Friday, September 13, 2024

 *✍🏼 నేటి కథ ✍🏼*

*అవివేకం🐜🐀🐇🐺*

ఒక అడవిలో ఒక చీమ వేగంగా పరిగెడుతుంది. కొంతసేపటికి దానికొక ఎలుక ఎదురొచ్చింది. "చీమ చీమ ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు?" అని చీమని అడిగింది ఎలుక. "అక్కడొక పెద్ద జంతువు ఉంది, నా కన్నా చాల పెద్దది. నన్ను తినేస్తుందేమో అని పరిగెడుతున్నాను" అని చెప్పింది చీమ. "అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను కూడా నీతో పరిగెడుతాను" అని ఎలుక కూడా చీమతో పాటు పరుగు ప్రారంభించింది. అవి రెండు పరిగెడుతూ ఉండగా కుందేలు ఎదురుపడుతుంది. "ఎందుకు పరిగెడుతున్నారు?" అని అడిగింది. "అక్కడొక పెద్ద జంతువు ఉంది, నా కన్నా చాల పెద్దది. నన్ను తినేస్తుందేమో అని పరిగెడుతున్నాను" అని చెప్పింది చీమ. "అవునవును" అంది ఎలుక. దాంతో, కుందేలు కూడా వాటితో పాటు పరుగు లంకించింది. కొంతదూరం వెళ్ళాక ఒక నక్క ఎదురై అదే ప్రశ్న వేస్తుంది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది. కొంతదూరం పరిగెత్తాక, నక్క అలసటతో "ఇంకా నావల్ల కాదు, నేను పరిగెత్తలేను, ఇంతకీ అసలు ఆ జంతువు ఏంటి?" అని అడుగుతుంది. "అదా! పెద్ద గండుచీమ. నా వైపే వస్తుంటే, తనేం చేస్తుందో అని భయపడ్డాను" అని చెప్పింది చీమ. ఎలుక, కుందేలు, నక్క కోపంతో "గండుచీమ మమ్మల్ని తింటుందా? అనవసరంగా భయపెట్టావు" అని అన్నాయి. "నన్ను తింటుంది అని చెప్పాను కానీ మిమ్మల్ని తింటుంది అని నేను చెప్పలేదుగా" అని అంది చీమ. నిజమేగా అనుకున్నాయి నక్క,కుందేలు, ఎలుక.

*నీతి: ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం.*


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

No comments:

Post a Comment