Saturday, May 4, 2024

' సత్యాన్వేషి చలం ' ఆపుస్తకం చదివి నేను వ్రాసిన సమీక్ష ...

 ఈ రోజు మహారచయిత చలం గారి వర్ధంతి. అసలు చలం అంటే ఏమిటో నేను తెలుసుకున్న పుస్తకం వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి పుస్తకం ' సత్యాన్వేషి  చలం ' ఆపుస్తకం చదివి నేను వ్రాసిన సమీక్ష ...ఓ జ్ఞాపకం ...మీకోసం. 

   పుస్తకం :- సత్యాన్వేషి చలం 
 
రచయిత్రి :- శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు 

        అరకొరగా ఒకటి రెండు చలం పుస్తకాలు చదివి ,అవి పూర్తిగా శృంగార పూరితాలనీ ,సభ్య సమాజం హర్షించేవి కాదనీ ,అందులోని నాయికలు సమాజం పట్లా వివాహ వ్యవస్థ పట్లా ఎంతమాత్రం గౌరవ మర్యాదలు లేని వాళ్ళనీ ,అందువల్ల వాళ్ళని సృజియించిన ఆ రచయిత కూడా సమాజం పట్ల ఎటువంటి బాధ్యతా లేని ఒక స్వేచ్చా ప్రవృత్తి కలవాడనీ ఒక నిర్ణయానికి వచ్చి చలం పుస్త కాలు చదవడానికి ఇష్ట పడని నాలాంటి వారికి చలం గురించీ ,అతని జీవితం గురించీ ,అతని సామాజిక దృక్పధం గురించీ అతని నిరంతర జీవన పోరాటం గురించీ సవివరంగా తెలియ జెప్పిన గ్రంధం (ఇక్కడ గ్రంధం అని ఎందుకంటున్నానంటే ...ఇందులో రచయిత్రి సూక్ష్మ పరిశీలనా దృష్టీ ,ఇందులో వివరించిన ప్రతీ విషయాన్నీ అనేక విమర్శనా గ్రంధాలనుండి సేకరించి సోదాహరణంగా  వివరించిన తీరూ ,చలాన్ని అవగాహన చేసుకునే క్రమం లో తను సేకరించిన సమాచారాన్ని సాధికారికం గా ప్రకటించి పాఠ కులను ఒప్పించ గలిగిన నేర్పూ ,దీనికి ఒక సద్గ్రంధానికి ఉన్న విలువను తెచ్చిపెట్టాయి ).చలం యొక్క బాల్య దశనుండీ ,అతని వ్యక్తిత్వం రూపుదిద్దుకునే క్రమం లో అతడు ఎదుర్కొన్న వివిధ పరిస్థితుల ప్రాబల్యం అతన్ని సద్బ్రాహ్మణత్వం నుండి నిరీశ్వర వాదిగానూ అటునుంచి ఈశ్వరాన్వేషిగా నడిపించిన తీరూ ,సవివరం గానూ సోదాహరణం గానూ మన కళ్ళముందుంచారు వీరలక్ష్మీ దేవి గారు. 

        బాధ్యత తెలియని తండ్రి దగ్గర దారిద్ర్యాన్నీ నిత్యమూ తన్నులూ హింసనూ భరించి ,  తరువాత   తాత గారి దగ్గర ధనవంతమైన జీవితాన్ని చవిచూసిన చలం వివాహానంతరం వివిధ పరిస్థితులలో తాతగారి ఆస్థినీ ,మామగారి ఆస్థినీ వదులుకొని ,నిరీశ్వరవాదిగా బ్రహ్మ సమాజంలో ఉండి ,తరువాత స్త్రీ కారణంగా బ్రహ్మ సమాజం నుండీ ఒకరకంగా సంఘం నుండీ వెలివేయబడి మేనత్త ప్రాపకంలో గడిపినరోజులూ ,వొదిన రంగనాయకమ్మను (వొయ్యి )ఆదుకొని ఆమె కోరిక ప్రకారం ఆమెను డాక్టర్ ను చదివించడానికి ఎంతో శ్రమకోర్చడమూ మనకు చలం గురించి మానవీయమైన కోణం లో ఆలోచించే దిశగా మనకు రచయిత్రి దారి చూపిస్తారు. ఆతరువాత రాజమండ్రి లో దీక్షితులవారి స్నేహంవల్ల సాహిత్య రంగ ప్రవేశం చేసి నవ్య సాహిత్య పరిషత్తు కవులలో ,కధా రచయితలలో ,నాటక ,నవలా రచయితలలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవటం తెలుసుకుంటాం. 
  
