ఓం నమో భగవతే శ్రీ రమణాయ
అధ్యాయము - 33
భగవాన్ ఉవాచ - తరువాయి భాగం
భగవాన్ సంసారమనే పదానికి అర్ధం చాలా గొప్పగా విశదీకరించినారు . సంసారమంటే మనస్సు సారమే అని దానిని విడిస్తే ఎక్కడ ఉన్న ఏదీకూడా బాధించదని భగవాన్ నొక్కి చెప్పారు . *ఒకసారి ఒక భక్తుడు అనునిత్యం దైవనామము జపిస్తూ ఉన్నప్పటికి అనేకమైన తలంపులు బయలుదేరుతున్నాయని భగవాన్ కి తన బాధను చెప్పుకొనగా భగవాన్ అటువంటి సంధర్భములు ఏర్పడినప్పటికిని ఏ నామమైతే పట్టుకొని జపిస్తున్నావో ఆ నామాన్ని పట్టుకొనమని సలహా ఇచ్చినారు* . ఆ భక్తుడు తనకు కలిగిన అంతరాయంకు గలకారణం సంసారమని దానిని వదిలి వేద్దామని అనుకుంటున్నానని అని ఆ భక్తుడు *భగవానుని ప్రశ్నింపగా దానికి భగవాన్ " సంసారములోపల ఉన్నదా ? బైట ఉన్నదా ? ” అని అనగా ఆ భక్తుడు భార్య పిల్లలు అదే సంసారమంటే అని అనగా భగవాన్ " వారేం చేశారండి . అసలు సంసారమంటే ఏదో తెలుసుకో . ఒకవేళ నీ భార్య పిల్లలును వదిలి ఇక్కడుంటే ఇదొక సంసారమని లేదా భార్య పిల్లలను వదిలి సన్యసించి కమండలము కర్ర మొదలగునవి పట్టుకుని తిరిగినచో అదొక సంసారమని కావున అసలు సంసారమంటే మనస్సంసారమే . ఆ సంసారాన్ని విడిస్తే ఎక్కడ ఉన్నా బాధించదు* . కావున ఆ మనస్సంసారము విడవటానికి ఏ నామమైతే జపిస్తున్నావో జపించేటప్పుడు తలంపులు వచ్చినపుడు చేసే జపం మరచి పోతున్నావని జ్ఞప్తికి తెచ్చుకుని ఆ జ్ఞప్తినే వృద్ధి చేసుకుని ఆ జపించే నామాన్నే పట్టుకుని ఉంటే తలంపులు బలం తగ్గి నామ జపం వల్ల ఉత్తములు అవుతామని ఎటువంటి ఆటంకాలు రావని " భగవాన్ విశదీకరించినారు . కావున దీనిని బట్టి మన మనస్సులో అలజడి చేసే తలంపులను ఎల్లప్పుడు వచ్చిన వెంటనే నొక్కిపెట్టవలెనని రహస్యాన్ని భగవాన్ తెలియజేశారు .
మరియొక భక్తురాలు ధ్యానం చేసుకుంటూ ఎల్లప్పుడు కూర్చోవాలనిపిస్తుందని కాని పని ఉండుటచే కుదురుట లేదని భగవాన్ ని ప్రశ్నింపగా భగవాన్ “ *మనస్సును ఉన్నచోటనే ఉంచి శరీరము పనిచేయనీ* " అని అన్నారు . ఆ భక్తురాలు మరొకసారి భగవాన్తో బంధాలు ఇంకా వదలటం లేదని అనగా దానికి భగవాన్ " *వచ్చేదిరాని , పోయేది పోనీ . ఆ నేను అనేది ఏదో సరిగ్గా చూడగలిగితే ఎటువంటి బాధలు ఉండవని ” భగవాన్ చెప్పినారు .
ఇంకొకసారి ఒక భక్తురాలు భగవాన్ వద్దకు వచ్చి మోక్షం కావాలని మరేమీ అక్కరలేదని మోక్షమొక్కటిస్తే చాలని కోరింది . పైగా ఆ భక్తురాలు ఎప్పుడో ఇస్తేకాదని ఇప్పుడే ఇవ్వాలని అని అన్నది . ఆమె వెళ్ళిన పిదప భగవాన్ చుట్టూ ఉన్న భక్తులతో ఇట్లనినారు . “*ఏమీ వద్దని అన్ని విడిచిపెడితే ఉండేది మోక్షమే . ఇక ఒకరిచ్చేదేమి ? అది ఉండనే ఉంది కదా . " అందులో ఉన్న మరియొక భక్తురాలు మాకు మోక్షం ఇవ్వాల్సిందే . మేము అందుకే వచ్చి ఉన్నాం అని అనగా భగవాన్ , “ అది మూటా , ముల్లెయా కట్టి ఇచ్చేందుకు ఇంక ఏమీ కోరరట . ఒక్క మోక్షమిస్తే చాలునట . అది మాత్రం కోరిక కాదు కాబోలు . ఉన్నవన్నీ పోగొట్టుకుంటే మిగిలేదే మోక్షం అవి పోగొట్టుకునేందుకే సాధన చేయాలని " భగవాన్ సూచించినారు* .
