Friday, January 6, 2023

ఇవి ఉన్నట్లుండి తెల్లబడలేదు!

 *ఇవి ఉన్నట్లుండి తెల్లబడలేదు!*

ఒక రైలు బోగీలో ఒక వృద్ధుడు ఉన్నాడు. 

తర్వాతి స్టేషన్ లో కొందరు యవకులు ఆ బోగీలో ఎక్కారు. కాసేపటికి ఈ వృద్ధుడి  ఎదురుగా వచ్చి కూర్చున్నారు. 

ఒక యువకుడి దృష్టి బోగీలోని చైన్ మీద పడింది. స్నేహితులతో, నేను చైన్ లాగుతాను అన్నాడు.

రెండవవాడు అనవసరంగా అది లాగి, రైలును ఆపితే 500 జుర్మానా వేస్తారు. అదీగాక జైలు శిక్ష కూడా వేయవచ్చు అన్నాడు. జైలు శిక్ష తప్పించుకోవాలంటే 500 లతోబాటు మరో 700 కట్టాల్సొస్తుంది కూడా.

అపుడు మొదటి యువకుడు మన దగ్గర ఎంత డబ్బులున్నాయో తీసి మూడవ స్నేహితుడి వద్ద పెట్టండి అన్నాడు. ఒకడేమో 500 నోటు, రెండవ వాడు 200 నోటు, మరో అయిదుమంది తలా 100 నోట్లు తీసి ఇచ్చారు. 

ఇదయ్యాక మొదటి యువకుడు, అయినా నేను చైన్ లాగినా టి.సి. వచ్చినపుడు ఎదురుగా ఉన్న ఈ ముసలాడు చైన్ లాగాడు అని చెప్పేస్తే సరి. మనడబ్బులు మిగిలిపోతాయి అన్నాడు. 

అన్నదే తడవుగా చైన్ లాగేశాడు. రైలు ఆగిపోయింది.

కాసేపటికి ఇద్దరు రైల్వే పోలీసులను వెంటబెట్టుకుని టి.సి. వచ్చాడు. ఎవరు చైన్ లాగింది? అనడగ్గా యువకుడు వృద్ధుడివైపు చూపించాడు. 

టి.సి.కి కోపం వచ్చి, వృద్ధుడిని చెడామడా తిట్టాడు.

అపుడు వృద్ధుడు చైన్ లాగింది నేనే. దానికొక కారణం ఉంది. ఈ యువకులందరూ కలిసి నాదగ్గరున్న 1200 రూపాయలను లాక్కుని, ఆ మూడవ యువకుడి వద్ద దాచారు. ఒకటి 500 నోటు, ఇంకొకటి 200 నోటు, మిగితావి 100 నోట్లు అన్నాడు. టి.సి. కి మరింత కోపం వచ్చి, పోలీసులను సోదా చేయమన్నాడు.

పోలీసులకు డబ్బు దొరికింది.ఆ డబ్బును టి.సి. ఆ వృద్ధుడికి ఇచ్చేశాడు.  

వెంటనే యువకుల మీద ఫైన్ తో బాటు కేసు బుక్ చేసి బోగీలోనుండి దిగమన్నాడు. బోగీలోనుండి దిగబోతున్న  మొదటి యువకుడిని చూస్తూ, *"నా తలమీది వెంట్రుకలు ఉన్నట్టుండి తెల్లబడలేదు"* అన్నాడు వృద్ధుడు.

No comments:

Post a Comment