కళాదీపిక
●●●●●
ఈరోజు...
విలియమ్ షేక్స్ పియర్ గారి
(26-4-1564 ◆ 23-4-1616)
వర్థంతి
●క●ళా●దీ●పి●క●
విలియమ్ షేక్స్ పియర్...
నాటకం అన్నమాటకు అనంతమైన గౌరవాన్ని ప్రసాదించిన మహనీయుడు...
విలియం షేక్స్ పియర్...
ఆంగ్ల సాహిత్యంలో "నాటకం" అన్న పదాన్ని అఖండంగా, అపూర్వంగా ప్రకాశింప జేసిన ధన్యాత్ముడు...
విలియం షేక్స్ పియర్...
రసహీనంగా సాగుతున్న నాటక ప్రదర్శనలకు నవ్యతని, నాణ్యతని అందించి అందుకోలేనంత ఎత్తుకెదిగిన త్రివిక్రముడు...
విలియం షేక్స్ పియర్...
శతాబ్దాల కాలం పాటు ప్రాచీన అలంకారికులు చెప్పిన నాటక నియమాల సంకెళ్ళ నుండి నాటకాన్ని మరోమలుపు తిప్పిన
సంస్కరణా యోధుడు...
విలియం షేక్స్ పియర్...
హాస్య, భీభత్స, భయానక, రౌద్ర, శృంగార, విషాద, శోకాలను తన నాటకాలలో ఎడనెడ పండించి, భవిష్యత్ నాటకానికి బాటలు వేసిన రసహృదయుడు...
విలియం షేక్స్ పియర్...
మానవ జీవన ప్రయాణంలోని దుర దృష్టాలకు, సామాజిక జీవనం కష్టనష్టాలకు గురై, అభాగ్యులై, దీనంగా, హీనంగా బ్రతుకుతున్న అతి సామాన్యులే తన నాటక పాత్రలుగా సజీవంగా మలచిన మహాత్ముడు...
విలియం షేక్స్ పియర్...
ఇలా... ఎన్ని మాటలు చెప్పినా, ఎంత గొప్పగా ప్రశంసించినా వాటన్నిటికీ మించిన మహా రచయిత,శతాబ్దాలుగా నాటకానికి వెలుగుచూపిన, చూపుతున్న, రచనా బ్రహ్మ... విలియం షేక్స్ పియరే. విశాల విశ్వంలోని సకల భాషల నాటకాలూ... విలియం షేక్స్ పియర్ నుండే ఊపిరినందుకొన్నాయి. సమస్త నాటక ప్రయోగాలకు దారి చూపిన మార్గదర్శకుడాయన. రాజులు, మహారాజులు, చక్రవర్తులు వంటివారి ఇతివృత్తాలకే పరిమితమై కథావస్తుపురీత్యా సంకుచితమైపోయి, జగన్నాథ చక్రాల బాటన సాగిపోతున్న నాటకాన్ని, నేలకు దించి, మానవ హృదయాలను ఆవిష్కరించి, ప్రపంచ నాటకానికే సార్థకత చేకూర్చిన ధన్యుడాయన.
షేక్స్ పియర్ జీవితం ఏమీ వడ్డించిన విస్తరి కాదు. ఆర్థిక సమస్యల మధ్య, కుటుంబ భారం వల్ల నిరంతరం సంఘర్షణకు గురైన జీవితమే ఆయనది. ఇంగ్లాండ్ లోని 'స్ట్రాట్ఫోర్ట్ - అపాన్ - ఏవెన్' అనే చోట షేక్స్ పియర్ జన్మించాడు. జాన్ షేక్స్ పియర్ మేరీ ఆర్డెన్ దంపతుల భాగ్యవశాన జన్మించిన ఈ బాలుడు భవిష్యత్ లో విశ్వవిఖ్యాత నాటకకర్త కాగలుగుతాడని ఎవరూ ఊహించి ఉండరు. ఆయన జనన తేదీ గురించి ఖచ్చితంగా నిర్ధారణ కాలేదు. (అత్యధికుల అభిప్రాయం ప్రకారం ఆయన జనన తేది 26-04-1564). అయితే పద్దెనిమిదో శతాబ్ధ పరిశోధకులు ఆయన మరణించినది మాత్రం 23-4-1616 అని నిర్ధారణ చేసారు.
స్ట్రాట్ఫోర్డ్లోని కింగ్స్ న్యూస్కూల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది.
