Thursday, December 22, 2022

*గురువులు పలు తెఱగులు*. నిజంగా మీ మేలు కోరేవారు ఎవరూ కూడా తాము మీకన్న అధికులమైనట్లూ, తాము నేర్పేవారు, మీరు నేర్చేవారు అన్నట్లు మాట్లాడరు. కేవలం మీ శ్రేయస్సు కోరే మిత్రులవలె మెలగుతారు.

 *🧘‍♂️80 - శ్రీ రమణ మార్గం

*శ్రీ రమణ మహర్షి సందేశం పునర్జన్మ ఉన్నట్టా? లేనట్టా?*

*గురువులు పలు తెఱగులు*

గురువు లేనిది ఆధ్యాత్మిక విద్య నేర్వలేమనీ, తమంతట తాము అడుగు ముందుకు వేయలేమనీ, భారతీయ మనస్తత్వంలో ఎంత గాఢంగా నాటుకు పోయిందటే “నన్ను గురువుగా భావించకండి మొర్రో” అనిన మహానుభావుల్ని కూడా “నువ్వు గురువువే, కాదని ఎందుకంటావు?” అని వారిని కూడా బాధించడం జరుగుతుండేది.

గురు శిష్య సంప్రదాయం పేరిట నేడు జరుగుతున్న పరస్పర వంచన, దోపిడీని గమనించిన కొందరు మహా పురుషులు ఆ పేరును, ఆ భావాన్ని పూర్తిగా తిరస్కరించారు. అయితే ఆ కారణం చేత అలాంటి పుణ్య పురుషులు తమ వద్దకు వచ్చిన జిజ్ఞాసువులను నిరాదరణకు గురి చేశారని కానీ, మార్గాన్ని చూపించలేదని కానీ అనుకోకూడదు. సాధకుడు ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా ఆప్తుడైన వాడు సూచించిన విషయాన్ని అర్థం చేసుకొని తనంతట తానే ముందుకు నడవాలని వారి ఉద్దేశం.

అద్వైత శిఖరాలను అధిరోహించిన అరుణాచల రమణుడు 'గురు' పదాన్ని మృదువుగా పక్కకు నెట్టి “అంతగా గురువే అవసరమనుకుంటే ఈ లోకమంతా నీ గురువుగా పరిగణించవయ్యా" అని అంటుండేవాడు. ఈ విషయం ఆయన ఎన్ని మార్లు చెప్పినా “అలా అనకండి. మీరు మా గురువులే” అని ఆయన శిష్యుల్లో కొందరు అడ్డం తగిలేవారు. శ్రీ జిడ్డు కృష్ణమూర్తిగారి వద్ద ఇలాంటి ఆటలు సాగేవి కాదు కాబట్టి, ఈ మొండివాదం ప్రయోగించేవారు కాదు. అరుణాచల రమణుల స్వభావం వేరు; ఆయన ఇలాంటి వారిని ఏమీ చేయలేక మౌనంగా ఊరుకునేవారు.

ఆర్థర్ ఆస్బోర్న్ రమణ బోధను ఎంతో శ్రద్ధాసక్తులతో ఆచరించడమే కాక ఆంగ్ల పాఠకులకు ఆ బోధలను అందించిన వారిలో అగ్రగణ్యుడు. గురువు ఆవశ్యతకను గురించి భారతీయుల్లోనే కాక, సంప్రదాయాన్ని నమ్మిన కొందరు పాశ్యాత్యులలో కూడా ఈ విశ్వాసం ఎంత బలీయంగా ఉంటుందో చెప్పిన సందర్భం ఒకటున్నది.

"ఫ్రెంచి తత్త్వవేత్త రెనిగినాన్తో సహా మేము కొందరం సూదంటురాయి ఇనుప ముక్కలను ఆకర్షించినట్లు భగవాన్ రమణుని ఆకర్షణకు లోనై ఆయన చుట్టూ చేరాము.

