Saturday, July 5, 2025

 *☘️~ వేదమూర్తుల స్తుతులు ~ ☘️*
*꧁❀❀━❀🌼🕉️🌼❀━❀❀꧂*
               *(23 వ భాగము)*

*ప్రకృతి, జీవుడు ఒకప్పుడు వరుసగా ప్రకృతి పురుషులని చెప్పబడతారు.. ప్రకృతి పురుషుల కలయికయే ఈ సమస్త జగత్తు. ప్రకృతి ఉపాదానకారణము, జీవులు నిమిత్తకారణము. ఈ రెండు కారణాలు జతకూడినపుడు ఒనగూడే కార్యమే. ఈ భౌతికజగత్తు. ఈ జగత్తును గురించి, దీనిలో జరిగే సమస్తమును గురించి సరియైన అవగాహనకు వచ్చే అదృష్టవంతుడు దానికి ప్రత్యక్షముగను, పరోక్షముగను స్వయంగా భగవంతుడే కారణమని తెలుసుకుంటాడు. అందుకే బ్రహ్మసంహితలో "ఈశ్వరః పరమః కృష్ణ సచ్చిదానందవిగ్రహః I అనాదిరాదిర్గోవింద : సర్వకారణ కారణం" అని చెప్పబడింది. సావధానపూర్వకముగా ఆలోచించిన తరువాత, విచారణ తరువాత మనిషి పరిపూర్ణజ్ఞానాన్ని బడసినపుడు శ్రీకృష్ణభగవానుడే సర్వకారణాలకు మూల కారణుడని తెలిసికొంటాడు. భగవంతుని పరిమాణమును గురించి అంటే అతడు ఎంత పొడవుగా ఉంటాడు.* *ఎంత వెడల్పులో ఉంటాడని కల్పనము చేసేందుకు బదులుగా లేదా మిథ్యగా తత్త్వవాదము చేసేందుకు బదులుగా శ్రీకృష్ణుడే సర్వకారణకారణమనే బ్రహ్మసంహిత నిర్ణయాన్ని ఆమోదించాలి. అదే పరిపూర్ణమైన జ్ఞానము.*

*ఈ విధముగా వేదస్తుతి (వేదమూర్తులు గర్బోదకళాయి విష్ణువుకు చేసిన స్తుతులు) తొలుత పరంపరలో సనందనునిచే అతని సోదరులకు వివరించబడినాయి. వారంతా సృష్ట్యారంభములో బ్రహ్మకు జన్మించారు. ఈ నల్వురు కుమారగణము బ్రహ్మదేవుని తొలిపుత్రులు కనుక పూర్వజాత యని పిలువబడినారు. పరంపరా విధానము సాక్షాత్తుగా శ్రీకృష్ణుని నుండియే ఆరంభమైనదని భగవద్గీతలో చెప్ప బడింది. అదేవిధంగా ఇక్కడ వేదమూర్తుల స్తుతులలో కూడ భగవంతుడైన నారాయణ ఋషిచే పరంపరావిధానము ఆరంభమైనదని తెలిసికోవాలి. వేదస్తుతిని సనందనుడు వివరించాడు. దానినే నారాయణఋషి బదరికాశ్రమములో తిరిగి వర్ణించాడు. కఠోరమగు తపస్సు ద్వారా ఆత్మానుభూతి పథాన్ని చూపించడానికి ఉన్నట్టి శ్రీకృష్ణుని అవతారమే నారాయణ ఋషి. ఈ యుగంలో శ్రీ చైతన్యులు విశుద్ధభక్తుని పాత్రను స్వీకరించి విశుద్ధ భక్తియోగాన్ని ప్రదర్శించారు. అదేవిధంగా గతంలో శ్రీనారాయణ ఋషి శ్రీకృష్ణుని ఒకానొక అవతారముగా అరుదెంచి హిమాలయములలో కఠోరమగు తపస్సు చేసాడు. శ్రీ నారదముని ఆతనినుండి ఉపదేశాలు పొందాడు. వేదస్తుతి రూపంలో సనందనుడు వివరించినదానిని నారాయణఋషి నారదమునికి చెప్పాడు. భగవంతు డొక్కడే పరమోన్నతుడని, ఇతరులందరు సేవకులేనని దాని నుండి తెలిసికోవాలి.*