మహనీయులందరి జీవితాలలోని అనేక సంఘటనలు మామూలు ప్రపంచానికి భిన్నంగా కన్పిస్తాయి. మన దృష్టిలో అవి అర్థరహితంగా అన్పిస్తాయి కూడా! అయినా వాటికేదో అంతరార్థం ఉంటుంది. షేక్స్ పియర్ కథ కూడా అటువంటిదే. ఆయన పద్దెనిమిదవ ఏట తనకన్నా ఎనిమిదేళ్ళ పెద్దదైన అనీ హాధవేని ని పెళ్ళి చేసుకున్నాడు.
ఆ దంపతులకు సుసన్నా అనే అందమైన అమ్మాయి పుట్టింది. ఆ తరువాత రెండేళ్ళకు హేమ్నెట్ అనే కొడుకు, జుడిత్ అనే కూతురు కవల పిల్లలుగా జన్మించారు. కొన్నాళ్ళకి హేమ్నెట్ మరణించాడు.
అటు తరువాత షేక్స్ పియర్ జీవితంలో ఏడేళ్ళకాలం గురించి ఎవరికీ స్పష్టంగా తెలియదు. చరిత్రకారులు ఎన్నో పరిశోధనలు చేశారు. ఎన్నో ఊహాగానాలు చేశారు. కొందరి అభిప్రాయంలో ఆ కాలంలో ఆయన పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశాడని, మరికొందరి అభిప్రాయంలో ఆయన నాటకశాలలో గుర్రాల కాపలా పనిచేసే వాడని... ఇలా... ఎన్నో... ఎన్నో... ఊహా గానాలున్నాయి. అయితే... షేక్స్ పియర్ దృష్టి నాటకం వైపుకు మళ్లడాన్ని పరిశీలిస్తే ఆయనకు ఆ కాలంలో నాటకంతో సంబంధం ఉండడమే న్యాయమనిపిస్తుంది. అప్పటి నాటకాలు చూడడం, నాటకంతో పరిచయం పెంచు కోవడం, ఆనాటి నాటకాల గురించి అవగాహన ఏర్పరచుకోవడం అనే మూడు సూత్రాలవల్లనే షేక్స్పియర్ చిరస్మరణీయమైన నాటకాలను రూపుదిద్దారు.
షేక్స్ పియర్ తొలి నాటకం 'హెన్రీ-6' మొదటి భాగం. ఈ నాటకం వెలుగు చూసిన కాలంలోనే, ఆయన రచయితగా, నటుడిగా పనిచేసేందుకు స్ట్రాట్ ఫోర్ట్ వదలి లండన్ వెళ్ళిపోయారు. రచయితగా ఆయన కీర్తి లండన్లోనేకాక, ఇంగ్లాండు అంతా వ్యాపించడం ప్రారంభించింది. అంతవరకూ ఆంగ్ల నాటకాల్ని శాసించిన నాటక రచయితల ఆలోచనా ధోరణికి భిన్నంగా షేక్స్ పియర్ రచనా విధానం సాగింది. మరీ ముఖ్యంగా మానవ అంతరంగాన్ని దర్శించి సాగిన రచనలివి. ఎంతో ధనవంతులు, మరెంతో గొప్ప అధికారాన్ని, పదవుల్ని నిర్వహిస్తున్నా, వారి మనస్సుల్లో ఉన్న సంకుచితత్వాన్ని షేక్స్ పియర్ విస్పష్టంగా దర్శించి, తన రచనల్లో వెల్లడి చేశాడు. మానవ జీవనంలో వేదనను, దుఃఖాన్ని ఆయన నాటకాలు అత్యద్భుతంగా ప్రదర్శించాయి.
మానవ జీవనం ఎవరికీ పూలబాట కాదు. ఎవరికీ స్వాగత గీతం కాదు. జీవితంలో ఎదురైన కష్టాలను, సమస్యలను అధిగమించి, సందర్భానికి తగినట్టుగా తనని తాను తీర్చిదిద్దుకోవడంలో మనిషి విజయం, లేదా అపజయం ఆధారపడి ఉంటాయి. షేక్స్ పియర్ విషయంలోనూ అదే జరిగింది. నాటక రచయితగా ప్రసిద్ధినందుకొంటున్న కాలంలోనే, కీర్తిప్రతిష్టలు సంపాదించు కొంటున్న కాలంలోనే, ఊహించని విపత్తు ఎదురయ్యింది. లండన్లో ప్లేగు వ్యాధి విజృం భించింది. ఆ నాటికి లండన్ మహానగర జనాభా రెండు లక్షలు ఉండవచ్చు. ప్లేగు వల్ల మరణించిన వారు 10675 మంది అని లెక్కకట్టడం జరిగింది. అంటే ప్రతి ఇరవై మందిలో ఒకరు మృత్యువాతపట్టిన విషాద సన్నివేశం అది. ఆ స్థితిలో లండన్లో నాటక ప్రదర్శనల్ని నిలిపివేసారు.నాటకశాలల్ని నిరవధికంగా మూసేశారు. షేక్స్ పియర్ ముందు భవిష్యత్ ప్రశ్నార్థకమైపోయింది.