మాలో డేవిడ్ మెక్లెవర్ అనే అతడు భగవాన్ రాసిన త్రిపుర రహస్యం, అద్వైత బోధ దీపిక అనే గ్రంథాలను ఆయన ఆజ్ఞానుసారం అనువదించిన వాడు కూడా. కానీ ఆ తర్వాత ఎందువలననో కాని త్రివేండ్రం వద్ద నివసిస్తున్న ఒక యోగిపైకి మా డేవిడ్ మనసు మళ్ళింది. ఆయన్ని తన గురువుగా స్వీకరించి ఆయన సన్నిధిలో స్థిర నివాసము ఏర్పరుచుకున్నాడు డేవిడ్.

నేనంటేనూ, నా భార్య అంటేనూ డేవిడ్కు చాలా అభిమానం. అందువల్ల తాను సేవించే గురువును మేమిద్దరమూ కూడా సేవించాలని అభిలషిస్తుండేవాడు. ఆత్మసాక్షాత్కారానికి సజీవ గురువు ఎంతైనా అవసరమనీ, భగవాన్ రమణులు తాను గురువని ఎన్నడూ ప్రకటించుకోలేదు కాబట్టి నేనూ, నా భార్య, శ్రీరమణుల్ని వదలి పెట్టి, మాబోటివాళ్లను శిష్యులుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న ఈ త్రివేండ్రం గురువు వద్దకు వచ్చేయమని రాస్తుండేవాడు. ఈ విషయమై చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు నేను భగవానుకి చూపిస్తుండేవాణ్ణి. భగవాన్ రమణులొక్కరే నా గురువని నా లేఖల్లో నేను తరచు ఉద్ఘాటిస్తూ ఉండడం, ఆ లేఖల్ని శ్రీరమణులు చూచి ‘అవును’ అన్నట్లుగా తల పంకించడం జరుగుతూనే వుండేది.

ఒకనాడు డేవిడ్ దగ్గర నుండి ఉత్తరం అమిత తీవ్రమైన హెచ్చరికతో వచ్చింది. రమణుల వారిని తక్షణమే విసర్జించి నేను వెంటనే త్రివేండ్రం రాకపోతే పరిణామాలు అనూహ్యంగా వుంటాయని వున్నది ఆ ఉత్తరంలో, నేను ఆందోళన చెందాను. సాయంత్రం శ్రీ రమణులతో సమావేశమైనప్పుడు ఆ ఉత్తరం చూపిద్దామనుకున్నాను.

ఆ మధ్యాహ్నం ఒంటరిగా తోటలో  తలవంచుకొని కలుపు మొక్క లేరేస్తున్నాను. అకస్మాత్తుగా నా వెనుక 'ఢాం' అనే పెద్ద శబ్దం వినిపించింది. వెనుకనున్న వృక్షం మీది నుండి ఏదో జంతువు కిందికి దూకినట్లూ, నా మీదికి వెనుక నుండి వస్తున్నట్లు అనిపించింది. తృటిలో అది నా వీపు మీద ఎక్కి కూచున్నది. దాని వెనక కాళ్ళతో నా వీపు మీదుగా రొమ్మును చుట్టి పట్టుకొని వుండడం కనిపించింది. ఆ కాళ్ళనున్న రోమాలను బట్టి అది ఎలుగుబంటి అయివుంటుందని ఊహించాను. అదేమి విచిత్రమో గాని ఆ సమయంలో అది 'ఏమి' జంతువో తెలుసుకుందామని గాని. నాలో
భయం కలగడం కాని, కనీసం ఏమిటి ఈ దురవస్థ అని అనుకోడం గాని ఇవేవీ జరగలేదు. ఒక విధమైన వైరాగ్య భావం నన్నలముకున్నది. అందువల్లనే చలించలేదు; మొక్కలు ఏరేస్తూ ఉండిపోయాను.

నా నిర్లక్ష్యాన్ని గమనించిన ఆ జంతువు పరిమాణంలో పెరిగి పెద్దదవుతున్నట్లు గాను, తన బరువంతా నామీద మరింతగా మోపుతున్నట్లు గానూ అనిపించింది. ఆ బరువుకి ముందుకు వంగిపోతున్నాను.