ఒకసారి భగవాన్కు విపరీతమైన కాళ్ళు నొప్పులు రావటంచే భక్తులు ఒక్కొక్కరు ఒక రకమైన సేవను అంటే కాళ్ళు వత్తేవారు ఒకరు , తైలం రుద్దేవారు మరొకరు ఇలా ఎవరికి తోచినట్లు వారు చేయుచుండగా భగవాన్ వారి సేవలను గమనించి ఇట్లనినారు , " *ఇంటికి చుట్టం వస్తారు . చూచి చూడనట్లుంటే త్వరగా పోతాడు . కాని మర్యాదలు చేస్తే వెళ్ళనే వెళ్ళడు . కావున వ్యాధి కూడా అంటే , మీరట్లా చేస్తూ వుంటే అది వదిలి ఎందుకు పోతుంది . లక్ష్యం పెట్టకుండా ఉంటే అదే పోతుంది . ఐనా ఇది కూడా ఒక విధంగా మంచిదే . మీరిలా నాకు కాళ్ళు వత్తుచుంటే వచ్చే జనం అంతా నన్ను చూసి ఈ స్వామి తానే కాళ్ళనొప్పులతో బాధపడుతుంటే ఇక మనకేం చేస్తాడని వచ్చినవారు వచ్చిన తోవలోనే పోతారు . కావున చేయండి* " అని భగవాన్ అన్నారు .
భగవాన్ నిజమైన నేనును గూర్చి ఇట్లనివారు , " నేను దేహం కాని పంచేంద్రియాలు , ప్రాణం , మనస్సు మరియు సుషుప్తికాదు . వాటన్నిటిని విడిచిపెట్టంగా మిగిలేది ' నేను ' అది చైతన్యము అనే అదే సచ్చిదానంతమని ఆ స్థితిలో ' నేను ' అన్న భావావేశం కూడా ఉండక మిగిలి ఉన్నదే మౌనమని అదే ఆత్మ అని చెప్పేవారు . కనిపించే సృష్టి , అహము మరియు ఈశ్వరుడు వీటన్నిటిని వేరువేరుగా తలుచుట భ్రాంతి అని భావాలకు మూలమైన మనస్సు మాయమైనచో కనిపించే వస్తుజాలము కూడా పోవునని కావున మనస్సంటేనే భావాల సమూహమని అదొక శక్తి అని అది ప్రపంచంగా రూపము ధరించి కన్పిస్తుందని ఎప్పుడైతే ఆ మనస్సు ఆత్మలో లయమౌతుందో అప్పుడే నిజమైన తత్వం కన్పిస్తుంది . కావున నేనెవరిని అన్న చింతన కొనసాగిస్తుఉంటే భావాలకు సమూహమైన ఆ మనసు అదృశ్యమౌతుంది . ఏ పని చేసినా అహంకార రహితుడై నేను చేస్తున్నాననే భావన లేక తన అహాన్ని ఆత్మకు అంకితం చేయాలని భగవాన్ చెప్పినారు . కావున మనస్సు మాయమవుటకు కొన్ని పద్ధతుల ద్వారా దానిని నిశ్చలం చేయుటకు యత్నించినను అది తాత్కాలికమే అవుతుంది . కాని మళ్ళీ ఆ మనస్సులో తలంపులు వస్తూనే వుంటాయి . కావున అంతరంగములోకి చూస్తూ వెళ్ళినకొద్దీ అవి బలహీనమవుతాయి . అలా ఆత్మలో చొచ్చుకొని పోయే కొద్ది మనస్సు మాయమవుతుందని చివరికి అదే ఆత్మగా కనిపిస్తుందని భగవాన్ చెప్పినారు . ఒక ఆలోచన బైట పడినప్పుడల్లా దానిని ధ్వంసము చేయుటయే ఉపాయము . అంటే దానిని పుట్టే స్థానములోనే నశింపచేయాలి . నిరంతరము ఆత్మ గురించి చింతన చేయాలని భగవాన్ చెప్పారు .
భగవాన్ భగవంతుని గురించి కూడా ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు . భగవంతునికి ఏ సంకల్పము లేదని మరి ఏ పనైనా ఆయనకు సంబంధించినది కాదని ప్రపంచంలో జరిగేదేదైనా ఆయనని ప్రభావితం చేయదని సాక్షీభూతునిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడని చెప్పారు . కాని జీవులకు మాత్రము వాటి ప్రభావము యధావిధిగా ఉంటుందని , భగవంతుడు నిర్ణయించిన క్రమానన్ను సరించి అనగా వారి వారి కర్మలననుసరించి వచ్చే ఫలితాలు వారివేగాని భగవంతునివి కాదని ఆ భగవంతుడు దానికి బాధ్యుడు కాడని భగవాన్ చెప్పినారు* .
ఈ విధంగా భగవాన్ సంసారమంటే , ధ్యానమంటే , మోక్షమంటే , నిజమైన నేను గూర్చి మరియు భగవంతుని గూర్చి కొన్ని ముఖ్యమైన రహస్యాలు చెప్పినారు . కావున మనము కూడా మనము సంసారంలోనే వుంటూ మనస్సంసారమును గురించి ఎరింగి , ధ్యానం గురించి మరియు అన్ని విడిచిపెడితే ఉన్నదే మోక్షమని తెలిసికొని మరియు నిజమైన నేనుగా గుర్తించుటకు కావలసిన శక్తి ఆ భగవానుని ప్రార్థిస్తూ శరణు వేడుదాం .
ఓ రమణా నీవే మాకు శరణు .
అరుణాచల శివ.
No comments:
Post a Comment