Sunday, December 18, 2022

మృదు భాషణం

 ix.Xi. 1-5. 191222-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

               మృదు భాషణం
                  ➖➖➖✍️


నిండైన నది నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. పిల్లకాలువలుగా చీలి గులకరాళ్ల మీద ప్రవహిస్తున్నప్పుడు    గలగలమంటూ శబ్దాలు చేస్తుంది.       నీళ్లతో నిండుగా ఉన్నప్పుడు    కుండ తొణికిసలాడదు. ఇలాంటి ఉపమానాలు మనిషికి ఎన్ని చెప్పినా        మాట్లాడాలనుకున్నది అతడెప్పుడూ మాట్లాడటం మానడు. భావ వ్యక్తీకరణకోసం భగవంతుడు అతడికిచ్చిన మహత్తరమైన శక్తి- మాట. సృష్టిలో మరేజీవిలోనూ అది కనబడదు. మనసులోంచి వచ్చేదిలా     ఆ మాట ఉండాలి.      మంచి అభిప్రాయం అనిపించాలి.   అందరినీ ఆలోచింపజేయాలి. ప్రయోజనం కలిగించగలదై ఉండాలి.

గీతలో భగవంతుడు మనిషికి ఆహ్లాదకరంగా మాట్లాడటం నేర్చుకొమ్మని చెబుతాడు. రెచ్చగొట్టి,  ప్రలాపాలుగా అనిపించే మాటలు వద్దన్నాడు. అటువంటి మాటలు తనకు వినిపించిన తక్షణమే స్పందించవద్దన్నాడు. సత్యాన్ని ప్రతిబింబించేవి, ప్రియమైనవి, ఎదుటి వ్యక్తి హితాన్ని కోరేవిలా మాటలుండాలన్నాడు. ఆ విధంగా మాట్లాడగలవాడిని ‘వాక్‌ తపస్వి’ అన్నాడు. 

మృదుభాషణం మనుషులందరిలో   కనిపించాల్సిన లక్షణంగా శాస్త్రాలన్నీ గుర్తించాయి.   వేదాంతి అరిస్టాటిల్‌ విశ్వసనీయత గోచరించేలా మాట్లాడితే అవి మానవ స్వభావాన్నే మార్చగలవంటాడు. పరస్పరం అవిశ్వాసం కలిగించే మాటలే మనుషులొకరినొకరు చూసి భయపడటానికి కారణ మన్నారు గాంధీజీ.

మనిషి తనను తాను సమర్థించుకునేందుకు మాట్లాడు తున్నానని ఎవరికీ అనిపించనీయ కూడదు. అదే ఉద్దేశమైతే అతడు మాట్లాడకుండా ఉండటమే మంచిది. కొన్ని మాటలు వింటున్నప్పుడు మధురమైనవిగా, సందేశమేదో అందజేస్తున్నవిగా అనిపించినా అందులో అంతర్లీనంగా విషం, వ్యర్థాల వంటివి దాగి ఉండవచ్చు. అనుభవంతో కానీ అర్థంకాని విషయమది. ఆ విధంగా మాట్లాడే మనుషుల్ని నీతిచంద్రిక కర్త చిన్నయసూరి పయోముఖ విషకుంభాలన్నాడు.

ఆచితూచి మాట్లాడటం అందరికీ చేతకాని అభ్యాసం. మాట నేర్పు ఉన్నవారినే మహారాజులు రాయబారులుగా, మహామంత్రులుగా నియమించుకునేవారు. రామాయణంలో హనుమంతుడు, భారతంలో విదురుడు, సంజయుడు, కృష్ణరాయల అమాత్యుడు తిమ్మరుసు... అటువంటి మాటకారులే.

మంచి ముత్యాలనిపించే మాటలెప్పుడూ మెరుస్తూనే ఉంటాయి. అవి పండితులకైనా పామరులకైనా శాశ్వతంగా వినపడతాయి.

 వ్యక్తులు, వ్యవస్థలను విమర్శించడమొక్కటే లక్ష్యం కాకుండా, ఛలోక్తులతో నర్మగర్భంగా, లోకజ్ఞానాన్ని ప్రస్ఫుటించే పొడుపు కథలు ఉపమానాలతో మాట్లాడిన మాటలు, ఆత్మవిమర్శకు అవకాశమివ్వటమే కాక, కాలపరీక్షకు సైతం నిలబడతాయి. శబ్దాడంబరంతో పాండిత్యాన్ని ప్రదర్శించాలనుకుంటే పొరపాటే అవుతుంది. వాగ్ధాటితో నిజాన్ని వక్రీకరించేవారు వక్తలనిపించుకోలేరు. నిజాన్ని క్రమబద్ధీకరించేందుకు చెప్పేవైనప్పుడు మాటలు వ్యక్తిత్వానికి వన్నెతెస్తాయి.

భర్తృహరి ‘వాగ్భూషణమే సుభూషణం’ అని నిర్ద్వంద్వంగా చెబుతాడు. మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడకపోవటమూ మహాపరాధమే. ధృతరాష్ట్రుడు అవసరమైనప్పుడు నోరు మెదపకుండా ఉండటం మహాభారత యుద్ధానికి ముఖ్యకారణమని విశ్లేషకుల అభిప్రాయం.

వాక్‌ స్వాతంత్య్రంతో మనిషికి వచ్చే స్వతంత్రం ప్రత్యేకమైనదైనా నిజాన్ని నిర్భయంగా చెప్పడానికే అది ఉన్నదని మనుషులు గ్రహించాలి. 

మాటకు మంత్రానికుండే ప్రభావం ఉంటుంది. అది వరమిచ్చేదిలా ఉండాలి కానీ శాపమిచ్చేలా ఉండకూడదు. మనుషులను కలపాలి కానీ విడదీయకూడదు. ఆ గ్రహింపు ఉంటే మనుషులంతా మంత్రద్రష్టలవుతారు!✍️

                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment