Saturday, July 5, 2025

 [7/3, 15:12] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*


అవనివిభుండు నేరుపరియై చరియించిన గొల్చువార లె
ట్లవగుణలైన నేమి పనులన్నియు జేకురు వారిచేతనే
ప్రవిమలనీతిశాలి యగు *రామునికార్యము మర్కటంబులే
తవిలి యొనర్పవే జలధి దాటి సురారుల ద్రుంచి భాస్కరా

*తాత్పర్యము:*

రాజు నీతిమంతుడైన యెడల, సేవకు లెట్టివారైనను పనులు నెరవేరును. నీతివిశారదుడగు శ్రీరఘురాముని కార్యము చపలచిత్తములగు కోతులు చక్కజేశాయి కదా!
[7/3, 15:12] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*


*కక్కుర్తి వెధవ*

అన్నింటిని ఆశించేవాడు. అలాంటి వారిని గురించి ఈ మాటను వాడతారు. ఆబగా అన్నం తినే వారిని ఉద్దేశించి కూడా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
[7/3, 15:12] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*


*కుటుంబ కోసం త్యాగం చేసేవాడు ఉన్నతుడైతే, దేశం కోసం త్యాగం చేసేవాడు మహాత్ముడువుతాడు.-- గాంధీజీ*
[7/3, 15:12] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*


*కనుక్కో కనుక్కో ఓ బాలా*


కనుక్కో కనుక్కో ఓ బాలా
పొడుపుకథా చెబుతాను

కథ విప్పండీ-
కథ చెప్పండీ-

చూడచక్కని చిన్నది, గోడమీద ఉన్నది
నువ్వుచూస్తే నీలాగ, నేనుచూస్తే నాలాగ
ఏమిటది ? ఏమిటది ? ఏమిటది-                 
                                                             
*అద్దం!!*

ఆవును గుంజకు కట్టేసి దూడ మేతకు వెళ్ళింది.
సాయంకాలం తిరిగొచ్చి ఆవుకు బంధం విప్పింది.
ఏమిటది ? ఏమిటది ? ఏమిటది-

*తాళంచెవి!*

అమ్మకడుపులో నిద్రిస్తారు అరభైమంది పిల్లలు
మేలుకున్న పిల్లవాడు కాలిపోతాడు
ఏమిటది ? ఏమిటది ? ఏమిటది-
                                                      
*అగ్గిపుల్ల!*

పొద్దున్నే జననం, రాత్రంతా శయనం
సాయంకాలం పయనం 
ఏమిటది ? ఏమిటది ? ఏమిటది-
                                                    
*సూర్యుడు!*
               
నల్లని ముఖమూ, నలచదరం
పిల్లలు పెట్టే తెల్లని వాతలు 
ఏమిటది ? ఏమిటది ? ఏమిటది-
                                                     
*పలక!*
                                                  
ఒంటి చేతి పిల్లా, వడ్డించు మల్లా
ఏమిటది ? ఏమిటది ? ఏమిటది-
                                                    
*గరిటె!*
                                                            
కవలపిల్లలిద్దరు, కాళ్ళకింద ఉందురు
ఒకరిని విడచి ఉండరు, ఒంటరిగా నడవరు.
ఏమిటది ? ఏమిటది ? ఏమిటది-
                                                      
*చెప్పులు!*


*👇🎼🎤ఈగీతం ఆడియో🎻🎸👇*
[7/3, 15:12] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*


*అందితే జుట్టు అందక పోతే కాళ్లు*


అవకాశవాది తన పని పూర్తి చేసుకోటానికి ముందు గడ్డం పట్టుకు బ్రతిమిలాడతాడు, అయినా పని కాకపోతే కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడతాడటానికి కూడా వెనకాడడు. ఈ సామెత ఒక అవకాశవాది తత్వాన్ని తెలియచేస్తోంది.
[7/3, 15:12] +91 79819 72004: *✍🏼 నేటి కథ ✍🏼*


*ఎవరు గొప్ప*


అర్థంలేని కథలు చెప్పి ప్రశ్నలు అడగటం మన జానపదులకే చెల్లింది. అస్సలు అర్థంలేని గొప్ప కథ ఒకటి ఉన్నది ఇక్కడ. అది చదివి ఎవరు గొప్పో తేల్చగల్గితే మీకు అక్షరలక్షలు లభించగలవు. ప్రయత్నించండి మరి.

*రచన: గంగమ్మ, టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి*

పూర్వం తూర్పుదేశంలో చెంబన్న, పడమటి దేశంలో మంబన్న అనే ఇద్దరు బలశాలులు ఉండేవారు. వారి బలాబలాలను గూర్చి చుట్టుపక్కలవాళ్ళు బహుగొప్పగా చెప్పుకొనేవారు. చెంబన్న,మంబన్నలు ఒకరినిగూర్చి మరొకరు విన్నారేకాని, వారు ఒకరినొకరు ఎన్నడూ చూసుకోలేదు.

