా భక్తుడు. "శ్రమేమి, అదైతే మనకు ఎంత గాలి కావాలో అంతే వస్తుంది. ఫాన్ బుయ్ మనే శబ్దంతో విపరీతంగా విసురుతుంది. పైగా కరెంటు ఖర్చు. మన మూలంగా ఆఫీషువారికెందుకు ఖర్చు" అని తిరస్కరించారు భగవాన్. అడుగడుగునా భగవానులో కనిపించే నిరాడంబరత మరే మహాత్మునిలోనూ మనకు కనబడదంటే అతిశయోక్తి కాదు. 🙏🏻         

No comments:

Post a Comment