*_శీర్షిక: యువతలో ఈమాత్రం సంస్కారం ఉంటే చాలు.._*
*---------------------*
*సువర్చల త్వరగా ఇంటికి వెళ్ళాలన్న హడావుడిలో కారు వేగంగా నడుపుతోంది. ఇల్లు ఇంక రెండు కిలోమీటర్లుందనగా కారు ఆగిపోయింది. అది నిర్జన ప్రదేశం. అక్కడ ట్రాఫిక్ లేదు.. పైగా చీకటి పడుతోంది.. సువర్చలకు ఏం చేయాలో తోచలేదు. కాసేపు వేచి చూసింది. అంతలో ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ అటుగా వెళ్తూ పరిస్థితి గమనించారు... ఆమె దగ్గరకు వచ్చి, "మేడమ్! సాయం కావాలా" అని అడిగారు.. "ఈ కారు ట్రబులిచ్చింది. మీరు రిపేర్ చేయలేరు వద్దులే" అంది.. వాళ్ళు ఒకరి మొహాలొకరు చూసుకుని, "ఈ రోడ్డు బాగుండదు, చీకటి పడుతోంది.. ఇప్పుడు మీరు ఈ సమస్యను ఎదుర్కోవాలంటే డబ్బు వలన గానీ, లేదా పరికరాల వలన గానీ అయ్యే పనిగాదు.. కేవలం మా భుజబలం వల్లనే అవుతుంది. మీరేమీ కంగారు పడకండి." అని ధైర్యం చెప్పి, ఆమెను డ్రైవింగ్ సీటులో కూర్చోమన్నారు. ముగ్గురూ తీవ్రంగా శ్రమపడి ఇంటి వరకూ కారును తోసుకుంటూ వచ్చారు.. సువర్చల వాళ్ళను ఇంటిలోకి సాదరంగా ఆహ్వానించింది. స్నాక్స్, టీ ఆఫర్ చేసింది. వారి సంస్కారాన్ని మెచ్చుకుంటూ మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పింది..*
*మీరు మాకు థ్యాంక్స్ చెప్పకూడదు. మేము కూడా ఇక్కడి వాళ్ళమే ఈ ఏరియా మొత్తం మాకు తెలుసు. ఇందులో మా గొప్పతనం ఏమీలేదు. ఏదైనా ఉంటే.. అది మేము హైస్కూల్లో చదివేటప్పుడు మమ్మల్ని ఇలా మార్చడానికి నిరంతరం తపించిన మా సోషల్ మాష్టారు... శ్రీ సత్యనారాయణ గారికే చెందుతుంది. ఎందుకంటే అప్పట్లో మాలో ఈ సంస్కార బీజాలను నాటింది వారే! మానవతా దృక్పథంతో మెలుగుతూ సమాజసేవ చేయడంలో ఉన్న మాధుర్యాన్ని అనేకసార్లు అనుభవపూర్వకంగా మాకు చవిచూపించారు. ఆవిషయంలో మాత్రం ఆయన మాలో గట్టి పునాది వేశారు. ఈ ప్రపంచంలో, ఇరుగు పొరుగునున్నవాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకోకుండా ఉంటే ప్రశాంతంగా ఎలా జీవించగలరు? అనేది బాగా వంటబట్టించారు." అని వారు చెబుతూంటే, ఆ మాటలకు ఆమె మరింత ముగ్ధురాలయ్యింది.. "మిమ్మల్ని ఇంత సంస్కారవంతులుగా తీర్చిదిద్దిన మీ సోషల్ మాష్టారు శ్రీ సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక అభివందనాలు. ఆదర్శవంతులైన మీకు నా అభినందనలు.. ఆశీస్సులు తెలుపుకుంటున్నాను" అంది. వారు కూడా తమ గురువును తలచుకుంటూ సంతోషంగా సెలవు తీసుకున్నారు.... (ఇదీ కథ)*
*¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶*
_[ఇందులోని విషయం శ్రీ Somavajhala.. మాష్టారు గారిది. అందులో కొన్ని సవరణలు చేసి, 'సోషల్ సార్' అనే ఇంకొక పాత్రను సృష్టించాను. అంశానికి సరిపడే చిత్రాన్ని జతచేశాను. మొత్తం విషయాన్ని మరింత అర్థవంతంగా, ఆదర్శంగా మలచడానికి ప్రయత్నించాను. ఇంత మంచి విషయాన్ని అందించి నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ... 🙏--వెలిశెట్టి నారాయణరావు]_
¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶
*_నిజమేకదా! ఇప్పుడు మనం ఈ విషయాన్ని మరికొంచెం తర్కంతో ఆలోచిద్దాం. ప్రపంచంలో చాలామంది బంధువులు లేదా ఇరుగుపొరుగు వారు వేరైపోయి ఒంటరిగా బ్రతక డానికి అలవాటు పడుతున్నారు.. దీని వలన కోల్పోతున్న అనుబంధాలను తిరిగి పొందలేనంత నష్టం జరుగుతోంది.. మానవుడు సంఘజీవి అనే మాట పుస్తాకాలకే పరిమితం అవుతోంది.. నిస్వార్ధం, సంఘీభావం తెలియ చేయడమనేది పరిగణన లోకి తీసుకోబడటం లేదు.. ఇతరులతో బంధాలను కొనసాగించ డానికి ఇవే ఆధారమని గ్రహించాలి.. మనల్ని ఇతరులు ఎలా ట్రీట్ చెయ్యాలని కోరుకుంటామో, మనం కూడా ఎదుటి వారిని అలాగే ట్రీట్ చెయ్యాలి కదా! అప్పుడే ఆ ముగ్గురు యువకులు కోరుకున్న సమాజం వస్తుంది. ఏమంటారు?...... కానీ, నేటికాలంలో చదువుల గమ్యం, గమనం కూడా అగమ్యగోచరంగా తయారైంది. సత్యనారాయణ లాంటి ఉపాధ్యాయులు కూడా మనసుని చంపుకుని బలవంతంగా... కేవలం మార్కులు, ర్యాంకులు సాధించడం మాత్రమే ధ్యేయంగా శ్రమపడాల్సి వస్తోంది. అంతేకదా! ఒప్పుకుంటారుగా!?_*
*________________________*
*_{శుభోదయ వందనములతో.. మీ... --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు, ఆత్మకూరు.}_*
*=-=-=¶¶¶¶¶=-=-=*
No comments:
Post a Comment