ఓం నమో భగవతే శ్రీ రమణాయ
*అధ్యాయము - 23
ఆణిముత్యాలు - 8
ఆత్మ జ్ఞానం - కొన్ని ముఖ్యమైన బోదనలు / రహస్యాలు*
భగవాన్ శ్రీ రమణ మహర్షులవారు ఎల్లప్పుడు మౌనముగా ఉంటూ ఎవరైనా వారిని ప్రశ్నించిన , సాధరణముగా నేను ఎవరు అని ముందు తెలుసుకోమనేవారు . ఆ అసలైన నేనును తెలుసుకుంటే ఆత్మ సాక్షాత్కారమైనట్లే . ఈ నేను అనునది మనిషికి సంబంధించిన అనగా దేహమునకు గాని మనస్సునకు గాని కాదు . మూడు దశలలో అనగా జాగ్రత్ , స్వప్న , సుషుప్తి లందు అనుభవించునదే ఆ నేను . ఈ మూడు అవస్థలు వ్యక్తిని ఎటువంటి బాధ పెట్టవు ఈ మూడు అవస్థలు ఆత్మను భాదింపకుండ వచ్చిపోయేవి . ఆత్మ ఎల్లప్పుడు సంపూర్ణముగా ఆనందముతో ఉండునని తెలిసికొనుటయే ఆత్మ సాక్షాత్కారముని భగవాన్ చెప్పేవారు .
భగవాన్ ఆత్మను తెలిసికొనుట ఎట్లు అని ప్రశ్నించే భక్తులకు వారు చెప్పిన సమాధానము *ఆత్మగా ఉండుటయే ఆత్మను తెలిసికొనుట అని అనేవారు* . ఉదాహరణకు మన కనులను మనము చూసుకొనలేము . అద్దములో మాత్రమే మన కనులను చూడగలము . ఒక వేళ ఆ అద్దమును ఉపయోగించక పోయినంత మాత్రమున మన కనుల ఉనికిని కాదనగలమా అనే ప్రశ్నను భగవాన్ వేసేవారు . కావున భగవాన్ చెప్పినదేమనగా ఆత్మను తెలిసికొనుట అనగా ఆత్మగా ఉండుటయే అని మరియు భగవాన్ ఇట్లనేవారు . “ నీకు ఆత్మ తెలియదని చెప్పగలవా ? కావున మన కనులను మనము చూడలేక పోయినను అదే విధముగా ఆత్మ విషయముగా ఉండనప్పటికి నీవు ఆత్మను ఎరుగుదువు . లేదా ఆత్మ విషయముగా లేదు గనుక నీవు నీ ఆత్మను లేదనగలవా ? ” అని భగవాన్ చెప్పేవారు . ఆత్మయే ఈశ్వరుడు , నేనున్నాను అనునుది ఈశ్వరుడు భగవాన్ దీనికి నిదర్శనముగా భగవద్గీత యందు 10 వ అధ్యాయము నందు ( విభూది యోగము ) 20 వ శ్లోకం ఇక్కడ వివరించినారు .
