జూన్ 2025 కథామంజరి పత్రిక లో ప్రచురించబడిన నేను వ్రాసిన కథ
' బామ్మ పెట్టెలో పట్టుచీర '
బామ్మ పెట్టెలో పట్టుచీర
-------------------------------------
" ఇప్పుడు ఈవిడ గారికి ఏమి మునిగిపోయింది అని వీళ్లు ఊడిపడ్డారూ?
జరుగుబాటు ఉంటే జ్వరమంత సుఖం లేదని కొడుకుతో నాతో హాయిగా సేవలు చేయించుకుంటుంటే ఏదో నాలుగురోజుల జ్వరానికే చూడటానికి వచ్చేయాలా?" అంటూ తన అత్తగారిని చూడటానికి వచ్చిన ఆవిడ తమ్ముడినీ, ఆయన భార్యనీ తిట్టుకుంటూ బీరువా అంతా కలుగులో పండికొక్కు తవ్వి పోసినట్లు కెలికేస్తూ వెతికేస్తోంది అమరేశ్వరి.
"కొంచెం సేపట్లో వెళ్ళిపోతారు కదవే అమ్మా, భోజనం కూడా చేసే వచ్చామన్నారుగా, నువ్వెందుకు ఇంత ఖంగారు పడుతున్నావు?" అంటూ అమరేశ్వరిని విసుక్కుంది కూతురు సుమిత్ర.
విసుక్కోదు మరీ.. తను పుట్టింటికి వచ్చినప్పుడు ఎంత మంది చుట్టాలను కలిస్తే అంత ఆనందం సుమిత్రకి.
తరచూ తను కొనుక్కున్న కొత్త చీరలు, నగలు, తను భర్తతో కలిసి తిరిగిన ప్రదేశాలూ, అక్కడ తాము కలిపి నాకిన ఐస్ ఫ్రూట్లూ, కలిసి పీకిన గడ్డిపోచలూ అన్నీ ఫోటోలు తీసి, అవి అందరికీ చూపించి, అందరికన్నా తను ఎంత గొప్ప జీవితం గడుపుతున్నదో చాటుకోపోతే గోరుచుట్టు వచ్చినంత సలపరం వచ్చేస్తుంది ఆ అమ్మాయికి.
అప్పటికీ ప్రతీరోజూ కట్టిన చీర కట్టకుండా కట్టి, తను తుమ్మినా, చీదినా ఫోటోలు తీసుకుని, ఆ ఫోటోలు ఫేస్బుక్లో, ఇన్స్తాగ్రామ్లో పెడుతూనే ఉంటుంది. కానీ తమ బంధువుల్లో ముసలీ ముతకా ఎంత సేపటికీ బల్లుల్లా ఆ భక్తి టీవీలు పట్టుకు వేలాడేవాళ్ళే గానీ ఫేస్‌బుక్‌లు, ఇన్స్తాలూ చూసేవాళ్ళు తక్కువ.
అందుకే, మూడ్నెల్లకోసారి ఏదో ఒక వంక పెట్టుకుని వెయ్యి కిలోమీటర్ల పైన ప్రయాణం చేసి మరీ పుట్టింటికి వస్తుంది సుమిత్ర. వచ్చినప్పుడల్లా అందరినీ కలిసి తన గొప్పల ఎగ్జిబిషన్ నిర్వహించి వెళ్తుంది.
పనిలో పనిగా తల్లికి అటు బామ్మ మీద, ఇటు మరదలి మీద నూరిపోసి, వీలైనన్ని గొడవలు రాజేసి, ఆ ఇంట్లో ఏ ఇద్దరు అత్తా కోడళ్ళ మధ్యా సఖ్యత లేకుండా జాగ్రత్తలు చేసి, అలా అయితేనే పుట్టింట్లో తన స్థానం సుస్థిరం అనుకుని, ఆ విషయాన్ని అలా రూఢీ చేసుకుని మరీ పోతుంది సుమిత్ర.
