Saturday, May 4, 2024

భగవంతుడు

 *శ్రీగురుభ్యోనమః*

                      *భగవంతుడు*


*ప్రశ్న :  భగవంతుడు  ఆత్మకి  భిన్నమా ?*

*జవాబు :*  ఆత్మే  భగవంతుడు.  *అహం*  అంటేనే  భగవంతుడు.  నీవు  అహంకారాన్ని  పట్టుకొని  ఉండటం  వల్లనే  ఈ ప్రశ్న  ఉదయిస్తుంది.  నీవు  ఆత్మనే  పట్టుకొని  ఉంటే  ఉదయించదు.  ఆత్మ  దేనినీ  అడుగదు,  అడుగలేదు.  ఆత్మకి  భిన్నంగా  భగవంతుడుంటే,  ఆయనని  అనాత్మమైన  భగవంతుడనాలి.  అది  అసందర్భం  కదా !  *వాస్తవంగా ఉన్నదల్లా ..  ఉన్నట్టు  తెలియని  భగవంతుడే !  ఉన్నట్లు  అనిపించే  వ్యక్తే  ఎప్పుడూ  ఉండని  వాడు.*  తాను  లేననీ,  శూన్యమనీ  గ్రహించిన  స్థితే  ఉత్తమమైనదని  ఋషులు  చెపుతారు.  

నీవొక  వ్యక్తివనీ,  విశ్వమంటూ  ఒకటున్నదనీ,  దానికి  అవతల  భగవంతుడున్నాడనీ  అనుకుంటావు.  ఇందులో  భేదభావముంది.  ఈ భావం  పోవాలి.  నీకు  గాని,  విశ్వానికి  గాని  భగవంతుడు  వేరుగా  లేడు.  *గీత*  లో  ఇట్లా  ఉంది.

అహమాత్మా  గుడాకేశ  సర్వభూతాశయస్థితః !
అహమాదిశ్చ  మధ్యం చ
భూతానామన్త  ఏవ చ       ( 10:20 )

( గుడాకేశా ( ఓ అర్జునా ) !  నేను  అన్ని  ప్రాణుల  హృదయాలలోనూ  ఉంటాను.  ప్రాణుల  ఆదిమధ్యాంతములు  నేను.)

భగవంతుడు  అందరి  హృదయాలలోనూ  ఉండటమే  కాదు,  అన్నిటికీ  ఆధారమాయనే !  అన్నిటికీ  మూలమాయనే !  అన్నీ  చివరికి  విశ్రమించేది  ఆయనలోనే !  అన్నీ  ఆయననుండే  ఉదయిస్తాయి,  ఆయనలోనే  వసిస్తాయి,  ఆయనలోనే  లీనమవుతాయి.  అందువల్ల  ఆయన  వేరు  కాదు. 


             *"నీ సహజస్థితిలో  ఉండు"*
      *భగవాన్ శ్రీ రమణమహర్షి బోధనలు*

                         
🌷🙏🌷

No comments:

Post a Comment