Tuesday, January 17, 2023

శ్రీ రమణ మార్గము *జ్ఞానులు: జ్ఞానబంధువులు*

 *🧘‍♂️88 - శ్రీ రమణ మార్గము

*జ్ఞానులు: జ్ఞానబంధువులు*

సుప్రసిద్ధ బ్రిటీష్ గ్రంథకర్త ఆల్జీస్ హక్స్ లి  గొప్ప మేధావి. అతడి మెదడు ఒక విజ్ఞానఖని అని చెప్పుకునేవారు. ఆయన శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారికి ఆప్తమిత్రుడు. హకీ కృష్ణమూర్తితో ఒకమారు ఇలా అన్నాడు: “నేను సైన్సును గురించి, చిత్రలేఖనం గురించి, కవిత్వం, వేదాంతం, బౌద్ధం, హిందూమతం మొదలైన వాటిన్నిటినీ గురించి సాధికారికంగా ప్రసంగించగలను.”

హకీ మెదడు సర్వశాస్త్ర సముచ్చయమని కృష్ణమూర్తి గారికి కూడా తెలుసు. కానీ ఈ మాట కృష్ణమూర్తితో అని, హక్సీ, “మరి నేనింత విజ్ఞానం, పాండిత్యం కలిగుంటే, ఇక నాకు నూతనము, స్వతంత్రము అయినటు వంటిది, 'ఒరిజినల్' అయి నటువంటిది అనుభవంలోకి వచ్చేనా అనే అనుమానం కలుగుతున్నది” అన్నాడు.

“ఇది ఎంత విచారకరమైన విషయమో ఆలోచించండి" అంటారు శ్రీ కృష్ణ మూర్తి మనతో. “అందుకే హకీ చివరకు 'మెస్కలిన్' వంటి మాదక ద్రవ్యం సేవించ నారంభించాడు. అదేమంటే 'ఒరిజినల్' అయినటువంటిది ఏదో ఒకటి నేను కనుగొని తీరాలి” అని సమాధాన మిచ్చేవాడంటారు కృష్ణమూర్తి.

"మరి మీ మెదడు, పవిత్రంగా ఎంచే పాత గ్రంథాలనే వల్లె వేస్తుంటుందా? లేక నిత్య నూతనమూ, ఒరిజినల్ అయినటువంటి దానిని కనుగొనగలిగి ఉన్నదా? ఆలోచించండి” అంటారు కృష్ణమూర్తి మనతో.

అరుణాచల రమణులకు కూడా శాస్త్ర పాండిత్యం ఆధ్యాత్మికతకు, అనగా నిత్య నూతనమైన దానిని కనుగొనేందుకు, అవరోధంగానే కనిపించేది. ఆశ్రమంలోని శ్రీ వెంకటరత్నం అనే అసిస్టెంట్ లైబ్రేరియనుతో, ఏదో సందర్భంలో శ్రీ రమణులు ఇలా అన్నట్లు శ్రీమతి సూరి నాగమ్మ తన పుస్తకంలో రాశారు. "శబ్దజాల మహారణ్యం చిత్త భ్రమణకారకం” అన్నారు పెద్దలు. అవి దరిచేర్చేవి కావు. శాస్త్ర పఠనమూ, పాండిత్యమూ కీర్తి భోగదాయకములే గానీ, ముముక్షువుకు కావలసిన ముక్తి సాధకమైన చిత్తశాంతికి
వినాశకరములే. పెద్ద పెద్ద బీరువాలు నిండుకొని ఎన్నో గ్రంథాలు. ఎన్నని చదువ గలరు? ఎన్నో మతాలు. ఎన్నెన్నో గ్రంథాలు. ఒక్క మతానికి చెందిన గ్రంథాలు చదివేందుకే జీవిత కాలం చాలదు. ఇక ఆచరణ ఎప్పుడు? చదివినకొద్దీ చదవాలనే అనిపిస్తుంది. అందుకు గల ఫలితం చదివిన వారితో చర్చిస్తూ కాలయాపన చేయడమే కానీ కడతేరనీయవు” అన్నారు.

అందుకే తనకు అత్యంత సన్నిహితుడైన శ్రీ కావ్యకంఠ గణపతిమునికి ఆత్మ సాక్షాత్కరించి ఉంటుందా అని ఎవరో శ్రీ రమణుల నడిగితే, “అంత గ్రంథ విజ్ఞానంతో నిండిపోయిన అతడికి ఆత్మ సాక్షాత్కారం ఎలా సాధ్యం?” అని కృష్ణమూర్తిగారు హక్సీ విషయంలో అన్నట్లే, శ్రీ రమణులు గణపతిముని విషయంలో అన్నారు.