ఒక రోజు చెంబన్న, మంబన్నను చూడడానికి బయలుదేరాడు. ప్రయాణానికన్నీ సిద్దంచెయ్యమన్నాడు భార్యను. చెప్పిందే తడవుగా చెంబన్న భార్య ఊరిలోని అమ్మలక్కలను అందరినీ అడిగి , పాత చీరలన్నీపోగుచేసి, ఒక బొంతగా కుట్టి, అందరి సాయంతో వంట చేసి, వరిబువ్వా, ముద్ద పప్పు, ఊరగాయ, నెయ్యీ వేసి బొంతనిండా సద్దిని కట్టించింది. ఆ సద్ది మూటను ఒక ఏనుగుమీదుంచి భర్తను సాగనంపింది.
చెంబన్న, ప్రయాణం చేసీ, చేసీ మాపటేళకు ఒక చోట ఆగి, సద్దిమూటను విప్పిభోజనం తిన్నాడు. భోంచేశాక బొంతను ఒక పెద్ద చింతమాను మీద ఆరేసి, మళ్ళీ తిరుగుప్రయాణంలో తీసుకోవచ్చునులే అనుకొని ప్రయాణాన్ని కొనసాగించాడు. సాయంత్రానికి మంబన్న ఊరిని చేరుకొని మంబన్న గురించి ఆరాతీయసాగాడు.
కట్ట మీద కూర్చున్న ఒక ముసలి తాతను మంబన్న ఇల్లు ఎక్కడుంటుందని అడిగాడు. అదిగో ! అక్కడ బిందెలో నీళ్ళు తెస్తోందే, ఆమే మంబన్న భార్య అని తాత చెప్పాడు. అపుడు చెంబన్న, మంబన్న భార్యతో మాట్లాడి తాను, మంబన్నను చూడాలనీ, అతనితో మాట్లాడాలనీ చెప్పాడు. సరే అని చెంబన్నను, మంబన్న భార్య వాళ్ళ ఇంటికి తీసుకపోయింది. "అన్నా! ఇప్పుడే వస్తాను, అలా ఆ మంచం వాల్చుకొని కూర్చో"మని చెప్పి లోపలికి వెళ్ళింది.

చెంబన్నకు అది అవమానంగా అనిపించింది. అయినా తప్పదుగదా. "ఒక ఊరి రెడ్డి మరోఊరి పాలేగాడు" , అనుకొని మంచం వాల్చబోయాడు. మంచం వంగలేదు. కొంచెం గట్టిగా ప్రయత్నించాడు. మంచం కదలనేలేదు. బలమంతా ఉపయోగించి చూసాడు. కానీ మంచాన్నిమాత్రం కదపలేకపోయాడు. ఇక మంచాన్ని చూస్తూ ఆశ్యర్యపోవడం చెంబన్న వంతయింది. ఇంతలో మంబన్న భార్య వచ్చి, కూర్చోమంటే అలా నిలబడ్డావేందన్నా? అంటూ వచ్చి తన చిటికెన వేలితో మంచాన్ని వాల్చింది. చెంబన్న ఆశ్యర్యంతో, "మంబన్న భార్యనే ఇంత బలవంతురాలే ! ఇక మంబన్న ఎంత బలవంతుడయి ఉంటాడో?" అనుకున్నాడు.ఇంతలో మంబన్న భార్య వచ్చి, "ఆయన ఉదయం వస్తారు, మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండండని, ఒక చాపా, రగ్గూ ఇచ్చి, ’ఇక్కడ పడుకొమ్”ని బయట ఒక అరుగును చూపించింది. అరుగు మీద పడుకున్న చెంబన్నకు, నిద్ర పట్టలేదు. "అమ్మో! ఉదయం వరకూ నేను ఇక్కడే ఉంటే మంబన్న చేతిలో నాకు పరాజయం తప్పదు" అనుకొని తెలవారకనే బయలుదేరి వెళ్ళిపోయాడు. అలా ఆయన వెళ్ళిన కొంతసేపటికే మంబన్న ఇంటికి వచ్చాడు. చెంబన్న వచ్చివెళ్ళిన విషయాన్ని భర్తతో చెప్పింది మంబన్న భార్య. అవునా ! అయ్యో ! నేను ఎంతకాలంనుండీ ఆయనను కలవాలనుకుంటున్నాను. ఇప్పుడే వెళ్ళి ఆయనను కలుసుకొంటానని బయలుదేరాడు.
చెట్టుపైకెక్కి, బొంతను విప్పుకొంటున్న చెంబన్నకు, గుర్రంపైవస్తున్న మంబన్న కనిపించాడు. అతనే కాబోలు మంబన్న! నన్ను ఓడించడానికే వస్తున్నట్టున్నాడు. ఆలస్యం చేస్తే నాకే ప్రమాదం అనుకొని త్వరగా చెట్టును దిగి, దాన్ని వేర్లతోసహా, పెకిలించేసుకొని, తన ఏనుగెక్కి ముందుకు పోయాడు. ఇది చూసిన మంబన్న, చెంబన్న తన మీదకు యుద్దానికి వస్తున్నాడేమోననుకొని, తనూ ఒక తాటి చెట్టును పెకలించుకొని దాన్ని భుజాన పెట్టుకొని, తన గుర్రాన్ని, దౌడుతీయించాడు. కొంత సేపటికి వారిద్దరూ, కలుసుకొని తమలో ఎవరు గొప్పో తేల్చుకోవాలనుకొన్నారు. గెలుపును నిర్ణయించే మధ్యవర్తి కోసం ఎదురుచూశారు. ఇంతలో అంబలి కుండను నెత్తిమీద పెట్టుకొనివస్తున్న సీతాలు వారికి కనిపించింది.
ఇద్దరూ అమె దగ్గరకు పోయి "అమ్మా ! మేమిద్దరం యుద్దం చేస్తాము. మాలో ఎవరు గొప్పో నువ్వు తేల్చాలి" అని అడిగారు. అందుకు సీతాలు "అమ్మో! నిన్ననే నా మొగుడు సద్ది ఆలస్యమైందని మక్కిలు విరగదన్నాడు. ఇక ఈ రోజూ ఆలస్యమయితే, అంతే సంగతి. అంతగా కావాలంటే, మీరిద్దరూ నాభుజాలమీదకెక్కి పోట్లాడండి. నేను వెళుతుంటాన"ని చెప్పింది. ’ఈ ఉపాయం బాగానే ఉం”నుకొని, వారిద్దరూ సీతాలు భుజాలమీద కూర్చొని యుద్ధం చేయసాగారు. ఆంత దూరంలో వస్తున్న సీతాలును చూసిన గొర్రెలు కాసే తన భర్త, అయ్యో ! నిన్న నేను తనను కొట్టినందుకు కాబోలు ఇవాళ నన్ను కొట్టించడానికి ఎవరో బలవంతులను తీసుకవస్తున్నది నా భార్య! వాళ్ళకు దొరికితే నన్నెక్కడ బ్రతకనిస్తారు ? బ్రతికుంటే బలుసాకులు తినవచ్చు’ననుకొని, తన కంబళిని పరిచి, గొర్రెలనన్నింటినీ అందులొ మూటగట్టుకొని,ఆ మూటను తన నెత్తిన పెట్టుకొని పరిగెత్తసాగాడు.
అలా పరుగెత్తి పోతున్న అతన్ని, పైనుండి ఓ గ్రద్ద చూసి "ఇదేదో పెద్ద మాంసపు ముద్దలాగా ఉన్నదే" అనుకొని కిందికొచ్చి వాడిగల తన కాలిగోళ్ళతో అతన్నీ, గొర్రెల మూటనూ ఒక్క తన్నుతో తన్నుకపోయింది. అలా పోతూండగా ఏడంతస్తుల మేడలో తల ఆర్పుకుంటున్న యువ రాణి ఒకసారి ఆకాశంలోకి చూసింది. అంతలోనే గ్రద్ద తన్నుకుపోతున్న గొర్రెల మూటవచ్చి రాణి కంట్లో పడింది. రాణి సుతారంగా తన కంటిరెప్పను ఒక్కసారి రుద్దింది. వెంటనే గొర్రెల మూట కరిగిపోయింది.