గాడిద సంగీతానికి ఒంటె ‘ఓహో..’ అంటే, ఒంటె అందానికి గాడిద ‘ఆహా’ అన్నట్లు’, ‘ కూతురు తనని మించిన తెలివితో శోభిస్తూ, సవ్యసాచిలాగా తను ఒక చేత్తో అత్తగారిని ఇంకో చేత్తో కోడలినీ కంట్రోల్ చేయగలగడానికి క్రొంగొత్త సలహాలు ఇస్తూ ఉంటే మురిసి ముక్కలయ్యి, బ్యాగ్గుల నిండా చీరలు, పచ్చళ్ళు, పిండి వంటలు నింపి పంపిస్తూంటుంది అమరేశ్వరి.
పిల్లలకి ఆన్లైన్ క్లాసులు స్కూళ్ల వాళ్ళు ఇప్పుడు కనిపెట్టారు కానీ అసలీ ప్రక్రియకి ఆద్యురాలు ఎవరూ అని చరిత్రకారులు వెతికితే మాత్రం సుమిత్ర పేరే బయటకు వస్తుంది. ఎందుకంటే తను మళ్లీ వచ్చే లోపు అత్తా కోడళ్ల మధ్య తను రాజేసిన జ్వాలలు చల్లారిపోకుండా తల్లికి ప్రతి రోజూ ఫోన్ చేసి ఆన్లైన్లోనే అగ్గి ముట్టించి మరీ పోట్లాటల పాఠాలు చెప్తుంది ఆ నిత్యాగ్నిహోత్రురాలు!
ఆ అమ్మా కూతుళ్ళ రాజకీయాలు ఎదుర్కోవడం కాదు కదా,కనీసం అర్థం చేసుకునే శక్తి కూడా లేక ఉక్కిరిబిక్కిరై, ఆ టెన్షన్‌తో ఆరోగ్యం చెడగొట్టుకుంటున్న భార్య పద్మజను చూసి జాలేసి, దగ్గరా దాపుల్లో కాకుండా ఉద్యోగం చూసుకుని పారిపోయాడు అమరేశ్వరి కొడుకు భాస్కర్.
తన ప్రతాపానికి తట్టుకోలేక తమ్ముడూ మరదలు ఊరొదిలి పారిపోయినా ఊరుకోకుండా ' గొడుగు పడితే పిడుగుకి అడ్డమా ' అన్నట్లు ...
ఎప్పుడెప్పుడు వాళ్ళు తల్లిదండ్రుల్ని చూడడానికి వస్తారో తెలుసుకుని, తనూ అదే రోజుకి ఉల్కలా ఊడిపడి, ఉత్పాతాలు సృష్టించడం సుమిత్ర పార్ట్ టైం హాబీ.
అలాంటి ఒకానొక సందర్భంలో సుమిత్ర ఊడిపడ్డ టైమ్ లోనే పాపం సుమిత్రా వాళ్ళ ఎనభై ఏళ్ల బామ్మ ధనలక్ష్మమ్మకి జ్వరం వచ్చి, ఆవిడను చూడడానికి ఆవిడ తమ్ముడు ప్రకాశ రావు , ఆయన భార్య భాగ్యమ్మ రావడంతో సుమిత్రకి ఏనుగెక్కినంత సంబరంగా ఉంది.
రాగానే వాళ్ళకి తన టాబ్ లోవి ఓ వెయ్యి ఫోటోలు చూపించి, వివరించడం మొదలు పెట్టింది సుమిత్ర. కాసేపు తన అక్కయ్య తో మనసారా మాట్లాడుకుందాం అని వచ్చి, ఖర్మకాలి సుమిత్రకు చిక్కిన ప్రకాశరావు , వాళ్ళావిడా ఎటూ తప్పించుకునే మార్గం లేక, చచ్చినట్లు ఆ ఫొటోలు చూసీ చూసీ.. కళ్ళు మండి, నీళ్ళు కారి, చివరికి వాళ్లిద్దరి కళ్లు టమోటా పచ్చడి రంగులోకి మారి.... "మిగిలినవి కొంచెం సేపు ఆగి చూస్తాం" అని దణ్ణం పెట్టినంత పని చేయడంతో...
