*టాల్ స్టాయ్*
రచన : ఎం. డి సౌజన్య
ప్రముఖ రష్యా సాహితీవేత్త టాల్ స్టాయ్ పుట్టుకతో పెద్ద జమీందారు. ఒక రోజు ఆయన వాహ్యాళికి వెడుతుండగా ఇద్దరు వృద్ధులు ఎంతో బడలికతో ఎదురొచ్చి "బాబూ! మీరు ఈ ప్రాంతంవారే అయివుంటే కథల తాతయ్య లియో టాల్ స్టాయ్ గురించి వినే వుంటారు? ఆయన నివాసం ఎక్కడో చెబుతారా?” అన్నారు.
టాల్ స్టాయ్ కి కుతూహలం కలిగి తనెవరో ఆ వృద్ధ రైతులకు చెప్పకుండా "ఆఁ ఆఁ ఆయన ఇల్లు నాకు తెలుసు, అయినా ఆయన్నే ప్రత్యేకంగా ఎందుకు కలుసుకుందామనుకొని వచ్చారు? ఏమిటో ఆయన ప్రత్యేకత?” అన్నాడు.
వెంటనే వృద్ధుల్లో ఒకడు “ఆయన కథలు మీరు వినలేదా ? రైతుల గురించి, వివిధ రంగాలకు చెందన కర్షక మిత్రులను గురించీ ఆయన వ్రాసిన కథలు వాడవాడ ల్లో పల్లె పల్లెల్లో ఆబాలగోపాలం చెప్పు కొని, విని, చదివి ఆనందిస్తారే. ఈమాత్రం మీకు తెలియకపోవడం ఆశ్చర్యంగా వుందే? బడుగుజీవుల బాధలు, శ్రమ జీవుల గాథలే గదా ఆయన తన కథల్లో చెప్పేది, అంతమాత్రం మీకు తెలియదా? ఆయన కథలు రష్యా అంతా ఆబాల గోపాలం చదువుతారే! మీరు చదివి ఆనందించరా?” అన్నాడు.
టాల్ స్టాయ్ ఇక విషయం పెంచకుండా వాళ్ళను తనతో రమ్మన్నాడు.
ఇక వృద్ధుల్లో రెండవవాడు “మాకు చాలా జానపద కథలు, పాటలు వచ్చు. అవి అందరికీ తెలియాలన్నా, హృదయానికి హత్తుకునేట్టు చెప్పాలన్నా అవి టాల్ స్టాయ్ మాత్రమే రాయాలి.. మాలో ఒకడై మా వంటి వాడైతేనే మా సాధకబాధకాలు ఆయన రచనల్లో చొప్పించి చెప్పగలడు।" అంటూ చెప్పాడు.
వాళ్ళలా మాట్లాడుకుంటూ ఓ పెద్ద జమీందారు భవంతి ప్రాంగణంలోకి ఆడుగుపెట్టారు. వృద్ధులిద్దరూ ఆశ్చర్య పోతూ "ఇదేమిటీ! మమ్మల్ని కర్షకుల కథలు రాసే 'కథల తాతయ్య' దగ్గరకు చేర్చమంటే పెద్ద జమీందారు ఇంటికి చేర్చావు?" అన్నారు కంగారుగా.
“లోపలికి రండి. నేనే ఆ కథల తాతయ్య ను! నా ఆతిథ్యం స్వీకరించండి" అంటూ వాళ్ళను ఇంట్లోకి ఆహ్వానించాడు టాల్ స్టాయ్.
ఆ మాటలతో వృద్ధులిద్దరూ కలవర
పడిపోతూ “అయితే...ఇద్దరు వృద్ధులు' కథ వ్రాసిన ఆ టాల్ స్టాయ్ మీరేనా?” అన్నారు ముక్తకంఠంతో.
అప్పుడు టాల్ స్టాయ్ “ఔను, నేనే! ఆ కథను చదివిన ప్రతి రైతు ఆ కథ తనను గురించే అనుకుంటాడు కదూ” అన్నాడు ఆనందంగా.
ఇంతలో నాలుగు గుర్రాలు లాగుతున్న అందమైన బగ్గి వచ్చి ఆ భవంతి ముందు ఆగింది. అందులోంచి ఖరీదైన ఉన్ని బట్టలు ధరించిన పిల్లలు ఆప్సరసల్లా దిగి బిలబిలమంటూ ఇంట్లోకి పరిగెత్తారు. ఆ వృద్ధులు ఆ బగ్గీని ఆ పిల్లల ఖరీదైన ఉన్ని దుస్తుల్ని చూస్తూ విస్తుపోతున్నారు
"రండి భోజనం చేద్దాం. అలా భోజనం చేస్తూ మీరు మీ 'కథల తాతయ్య' కు చెప్పదలచిన కథలు చెప్పుదురుగాని” అన్నాడు టాల్ స్టాయ్ ఆ వృద్ధులు ఇద్దరినీ ఇంటిలోనికి ఆహ్వానిస్తూ.
అయితే ఆ ఇద్దరు వృద్ధులూ టాల్ స్టాయ్ ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ “క్షమించండి! మీ ఆతిథ్యం మేము స్వీకరించలేము. ఇంతవరకు మీ కథలు చదివి చదివి మీరు మాలో ఒకరనుకున్నాం. అంతేగాని మా వంటి పేదల రక్తమాంసాలు జలగల్లా పీల్చే జమీందారనుకోలేదు. ధనిక వర్గ ప్రతినిధియైన మీరు, మీ కథల్లో చిత్రించే పేద రైతుల చిత్రణ ఒట్టి బూటకమని
కలలో కూడా ఊహించలేదు” అన్నారు అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతూ.
అంతే! టాల్ స్టాయ్ జీవితంలో ఈ సంఘటన ఊహించలేనంత మార్పు తెచ్చింది. ఆయన క్రమేపీ తన ఆస్తి పాస్తుల్ని పేద రైతులకు పంచి ఇవ్వడమే కాక, చివరికి రష్యా జమీందార్ల, చక్రవర్తు ల అక్రమాలను తీవ్రంగా నిరశిస్తూ రచనలు చేయడంతో పాటు సాయుధ పోరాటం కూడా సాగించాడు. చివరికి ఒక సర్వసంగ పరిత్యాగిలా ఒక ఆశ్రమం లాంటి దాన్ని నిర్మించుకొని ఎవరూ ఊహించని విధంగా అతి నిరాడంబర జీవితం సాగించి, నవంబరు 21వ తేదీ 1910 సంవత్సరంలో కీర్తిశేషు డయ్యాడు.
టాల్ స్టాయ్ జీవితం ఎంతోమందికి ఆదర్శం.
📖
*సమాప్తం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•
No comments:
Post a Comment