“ప్రమాదపిధీమహి” అంటారు పెద్దలు. ప్రమాదాలు వచ్చినప్పుడు, ధీమంతులు అధైర్యపడరు. షేక్స్ పియర్ చేసింది అదే. మూతబడిన నాటకశాలల గురించి, ఆగిపోయిన తన నాటక రచన గురించి బాధపడకుండా, తన దృష్టిని కవిత్వం వైపు మళ్ళించాడు. షేక్స పియర్ సానెట్స్ ఆయన కీర్తిని అద్వితీయం చేశాయి. అనుకోని పరిస్థితులలో సాగిన ఆ ప్రయాణం, షేక్స్పియర్ని ఏకంగా ఇంగ్లాండ్ దేశానికి జాతీయ కవిగా గుర్తింపునిచ్చింది.
కాలం మారింది. లండన్లో పరిస్థితులు చక్కబడ్డాయి. నాటక శాలలు తెరుచుకొన్నాయి. షేక్స్ పియర్ తిరిగి నాటకాలు వ్రాయడం ఆరంభించాడు. షేక్స్ పియర్ రచనా సామర్థ్యం గురించి, బ్రిటన్ మహారాణి ఒకటవ ఎలిజబెతి తెలిసింది. ఓ మంచి నాటకం చూడాలని మహారాణి ఆకాంక్షించింది. అందుకే ఆవిర్భవించింది "ద లార్డ్ చాంబర్లెన్ మెన్" నాటకం. నాటకాన్ని చూసిన మహారాణి పరవశించిపోయింది. 1595వ సంవత్సరంలో మూడు గొప్పనాటకాలు ఆయన కలం నుండి వెలువడ్డాయి. మొదటిది రిచర్డ్-2 రెండోది మిడ్ సమ్మర్ నైట్స్లమ్, మూడోది చరిత్ర ప్రసిద్ధి చెందిన అత్యుత్తమ నాటకం రోమియో జూలియట్.
1601 లో అపూర్వమైన నాటకం 'హేమ్లెట్' వెలుగుచూసింది. 1604-05 సంవత్సరాల మధ్య చిరస్మరణీయమైన, ఆణిముత్యాల్లాంటి మూడు నాటకాలకు రూపుదిద్దాడు. వాటిలో ఒకటి 'ఒథెల్లో' రెండోది 'కింగ్లియర్' మరి మూడోది 'మాక్బెత్'. ఈ మూడూ మూడే.విశ్వనాటకచరిత్రలో అపూర్వమైన నాటకాలు ఈ మూడు పాత్రల రూపకల్పనల్లో, సన్నివేశ నిర్మాణంలో, అక్షర ప్రయోగంలో, భాషా నైపుణ్యంలో ఈ మూడు నాటకాలు ఆంగ్ల సాహిత్యానికే కాదు, ప్రపంచ నాటక సాహిత్యానికే మకుటాయమానంగా నిలుస్తాయి.
1611లో షేక్స్ పియర్ మరో గొప్ప నాటకం 'టెంపెస్ట్' వెలువడింది. అన్ని నాటకాలూ విరివిగా ప్రదర్శనలందుకొంటున్న వేళ, షేక్స్పియర్ కీర్తి దశదిశలా విస్తరిస్తున్న వేళ మళ్ళీ అనుకోని విపత్తు ఎదురయ్యింది. ఆయన నాటకాలను విరివిగా ప్రదర్శిస్తున్న గ్లోబ్ థియేటర్లో పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. దానితో ప్రదర్శనలు ఆగిపోయాయి. లండన్ వదలి, స్ట్రాట్ పోర్ట్ కు తిరుగు ప్రయాణం చేశాడు. గ్లోబ్ థియేటర్ని 1614లోపునరుద్ధరించారు. షేక్స్ పియర్ నాటకాలు తిరిగి ప్రదర్శనలందుకోవడం ఆరంభమైంది. విలియం షేక్స్పియర్ నాటకాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటి తరగతి వన్నీ మోదాంతాలు లేదా హాస్యప్రధానమైన నాటకాలు. ఈ వర్గంలో మొత్తం పద్నాలుగు నాటకాలున్నాయి.
1) ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్వెల్,
2) ఏజ్ యూలైకిట్, 3) కామెడీ ఆఫ్ ఎర్రర్స్,
4) లవ్స్ లేబర్స్ లాస్ట్, 5) మెజర్ ఫర్ మెజర్,
6) మర్చెంట్ ఆఫ్ వెనిస్, 7) మెర్రీ వైవ్స్ ఆఫ్ విండ్సర్, 8) మిడ్సమ్మర్ నైట్స్ డ్రీమ్,
9) మచ్ ఎబౌట్ నథింగ్, 10) టేమింగ్
ఆఫ్ ది ష్రూ, 11) టెంపెస్ట్, 12) టెల్ఫ్ నైట్, 13) టు జంటిల్మెన్ ఆఫ్ వెరోనా, 14) వింటర్స్ టేల్.
రెండో వర్గంలో వచ్చేవి చారిత్రక నాటకాలు,
ఇవి పదకొండు నాటకాలు. ఒకదానికి మరొకటి తీసిపోదు. 1) నాల్గవ హెన్రీ - మొదటి భాగం, 2) నాల్గవ హెన్రీ - రెండవ భాగం, 3) ఐదవ హెన్రీ, 4) ఆరవ హెన్రీ మొదటి భాగం, 5) ఆరవ హెన్రీ - రెండవ భాగం, 6) ఆరవ హెన్రీ - మూడవ భాగం, 7) ఎనిమిదవ హెన్రీ, 8) కింగ్డాన్, 9) పెరిక్లిస్, 10) రెండవ రిచర్డ్, 11) మూడవ రిచర్డ్.
విషాదాంత నాటకాలు, మూడవ వర్గంలోవి. నాటకకర్తగా షేక్స్పియర్ కు చిరకీర్తినందించినవి
ఈ విషాదాంత నాటకాలే. నాటకం సుఖాంతంగానే ఉండాలను కొన్న ఆనాటి ప్రాచీన సంప్రదాయాలకు భిన్నంగా నాటకాల్ని విషాదాంతాలుగా తీర్చిదిద్ది, అద్భుతమైన కళాఖండాలుగా రూపుదిద్దాడాయన. పన్నెండు విషాదాంత నాటకాలు... దేనికదే... వేటికవే...
1) ఆంటోని అండ్ క్లియోపాత్రా, 2) కొరియోలేసస్, 3) సింబలైన్, 4) హేమ్లెట్, 5) జూలియస్ సీజర్, 6) కింగ్లియర్, 7) మేక్బెత్, 8) ఒథెల్లో, 9) రోమియో జూలియట్, 10) టైమన్ ఆఫ్ ఏథెన్స్, 11) టైటస్ఏండ్రోనికస్, 12) ట్రోయిలస్ అండ్ క్రెస్సిడా.
మొత్తం ముప్ఫై ఏడు నాటకాలు. అన్నీ ఆణిముత్యాలే. ఈ నాటకాలన్నిటినీ కలిపి, మొత్తం పన్నెండు వందల ఇరవై నాలుగు పాత్రలు కన్పిస్తాయి. హేమ్లెట్, ఒథెల్లో, మార్క్ ఏంటోనీ, మేక్బెత్, కింగ్లియర్, మార్కస్ బ్రూటస్ వంటి పాత్రలు ఆయన నాటకాలలో అద్భుతంగా సృష్టించబడ్డాయి. గత నాలుగువందల ముప్ఫైఏడేండ్లుగాళ్లుగా ఆంగ్ల నాటకాన్ని సుసంపన్నం చేస్తూ, వేలాదిమంది నటీనటులు ఈ పాత్రల్ని పోషించి చిరస్మరణీయులయ్యారు. నేటికీ పాత్రపోషణలోకీర్తిప్రతిష్టలనందుకొంటున్నారు. సంభాషణా రచనలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన సృష్టించిన పాత్రలన్నీ వ్యథని, దుఃఖాన్ని గుండెల్లో దాచుకొంటాయి. వెల్లడి చేయాల్సినప్పుడు మనసారా ప్రదర్శిస్తాయి. ఏ పాత్ర ఎంతమాట్లాడాలో అంతే మాట్లాడుతుంది. అవసరమైనప్పుడు ఎంతో మాట్లాడుతుంది. మరీ ప్రాముఖ్యమైనదైతే నాటకం అంతామాట్లాడుతుంది. అందుకు గొప్ప ఉదాహరణ హేమ్లెట్ నాటకం. అందులో హేమ్లెట్ పాత్ర మొత్తం 1495 లైన్లు మాట్లాడుతుంది. అంటే ఆ నాటకంలో మొత్తం డైలాగ్ లలో, హేమ్లెట్ పాత్ర 37% సంభాషణలు మాట్లాడుతుందన్నమాట. అలాగే అనేక పాత్రలు కేవలం ఒక్కడైలాగ్కే పరిమితం అవుతాయి. ఇదీ మహా నాటక రచయిత లక్షణం.
నిజానికి షేక్స్పియర్ 1592లో లండన్ ప్రయాణం అయ్యింది నటుడిగా నిలవాలని. అనుకొన్నట్టే నటుడిగా ఆయన కీర్తి ప్రకాశించింది. కానీ నాల్గవ హెన్రీ నాటక రచన చేయడంతో, రచయితగా మారిపోవడం, అతడిలోని నటుడ్ని, రచయిత ఆక్రమించడం జరిగింది. చాలామంది జీవితాల్లో ఇదే జరుగుతూంటుంది. అయితే, ఆ తరువాత ఆయన రచనలన్నీ అంతగా విజయవంతం కావడానికి కారణం, ఆయనలోని నటుడే ననడం నిస్సందేహం. నటుడు, రచయితకు తోడుగా దిలార్డ్ ఛాంబర్లేన్స్మెన్ అనే నాటక సంస్థలో ఆయన భాగస్తుడు. ఎన్నో గొప్ప నాటకాలను ఆ సంస్థ ప్రదర్శించింది. గ్లోబ్ థియేటర్లో ఆయన సహభాగస్తుడు కూడా. 1609లో 154 సానెట్స్ తో షేక్స్ పియర్ కవితా సంకలనం వెలువడి, ఆయనకు ఎనలేని గౌరవం తెచ్చింది.
మహనీయులు తమ మరణం గురించి ముందే ఊహించగలరనడానికి, ప్రపంచ చరిత్రలో ఎన్నో కథలున్నాయి. షేక్స్ పియర్ విషయంలోనూ అదే జరిగింది. 1616 జనవరిలో తన వీలునామా వ్రాసి, భవిష్యత్ ప్రయాణానికి ఎదురుచూశాడు. ఏప్రిల్ 23, 1616న, అంటే వీలునామా వ్రాసిన మూడు నెలలకే ఆయన కన్నుమూశారు. ఆయన జన్మించిన స్ట్రాట్ఫోర్ట్- అపాన్ -ఏవన్ అన్న పల్లెటూరిలోనే ఆయనకు అంతిమ సంస్కారం జరిగింది. అప్పటికాయన వయస్సు కేవలం ఏభై రెండేళ్లు మాత్రమే.
ఇలా ఎంతని వ్రాయగలను? ఎంతని చెప్పగలను? ఎంత చెప్పినా అది అల్పమే! ఎంత వ్రాసినా అది స్వల్పమే! నాటకరంగ ఆత్మబంధువులమైన మనమందరం మెచ్చే, మనందరికీ అన్వయించే, మనందరి జీవితాలలో నిత్యసత్యంగా కన్పించే షేక్స్పియర్ రచనలోని ఓ అద్భుతమైన సంభాషణతో ఈ వ్యాసానికి స్వస్తి పలుకుతాను.
'ఏజ్ యూలైకిట్' అనే నాటకంలో...
రెండవ రంగంలో, మూడవ సన్నివేశంలో
విన్పించే ఈ మాటలు, ఈ భూమిమీద
సూర్యచంద్రన్న కాలం నిలిచే వుంటాయి.
"ఈ ప్రపంచమే ఒక రంగస్థలం.ఈ స్త్రీలు, పురుషులు అందరూ కేవలం పాత్రలు మాత్రమే ఈ జీవన రంగస్థలం మీద వారికి వారి ప్రవేశం ఉంటుంది. వారి నిర్గమనం కూడా ఉంటుంది.ప్రతి మనిషి ఈ రంగస్థలం మీద అనేక విధాలుగా అభినయిస్తాడు. సమయం వచ్చినప్పుడు, తప్పక నిష్క్రమిస్తాడు"
●●●●●●
-వాడ్రేవు సుందర్రావు
నంది, గరుడ అవార్డుల గ్రహీత, తణుకు
●●●●●
●●●●●●●●●●●●●
🙏క🙏ళా🙏దీ🙏పి🙏క🙏
●●●●●●●●●●●●●
No comments:
Post a Comment