*ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది..*
విశ్లేషణ :
- శ్రీ తాడేపల్లి పతంజలి గారు
84 లక్షల జన్మలలో మానవ జన్మ ఎక్కడిది ? ఈ జన్మ ఎత్తిన లాభం ఏమిటి ?( లాభం లేదని భావం ). ఓ వేంకటేశ్వరా! నిన్నే నమ్ముకున్నాను. ఇది నిజం ( నిక్కము ). ఈ నమ్ముకున్న భక్తుడిని ఏం చేస్తావో... అది నీ ఇష్టం ( నీ చిత్తంబికనూ ).
1. మాధవా! ( లక్ష్మి కి భర్తా! ) నీ భక్తుడైన నేను, వేళకు అన్నం తినడము మరువను. సంసార సుఖం మరువను. కర్మ, జ్ఞాన ఇంద్రియాల వల్ల లభించే సుఖాల భోగం మరువను. ఇదంతా నీ మాయ ! ఏదయితే నీ సంబంధమయిన జ్ఞానముందో ( సుజ్ఞానంబును ) దానిని మరచిపోతాను. దేవుని తెలుసుకునే ( తత్వ ) రహస్యాలు మరచిపోతాను. గురువును దైవాన్ని మరచిపోతాను. ఇది కూడా నీ మాయ.
2. పాపాన్ని, పుణ్యాన్ని విడువను. నా చెడ్డ గుణాలు విడిచిపెట్టను. దురాశలు ( మిక్కిలి ఆశలు ) విడిచిపెట్టను. ఓ విష్ణు దేవా! ఇదంతా నీ మాయ. యజ్ఞం చేయటం, యజ్ఞం చేయించటం, గురువు దగ్గర వేదం చదువుకోవడం, వేదం చదివించటం, దానం చేయటం, అవసరమైన మేరకు దానం తీసుకోవటం అనే ఆరు కర్మలు విడిచిపెడతాను. దేనిమీద ఆసక్తి లేని వైరాగ్య గుణాన్ని విడిచిపెడతాను. ఆచారాలు విడిచిపెడతాను. ఇదంతా నీ మాయ.
3. సంబంధాలు కలిగించే అనేక పనులు ( బహు లంపటముల ) తగిలించుకుంటాను. అనేక బంధాలలో చిక్కుకుంటాను. కానీ అదేమి కర్మమో కానీ , ఎంత జరగనీ! మోక్షపు మార్గంలో నడవను. స్వామీ! నువ్వు నాకు ఎదురుగా కనపడతావు ( అగపడి ). నాలోపల అంతర్యామిగా ఉంటావు. ఏమీ చేయలేని నా చేతకానితనాన్ని చూసి నవ్వుకుంటుంటావు. అయినా నిన్ను శరణు పొందిన నాకా యీ మాయా ?! ( నీ భక్తుడనైన నాకు మాయ తగదు. మాయను తొలగించమని విన్నపం ).
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
భగవంతుని అతి విచిత్రమైన శక్తి మాయ. ఈ మాయను ఎవరూ దాటలేరని, తనను సేవించినవారు ఈ మాయను దాటవచ్చని భగవానుడు భగవద్గీతలో చెప్పిన శ్లోకానికి (7-14) ఈ కీర్తన సారాంశం లాంటిది.
తిక్కన భారతంలో ధర్మరాజు కృష్ణుడితో 'మాకు మా నాన్న పాండుమహారాజు పెద్ద దిక్కుగా నిన్నచూపించి వెళ్ళాడు' అంటాడు. తండ్రి చేసే రక్షణ లాంటివి నువ్వు చెయ్యక తప్పదని, ఇకపై మా బాధ్యతంతా నీదే అని చెప్పకుండా ధర్మరాజు చెప్పాడు.
సరిగ్గా ఇదే మోస్తరులో ఈ కీర్తన పల్లవిలో కవి 'నిన్నే నమ్ముకొన్నాను. ఇక నీఇష్టం!' అన్నాడు స్వామివారితో. అంటే నమ్ముకొన్నవాళ్ళని నువ్వు రక్షించక తప్పదని ధ్వని.