ఆ ముసలాళ్ళ మీద విసుగుతో కూడిన జాలితో చిన్న విరామం ఇచ్చి వచ్చింది సుమిత్ర.
ఒక అయిదారు వందల సెకన్ల తర్వాత ఇంకో వెయ్యి ఫోటోలు చూపిద్దాం , ఈ లోపు వాళ్ళు బామ్మతో మాట్లాడుకుంటారు అనుకుంటూ బెడ్ రూమ్‌లోకి వస్తే, ఇక్కడ తల్లి అమరేశ్వరి చుట్టాలు రావడాన్ని నిరసించడం సుమిత్ర కి నచ్చలేదు.
అంతే మరి, తల్లి అయితే మాత్రం... తన సరదాలకి అడ్డు పడితే ఎట్లా? తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే.
"ఇంతకీ నువ్వేం వెతుకుతున్నావు అంత హడావిడిగా, ఎందుకా ఖంగారూ?" అని తల్లిని గుసగుసగా గద్దించింది సుమిత్ర.
"అదేనే.. ఆ వచ్చినావిడకి పెట్టడానికి చీర కోసం వెతుకుతున్నాను. సమయానికి ఒక్క చీరా లేదు."
"ఇప్పుడు ఆవిడకి చీర ఎందుకు పెట్టాలి? ఒక జాకెట్ ముక్క పెడితే సరిపోతుంది గా ."
"అట్లా కాదులే.. ఏదో ఒకటి పెట్టాల్సిందే, క్రితంసారి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆవిడగారు బడాయిగా నాకు రెండు వేల రూపాయల గద్వాల్ చీర పెట్టింది. ఇప్పుడు నేను చీర పెట్టకపోతే మనకే చిన్నతనం" అన్నది, ఎవరి మంచిలోనించి అయినా చెడును వెతికి మరీ చూడగల అమరేశ్వరి.
"అయితే ... నీకు పిన్నీవాళ్ళు, అత్తయ్యవాళ్ళు పెట్టిన కొత్త చీరలు నాకు చూపించావుగా, వాటిల్లోది ఏదైనా పెట్టు " అంది సుమిత్ర .
"ఆ.. అంత ఖరీదైన చీరలు పెట్టడం ఎందుకే ఈవిడ మొహాన, ఆ చీరలు ఒక్కొక్కటి వెయ్యి, పదిహేనొందల దాకా ఉంటాయి, అందరికీ అంత ఖరీదైన చీరలు కట్టుకునే యోగ్యత ఉంటుందా ఏంటి?
ఈ భాగ్యం పిన్ని మా బాబాయికి మంచి ఉద్యోగo వచ్చినప్పటినుంచీ నడమంత్రపు సిరితో మిడిసిపడుతూ ఉంది కానీ పెళ్ళయినప్పుడు ఆవిడ గారి తాహతు ఏమిటో నాకు తెలీదూ! వెయ్యి రూపాయల చీర పెట్టడానికి అర్హత ఉన్న మొహమేనా అది?" అంది అంతకు ముందు ఆవిడతో రెండు వేల రూపాయల చీర పెట్టించుకున్న అమరేశ్వరి.
"అయితే... ఈ చీర పెట్టూ, ఇదేదో కొంచెం తక్కువ ఖరీదు చీరలా ఉంది "
"అదీ... వైభవలక్ష్మీ వ్రతం నోచుకుని, అన్నపూర్ణ ఆంటీ పెట్టిన చీరే. మేమిద్దరం ఎంత మంచి స్నేహితులమో నీకు తెలుసు కదా. అది అంత ప్రేమగా పెట్టిన చీర నేను ఈవిడకి పెట్టలేనే. నేనే కట్టుకుంటా.
