భగవంతుని ఒక్కొక్కరు ఒక్కో విధంగా కొలుస్తారు, తలుస్తారు. కానీ అతనికంటే నిర్దిష్టమైన ఉనికి, స్వరూపము, విభూతి ఉన్నాయి. వీటన్నిటిని మనం సార రూపంగా చెప్పుకోవాలంటే... భగవంతుడు మొత్తం విశ్వానికి సంబంధించిన వాడు. దాంట్లో అన్ని మతాలు, అన్ని సాంప్రదాయాలు, అన్ని విధానాలతో చూసిన అతని యొక్క సత్య స్వరూపము ప్రస్ఫుటం కావాలి. భగవంతుడికి ఉండే అర్హతల గురించి మనం చెప్పుకున్నట్లయితే... అతనిని 5 ముఖ్యమైన అర్హతలతో అర్థం చేసుకోవచ్చు. ఈ ఐదు అర్హతలు ఎవరికైతే వర్తిస్తాయో వారిని భగవంతుడిగా మనం విశ్వసించాలి, ప్రకటించాలి, అనుసరించాలి, ఆరాధించాలి.
1. భగవంతుడు *సర్వధర్మ మాన్యుడు* అనగా భగవంతుని సర్వ ధర్మాల వాళ్లు అంగీకరించాలి- అతడే భగవంతుడు అని. ఇలా కాదు... నేను 'A' ని భగవంతుడు అంటే ఇంకొకరు 'B' ని అనుకోవడం. అన్ని ధర్మాల వాళ్లు అన్ని మతాల వాళ్ళు అంగీకరించాలి- అతడే భగవానుడు అని. ఈ విధంగా చూసినట్లయితే భగవంతుని యొక్క స్వరూపము *నిరాకార జ్యోతిర్బిందు* స్వరూపము. ఇదే విషయం భగవద్గీతలో ఉంది- అతడు పరంజ్యోతి అని, ఖురాన్ లో ఉంది- అల్లా ఏక నూర్ హై అని, బైబిల్లో ఉంది- గాడ్ ఇజ్ లైట్ అని, గురుగ్రంద్ సాహెబ్(సిక్కు) లో ఉంది- అతను ఓంకార స్వరూపమని. కాబట్టి మనకు నిరూపణ అవుతుంది- భగవంతుడు జ్యోతిర్బిందు స్వరూపుడని.
2. భగవంతుడు *సర్వజ్ఞుడు* అంటే అన్నీ తెలిసినవాడు. ఈ ప్రపంచంలో భగవంతునికి తెలియని విషయమంటూ లేదు, విద్య లేదు, జ్ఞానం అంటూ లేదు. అతనికి మన ఆత్మ గురించి, ఈ పంచభూతాల ప్రకృతి గురించి, తన (పరమాత్మ) గురించి మరియు ఈ సృష్టి యొక్క ఆది మధ్యంతం గురించి అన్ని తెలుసు. కాబట్టి అంటారు... గాడ్ నోస్ ఎవ్రీథింగ్ (God knows everything). మనం కూడా అంటాము- ఆ పైనున్న పరమాత్మకే అన్ని తెలుసు అని. కాబట్టి భగవంతుడు సర్వజ్ఞాత, సర్వజ్ఞుడు. ఇది అన్ని ధర్మాల వాళ్లు ఒప్పుకుంటారు.
3. భగవంతుడు *సర్వోపరి* అంటే అన్నిటికీ అతీతమైన వాడు. ఈ యొక్క జనన మరణాలకు, తినడము నిద్రపోవడం, ఈ కర్మలు చేయడము, ఈ సుఖం దుఃఖము, పాపము పుణ్యము, ఈ భౌతిక ప్రపంచానికి అతీతమైన వాడు. భగవంతుడు బ్రహ్మలోక నివాసి. కాబట్టి అతన్ని సర్వోపరి అని అంటారు. ఇదే విషయాన్ని అన్నిధర్మాల వాళ్ళు ఒప్పుకుంటారు- భగవంతుడు ఈ ప్రపంచానికి అతీతమైన వాడని.
4. భగవంతుడు *సర్వోన్నతుడు* అంటే హైయెస్ట్ ఆన్ హై (highest on high). అతనికంటే ఇక ఉన్నతమైన వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, అతనే అందరికంటే ఉన్నతమైన వాడు. మనం చూసినట్లయితే ఈనాటి సందేశకులు, మత గురువులు, ప్రబోధకులు అందరు కూడా భగవంతుని వైపే చూపిస్తున్నారు. దేవతలు కూడా ఆ భగవంతుని జ్యోతి స్వరూపంగా, పరంజ్యోతిగా ఆరాధించారు. రాముడు కానీ కృష్ణుడు కానీ వినాయకుడు కానీ అయ్యప్ప స్వామి కానీ మార్కండేయుడు కానీ, ఆది శక్తి కానీ, బ్రహ్మదేవుడు కానీ విష్ణుమూర్తి కానీ ఇలా అనేక దేవతలు కూడా అతన్ని ఆరాధించినట్టుగా, అతన్ని దేవదేవుడిగా చూపిస్తారు. కాబట్టి భగవంతుడు సర్వోన్నతుడు. ఇది అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకుంటారు.
5. భగవంతుడు *సర్వశక్తిమంతుడు*. అతను ఆల్మైటీ అథారిటీ (almighty authority), అతని దగ్గర లేని శక్తి అంటూ లేదు. ఈ విషయాన్ని కూడా అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకుంటారు. కాబట్టి ఎవరిలో అయితే ఈ ఐదు అర్హతలు ఉంటాయో వారే భగవతుడు అవుతారు. అంతే కానీ నేననుకుంటున్నట్టు, ఇంకొకరు అనుకున్నట్టు, ఫలానా ఫలానా అయితే కాదు...... అలాంటి వారిలో దైవత్వం ఉండవచ్చు కానీ, ఈశ్వరుడు మాత్రం కాజాలరు. *ఈశ్వరుడు* (శివ పరమాత్మ) మన అందరి ఆత్మల యొక్క తండ్రి, సుప్రీం ఫాదర్, సుప్రీం సోల్ (Supreme Soul).🙏🏻
No comments:
Post a Comment