ఆత్మ సాక్షాత్కారమొందిన ఏ నిజమైన మహానుభావుడైనా మనకిదే చెప్తుంటారు. శ్రీ శృంగేరి పీఠ ముఫ్పై నాల్గవ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర భారతి కూడా ఇదే విషయాన్ని మరింత మనోజ్ఞంగా ఒకమారు ఇలా చెప్పారు :

"నీకు సత్యాన్ని గురించి సందేహం ఉంటే, లేదా దానిని తర్కం చేత నిలబెట్టాలని అభిప్రాయముంటే, ధారాళంగా కావలసినన్ని పుస్తకాలు చదువు. నీకు సత్యాన్ని గురించి సందేహం లేకుంటే, జీవితంలో దానిని అనుభవానికి తేవాలని మాత్రం కోరుకున్నట్లైతే ఈ విస్తార గ్రంథాలోడన అనవసరం.

ఒక వంటవాడున్నాడనుకో. అతడు ఓ రుచికరమైన పదార్థం చేయాలను కుంటాడు. అప్పుడు ఆ భక్ష్యానికి కావలసిన వస్తువులూ, పరిమాణమూ, వండవలసిన విధానమూ అతనికి తెలియవలసిన అవసరం ఉన్నది. రుచి చూచేవారికి ఆ జ్ఞానమక్కర లేదు.

నేటి కాలంలో, ఆచార్యులవారి భాష్యాలన్నీ చదివితే కానీ అద్వైతి కాడనే భ్రమ ఒకటి ఉన్నది. ఆచార్యులు సత్యదర్శనం చేసినవారు; ద్రష్టలు. కానీ వారు తాము వ్రాసిన భాష్యములను చదివే ద్రష్టలయ్యారా ఏమి? పోనీ - వారు తాము రాసినది మరల మరల మననం చేసి అద్వైత దర్శనం చేశారనుకుంటే గోవిందపాదులు, గౌడపాదులు, శుకాచార్యులు, వ్యాసాచార్యుల మాటేమిటి? వారు భగవత్పాదుల దర్శనాలను చదివే అద్వైతులయ్యారా ఏమి?

అందుచేత ఆత్మదర్శనానికి ఆచార్యుల భాష్యాలను అన్నిటినీ చదవాలన్న నియమమేమీ లేదు. పోతే ఈ భాష్యాలపై అనర్గళంగా ఉపన్యాసం చేయగలవారిని మనం ఎంతో మందిని చూస్తున్నాం. వాళ్ళంతా అద్వైత సత్యానికి అతి దాపులో ఉన్నారని ఏమైనా చెప్పగలమా?” అన్నారు.

అనుభవ పూర్వకంగా జ్ఞానం సంపాదించిన వారు వేరు; జ్ఞానబంధువులు వేరు. పూర్వం జ్యోతిశ్శాస్త్రం, వైద్యం, వేదాదులు పరోపకారానికే అభ్యసించారని, యోగ వాసిష్ఠంలోని ఈ శ్లోకాన్నిబట్టి తెలుస్తుంది:

వ్యాచష్టేయః పఠతి చశాస్త్రం భోగాయ శిల్పవత్| యతతే న నత్వష్టానం జ్ఞాన బంధుః న ఉచ్యతే!

శాస్త్రాభ్యాసము, ఉపన్యాసాలు, శిల్పం చేసినట్లుగా భోగం కొరకు చేసేవాడు, అనుష్ఠానం కోసం - అనగా యోగాభ్యాసం మొదలగు వాని కొరకు ప్రయత్నించడు. అందువల్లనే అతడ్ని జ్ఞానబంధువన్నారు. ఆ కాలంలో శిల్పాదులు మాత్రమే జీవిత నిర్వహణకు అభ్యసించడం జరిగేది.

అదట్లా ఉంచి, దేనిని గురించైనా విని, చదివి, ఆ విధంగా కొంత పరిచయ మేర్పరచుకొని తెలుసుకోవడం ఒక జ్ఞానం.

ఇలా సమాచారం గ్రహించడం ద్వారా తెలుసుకోడాన్ని ఆంగ్లంలో Knowledge through information అంటారు. అలా కాకుండా నేరుస్తున్న దానిలో ప్రవేశించి, అదే తానై తెలుసుకోవడం వేరు; ఈ రకమైన Knowledge by being అనేదే ఆధ్యాత్మికరంగంలో ప్రయోజనకారి. మొదటిరకం లోక వ్యవహారంలో మాత్రమే ఎక్కువగా ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment