Saturday, May 4, 2024

ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు విన్నపం* -సామవేదం షణ్ముఖ శర్మ

 *ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు విన్నపం* 

-సామవేదం షణ్ముఖ శర్మ

ఇది ఎన్నికల సమయం. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత ప్రధానమైనవి. కాని ప్రపంచ వ్యాప్త పరిణామాలు గమనిస్తే ఈ ఎన్నికలు మరీ కీలకం. దేశ భవితవ్యాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పౌరుడు స్పందించవలసిన తరుణమిది.  

ఎండలెక్కువున్నాయనో, ఎవరు ఎన్నికైతే మనకేమనే ఉదాసీనత చేతనో, నేనొక్కడినే ఓటు వేయకపోతే ఏమయింది అనే భావన చేతనో, బద్ధకం చేతనో ఇంట్లో బైటాయించకుండా దేశం పట్ల బాధ్యతతో ఓటు వేయడం ప్రతివాడి కర్తవ్యం. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో చాలామటుకు వంద శాతం వోటింగు జరుగుతుంది. ఓటు వేయకపోతే జరిమానాలు కూడా వేసే ఉదంతాలు ఉన్నాయి. ఇంకా మన దేశంలో ఆ చైతన్యం పూర్తి స్థాయిలో జాగృతం కావడంలేదనే చెప్పాలి. 

ఈ నేపథ్యంలో ఉచితాల ప్రలోభాలకు లొంగిపోయే పౌరుల బలహీనతని ఆసరాగా తీసుకొని అవినీతి నాయకులు దూసుకుపోతున్నారు. వారు తమ ఆస్తులను ప్రజలకు పంచడంలేదు. ప్రజా ధనాన్ని ఎరవేసి మోసగిస్తారు అని కూడా తెలుసుకోలేని ప్రజలున్న దేశమిది. 

మరోవైపు ఓటు బ్యాంకులను తృప్తి పరచడం కోసం ఒక మతం వారికే ఈ దేశం సంపదని పంచిపెడతాం అని రాజ్యాంగ విరుద్ధంగా హామీలు ఇవ్వడం కూడా జరిగింది, జరుగుతోంది. దేశం, భద్రత, అభివృద్ధి ఇలాంటివేవీ పట్టించుకోకుండా తమ మత వ్యాప్తి కోసం,మతాధిక్యం కోసం మూకుమ్మడిగా విజృంభిస్తూ ఇతర దేశాలలో వాసులుగా, భారతీయ పౌరులుగా ఉన్న తమ మతం వారిని ఈ దేశంలోకి ఈ సందర్భంలో రప్పిస్తూ ఓటును వినియోగించుకొంటున్న మతవాదులకీ, వేర్పాటువాదులకీ కూడా ఇక్కడ కొదవ లేదు. వారికి దేశాభ్యుదయం, ప్రతి ఒక్కరి క్షేమం,  అభివృద్ధి వంటివి పట్టవు. వారు దేశాన్ని దెబ్బతీసి స్వార్థపరులతో చేతులు కలపడానికి కూడా వెనుకాడరు. అలాంటివారి శాతం పెరుగుతూ ఉంటే, దేశ హితాన్ని కోరేవారు  ఉపేక్షించడం ప్రమాదకరం. 

ఎవరి పాలనలో ఈ దేశం సర్వతోముఖంగా అభ్యుదయ పథంలో ప్రయాణం చేస్తోందో, ఉగ్రవాద తీవ్రవాద వేర్పాటువాదములు అణచివేయబడుతున్నాయోఎవరి నేతృత్యంలో శత్రు దేశాల నుండి ప్రమాదం లేని భద్రత రక్షణ మనకు లభిస్తున్నాయో, కుల మత వివక్ష లేకుండా అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయో, ఎవరి ఏలుబడిలో సాంకేతికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా స్వయం ప్రతిపత్తితో ప్రపంచ దేశాలలోనే మన దేశానికి గౌరవ ప్రతిష్ఠలు లభిస్తున్నాయో, ఎవరి నాయకత్వంలో అగ్ర రాజ్య స్థాయి వైపు పురోగమిస్తున్నామో, అందరితో కలిసి అందరి వికాసానికి పాటుపడే అంకిత భావం గోచరిస్తోందో, విద్య, విద్యుత్తు, సంపద కొదవ లేకుండా ఎవరి పాలనలో ప్రవాహమైందో, అవినీతిని నియంత్రించే నైతికత ప్రత్యక్షమవుతోందో అటువంటి మహనీయ నాయకులు పునః పునః ఈ దేశాన్ని పాలించాలనే సంకల్పం ప్రతి ఒక్కరిలో కలగాలి, కదలాలి.

