రామాయణానుభవం.....247
హనుమ శింశుపా వృక్షం నుండి సీతాదేవిని గమనిస్తున్నాడు. ఆమె అతిలోక సౌందర్యాన్ని గమనిస్తున్నాడు.
ఇంతవరకు కిష్కింధలో ఉన్నప్పుడు హనుమ శ్రీరాముడు సీతకొరకు విలపించడం చూసి విసుగుకొన్నాడు. “ఒక సామాన్య స్త్రీ కొరకు సర్వలోక ప్రభువైన శ్రీరామచంద్రస్వామి ఇంతగా పరితపించడమా?" అని మనస్సులో ఈసడించుకొన్నాడు. కాని ఇప్పుడు అర్ధమైంది రామ దుఃఖానికి కారణము "అతిరూపవతీ సీతా". సీతాదేవి యొక్క సౌందర్యము అద్వితీయమైంది.
హనుమ శ్రీరామచంద్రస్వామి యొక్క సౌందర్యాన్ని గుర్తుచేసికొంటున్నాడు. సర్వప్రాణి మనోహరమైనది రామసౌందర్యము,
ఇప్పుడు సీతారాముల గొప్పదనాన్ని చెబుతున్నాడు
"తుల్యశీలవయోవృత్తాం। తుల్యాభిజన లక్షణాం రాఘవో2ర్హతి వైదేహీం। తంచేయమసితేక్షణా"
సీతారాముల శీల, వయో, వృత్తాలు, అభిజన లక్షణాలు పరస్పరము తగినట్లుగా ఉన్నాయి.
1.శ్రీరామశీలము: శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడు. ఆయనకు ధర్మాచరణమే ముఖ్యము. రాజ్య సంపదలు ఆయనకు తృణప్రాయాలు.
పట్టాభిషేకానికి సర్వసన్నద్ధుడైన రాముని పిలిచి, "రాజ్యాన్ని వదలి వెంటనే అడవికి వెళ్లుమ"ని కైక ఆదేశించినప్పుడు, "తల్లీ! నాకు రాజ్యభోగాలపట్ల వ్యామోహం ఏ మాత్రము లేదు. నేను ఋషి వంటి వాడిని" అని ఆమెతో అని వెంటనే అక్కడి నుండి అడవికి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఆయన మనస్సులో ఏ మాత్రము వికారము కలుగలేదు.
సీతాశీలము:- తన భర్త ఆయన తండ్రిని సత్యవాక్య పాలకుని కావించడానికి అడవులకు వెళ్తున్నాడని తెలిసిన తక్షణమే తాను కూడ అడవులకు వెళ్లడానికి తయారయింది. అయోధ్యా సౌఖ్యాలు, అత్తమామల ఆదరణలు అన్ని ఆమెకు తృణప్రాయం అనిపించాయి.
“యస్త్వయాసహసస్స్వర్గో। నిరయోయస్త్వయావినా”
"రామచంద్రా! నీ వెంట ఉండడమే నాకు స్వర్గము. నీ విరహమే నాకు నిర్ణయము (నరకము)" అని తెలిపి, భర్తను ఒప్పించి, ఆయనను అనుసరించింది.
2) వయస్సు:- భక్తామే పంచ వింశకః 25 మమాష్టాదశ గణ్యతే||
శ్రీరామచంద్రుడు అడవులకు బయలుదేరినప్పుడు ఆయన వయస్సు ఇరువై అయిదు సంవత్సరాలు. సీతాదేవి వయస్సు (18) పద్దెనిమిది సంవత్సరాలు. అది భార్యాభర్తలకు ఆనాడు తగిన ఈడు.
3) వృత్తము:- శ్రీరామచంద్రుడు ఆశ్రిత రక్షా దీక్షితుడు. తనను ఆశ్రయించిన వారిని ఎవ్వరినైనా రక్షించే దీక్ష గలవాడు. ఒక బోయవానిని దగ్గరికి తీసికొన్నాడు. ఒక గ్రద్దకు పరమపదాన్నే ఇచ్చాడు. ఒక కోతికి ఆశ్రయమిచ్చాడు. ఒక రాక్షసునికి అభయమిచ్చాడు.
సీతాదేవి కూడ ఆశ్రిత రక్షా దీక్షితురాలే. తనను భయపెట్టి బెదిరించి, నానా బాధలకు గురిచేసిన రాక్షస స్త్రీలకు కూడ అభయాన్నిచ్చిన ఉదారురాలు ఆవిడ
"భవేయం శరణం హి వః”
"మీ అందరిని రాముని నుండి రక్షిస్తాను" అని అభయమిచ్చింది ఆ తల్లి.
..........సశేషం.......
చక్కెర.తులసీ కృష్ణ
No comments:
Post a Comment