*"ఏకలే ఈశ్వర కృష్ణ" కృష్ణుడే ఏకైక ఈశ్వరుడని చైతన్య చరితామృతములో చెప్పబడింది. "ఆర సబ భృత్య" మిగిలిన వారందరూ అతని సేవకులే. "యారే యైచ్చే నాచాయ సే ఛే కరే నృత్య" - భగవంతుడు తాను కోరినట్లుగా జీవులు అందరినీ వివిధ కలాపాలలో నెలకొల్పుతున్నాడు. ఆ విధంగా వారంతా వివిధము లైన కళలను, స్వభావాలను ప్రదర్శిస్తున్నారు. ఈ విధంగా వేదస్తుతి జీవునికి, భగవంతునికి గల సంబంధమును గురించిన మూల ఉపదేశమే అవుతుంది. భక్తి యోగాన్ని పొందడమే జీవునికి మహోన్నతమైన అనుభూతి అవుతుంది. భౌతిక కల్మషము నుండి పూర్తిగా బయటపడనిదే ఎవ్వరును భక్తియుత సేవలో లేదా కృష్ణభక్తిభావనలో నెలకొనలేరు. భగవంతునికి దివ్యమైన సేవ చేయడమే సమస్త వేదవాఙ్మయసారమని (అంటే నాలుగు వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, వేదాంత సూత్రముల సారము) నారాయణఋషి నారదమునికి తెలిపాడు. ఈ సందర్భములో అతడు "రస" అను ప్రత్యేకమైన పదప్రయోగాన్ని చేసాడు. భక్తియుత సేవలో “రసభావము" మాధ్యమము అవుతుంది. భగవంతుడు, జీవుని నడుమ పరస్పర ప్రేమ వినిమయానికి అదియే మూలసిద్ధాంతము. ఈ రసభావము వేదాలలో కూడ "రసోవైసః" అని వివరించబడింది. అంటే భగవంతుడే సకల రసనిధి. పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, వేదాంత సూత్రాలు వంటి సమస్త వేదావాఙ్మయము రసభావస్థితిని పొందే విధమును జీవులకు ఉపదేశిస్తున్నాయి. సమస్త వేదవాఙ్మయ రసము మహాపురాణమైన భాగవతములోని వాక్యాలలో ఉన్నదని చెప్పబడింది. "నిగమకల్పతరోర్గలితం ఫలం" - వేదవృక్షానికి పండిన ఫలమే శ్రీమద్భాగవతము.*

*భగవంతుని శ్వాసచే నాలుగు వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము, అథర్వవేదము), మహాభారతము వంటి ఇతిహాసములు, ప్రపంచ చరిత్రలుగా భావించబడే పురాణాలు ఆవిర్భవించాయని మనకు తెలుసు. పురాణాలు, మహాభారతము వంటి వైదిక చరిత్రలు పంచమవేదముగా పిలువబడతాయి.*

*ఇరువదియెనిమిది శ్లోకాలను గూడిన వేదస్తుతిని వేదజ్ఞానసారముగా భావించాలి. భక్తియోగమే సమస్త వేదవాఙ్మయసారమని సనకాది కుమారగణము, ఇతర ప్రామాణిక ఋషులు చక్కగా ఎరిగియుండి అంతరిక్షములో ప్రయాణిస్తూ దీనిని వివిధలోకాలలో ప్రచారము చేస్తారు. అటువంటి ఋషులు, నారదుడు నేలపై ప్రయాణింపక నిరంతరము అంతరిక్షముననే ప్రయాణిస్తారని ఇక్కడ చెప్పబడింది.*

*ప్రపంచములో బద్ధజీవుల కార్యము ఇంద్రియభోగములో నెలకొనడము గాక భగవత్సేవ యనెడి మూలస్థితిలో నెలకొనడమేనని బోధించడానికే నారదుడు, సనకాది ఋషులు విశ్వమంతట పర్యటిస్తారు. జీవులు నిప్పురవ్వల వంటివారని, భగవంతుడు అగ్ని వంటివాడని చాలా చోట్ల చెప్పబడింది. నిప్పురవ్వలు అగ్ని నుండి దూరంగా పడితే తమ సహజమైన వెలుగును కోల్పోతాయి. ఈ విధంగా భౌతికజగత్తులోకి వచ్చిన జీవులు మహాగ్ని నుండి దూరంగా పడిన నిప్పురవ్వలేనని చెప్పబడింది. జీవుడు శ్రీకృష్ణుని అనుకరిస్తూ ఇంద్రియభోగానికై ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించడానికి యత్నిస్తాడు. ఆ విధంగా అతడు తన మూలస్థితిని మరచిపోతాడు. అతని తేజోశక్తి, ఆధ్యాత్మికఉనికి అన్నీ ఆరిపోతాయి. కాని జీవుడు కృష్ణభక్తిభావనను చేపడితే మూలస్థితిలో తిరిగి నెలకొల్పబడతాడు. ఈ భక్తియోగ విధానాన్ని ప్రచారం చేయడానికే నారదుడు, సనకాదుల వంటి మునులు విశ్వమంతట పర్యటించి జనులకు బోధ చేస్తూ శిష్యులను తయారు చేసికొంటారు. బద్ధజీవులందరు తమ మూల చైతన్యాన్ని (కృష్ణభక్తిభావనను) పునరుద్ధరించుకొని ఆ విధంగా భౌతికజీవన క్లేశస్థితుల నుండి ఊరట పొందేటట్లు బోధ చేయడమే వారి లక్ష్యము.*

💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*"వేదమూర్తుల స్తుతులు" అను దశమస్కంధములోని భక్తివేదాంతభాష్యము ఇంకా వుంది*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦 
*☘️\!/సర్వం శ్రీకృష్ణార్పణమస్తు\!/☘️*

*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🦚🍁 🙏🕉️🙏 🍁🦚🍁

No comments:

Post a Comment