Friday, May 17, 2024

దైవానికి ప్రీతి పాత్రులు

 దైవానికి ప్రీతి పాత్రులు

ఒక గ్రామంలో ఓ వైద్యుడు ఉండేవాడు. దైవాన్ని ఏమాత్రం నమ్మని నాస్తికుడు అతని హస్తవాసి మంచిది. నిరుపేదలకు ఉచితంగా వైద్యం చేసేవాడు ఉదర పోషణార్థం ఔషధాల తయారీ కోసం ధనవంతుల వద్ద డబ్బు తీసుకునేవాడు ఆ గ్రామంలో ఎవరికీ ఏ కష్టం కలిగిన పిలవకుండానే వెళ్లి చేతనైనంత సహాయ సహకారాలు అందించే వాడు అనారోగ్యం పాలైన వృద్ధుల ఇంటికి వెళ్లి ఉచితంగా వైద్య సేవలు చేసేవాడు. దైవాన్ని గురించి ఎవరైనా అతనితో ప్రస్తావిస్తే తన ఊహకందని వాటి గురించి చర్చించే పరిజ్ఞానం లేదని అనేవాడు. ఆపద కలిగిన వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చేసే సేవ వల్ల తనకు కలుగుతున్న ఆత్మ తృప్తి, అనిర్వచనీయమైన ఆనందం వస్తుందని బదులిచ్చేవాడు. 
   ఒకసారి ఆ గ్రామంలో భయంకరమైన అంటూ వ్యాధి వ్యాపించింది. వైద్యుడు ఎన్ని మూలికల ఔషధాలు ప్రయోగించిన వ్యాధి తగ్గుముఖం పట్టలేదు. ఆ వ్యాధిని ఎలా నియంత్రించాలో అతడికి అర్థం కాలేదు ఒకరోజు ఆ ఊరికి ఓ సన్యాసి వచ్చాడు. ఊరి పొలిమేరలోని దేవాలయంలో బస చేశాడు గ్రామంలోని పెద్దలందరూ సన్యాసిని దర్శించుకుని అంతుచిక్కని వ్యాధి గురించి తెలిపి ఎలాగైనా తన మహిమతో రక్షించమని కోరారు ఆ సన్యాసి బదులిస్తూ వైద్యుడు పేరు ప్రస్తావించి అతన్ని తీసుకురమ్మని ఆదేశించాడు. పరమ నాస్తికుడని మీలాంటి వాళ్లపైన నమ్మకం లేదు కనుక దేవాలయంలోకి రాడని చెప్పారు అయితే మనమే అతన్ని దర్శించుకోవాలని పలికి సన్యాసి వైద్యుడు ఇంటికి వెళ్ళాడు. వైద్యుడు ఆ సమయంలో ఒక రోగికి వైద్యం చేస్తున్నాడు కనీసం లేచి నించొని సన్యాసిని సాదరంగా ఆహ్వానించలేదు. సన్యాసి సరాసరి వైద్యుడి దగ్గరికి వెళ్లి తన జోలిలో నుంచి పెద్ద మూలికను తీసి దానితో వైద్యం ఎలా చేయాలో తెలిపి అంటువ్యాధిని తగ్గించమని ఆదేశించి వెంటనే వెను తిరిగాడు సన్యాసి వెంట ఉన్న గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు. స్వామి! ఆ మూలికను మాకు ఇచ్చి ఉంటే సరిపోయేది కదా! మా గ్రామాన్ని మహమ్మారి నుంచి కాపాడుకోనగలిగే వాళ్ళం. వైద్యుడొక నాస్తికుడు, కనీసం దేవుడి పటానికైనా నమస్కరించడు.మీరు అతన్ని కరుణించారు! అన్నారు. నాయనలారా! దైవానికి వైద్యుడు లాంటి వారే ప్రీతి పాత్రులు. సృష్టిలోని అన్ని జీవుల పరిపూర్ణ స్వభావమే భగవంతుడు. దైవంలో అన్నీ ఇమిడి ఉన్నాయి ఆ సర్వేశ్వరుడి పరిధి అనంతమైనది పరుల మేలు కోసం జీవించేవాడు పరమ భక్తుడి కన్నా గొప్పవాడు తన కోసం బతకడం కన్నా ఇతరుల కోసం బతికేవాడే భగవంతుడు సన్నిధికి చేరగలడు అన్నాడు. 

 స్వార్థపరుడైన ఆస్తికుడి కన్నా నిస్వార్థపరుడైన నాస్తికుడి హృదయంలో అంతర్యామి అంతర్లీనంగా ఉంటాడని ఈ కథ మనకు తెలియజేస్తుంది.

No comments:

Post a Comment