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః|
అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ|| 10-20 ||
ఓ అర్జునా ! సమస్త ప్రాణుల హృదయములందున్న ఆత్మను నేనే . సకల భూతముల ( ప్రాణం ) ఆదియు , మధ్యస్థితియు అంతయు నేనే . ( ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయములకు కారణము నేనే . )
భగవాన్ చెప్పినదేమనగా ఈశ్వరుడు ఆత్మ కంటే వేరు కాదని ఆత్మయే ఈశ్వరుడని కాని అట్టి సందేహము రావడానికి గల కారణము ఎవరైతే అహంకారాత్మను పట్టుకున్న వాడు , ఈశ్వరుడు ఆత్మ కంటే వేరని భావన కల్గును అని చెప్పినారు . సత్యాత్మను పట్టుకున్న వారికి ఇలాంటి సందేహము రావని భగవాన్ చెప్పారు . ఆత్మ ఎన్నడు కనిపించదు . అలాగే అదృశ్యము కూడా కాదని కావున ఆత్మ శాశ్వతమని భగవాన్ చెప్పినారు . భగవాన్ సాక్షాత్కారమంటే శాంతముగా ఉండటమే అని సాక్షాత్కారమనేది క్రొత్తగా పొందేది కాదని సాధకుడు నాకు సాక్షాత్కారము కలుగలేదు అనే భావాన్ని వదులుకోమన్నారు . *ఆత్మ లేని క్షణమనేది లేదని భగవాన్ చెప్పేవారు . ఆనాత్మమైనవి వదులుకుంటే మిగిలేది ఆత్మే అని లోనున్న వాసనలన్ని వదిలించుకోమన్నారు . ఆత్మ అంటే నువ్వే అది తెలిసికోవటమే ఆత్మ సాక్షాత్కారమని* చెప్పేవారు . ప్రతి జీవిలో లోన ఆనంతమైన ఆనందం రూపేణా ఆత్మ ఉండునని కాని ఆ ఆనంద నిలయమైన ఆత్మని మాయతెర కప్పుటచే అది తెలియకపోవుటచే అవిద్య ఆవతరించునని దృష్టి దేహముపై పోయి మనస్సు అనేకమైన ఆలోచనలను కలిగించి వాటి వెంట పరుగిడును కాని దృష్టి అంతర్ముఖము కాదు భగవాన్ చెప్పినదేమనగా *ప్రతివారికి నేనున్నాని తెలుసని వారి ఉనికి ఎవ్వరూ కాదనలేరని* సుషుప్తిలో మాత్రము వారికి ఎరుక అనేది ఉండదని మెలకువ వచ్చిన వెంటనే ఆ ఎరుక తెలుస్తున్నదని చెప్పారు . సుషుప్తి లోను మెలకువ లోను ఉన్నది మనిషి ఒక్కడే . మరి తేడా నిద్రలో మాత్రము అతనికి శరీరస్పృహ లేదు . మెలకువలో మటుకు ఆ స్పృహ ఉన్నది . దేహము గురించిన ఈ ఎరుక పైకి రావటమే ఈ భేదానికి కారణం . కాని చైతన్యంలో మాత్రము మార్పులేదు . సుషుప్తిలో పరిమితులు అంటూ ఉండవు . అంటే బంధాలనేవి సుషుప్తిలో అంటవు . అదే మెలకువగా ఉన్నప్పుడు మాత్రమే పరిమితులు ఉండి అవి బంధాలుగా ఏర్పడతాయి . ఈ మెలకువలోనే ఈ శరీరమే నేను అనే తప్పుభావన ఏర్పడుతుంది . కావున భగవాన్ చెప్పినదేమనగా. ఈ శరీరము నేనే అనే తప్పుడు భావన పోవాలని అసలైన నేను అనేది ప్రతి వారిలో ఎప్పుడు ఉంటుందని చెప్పారు . ఈ మూడు అవస్థలలో సుషుప్తి మరియు మెలకువను తీసుకుని గ్రహించినచో శరీర ధ్యాస అనేది ఒక దానిలో కనబడుతుంది . కాని చైతన్యం అనేది మటుకు ఉంటుంది . *భగవాన్ ఈ శరీరమే నేననే తప్పుడు భావము పోవుటయే సాక్షాత్కారమని అంతే తప్ప సాక్షాత్కారమంటే ఏదో