అసలు ఎప్పుడూ ఇలాంటి వాళ్ళ కోసం మూణ్ణాలుగొందల్లో పెట్టుబడి చీరలు తెచ్చి ఇంట్లో రెడీగా ఉంచుకుంటా. మనం నిన్న షాపింగ్ కి వెళ్ళినప్పుడు అవి కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ, మన ఇద్దరి షాపింగ్ అంతా పట్టుచీరల సెక్షన్ లోనే అయ్యిందాయే. మనిద్దరికీ చీరలు సెలెక్ట్ చేసేప్పటికే మన ఓపికలు అయిపోయాయి, ఇంక ఆ పెట్టుబడి చీరల వైపుకే పోకపోతిమి" నిట్టూరుస్తూ అంది అమరేశ్వరి.
"అమ్మా, ఈ చీర చూడు, ఏదో తక్కువ ఖరీదు చీరలానే ఉంది" అంటూ బీరువా లోంచి ఒక చీర బయటకి తీసింది సుమిత్ర.
"అదా, అది తక్కువ ఖరీదు చీరే కానీ ఆ రంగు నాకు నచ్చింది, అందుకే నా కోసం ఉంచుకున్నా అది"
ఇంతలో.."అమ్మాయ్ మంథర, వాళ్ళు బయల్దేరతాం అంటున్నారు, మీ అమ్మకు చెప్పు" అంటూ బెడ్రూం గుమ్మం దగ్గరికి వచ్చి, కోడలు గుడ్లురిమినట్లు చూడడంతో గుమ్మం దగ్గరే ఆగిపోయింది బామ్మ గారు.
అంతే మరి! ఇష్టం వచ్చినట్టు ఇల్లంతా తిరిగే హక్కు లేదు అమరేశ్వరి హయాంలో ధనలక్ష్మమ్మకి!
ఆవిడ మంచం ఏ గదిలో ఏ మూలన ఉందో అక్కడే పడిఉండాలి ఆవిడ. భోజనం వేళకి పిలిస్తే పెట్టింది తిని, మళ్లీ కుక్కిన పేనులా కుక్కి మంచంలో ఉండాలి. ఏదో చుట్టాలు వచ్చినప్పుడే ఆ కాసేపు అలా హాల్లొకి వచ్చి మాట్లాడే అవకాశం ధనలక్ష్మమ్మకి, ఎప్పుడైనా అమరేశ్వరి బయటకు వెళ్ళినప్పుడు మాత్రం రెక్కలొచ్చిన పక్షిలా ఇల్లంతా స్వేచ్చగా తిరుగుతూ, హాయిగా తన కొడుకుతో కబుర్లు చెప్పుకుంటుంది ధనలక్ష్మమ్మ
పెళ్లయ్యాక అత్తగారింటి సంప్రదాయం పేరుతో తన తల్లి పెట్టిన ఓల్డ్ ఫ్యాషన్డ్ పేరు తీసేసి ' మందిర' గా తన పేరు మార్చుకుంది సుమిత్ర.
అంతకు ముందే సుమిత్ర బుద్ధులు కనిపెట్టి, ‘‘ వాళ్ళమ్మ రామాయణంలో అంత మంచి పాత్ర పేరు దీనికి పెట్టి ఆ పేరుని చెడగొట్టింది కానీ అసలు ఏ మంథర అనో శూర్పణఖ అనో పెడితే దీని చుప్పనాతి తనానికి సరిగ్గా సరిపోయేది‘‘ అని తన మనసులో ఎప్పుడూ అనుకునే ధనలక్ష్మమ్మ , మారిన పేరు నోరు తిరగటం లేదనే వంకతో సుమిత్రని మందిర బదులు మంథర అనే పిలుస్తూ ఉంటుంది.
ఇప్పుడు చుట్టాలున్నారు అన్న అలుసుతో అత్తగారు హద్దులు మీరి తన బెడ్రూమ్ లోకి ప్రవేశింపచూసిందని అమరేశ్వరికీ, ఎన్ని సార్లు చెప్పినా తనను మంధర అనే పిలుస్తుంది అని సుమిత్రకీ ధనలక్ష్మమ్మ మీద వళ్ళు మండిపోయింది.
"ఈవిడ సంగతి తర్వాత చూద్దాం కానీ, అవతల వాళ్ళు బయలుదేరతాం అంటున్నారు, ఇప్పుడేం చేద్దాం?" అని తల పట్టుకుని కూర్చుంది అమరేశ్వరి.
మొన్నే ఎవరో బంధువుల ఇంటికి వెళ్ళినపపుడు వాళ్ళు తనకి పెట్టిన పెట్టుడు చీర, ఇప్పుడు అవసరానికి ఇవ్వమని తల్లి అడుగుతుందేమో అని అనుమానం వచ్చి, తన దగ్గర ఉంటే తనే ఎవరికైనా పెట్టడానికి వాడుకోవచ్చు కదా అని, "నా దగ్గరున్న చీర ఇచ్చేదాన్ని కానీ ఆ చీర నిన్న రాత్రి వీడియో కాల్లో చూసి 'చాలా బాగుంటుంది నీకు, నువ్వే కట్టుకో, ఎవరికి పెట్టకు' అన్నారమ్మా మీ అల్లుడు" అంటూ ముందర కాళ్ళకి బంధం వేసింది, అంతకు ముందు రోజే ముప్పయి వేలు పెట్టి తల్లితో మూడు పట్టుచీరలు కొనిపించుకున్న కూతురు.
ఇంకా బీరువా వైపు చూస్తూ ఆలోచిస్తున్న తల్లితో,
"ఈ బీరువాలో అయితే ఏం లేవుగా, ఆ రెండో బెడ్ రూంలో ఇంకో బీరువాలో కూడా నీ చీరలు కొన్ని పెట్టావుగా, అందులో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం పదా, ఆ బీరువా కీస్ తీసుకో" అంటూ లేచింది సుమిత్ర.
'రెండో బెడ్రూం 'అనగానే ఏదో గుర్తు వచ్చి అమరేశ్వరి కళ్లు మెరిసాయి.
అమరేశ్వరికి గుర్తొచ్చింది ఆ గదిలోని తన బీరువాలో పెట్టుడు చీర ఉన్నదని కాదు, ఆ గదిలోని ఓ పెట్టెలో ఏకంగా ఓ పట్టు చీర ఉన్నదని!
కానీ ఆ పెట్టే తనది కాదు, తన అత్త గారిది!!
ధనలక్ష్మమ్మకి ఆవిడ అన్నయ్య, తన మనవడి పెళ్ళిలో పెట్టిన కంచిపట్టు చీర అది. ఆ అన్నయ్య ఆ తర్వాత కొన్ని రోజులకే వెళ్లిపోయిన బాధతో ఆ చీర ఇంకా కట్టుకోని బామ్మ గారు, ఆ చీరను అన్నయ్య జ్ఞాపకార్థంగా ఉంచుకుని, కడుపుతో ఉన్న పద్మజ ప్రసవించాక "మునిమనవడి బారసాలలో కట్టుకుంటా" అంటూ పదిలంగా ఉంచుకున్నారు.
ఆ చీర ధనలక్ష్మమ్మ చేతిలో చూసిన మొదటి క్షణం నుండి అమరేశ్వరి మనసు కుతకుతలాడిపోతోంది. తనకి ఎంతో ఇష్టమైన చంద్రకాంతం రంగు చీరా, అందునా కంచి పట్టు చీర, అత్తగారి దగ్గర ఉండటం భరించలేకపోతోంది.
అలా అని అమరేశ్వరి దగ్గర అలాంటివి లేక కాదు, అంత కన్నా ఖరీదైనవి, అలాంటి రంగుల్లో ఎన్నెన్నో ఉన్నాయి.
అయినా సరే.. అత్తగారి దగ్గర ఉండకూడదు, అంతే!
"అసలు కోడళ్ళ దగ్గర అత్త గార్లు ఎంత అణిగి మణిగి ఉండాలి?