            ఇలా చలం జీవితాన్ని పుట్టుక నుంచీ ,రమణాశ్రమం లో ఈశ్వరైక్యం చెందేవరకూ 1894 - 1979 ఆయన జీవన ప్రయాణం లోని ప్రతి మలుపునూ ,అంటే కుటుంబ పరం గా వ్యక్తిత్వ పరం గా ,సామాజిక పరంగా ,రచనా పరం గా ,ఆర్ధిక పరంగా ,మానసిక పరం గా ,ఆయన లో కలిగిన ప్రతిమార్పునూ రచయిత్రి మన కళ్ళముందు ఆవిష్కరింప జేసారు. తద్వారా మనం చలాన్ని మమూలు రచయితగా కాక ఇంకొంచెం ఆసక్తి తోనూ ,విశాల  దృక్పధం తోనూ అర్ధం చేసుకునే ప్రయత్నం చేయగలుగుతాం. 

            చలం సాహిత్యం గురించి  వ్రాస్తూ రచయిత్రి "జన్మతః ఆయన సృజన శీలి. ఆవిధం గా కళాకారుడు కావటం వల్ల అతని అన్వేషణ సాహిత్య రూపం లోకి వచ్చి బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం లభించింది "అంటారు .చలం నవలల్లోని నాయికలు సమాజం పట్ల వ్యక్తం చేసిన భావాలన్నీ చలం భావాలకు  ప్రతిబింబాలే అంటారు రచయిత్రి. తాము నమ్మిన సత్యాలకోసం దేనికీ భయపడని ధీరులే ఆ స్త్రీలు. వీరు వివాహం గా చలామణీ అవుతున్న సంఘ వ్యవస్థను వ్యతిరేకిస్తారు. హృదయమే ప్రమాణం గా నడుస్తారు. ఆయన గానీ ,ఆయన పాత్రలుగానీ తిరుగుబాటుచేసింది సంఘం లోని కుహనా భావాలూ ,విలువలమీద అంతే గానీ ఆయన పోరాటం అందని సుఖాలకోసం కాదు అంటారు. ఇందులో 1921 లో వ్రాసిన శశిరేఖ నవలనుండీ ,చివరగా 1948 లో వ్రాసిన జీవితాదర్శం నవల వరకూ అతని వయసూ ,సామాజిక పరిస్థితులూ ,జీవన సంఘర్షణలూ లాంటి అతని మనస్సుపై ప్రభావితం చేసిన అంశాలూ ,అతని నవలల్లోని పాత్రల ద్వారా అతను సమాజం పై కాలానుగుణం గా ఎటువంటి హిపోక్రసీ లేకుండా వెలిబుచ్చిన అభిప్రాయాలుగా మనం అర్ధం చెసుకో వచ్చు. 

