భగవాన్ రమణ మహర్షి నిత్య పారాయణం
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
అధ్యాయము 17
ఆణిముత్యాలు - 2 ( ధ్యానం )
భగవాన్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు . ధ్యానం చేయదలచుకుంటే నీలోనే ఉన్న నేనుపై దృష్టిని పెట్టమని . అదే ఆత్మ . ఒకసారి ఒక భక్తుడు తనకు ఎప్పుడు ధ్యానములో కూర్చోవాలనుకున్నా కుదరటము లేదని తను ఆశ్రమములో చేసే పనుల వలన అభ్యంతరము కలుగుతున్నదని భగవాన్ కు విన్నవించుకున్నారు . దానికి భగవాన్ ఆణిముత్యము వంటి సందేశమిచ్చినారు . అదేమనగా , “* నీ మనసుని ఉండవలసిన స్థలములో నిలుపు . నీ దేహాన్ని పని చేయనీ* ” అని అన్నారు . సుబ్బ లక్ష్మమ్మ అనే మరో భక్తురాలు ఉండెడిది . ఆవిడకి ధ్యానమంటే ఇష్టం . ఆశ్రమములో తీరుబడి లేకపోవుటచే ఆవిడ తన ఊరికి వెళ్ళి ఒక సంవత్సము ఉండి ధ్యానములోనే కాలం గడిపేది . ఐనా ఆవిడ మనసు మాత్రము ఆశ్రమముపై ఉండేది . తిరిగి ఆమె ఆశ్రమమునకు వచ్చినపుడు భగవాన్ ఆమెతో “ నీకు ధ్యానమంటే ఇష్టమా నీ మనస్సు ధ్యానం మీదనే ఉన్నట్లుంది ” అని అనగా ఆమె భగవాన్‌తో తనకు వంటపనులే ఉండుటచే కుదరటం లేదని చెప్పగా భగవాన్ ఇట్లనినారు , “ ఈ కాలు , చెయ్యి పనులు చేస్తూ ఉండనీ . నువ్వు కాలు చెయ్యివి కాదుగా . నువ్వు ఏమీ చేయక తటస్థంగా ఉండే వస్తువువు . అది నీకు ఎరుక కలగనంత వరకు కష్టం . ఆ ఎరుక కలిగినచో ఏదీ కష్టమనిపించదు . ఈ దేహము రాగద్వేషములతో ఉండును . కావున పనికష్టముగా అగుపించును . ఈ దేహము ' నేను ' అనుకున్నంతకాలము ఏ పనీ లేకుండా కూర్చుని ఉంటే మనస్సు ఊరుకుని నిలకడగా కూర్చుంటుందా ? అది మనము నిద్రపోయినా కూడా ఊరకే ఉండదు . కలలో కూడా తిరుగుతూనే ఉంటుంది .
భగవాన్ ధ్యానము గురించి ఎల్లప్పుడు ప్రతి వారిని తమ నిజ స్వరూపాన్ని ధ్యానించమని గుర్తుచేస్తూ ఉండేవారు . శరీరము , బుద్ధి , ఆవేశాలు ఇవన్నీ నీవు కావని కూడా చెప్పేవారు . భగవాన్ ధ్యానము చేసేవానికి , ఆత్మ విచారం అనుసరించే వానికి లక్ష్యం ఒక్కటే అని మనో నిశ్చలత అనేది కొందరికి ధ్యానం వల్ల మరికొందరికి జ్ఞానం వల్ల లభిస్తుందనేవారు . ' నేను ' పై44 ధ్యాస ఉంచమనేవారు . అది ఆత్మకి దారి చూపునని మిగిలినవి ఇంకేవిధముగానైనా చేసినను చివరికి అవి కూడా ఆత్మకి దారితీయునని అంటే మొదటి మార్గమైన ' నేను ' పై ధ్యాస ఉంచటంకు వచ్చి చేరుతాయని చెప్పేవారు . ఇతర పద్ధతులన్నీ సాధన చేసే వారికి ఒక రకమైన మానసిక నిశ్చలత మొదట కలిగి పిదప ఆత్మపై అవగాహన కలుగును . కావున మిగిలినవన్నీ పరోక్ష పద్ధతులే . అవన్నీ ఆత్మ జ్ఞానానికి లేదు ఆత్మ విచారానికి తెలిసికొనుటకు ఉపయోగపడును . ఒకసారి ఒక భక్తుడు దేనిపైనైనను ధ్యానం చేయటమంటే ఇష్టపడేవారు . కాని ఆత్మ విచారణ మార్గమంటే కష్టమనేవారు . అసలు ఆ ఆత్మ విచారణ మార్గముపై అయిష్టత కూడా చూపేవారు . ఆ విషయమును భగవాన్ ముందుకు తెచ్చినపుడు భగవాన్ చెప్పినది ఏమనగా ఎవరికైనను తనకు నచ్చిన అభ్యాసాన్నే చేసుకోమని అది తుట్ట తుదకు అప్రయత్నముగానే ఆత్మ జ్ఞానము కలిగిస్తుందన్నారు . భగవాన్ ధ్యానానికి ఇచ్చిన నిర్వచనము ఇతర భావనలన్నీ విడిచిపెట్టి ఒకే ఒక భావముపై మనసును ఏకాగ్రత చేయమన్నారు . ఇంకొద్ది మెట్టు ఎక్కినవారు అసలైన ధ్యానమంటే మనస్సుని ఆత్మపైనే లగ్నం చేయమనేవారు . ఈ రెండవరకమైన ఉన్నతస్థాయిలో చేసే ధ్యానాన్ని ఆత్మ విచారానికి మారుపేరే అవుతుంది . అనగా మనస్సుని ఆత్మపై లగ్నం చేయటమే ఆత్మవిచారమంటే మరియు ధ్యానము కూడా .