*కథనంతా విన్నారు కదా ! మరి మీరే చెప్పండి వీరిలో ఎవరు గొప్పో.??*
[7/3, 15:12] +91 79819 72004: *✅తెలుసు కుందాం✅*


*📱సెల్‌ఫోన్ కు తేదీలు తెలుసా? Do Cellphone know dates?📲*

సాధారణంగా సెల్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ అయిపోకముందే ఆఫ్‌ చేస్తే, ఆ బ్యాటరీ శక్తితో సమాచారం సెల్‌ఫోన్‌ సర్క్యూట్‌లో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఫోన్‌ మెమొరీలో ఉన్న కాంటాక్ట్‌ పేర్లు వగైరా సమాచారమంతా అలాగే ఉంటుంది. అందుకే తిరిగి ఆన్‌ చేసినపుడు తేదీ, సమయం, ఇతర వివరాలు కూడా ఉంటాయి. కానీ సెల్‌ను చాలాకాలం పాటు ఆఫ్‌ చేస్తే దానిలోని బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జి అయిపోతుంది. అప్పుడు ఫోన్‌ మెమొరీలో ఉండే సమాచారం మొత్తం ఖాళీ అవుతుంది. తిరిగి ఛార్జింగ్‌ చేసి ఆన్‌ చేస్తే ఆ సమాచారం తిరిగి రాదు. కానీ తేదీ, కాలం మాత్రం బాగానే కనిపిస్తాయి. ఇందుకు కారణం ఫోన్‌ మెమొరీ కాదు. మనం ఏ కంపెనీ సెల్‌ఫోన్‌ను వాడుతున్నామో, ఆ టవర్‌తో లింకు ఏర్పడి వారి సర్వీసు సర్వర్‌ కంప్యూటర్‌తో సంధానించుకుంటుంది. అయితే కాంటాక్ట్స్‌, ఇతర వివరాలను సెల్‌లో ఉండే మైక్రోచిప్‌లోకానీ, సిమ్‌ మెమొరీలో కానీ దాచుకుంటే ఎన్ని రోజుల తర్వాతైనా తిరిగి వాడుకోవచ్చు.

No comments:

Post a Comment