       ఇక్కడ ప్రతి నవలయొక్క సంగ్రహాన్నీ అందులో చలం వ్యక్తీ కరించిన విషయాలనూ ,తద్వారా అతనిలో కలుగుతున్న మానసిక పరిణితి దశలనూ ,ఆ పరిణామ క్రమాన్నీ చక్కగా వివరించారు రచయిత్రి. "చలం ఏ సత్య పధాన్నయితే కనుగొనాలని తపించాడో అది తన ఒక్కడి కోసమేగాక ప్రజలందరికోసమూ అని ఆరాట పడటం వల్ల తనకు సత్యమనిపించిన ప్రతి అంశాన్నీ ప్రజలముందు ఉంచుతూ వచ్చాడు. ఆవిధం గా ఇంచుమించూ ఆయన జీవితం చివరి దాకా ఆయన నుంచి వచ్చిన ఆ అన్వేషణ సృజనరూపం లో తెలుస్తూనే వచ్చింది. అంతే కాక తను ఏనాటికి ఏది నిజమని నమ్మితే అది చెప్పడానికి చలం ఏనాడూ భయపడలేదు. "అంటారు. జీవితానికి ఆదర్శం ఏమిటంటే శాంతిలో జీవించటం స్పందించే హృదయాన్ని కాపాడుకుంటూ గొప్ప శాంతిని సాధించ గలగడమే జీవితంలో చివరి విలువ అని ఈ నవలల సారాంశం. ఈ దారిలోనే చలం జీవన ప్రయాణం సాగినట్లు అతని జీవతాన్ని పరిశిలించినప్పుడు అర్ధమవుతుంది.రచయిత్రితో పాటు  పాఠకులకు కూడా .
  
            చలం రాసిన దాదాపు పది పౌరాణికాలూ ,రెండు చారిత్రకాలూ ,రెండు జానపదాలూ ఇరవై రెండు సాంఘిక నాటకాలూ ఇవికాక ఏడు అనువాద నాటకాలనుంచి పరిశోధనకు  అనువైన వాటిని విశ్లేషించి అందులోని చలం అన్వేషణా దృష్టిని వెలికి తీసారు రచయిత్రి. "ఇంకా ఎదగాలి మనసులు విశాలం కావాలి ,నా పుస్తకాలు అర్ధం కావాలంటే "అని చలం గారి మాటలనె ఉదహరిస్తూ ,ఇది అహం కారంతో చెప్పిన మాట కాదని సూక్ష్మ పరిశీలనకు తెలుస్తుంది అంటారు ఆవిడ. మొదటి నాటకం చిత్రాంగి నుంచి చివరి నాటకం పురూరవ దాకా పురుషులఔన్నత్య  సాధన ప్రధానాంశం గా చలం తీసుకున్న విధానాన్ని విశ్లేషిస్తారు రచయిత్రి. చలం సావిత్రి నాటకం లోని సావిత్రి సత్యవంతుడి ప్రాణాల్ని తన ప్రేమ శక్తి చేత సాధించుకుంటుంది. తరువాత శశాంక నాటకం ప్రేమ జీవనం లోని ఒడిదుడుకులను చూసాక రాసింది ఇందులోని భావాలు చలంలో క్రమం గా ఏర్పడుతున్న పరిణామాలను చెబుతాయి. అతనిలోని రసికుడు క్రమం గా తాత్వికుడుగా మారే క్రమం ఈ నాటకంలో కనిపిస్తుంది అంటారు. 

         ఇక పురూరవ నాటకంలోని ఊర్వసి చలం అన్వేషించిన స్త్రీ అంటారు రచయిత్రి. చలం ఈనాటకం లో చేసిన తాత్విక చర్చనూ ,జీవితమంటే ఏమిటి ?ఎందుకు జీవించడం ?అన్న విషయాలమీద తను తెలుసుకున్న జ్ఞానాన్ని ఊర్వసి ద్వారా చెప్పించారు. "జయదేవ నాటకం లో జయదేవుని పాత్ర నిండా  చలమే  కనిపిస్తాడు 1935 -36 మద్య ప్రాంతాల్లో చలం ఆసనాలూ ప్రాణాయామాలూ చెయ్యడ ప్రారంభించి వాంఛను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చెసారు. అతనిలో జరిగిన అంతర్యుద్ధమే అందులో ప్రతిబింబిస్తుంది. అలాగే సత్యం ,శివం ,సుందరం అనే మూడు సాంఘిక నాటకాల్లోనూ సంఘంలో చెలామణీ అయ్యే ఆచారాలను నిరసించి వాటి వెనుకనున్న స్వార్ధాన్నీ ,దుర్మార్గాన్నీ ,మోసాన్నీ ,కపటాన్నీ ,కుళ్ళునూ బయటపెట్టాడు. "ఏదన్నా ప్రపంచంలో అర్ధం కావాలంటే దానిలో ఐక్యమై ,ఆదృష్టితో యోచించాలి. ఎక్కిరింపూ ఏం లేదని కొట్టేయడమూ చాలా సులభం  "ఈ మాట చలం జీవితానికీ సాహిత్యానికీ కూడా వర్తిస్తుంది ంటారు రచయిత్రి. 