చర్మం, కన్ను, చెవి, నాలుక, ముక్కు - ఇవి జ్ఞానేంద్రియాలు, వాక్కు, చేయి, పాదం, పాయువు, జననేంద్రియం - ఇవి కర్మేంద్రియాలు. ఈపదింటిని కలిపి దశేంద్రియాలంటారు. కొంతమంది మనస్సుతో కలిపి ఇంద్రియాల సంఖ్య పదకొండుకు పెంచారు. ఈ పదకొండు ఇంద్రియాలు సుఖాన్ని, భోగాన్ని కోరుకుంటున్నాయి కాని, శాశ్వత సుఖాన్ని ఇచ్చే నీ గురించి ఆలోచించటం లేదని జీవుని బాధ కవి ప్రకటించాడు. ఆధ్యాత్మ సాధన చేసేవాడు ఆహారం తీసుకోవటంలో నియమాలున్నాయి. ఆ ఆహారం న్యాయంగా సంపాదించినది అయి ఉండాలి. పరిమితంగా ఉండాలి. రుచి కోసం కాకుండా ఆకలి కోసం తీసుకోవాలి. మాంసాహారం కాకూడదు. దేవునికి నివేదించి తినాలి. ఈ ఆహార నియమాలన్నీ పాటించలేకపోతున్నాను అంటూ, ఇది నా తప్పుకాదు. - నీ మాయ అంటున్నాడు కవి..
గొడ్డు ఎంత వేగంగా ముందుకు వెళదామనుకొన్నా, లంపటం సాగనీయదు. ఆధ్యాత్మ సాధన చేసేవాని పరిస్థితి కూడా ఇంతే! తను స్వయంగా తగిలించుకొన్న
సంబంధాలు తాననుకొన్న కృషిని సాగనీయవు. ఇది నీ మాయే అని కవి చెప్పటంలో, దీనిని తొలగించమనే ఆర్తి ఉంది..
మోక్షపు మార్గం అంటే శ్రేయోమార్గం. (కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు) ఇది నిత్య సుఖాన్ని కలిగించేది. దీనికి విరుద్ధమైనది ప్రేయోమార్గం. అంటే భౌతిక సుఖాల మీద ఇష్టం. నేను ఈ లోకంలో కనిపించే తాత్కాలిక సుఖాల మీద మోజు పడుతున్నాను. శాశ్వత సుఖాన్ని కలిగించే మోక్షపు మార్గం సంగతి ఆలోచించనని కవి వాపోతున్నాడు. వైరాగ్యమంటే అల్లాటప్పగ వచ్చేది కాదు. అనుభవిస్తున్న భోగాలను విడిచి పెట్టడం, కొత్త భోగాలను కోరుకోకుండా ఉండటం. ఈ రెండింటినీ పాటించగలిగితే వైరాగ్యం వచ్చినట్టే. ఇది విడిచిపెట్టానని కవి ఆవేదన.
చేయకూడనివి చేస్తున్నాను. చేయవలసినవి చేయటం లేదు. ఈ రెండింటికీ నీ మాయ కారణం అని, తన తప్పేమీ లేదని ఈ కీర్తనలో కవి చమత్కరిస్తున్నాడు. ఇది ఉత్తమ మానవునిగా ఎదగలేని దుర్యోధన స్వభావం. 'నాకు ధర్మం అంటే ఏమిటో తెలుసు. కాని అది నన్ను ఆకర్షించదు. అధర్మమంటే ఏమిటో తెలుసు. నేను దానిని విడవలేకపోతున్నాను' (జానామి...) ఈ రకమైన దుర్యోధన స్వభావం దేవుని మాయ అని, ఆయనని హృదయ పూర్వకంగా శరణు కోరితే ఈమాయను తప్పించుకోవచ్చని ఈ కీర్తనలో అన్నమయ్య వారసుని సందేశం.
మాయతో కూడిన పరమాత్మ, పాలలో నెయ్యిలాగ ప్రతి జీవిలోను అంతర్యామిలా ఉంటాడు. ఆ స్వామికి జీవుల ఆవేదనలను చెప్పి, వాటికి శరణాగతి అనే పరిష్కారాన్ని సూచించిన ఉత్తమ కీర్తన ఇది. స్వస్తి. 🙏🏻
No comments:
Post a Comment