భగవాన్ మరొక ముఖ్య విషయము కూడా సాధకులకు తెలియచెప్పారు . అదేమనగా ధ్యానము మరియు విచారణ రెండు ఒక్కటేనని . వాటి మధ్య తారతమ్యములు లేవని . విచారణ చేసేవారు ' నేనెవరిని ' అని ప్రశ్నించుకుంటూ చివరికి ఆత్మ అంటే తెలుస్తుంది . ' నేను ' అంటే శరీరముకాదనిలోనున్న ఆత్మయే ' నేన'ని తెలుస్తుంది . ఈ విచారణ చేయలేని వారు ధ్యానము చేసుకోమన్నారు . ధ్యానము చేసేవారు తనను తాను మరచి అనగా *' నేను చేస్తున్నాను ' అని కూడా మరచి . “ నేను బ్రహ్మాన్ని లేక నేను ఈశ్వరుడను " అని తలుస్తూ సాధకుడు ధ్యానించాలి . ఈ పద్ధతిని విడువకుండా చేస్తూపోతే చివరికి బ్రహ్మము లేక ఈశ్వరుడు అనే ఎరుక కలుగుతుంది . అదే ఆత్మ* . కావున ధ్యానము , విచారణము రెండూ ఒక్కటే . ఒకే మార్గాన్ని చూపుతాయి . ఆత్మంటే ఏమిటో తెలుపుతాయి . భగవాన్ చెప్పినది ఒక భావమును పట్టుకుని ఉంటే ఆ భావము ఇతర ఆలోచనలను రానీయకుండా మనస్సును ఎటూ పోనీకుండా ఉండటానికి ధ్యానము చేస్తే శక్తి కలుగుతుందని ఆ భావాన్ని విడవకుండా ఉండుటయే ధ్యానమని దానివల్ల ఆలోచనలన్ని పోయి ఒక్క ఆత్మే మిగులుతుంది . ఆత్మలో లీనమై చివరకు తాను ధ్యానము చేస్తున్నాననే భావము కూడా లేకుండా ఉండాలని భగవాన్ చెప్పేవారు . ధ్యానమంటే ఆత్మ నిష్ఠ అని మన మనసులోని భావాలన్ని తొలగించటానికి చేసే ప్రయత్నాన్ని ధ్యానమందురు . ఆ ఆలోచనలన్ని ( భావాలు ) పోగా స్థిర మనస్సు ఏర్పడును . అటువంటి మనస్సే ఆత్మ అనగా మిగలినదే ఆత్మ . కొందరు భక్తులు ధ్యానము చేస్తున్నప్పుడు నిద్ర వస్తున్నదని ఆ నిద్రను ఆపుటకు ప్రయత్నిస్తున్నామని భగవాన్ కి చెప్పేవారు . దానికి *భగవాన్ నిద్రను ఆపటానికి ప్రయత్నిస్తున్నావంటే ధ్యానములో కూడా ఆలోచన కొనసాగుతున్నదని ” భగవాన్ హెచ్చరించేవారు *. భగవంతుడు ఆత్మరూ పేణా " నేనున్నా " నని ఎరుక ఉన్నంతవరకు భగవత్ సాక్షాత్కారం కలిగినట్లే . ఆ ఎరుక లేనివారు మాత్రమే భగవంతుని అన్నిచోట్ల వెతుకుట ఆరంభిస్తారు . కొందరు కనుబొమ్మల మధ్య భగవంతుడున్నాడనే భావనతో ధ్యానము చేసేవారూ ఉన్నారు . అవన్నీ కూడా ఏకాగ్రత్తను మాత్రమే పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది . భగవాన్ భగవంతుని నామము మరియు ఆత్మ ఒక్కటేనని చెప్పేవారు . ఆత్మసాక్షాత్కారము కలిగినవారికి వారి హృదయంలో భగవాన్ స్మరణము అనుకోకుండానే సాగిపోతుందని చెప్పేవారు . కొందరు భక్తులు ఆత్మ సాక్షాత్కారము లేదా ఆత్మ గురించి తెలుసుకోవటానికి ఏ శాస్త్రాలు ఉపయోగపడునని భగవాన్ ని ప్రశ్నించినపుడు భగవాన్ దానికి జవాబుగా ఏ శాస్త్రాలను కూడా చదువ వలసిన పని లేదనేవారు . ఆత్మను గురించి తెలిసికోవటానికి ఏ పనులు అడ్డురావని కూడా చెప్పేవారు . “ నీలో నీవు నేను నేను ( అహం ) అని అనుకున్నట్లు అయితే అలా కొనసాగగా ఆత్మ స్థితికి నీవే చేరుతావు . ఏ పనిచేస్తున్నా కూడా అట్లాగే అనుకుంటూ ఉండమని ఆ నేను అనేదే భగవంతుని నామమని ” చెప్పేవారు . ఏ పని పనిలోనున్న నేను చేస్తుందని కాని ఆ పని చేసేది నీవేనని ( నేను శరీరము ) అని అనుకోవద్దని భగవాన్ చెప్పేవారు . నేను చేస్తున్నాను అనే ఆలోచన కర్తృత్వ భావం కలిగి అదే మనలో ఎన్నో భావాలకి కారణమై ఉంటుంది . దానివలన మనస్సు ఏ విషయములపై తలంపులు చేసినా ఆ ఉంటుందో దానికి సంబంధమైన ఆలోచనలు బైటకి తెస్తాయి ఇన్ని తలంపులకు ఆలోచించు వాడే మూలము . నేను . అనేది తప్ప మిగిలినవన్నీ అనగా వచ్చిపోయే ఆలోచనలు మారుతూ ఉంటాయి . కాని నేను అనే ఆలోచన స్థిరము . ఆ నేను అనే తలంపు మీదే శ్రద్ధను ఉంచినట్లయితే ఇతర ఆలోచనలన్ని వాటంతట అవే వెళ్ళిపోతాయి " అని భగవాన్ చెప్పేవారు . భగవాన్ మరొక ముఖ్యమైన విషయం కూడా చెప్పారు . ఈశ్వరార్పణముతో చేసిన పనులు నిశ్చలత్వము పొంది సరైన ధ్యానానికి శక్తిని చేకూరుస్తుందని అదే ఫలాపేక్షతో చేసే పనిమాత్రం భారమనిపిస్తుందని నేను చేస్తున్నాననే భావము కూడా కలిగి దాని వలన ఆ చేసే పని కూడా ఎలా చేయాలో అనే సంకోచము మరియు భయం కలుగుతుందని ఆ భయం వలన ఫలితం ఏ విధముగా ఉంటుందో అనే తపన తప్ప ఆత్మ విచారము దూరమయిపోతుంది . కావున భగవాన్ చెప్పినదేమనగా మనము చేసే పనులు విసుగుతో లేదా యాంత్రికంగా కాని చేయకూడదని పూర్తి శ్రద్ధాభక్తులతో ధ్యాస పెట్టి ఎరుకతో పనిచేయవలెనని భగవాన్ చెప్పేవారు .
కాబట్టి భగవాన్ ధ్యానము గురించి చెప్పిన ఆణిముత్యముల వంటి బోధలను గ్రహించిన సాధకులు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలరు . వారి బోధలను మనకు అవగాహన కలగాలని భగవాన్ కృప మనపై ఉండాలని ఆ భగవానుని శరణు వేడుకుంటూ మనము కూడా ధ్యానాన్ని ప్రారంభిద్దాం . రమణుని అనన్య శరణాగతి వేడుదాం .
ఓ భగవాన్ రమణా నీవే మాకు శరణాగతి .
అరుణాచల శివ నీవే మాకు శరణాగతి 🙏
No comments:
Post a Comment