Friday, January 6, 2023

*****మనసును నిశ్చలంగా ఎవరు ఉంచుకోగలుగుతారు ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

🪷🪷 *"శ్రీరమణీయం"* 🪷🪷
     
*"మనసును నిశ్చలంగా ఎవరు ఉంచుకోగలుగుతారు ?"*
*************************
*"అద్దంలో మంట కనిపించినా అది అద్దానికి గాని దాన్ని చూసే వారికిగానీ ఏ హాని చేయదు. జ్ఞానుల మనసు అలాగే ఉంటుంది. పరిపూర్ణ శాంతిని, భగవంతుని సాన్నిధ్యాన్ని , ఆత్మానుభవాన్ని పొందిన సద్గురువులు, యోగులు, జ్ఞానులు మనసును నిశ్చలంగా ఉంచుకుంటారు. కప్ప సహజంగానే తన నాలుకను పైకి మడిచి 'ఖేచరీ విద్య'తో ఆకలిదప్పులులేని స్థితిలో ఉంటుంది. యోగి కూడా ఈ లోకంలో అలా జీవిస్తాడు. అలాగే శ్రీరమణభగవాన్ వంటి జ్ఞానులు ఈ ప్రపంచంలో మనతోపాటు జీవిస్తున్నా ఏ విషయాలు వారి మనసును చలింపజేయలేవు. మనకి వారికి తేడా అంతా విషయాన్ని స్వీకరించే తీరులోనే ఉంటుంది. వాస్తవానికి ప్రాపంచిక విషయాలేవి మన మనసుకు కూడా అంటేవి కావు. కానీ మనకి ఆ విషయంలో అనుభవం లేదు. ఆ వివేకం కలిగిన రోజు మనం కూడా సాక్షిత్యంతో సాధనలో ముందుకు సాగుతాం !"*

*"మనసును సరైన దారిలోకి తెచ్చుకునే మార్గోపదేశం ఏమిటి ?"*
**************************
*"దేహ సహచర్యంతో వికారాలను ప్రోగుచేసుకొనే మనసును విచారణ, వైరాగ్యాలతో దారిలోకి తెచ్చుకోవచ్చు. మనసు దేనిపై ప్రసరిస్తే దాని స్వరూప స్వభావాలతో మమేకం చెందుతుంది. అందువల్లే నిత్యం తాను దేహాన్ని అనే భావనలోనే మనసు ఉంటుంది. నిజానికి పంచేంద్రియాల ద్వారా విషయాలను గ్రహించటమే మనసు లక్షణం. గ్రహించే విషయాల ఎడల మనసుకున్న అనుకూలత, ప్రతికూలతలే వికారాలు అవుతున్నాయి. ఇవే కష్ట-దుఃఖాలుగా సుఖ-సంతోషాలుగా మనసుకు ద్వంద్వభావాన్ని కలుగజేస్తున్నాయి. చెడు సహవాసాలతో దారి తప్పిన పిల్లలను మంచి మాటలతో సత్ప్రవర్తన అలవర్చి దారిలోకి తెచ్చుకుంటాం. అలాగే పెద్దల మాటలు, సత్సంగం, మంత్రజపం, యోగాభ్యాసాల ద్వారా మనం (మనసు) ఈ దేహం కాదని తెలుసుకోవచ్చు !"*

*"మనసు స్వరూపం తెలుసుకునేందుకు అన్వేషణ ఏ విధంగా చెయ్యాలి ?"*
*************************
*"బయట వెన్నెల ఉన్నదని ఇంట్లో పోయిన వస్తువును బయట వెదకటం అజ్ఞానం. అలాగే నీలోవున్న మనసును బాహ్య విషయాలపై పెట్టి అంతరంలోని దాని స్వరూపాన్ని వెతకాలనుకోవటం అవివేకం. ఎందుకంటే బాహ్య విషయాలపైకి వెళ్ళగానే మనసు వాటి స్వరూపాన్ని సంతరించుకుంటుంది. వికారాలు, బాహ్యవిషయాలు, దేహాత్మభావనల నుండి విముక్తమైన మనసు మాత్రమే తన స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతుంది. ఆత్మే దేహంతో కలిసి మనసుగా మలినమైంది. నిశ్చలస్థితి ద్వారా నీరు తన సహజస్థితిని పొందినట్లే, సాధనలో మనసు స్వస్వరూపమైన పరమాత్మ స్థితిని పొందుతుంది. అందుకే సాధనలో మనం సహజస్థితిని పొందటం తప్ప కొత్తగా సాధించేది ఏమి ఉండదని భగవాన్ శ్రీరమణమహర్షి చెప్పారు. మనసు ఎంత తాపత్రయం పడినా కోర్కెలు తీర్చుకోవటం ద్వారా పొందేది క్షణికమైన అనుభవమే ! తాను కొత్తగా పొందేది, తనకు మిగిలేది ఏదీ లేదని మనసుకు తెలియటమే వైరాగ్యం. తనకు అంటని వాటి గురించి పెట్టే పరుగులు ఆపటమే వివేకం !"*

           *"{"శ్రీరమణీయం"}"*
            

No comments:

Post a Comment