ఒకటి మనముందు సాక్షాత్కారించుటము కాదని ఈ శరీరమే నేనను మిధ్యాజ్ఞానము పోయిన పిదప మిగిలినది ఆత్మే . కావున ఆత్మ సాక్షాత్కారము అయినట్లు . ఇదే ఆత్మా జ్ఞానము కూడా . ఆత్మ అనేది కేవలము ఎరుకే . ఈ మూడు స్థితులు అనగా సుషుప్తి స్వప్నము మెలకువ ఆత్మపై తాత్కాలికమైన ఏర్పడే స్థితులు మాత్రమే . కాని ఆత్మ మాత్రము నిశ్చలముగా స్థిరముగా శాశ్వతముగా ఉండేది* . ఆ ఎరుక ఆత్మ . సుషుప్తిలో , మెలకువలోను మనిషి ఉంటాడు . ఆ రెండు స్థితులకి భేదమేమిటంటే మెలకువలో శరీరము , ప్రపంచము , వస్తువులు కనిపిస్తాయి . కాని సుషుప్తిలో కనబడవు . ఆ సుషుప్తి మరియు మెలకువ అవిచ్ఛినముగా కొనసాగుతూ ఆ స్థితి స్వచ్ఛమైన ఉనికే ఇలాంటి బోదనలు విన్నపుడు ఒక భక్తుడు భగవాన్ని ఈ విధంగా ప్రశ్నించినాడు . " సుషుప్తిలో నాకు ఎరుక ఉండదు కదా . ” దానికి భగవాన్ చెప్పినది . “ నిజమే శరీరము కాని ప్రపంచము కాని మరియు వస్తువులు కాని సుషుప్తిలో నీకు తెలియవు . కాని ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్న సుషుప్తిలో నాకు ఎరుకే ఉండదు అని నువ్వు అన్నావంటే ఆ అవస్థలో కూడా నువ్వున్నావన్నమాట . కాని ఆమాటలను ఇప్పుడనేది ఎవరు మెలకువగా ఉన్న మనిషి , కాని నిద్ర పోయేవాడన లేడు . కాబట్టి నిద్రలో ఈ శరీరము ఆత్మ అని మనిషికి థ్యాస ఉండదు అని ఋజువైనది . మెలకువలో మాత్రమే నీవు దేహంతో తదాత్మ్యం చెందుటవలన కనబడే ప్రపంచాన్ని చూసి మురిసిపోతావు . కాని సుషుప్తిలో నీవంటూ ఒక వ్యక్తిగా లేకపోవుటచే అవేవీ ఉండవు . కావున ఉనికి శాశ్వతమని శరీరము ప్రపంచము కావని అవి చైతన్యమనే తెరపై వస్తూ పోయేవని ఆ ఉనికే , ఆ చైతన్యమే శాశ్వతము .
నేను అనే భావము మెలకువ స్థితిలోనే వస్తుంది . అప్పుడే భావాలు శరీరవ్యాపకాలు తదితరమైనటు వంటివి ప్రారంభమవుతాయి . సుషుప్తి స్థితి మటుకు శుద్ధ చైతన్యానికి చేరువగా ఉంటుంది . అలా అని ఈ నేను అనే అహం వృత్తి భావము మెలకువలోనే వస్తున్నది కదా . మన మెల్లప్పుడు సుషుప్తిలోనే ఉందామనుకుంటే పొరపాటే ఇతర స్థితులు కూడా జ్ఞాని . అయిన వానికి వస్తు ఉండాలి . సామాన్యుడికి , జ్ఞానికి అ స్థితులలో అనుభవించే ఆనందానికి మటుకు తేడా ఉంటుంది . జ్ఞాని ఆనందము శాశ్వతమైనది . దేనితోను కూడా మారదు . జ్ఞానికి ఎరుక ఉంటుంది . భగవాన్ పదేపదే వారిని ప్రశ్నించిన భక్తులకు ఆత్మను గురించి ఆ స్థితిని అందుకోలేకున్నాము . అనే వారికి భోదించినదేమనగా నువ్వే ఆత్మవని నువ్వెప్పుడు ఉంటూనే ఉన్నావని తప్ప ఆత్మ గురించి వేరుగా చెప్పవలసినది ఏమీ లేదన్నారు . మరియు భగవాత్ సాక్షాత్కారమన్నా , ఆత్మసాక్షాత్కామన్నా ఒక్కటేనని నువ్వునీవుగా , నీ ఆత్మగా ఉండుట అని చెప్పేవారు ఈ శరీరము నేనని అనాత్మ విషయాలను విడనాడినచో మిగిలినదే ఆత్మ .
నేను అనే ఈ అహంకారము వస్తూ పోతుందని అది తాత్కాలికమైనదని అసలైన ఆత్మ శాశ్వతమని నువ్వే ఆ ఆత్మవని కాని నేను అనే అహంకారాన్ని తప్పుగా అర్ధం చేసుకుని దానితో తదాత్మ్యం చెందుచున్నారని భగవాన్ సూచించారు . ఎప్పుడైతే నీవు దేహానివనుకున్నప్పుడు ప్రపంచం ఉంటుందని అట్లుకాక నువ్వు ఆత్మవే అనుకున్నప్పుడు ఉండేదల్లా ఆత్మేనని భగవాన్ సూచించారు . భగవాన్ వాస్తవానికి అవిద్య అంటూ ఏమీ ఉండదని అది మన అజ్ఞానమే తప్ప మరేమీ కాదని అది కూడా *ఆత్మ గురించి మరుపే అజ్ఞానమని భగవాన్ సూచించారు . అసలు ఆత్మ జ్ఞానమంటే ఆత్మగా ఉండటమే అని ఆత్మగా ఉనికే అని అనగా నీ ఉనికే అని భగవాన్ చెప్పేవారు . ఆత్మని అందరూ వేరే విధంగా భావించుకొనుట చేత జ్ఞానాన్ని పోగొట్టుకొని అవిద్యలో చిక్కుకుంటారు* . ఎప్పుడూ నీ గురించి చెప్పుకుంటూ ఆలోచిస్తూ ఉంటావని కాని ప్రశ్నించినప్పుడు ఆ నేను ఎవరో తెలియదంటావని భగవాన్ చెప్పేవారు . కావున ఆత్మ అంటే నువ్వేనని భగవాన్ సూచించారు . ఒక భక్తుడు కనిపించే చెట్లు , చేమలు , కొండలు , విషయముల గురించి మరేమిటని ప్రశ్నింపగా భగవాన్ దానికి జవాబుగా “ ఆత్మకి భిన్నంగా ఉండవని నిజానికి నువ్వు వాటిని చూస్తున్నాననుకుంటున్నావుగాని ఆ భావము ఆత్మ నుంచే లేస్తుందని అది ఎక్కడినుంచి లేస్తుందో కనుక్కోమని అప్పుడిక ఆలోచనలు రాక ఆత్మే మిగులుతుందన్నారు . ఉదాహరణకు సినిమా తెరమీద కాంతి పడుతుంది . దానిమీద నీడలు నడుస్తున్నట్లు చూచేవారికి కన్పిస్తుంది . ఆ నాటకంలోని ప్రేక్షకులను కూడా తెరమీద నాటకమాడే వారిలో భాగంగా చూపిస్తే చూచేవాళ్ళు చూడబడేది తెరమీద ఉంటాయి . *దీనిని నీకు వర్తించుకో . నువ్వు తెరవి . ఆత్మ అహంకారాన్ని సృష్టించింది . అహంకారానికి గల భావాలు ప్రపంచంలాగా ప్రదర్శింపబడతాయి . కావున నువ్వు చెప్పిన చెట్లు , చేమలు వీటిలోనివే . ఇవన్నీ ఆత్మ తప్ప వేరేమీ కావని నువ్వు ఆత్మని చూస్తే అన్నీ ప్రతిచోట మరియు ఎప్పుడు అదేనని తెలుస్తుంది . ఆత్మకి తప్ప వేరేదేనికి ఉనికి లేదు* .
*భగవాన్ మరియొక ముఖ్యమైన విషయం చెప్పినదేమనగా అజ్ఞాని ఎల్లప్పుడు మనస్సునే చూస్తాడని నిజానికి అది ఆత్మనుంచి ఉదయించే శుద్ధ చైతన్యానికి ప్రతిబింబం మాత్రమే* . అతడు అజ్ఞాని అవుట వలన మనసునే చూస్తాడు కావున అతని మనసు సహజంగా బైట పరుగెడుతుందని , దానివల్ల తన మూలాన్ని తెలుసుకోలేకపోతున్నాడు . హృదయం నుంచి వచ్చే *ఆ అనంతమైన చైతన్యపు కాంతిని మనిషి మనస్సులోని వాసనలు ప్రతిబింబించడం అవుతాయి . ఈ ప్రతిబింబం యొక్క రూపాలనే మనస్సంటారని ఆ ప్రతిబింబాన్ని చూసి అజ్ఞాని తాను జీవుడని , వ్యక్తి అని భ్రమపడి అతడు పరిమితుడని అనుకుంటాడు*. దీని వలననే ఆత్మ సాక్షాత్కారానికి ఆటాంకాలు మనస్సు యొక్క వాసనలే అని భగవాన్ చెప్పారు .
భగవాన్ ఉన్నదల్లా జ్ఞానమేనని , అసలు అవిద్య అంటూ లేదని , కానీ దానిగ్రహింపు సంస్కారాల వల్ల అని సూచించారు . ఆత్మను అహంకారంగా భావిస్తే అహంకారమే అవుతాయని , మనస్సుగా భావిస్తే మనస్సు అవుతామని , దేహంగా భావిస్తే దేహమవుతామని భగవాన్ చెప్పారు . ఇన్నింటికి గల కారణం భావమేనని* , కావున అహంకారాన్ని అది చేసే పనులను లెక్కపెట్టక దాని వెనుకనున్న కాంతినే గమనించమని , అహంకారమంటే " నేను " అనే భావమేనని నిజమైన నేను ఆత్మేనని భగవాన్ హెచ్చరించారు . ఈ భావాలవలనే మనలోపలనున్న ఆనందాన్ని మనస్సు అడ్డుపడి భావములచేత ఆ ఆనందాన్ని బైటకి తీయదు . కావున మనస్సు యొక్క నిజ స్వరూపము తెలుసుకుంటే ఆత్మ అన్వేషింపబడుతుంది . *మనచుట్టూ చూసేవన్నీ మనలోనే ఉన్నది* . మనకొక గమ్యముందని ఆ గమ్యాన్ని చేరుకోవాలని దానికొక మార్గమున్నదని భావనే తప్పని భగవాన్ సూచించారు . నిజానికి ఆ గమ్యం మరియు ప్రశాంతత మనమేనని గ్రహించాలి . *మనస్సు అణిగిపోతే ప్రపంచము కూడా అణిగిపోతుందని భగవాన్ చెప్పేవారు* .
భగవాన్ చెప్పిన ఈ ఆత్మ జ్ఞానమును వారి అమూల్యమైన బోధనలను రహస్యాలను మనము కూడా ఆచరిద్దాం . ఆ ఆచరించటానికి కావలసిన శక్తిని భగవాన్ ని వేడుకుందాం . మనకు అవిద్యే లేదని ఉన్నదల్లా జ్ఞానమేనని , మనము ఒక దేహముకాదని కనిపించే జగత్తు మిథ్యేయని ఆత్మయే సత్యమని మనమందరము ఆ భగవాన్ కృపతో వారి ఆణిముత్యముల వంటి బోధనలు మనకు అర్ధముకావాలని , ఆత్మగానే మనము ఉండాలని అసలు మనము ఆత్మే అని తెలుసుకోవాలని భగవాన్ శ్రీ రమణ మహర్షిని సర్వశ్య శరణాగతి వేడుతూ ఓ అరుణాచల రమణా నీవే మాకు శరణాగతి .
🙇♂️అరుణాచల శివ 🌹శ్రీ గురదేవా మీ పాదపద్మములకు సాష్టాంగనమస్కారాలు.
No comments:
Post a Comment