        చలం మాటల్లో చెప్పాలంటే "వాళ్ళు (విమర్శకులు )శైలి అనుకునేది నా హృదయోద్రేకం. నేను నా కధల్లో ఇలాంటి వ్యక్తులకోసం పడే మనోవేదన ,వాళ్ళకు జరిగిన అన్యాయం మీద కోపం ,వ్రాసేటప్పుడు నాహృదయం మండుతుంది. ఇంకా తీవ్రమైన మాటలకోసం వెతుక్కుంటాను ".ఆవిధంగా ఆయన లోపలి ఆక్రోశం నుంచి ,తపననుంచి ఆయన కధలు వచ్చాయి అంటారు రచయిత్రి. దాదాపు 108 కధలూ కధానికలూ రాసారు చలం. చలం కధల్లోని మొద్దటికధ" భార్య" 1924 నుంచి చివరి కధ "ఆ రాత్రి 1950 వరకూ కొన్నికధల్లోని సారాంశాలనూ ,అందులోని పాత్రలనూ వాటి ఔచిత్యాలనూ మనకు పరిచయం చేసారు రచయిత్రి.            

                                           అప్పుడూఇప్పుడూ ,ఆమెత్యాగం ,ఆత్మార్పణ ,వితంతువు ,శేషమ్మ ,కర్మఫలం ,లాంటి కధలు అతని ఆత్మార్పణనీ ,అంతర్మధనాన్నీ ,అతను వెతికే శాంతినీ ,ప్రకృతికి దగ్గరగా వుండే అతని వ్యక్తిత్వాన్నీ తెలియజేస్తాయి. "చలం స్త్రీని ప్రకృతినీ ఒకేవిధంగా చూడటం ఆయన కధలన్నిటా ఉంది అంటారు రచయిత్రి. స్త్రీ ల విముక్తికి అవసరమైన వెతికి వెతికి ,వాటిని సవివరంగా చర్చిస్తూ స్త్రీ అనే లక్షణ గ్రంధం లాంటి పుస్త కం  వ్రాసారు చలం  పురుషుణ్ణి గొప్పవాణ్ణి చేసి ఆత్మను వికసింప చెయ్యగల శక్తి స్త్రీ లో ఉన్నదని ఆయన నమ్మకమూ అనుభవమూ కూడా అంటారు ఆవిడ. చలం దృష్టి లో స్త్రీ లగొప్పదనమూ ,అస్వతంత్రత ,స్త్రీపురుషుల మధ్యలోని సేవ సేవ్యక ,మోహ ,కామ ,మిత్ర ,కుటుంబ ,ప్రేమ సంబంధాలనూ వివాహవ్యవస్థ పైన అతని అభిప్రాయాలనూ సోదాహరణం గా అతని సాహిత్యం లోని వివిధ పాత్రల ద్వారా ఎలా వ్యక్తీక రించారో  తెలుస్తుంది ఈ పుస్తకం చదవటం వల్ల  .

             అలాగే ఆయన వ్రాసిన బిడ్డల శిక్షణ పుస్తకం లో బిడ్డల పెంపెకం లో తల్లిదండ్రుల పాత్ర ఎంత కష్టమైనదో చెలం మాటల వల్ల అర్ధమవుతుంది. బిడ్డను పోషించుకోవటానికి ,తగిన శిక్షణ నివ్వటానికి సరయిన పరిస్థితులు ఉన్నప్పుడే బిడ్డలను సృజియించు కోవాలనే చెలం మాట అక్షర సత్యం అనిపించక మానదు. అలాగే చలం వ్యాసాల లో విద్య పట్లా ,నీతిపట్లా ,స్వేఛ్చా ,సౌందర్యం పట్లా  ఆయనకు ఉన్న అభిప్రాయాలనూ ,ఆయన సాహిత్యం నుండి విమర్శకులు గ్రహించిన అభిప్రాయాలనూ వివరంగా మన ముందు ఉంచారు రచయిత్రి. 