 కానీ ఎందుకనో నాకు భయం మాత్రం కలగ లేదు. ఉన్నట్లుండి అది తన ముందు కాళ్ళతో నా గొంతును పట్టుకొని నొక్కనారంభించింది. నాకు ఊపిరి సలపడం కష్టమైంది. దాని పట్టు మరింత బిగియ జొచ్చింది. ఇంత జరుగుతున్నప్పటికీ నాలో భయం జనించకపోవడం, నా మనస్సు సంపూర్ణంగా స్వాధీనంలో ఉండడం ఆశ్చర్యకరమైన విషయమే. ఇక నాకు ఊపిరాడదనే స్థితి ఉదయించింది. అది దాని పట్టు వీడలేదు సరిగదా, మరింత బిగించ నారంభించింది. భయమైతే లేదు గానీ ఇక నా మరణం మాత్రం తథ్యమని నాకు తెలిసిపోయింది. అప్పుడు జరిగింది ఓ అద్భుతం.

మరణం తప్పదని నాకు తట్టిన సమయంలో "అరుణాచల శివ, అరుణాచల శివ” అనే శబ్దం నాలో వినిపించ నారంభించింది. ఆ శబ్దం చేస్తున్నది నేను కాదు; లోపలి నుండి మరెవరో ఆ పదాలను ఉచ్చరిస్తున్నట్లు తోచింది. ఆ జపం వేగం పుంజు కున్నది; తీవ్రతరమయింది. ఒక వంక మరణ సామీప్యం, మరొకవంక ఈ దైవజపం, ఒకదాని సరసన మరొకటి సంభవిస్తూ ఉండడం ఒక వింత ఆనందానుభూతి అనవచ్చు. ఈ జపం స్థాయి పెరిగిన కొద్దీ, నా కంఠం మీది వత్తిడి తగ్గనారంభించింది. ఆ జంతువు పరిమాణం, దాని బరువు కూడా తగ్గనారంభించాయి. లోలోన ఈ అజపాజపం ఆగకుండా దానంతట అది సాగిపోతూనే ఉన్నది. 

ఒక్కసారిగా ఆ జంతువు నా వీపు మీది నుండి దూకి చెట్టు వద్దకు పరిగెట్ట నారంభించినట్లు నాకు అనిపించింది. దాని అడుగుల సవ్వడి నాకు వినిపిస్తూనే ఉంది. చెట్టెక్కి అది అదృశ్యమయింది. నేను నా యథాపూర్వ స్థితికి తిరిగివచ్చాను. అప్పటికీ నాలోన ఈ స్తోత్రం అంతరాయం లేకుండా సాగుతూనే వుంది. లేచి నుంచొని ఆ జంతువుకై వెతుకులాడాను కానీ అది ఎక్కడా కనిపించ లేదు. నాలో ఈ 'అరుణాచల శివ' అని వినిపిస్తున్న ఉచ్చాటన మాత్రం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది.

మర్నాడు ఉదయం భగవాన్ వాహ్యాళి నుండి తిరిగి వస్తుండగా ఉత్తరం చూపించి జరిగినదంతా విన్నవించుకున్నాను. అంతా విని భగవాన్ చిరునవ్వుతో "వారు చేయగలిగిందంతా అంతే. అయినా అంతా సుఖాంతమే కదా” అంటూ నడిచి వెళ్ళి పోయారు. మా సహచరుడు డేవిడ్, అతడి చేత ఈ ఉత్తరం రాయించిన ఆ గురువు, ఇద్దరినీ ఉద్దేశించి ‘వారు' అనే పదాన్ని భగవాన్ వాడినట్లు నాకనిపించింది.

రమణుల వంటి సద్గురువును ఆశ్రయించినప్పుడు, క్షుద్రదేవతోపాసన ద్వారా చేసే ఈ ప్రక్రియలు కూడా సాధకుడికి చివరకు మేలే చేస్తాయి. 'అరుణాచల శివ' అనే జపం సిద్ధించడానికి ఆఖరికి ఆ క్షుద్ర ప్రక్రియే మూల కారణమని చెప్పవచ్చు” అని ముగిస్తాడు ఆస్బోర్న్.

నిజంగా మీ మేలు కోరేవారు ఎవరూ కూడా తాము మీకన్న అధికులమైనట్లూ, తాము నేర్పేవారు, మీరు నేర్చేవారు అన్నట్లు మాట్లాడరు. కేవలం మీ శ్రేయస్సు కోరే మిత్రులవలె మెలగుతారు.

No comments:

Post a Comment