*శివపురాణం* -26 వ భాగం ప్రారంభం...
ఒకనాడు పార్వతీదేవి చెలికత్తెలయిన జయ విజయలు అమ్మవారితో ఒకమాట చెప్పారు. ‘అమ్మా, నంది నిన్నూ వహిస్తాడు, శంకరుడినీ వహిస్తాడు. కానీ ఆయనకు కొంచెం శంకరుని మాల ఔదలదాల్చడంలోనే సంతోషం ఎక్కువ. భ్రుంగీ అంతే. మన మాటే వినేవాడు ఒకడు లేడు. అలాంటి వాడు మనకి ఒకడు ఉంటే బాగుంటుంది. అందుకని నీవు ఒకడిని సృష్టించి ద్వారపాలకుడిగా పెడితే వాడు నీ మాటే వింటూంటాడు. అలాంటి వాడిని తయారు చెయ్యి. అతడు మన అంతఃపురమును కాపాడడానికి పనికివస్తాడు” అని చెప్పారు. వారి మాటలు విన్న పార్వతీ దేవి అలాగే చేద్దాం అని తన శరీరమునకు ఉన్న మలమును స్నానం చేసేటప్పుడు నలుగు పిండిలా తీసి దానిలోంచి ఒక పిల్లవాడిని తయారు చేసింది. నలుగులోంచి తయారు చేయబడిన పిల్లవాడు ఎలా ఉన్నాడన్నది ఎవరికీ తెలియదు. చాలా బాగుండాలని అమ్మవారు సంకల్పం చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. వాడు లేచి కూర్చున్నాడు. అపుడు వానితో నీవు వెళ్లి ద్వారము దగ్గర కూర్చుని ఎవరూ లోపలి రాకుండా నిలుపు’ అంది అపుడు ఆ పిల్లవాడు ద్వారం దగ్గర కూర్చున్నాడు.
ప్రమథగణములలో ముందు నందీశ్వరుడు విజయం చేస్తుండగా శివుడు లోపలి వెళ్ళబోయాడు.ఈ పిల్లవాడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. ముందు శంకరుడు జ్యోక్యం చేసుకోలేదు. అపుడు ప్రమథగణములకు ఆ పిల్లాడికి మధ్య యుద్ధం జరిగింది. ఎవరు సలహా చెప్పారో వాళ్ళే అమంవారి దగ్గరకు వచ్చి అమ్మా పిల్లవాడు యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి నీ శక్తులను పిల్లవాడికి ఇవ్వవలసింది అని చెప్పారు. అమ్మవారు శక్తులను ఇచ్చింది. ఆ పిల్లవాడు అద్భుతమయిన యుద్ధం చేసి ప్రమథగణములనన్నిటిని ఓడించేశాడు. ఇంక అక్కడ నుండి బ్రహ్మ, విష్ణువు కూడా వచ్చేశారు యుద్ధానికి. అయినా ఆ పిల్లవాడు శంకరుడిని లోపలికి పంపించలేదు. అపుడు శంకరుడు చేతిలో త్రిశూలమును పట్టుకుని పిల్లవాని కంఠమునకు గురి పెట్టి విసిరాడు. అపుడు త్రిశూలం ఆ పిల్లవాని కంఠమును ఉత్తరించేసింది. ఆ పిల్లవాడు క్రిందపడి మరణించాడు. తరువాత శంకరుడు లోపలికి వెళ్ళాడు. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి బయట కాపలా పెట్టిన పిల్లవాని ప్రస్తావన వచ్చింది. అపుడు శివుడు ఆ పిల్లవానిని త్రిశూల ధారల చేత చంపేశాను అన్నాడు. అపుడు పార్వతీదేవి అయ్యో ఆ పిల్లాడిని నేనే సృష్టించాను – చంపేశారా అని దుఃఖమును పొందింది. ఆవిడ దుఃఖమును ఉపశమింపజేయడానికి దేవతలు అందరూ వచ్చారు. ఆవిడ శంకరుని తన బిడ్డను మరల బ్రతికించమని అడిగింది. అప్పుడు ఆయన తన అనుచరులను పిలిచి మీరు ఉత్తర దిక్కుగా వెళ్ళి మీకు మొట్టమొదట కనపడిన ప్రాణి ఏదయితే ఉంటుందో దాని తలకాయ తీసుకురండి. ఆ తలకాయ పిల్లవాడికి పెడతాను’ అన్నాడు. వాళ్లకి మొట్టమొదట ఏనుగు కనపడింది. వాళ్ళు దాని తలకాయ పట్టుకొచ్చారు. దానిని ఈ పడిపోయిన పిల్లవాని కంఠమునకు కలిపాడు. ఆ పిల్లవాడు చక్కగా లేచి కూర్చున్నాడు. ఇప్పుడు వానికి శంకరుడెవరో తెలిసి శంకరునికి నమస్కారం చేశాడు. వెంటనే శంకరుడు కూడా వాడిని ఎత్తి తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. ఈలోపుగా సుబ్రహ్మణ్య జననం కూడా జరిగిపోయింది. ఈ ఇద్దరి పిల్లలతో సంసారం చక్కగా నడిచిపోతోంది.
No comments:
Post a Comment