                చలాన్ని జీవితం పొడుగునా అన్వేషకుడిగా చేసి నడిపిన శక్తి ఆయనలోని అశాంతి. ఈ అశాంతికి కారణాలు ఏమిటా అని ఆయన జీవితాంతం అన్వేషించాడు . చలం బాధతో ,అశాంతితో విషాదంతో ,కళాకారుడూ ఆధ్యాత్మిక గామీ అయ్యాడు అంటారు రచయిత్రి. ప్రేమ వల్ల వచ్చే ఆనందం గొప్పది అంటాడు చలం. కాల్పనిక సాహిత్యం లో చివరి నవల జీవితాదర్శం చివరిలో జీవితాదర్శం శాంతి అని చెప్పిస్తాడు ఆయన జీవితాదర్శం కూడా అదే అంటారావిడ. ఈవిధం గా తర్కించి యోచించి చివరకు బాధల్లోంచి నడిచి, బాధలు అంటకుండా ఉండే స్థితికి చేరినప్పుడే శాంతి లభిస్తుందని అర్ధం చేసుకున్నాడు. అటువంటి శాంతి కలగాలంటే మనిషి లోని ఆరాటాలు శమించటమేగాక అహం కూడా అణగాలని అర్ధమైంది చివరికి. అన్నీ నాకే అనుకోవడం నుంచి 'అంతానేనే 'అనుకో గలగడం దాకా ఎదగడంలో అటువంటి శాంత జీవనం లభ్యమవుతుందని గ్రహించుకుని ఆ జీవనం వైపు ప్రయాణం సాగించాడు. మరణం వరకూ ఆ మార్గం లోనే ప్రయాణిస్తూ వచ్చాడు. ఇదీ చలం  సత్య దృష్టి అంటారు  రచయిత్రి .

           చలం చివరి మజిలీగా అరుణాచలం లోని రమణాశ్రమం చేరిన తరువాత వ్రాసిన ఠాగూరు కావ్యాను వాదాలు గీతాంజలి ,ఉత్తరణ ,ఫలసేకరణ ,భగవద్గీత ,జీస జీవితం ,నిర్వికల్పం ఇంకా ఎన్నో వ్రాసారు. వీటిలో ముఖ్య మైనవి మిత్రులకు వ్రాసిన లేఖలు,ఇంకా 1972  లో వ్రాసిన ఆత్మకధ. ఆయన మాటల్లోనే చెప్పాలంటే "ఇక్కడికి వచ్చి చలాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాను. అదే నన్ను తెలుసుకోనీకుండా చేస్తున్నది. "అని చలం తనలోని 'అహం 'గురించి చెప్పడం అతని అంతర్మధనాన్ని సూచిస్తుంది. "చలం వంటి రచయితను ,సంఘనీతిని దుయ్యబట్టిన రచయితను అర్ధం చేసుకోవడం కష్టం. అందువల్లనే ఆయననుంచివచ్చిన సాహిత్యమూ ,ఆయన జీవితమూ అనేక విమర్శలకు గురైంది. సత్యాన్వేషణా పధం అడుగడుగునా ముళ్ళతో నిండినది. ఎప్పటికప్పుడు తనను తాను ప్రయోగానికి నిలబెట్టుకుని ,కొలిమిలో కాల్చుకుని ,సమ్మెటతో కొట్టుకుని ప్రకాశింపచేసుకుంటూ ముందుకు సాగవలసిందే. చివరకు మాటకంటే మౌనం ద్వారా అన్వేషణకు పూనుకున్న మనిషి -ఇందులోనే ఆయన క్రమ పరిణామం ఉంది .ఓక సత్యాన్వేషకుడికి అవసరమైన మార్గాన్ని ,సూనృతం తో ,చూపుతో ,జీవించిన, రచించిన రచించిన వ్యక్తి చలం "అని ముగిస్తారు రచయిత్రి. 