వంచనలకి, ప్రలోభాలకి, తాత్కాలిక ఉచిత ఫలాలకి ఆశపడితే శాశ్వత ప్రయోజనాలకి దూరమవుతాం. బద్దకంతో ఇల్లు కదలకపోతే మనమే నష్టపోతాం. దేశ సముజ్జ్వల భవిషత్తుతో పురోగమించాలంటే, పారులందరి జీవితాలు సౌఖ్యంగా సౌకర్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలి. ఇళ్ళ నుండి కదలాలి. అయిదేళ్ళలో ఒక్క రోజు మనం కేటాయిస్తే కొన్ని పదుల సంవత్సరాల వరకూ కూడా దేశ భవిష్యత్తుకు ఇక వెనక్కు చూడవలసిన అవసరం లేదు. విచక్షణ, వివేకం, సమగ్ర దెశాభ్యుదయం,  అలాగే ఈ దేశం యొక్క పరంపర, సంస్కృతి ఇది రక్షింపబడాలనే భావం ప్రతి ఒక్క పౌరునికి ఉండాలి. ఓటు హక్కు ఉన్న ప్రతి వారు ఇందులో పాల్గొనాలి. 

అదే  సమయంలో విదేశాలలో స్థిరపడ్డ మనవారు ఏమి చెయ్యాలి, ఈ ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. విదేశాలలో ఇంకా భారతీయ పౌరసత్యం కోల్పోకుండా వర్క్ విసా మీద పనిచేసేవారైతే వీలైతే భారత దేశానికి వచ్చి ఓటు చేయడం చాలా ముఖ్యమైన కర్తవ్యం. అలా రాలేని పక్షంలో దూరాభారాల వల్ల కానట్లయితే మరొక పని చేయవచ్చు. అక్కడున్నటువంటి మనవారు అలాగే విదేశీ పౌరసత్వం తీసుకొన్నటువంటి భారతీయులు వీరందరికి దేశం మీద భక్తి ఉన్నది దేశం బాగుండాలనే కోరిక ఉన్నది కనుక అక్కడి నుంచే ఈ దేశంలో ఉన్నటువంటి తమ బంధుమిత్రులను ప్రేరేపించి వారు ఇల్లు కదిలి వోటు వేయడానికి తగిన స్ఫూర్తినివ్వాలి. 

అదే విధంగా దేశం, ధర్మం రక్షింపబడాలి;  దేశీయతా భావం, జాతీయతా భావం, దేశ భక్తి భావం ఉండాలి, అటువంటి నేతృత్వం రావాలి అనే భావం అందరిలో కలిగించాలి. ఈ విధంగా ప్రతియొక్కరు ఈ సమయంలో ఉద్యమించి ఓటు హక్కును వినియోగించుకోవాలి.  ఎక్కువ శాతంలో మన తెలుగు రాష్ట్రాలలో ఓటింగ్ జరగాలి అని కోరుకుందాం. 

అంతే కాదు, ఓటర్ల లిస్ట్లో మన పేరు గల్లంతైతే ఉపేక్షించకుండా, వెనుతిరిగి వచ్చేయకుండా సంబంధిత ఎన్నికల కమీషన్ అధికారులకు తప్పకుండా ఫిర్యాదు చెయ్యండి. ఓటు మన హక్కు,  అది మనం వినియోగించుకోవాలి. దానిని ఎవరు తొలగించినా మనం ఊరుకోకూడదు. అదే విధంగా మనం ఆ రోజు తొందరగానే వెళ్ళి ఓటు వెయ్యాలని నిర్ణయించుకోవాలి. ఆలస్యం చెయ్యకుండా పొద్దున్న లేచాక ఎంత తొందరగా ఓటు వేస్తామా అని అదొక ప్రధానమైన దైవ కార్యక్రమంలా చెయ్యాలి. ఈ విధంగా మనం అత్యంత శ్రద్ధతో ఓటువేసినట్లయితే దేశం భవిష్యత్తు చాలా బాగుంటుంది. సరైన ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన అభ్యుదయ దృష్టి కలిగిన పాలన రావాలని పరమేశ్వరుని ప్రార్థిద్దాం. 

ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు
వందే భారతమాతరం. భారత్ మాతా కీ జయ్...

ధన్యోస్మి

No comments:

Post a Comment