                ఈ వ్యాసం లో రచయిత్రి కేవలం చలం సాహిత్యం గురిచి మాత్రమేకాక ఆయన జీవితమూ ,స్త్రీ ల సాహచర్యమూ ,ఆర్ధిక పరమైన ఇబ్బందులూ ,పిల్లలూ తదనంతర జీవితమూ గురించి పూర్తిగా వివరిస్తారు .సద్గుణాలతో పాటు ఆయన వ్యక్తిత్వం లోని లోపాలను కూడా యధాతధం గా మనముందు ఉంచుతారు.చలం తన  జీవితాన్నీ సాహిత్యాన్నీ ఎలా నిస్సంకోచం గా పాఠకుల  ముందు ఉంచిందీ ,చలం జీవితం ఆయన రచనల కంటే గొప్పగా ఎలా వెలిగిందీ తెలియ జెప్పారు .కాబట్టి ఆజీవితాన్నీ సాహిత్యాన్నీ మొత్తంగా చూస్తూ ఆయన ప్రయాణం ఏవిధంగా సాగిందీ ,ఎటుసాగిందీ అని పరిశీలించినప్పుడు ,ఆయన సహిత్య తత్వమూ ,జీవన తత్వమూ వాటిమధ్య ఉన్న సంబంధమూ కూడా అవగత మవుతాయి అంటారు. 

            ఈవిధం గా చలం యొక్క పుట్టుకనుంచి మహాప్రస్థానం వరకూ ,ఆయన సాహిత్యం లోని ఆలోచనా స్రవంతినీ ,వెలుగునూ గమనాన్నీ ,ఆయన నడచిన దారంతా వెదజల్లిన గ్రంధ సుమాలనూ గ్రహించి ,నవలలూ ,నాటకాలూ ,కధలూ  ఆత్మకధా ,లేఖలూ ,వ్యాసాలూ ,మ్యూజింగ్సు అనువాదాలూ దేని ప్రత్యేకత దానిదే !ఒక్కోటి పరిమళభరితం కావొచ్చు ,ఇంకొకటి అద్భుత వర్ణమయం కావొచ్చు ,వీటన్నింటినీ గ్రహించి ,చలం యొక్క సత్యాన్వేషణా పధమనే సూత్రాన్ని కనుగొని దానితో అందమైన కదంబ మాలగా ఈ పుస్తకాన్ని అందించారు రచయిత్రి వాడ్రేవు వెంకట వీరలక్ష్మీ దేవి గారు. పరిశోధనా వ్యాసం గా స్వర్ణ పతకం అందుకుంది అంటేనే ..ఇది ఎంత విలువైన గ్రంధమో తెలుస్తున్నది. ఈ పుస్తకం చదువుతుంటేనే చలం సాహిత్య సాగర సారాన్నంతా మధించి వెలికితీసిన నవనీతాన్ని సులువుగా ఇందులో బంధించడానికి రచయిత్రి పడ్డ శ్రమ ఎంతటిదో తెలుస్తుంది. 

           ఇంత మంచి పుస్తకం చదివే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందపడుతున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే ,ఇంతవరకూ మా సృజనలో పుస్తకాల గురించి మాట్లాడు కోవటమే తప్ప ,ఇ లా ధైర్యం గా అభిప్రాయాన్ని ఇంతవరకూ వ్రాసింది లేదు .కానీ మీ పుస్తకం వ్రాసేదాకా నన్ను నిలవనివ్వలేదు. ఇంతవ్రాసినా  దీనిగురించి చాలా తక్కువ వ్రాసాననిపిస్తుంది. ఇది తప్పకుండా మన అందరిదగ్గరా ఉండవలసిన పుస్తకం. ఇంత మంచి పుస్తకాన్ని అందించినందుకు శతాధిక ధన్యవాదాలు.

వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారూ .

No comments:

Post a Comment