కొంత మంది తెలివైనవాళ్లైతే అరగదని వంక పెట్టి, ఒక్కపూటే అన్నం పెడతారు ముసలి అత్తగార్లకి. అప్పుడే ఓపిక లేక కిక్కురు మనకుండా పడిఉంటారు ఈ అత్తగార్లు. పోనీ తనూ అలా చేద్దామంటే, తన మొగుడు పనీ పాటా లేకుండా రెండు పూట్లా తనే తల్లి గారికి వడ్డించి, దగ్గరుండి తినిపిస్తాడాయే. అందుకే ఈవిడ గారు ఇలా పట్టు చీరలు కడదామని చూస్తోంది.
తన ముందు ఆవిడ పట్టు చీరలు కడితే ఇంక తనకీ ఆవిడకి తేడా ఏముంది, తన పెత్తనానికి విలువ ఏముంది? ‘‘ ఇవీ అమరేశ్వరి ఆలోచనలు.
పైగా అమరేశ్వరి రాజ్యాంగం ప్రకారం తన బంధువులు తమ ఇంట్లో ఎవరికి ఏ బహుమతులు ఇచ్చినా వాటన్నిటి మీదా సంపూర్ణ హక్కులు అమరేశ్వరివే.
ఈ మధ్యే కొడుకు కోడలు అదే వూళ్ళో ఇల్లు కొనుక్కుని గృహ ప్రవేశం చేసుకుంటే.. ఆ ఫంక్షన్లో కొడుకు కోడలుకి తన తరపు బంధువులు బొట్టు పెట్టి ఇచ్చిన గిఫ్ట్‌లు అన్నీ ‘ నా బంధువులు ఇచ్చినవి అన్నీ నావే" అంటూ పద్మజ చేతిలో నుంచి లాక్కుని, తీసేసుకుంది.
అదే రూల్ అత్తగారి దగ్గర అమలు చేయలేకపోతోంది అమరేశ్వరి. ఎందుకంటే తన బంధువులు అందరూ తన కంటే ముందు, తన మేనత్తే అయిన తన అత్తగారికి బంధువులు అయ్యారాయే.
అందుకే తన అత్తగారికి అన్న అయిన తన పెదనాన్న ఆవిడకు ఆ పట్టుచీర పెట్టినప్పటి నుండి ఏమీ చేయలేక రగిలిపోతోంది.
ఇప్పుడు కూతురు 'ఆ రూమ్‌లో చీర' అనగానే చుట్టాలకి పెట్టడానికి అత్త గారి పట్టు చీర వాడేస్తే పీడా పోతుంది అనిపించింది అమరేశ్వరికి!
అందుకే.. ఒక్క అంగలో కూతురిని చేరి, బుగ్గలు లాగి ముద్దు పెట్టుకుంది.
"మా బంగారు తల్లే.. నీ బుర్రే బుర్ర... భలే ఐడియాలు చెప్తావు" అంటూ సుమిత్ర బుగ్గలు లాగి ముద్దు పెట్టుకుంది.
అంత ముద్దులు పెట్టుకునేంత గొప్ప ఐడియా తనేం ఇచ్చిందో తనకే అర్థం కాక
" నేనేం చెప్పానే అమ్మా!" అని ఆశ్చర్య పోయింది సుమిత్ర.
"నువ్వు తెలిసే చెప్పాలటే.ఆ అమ్మవారు నీ నోటితో అలా పలికిస్తుంది. చేతిలో వెన్న పెట్టుకుని నేతి కోసం ఊరంతా వెతుకుతున్నా ఇందాకట్నించీ" అంటూ, తను చేయబోయే పాపిష్టి పని తాలూకు అపరాధభావం తన మనసులో ఏ మూలా లేకుండా, ఆ పాపభారం అంతా అమ్మవారి మీద ముందుగానే వేసేసింది అమరేశ్వరి.
విషయం తెలుసుకుని, "ఇంట్లో పడి ఉండాల్సిన ఆ ముసలి దానికి ఎందుకే అంత మంచి చీర?, తీసి ఈవిడకి పెట్టేద్దాం. ఏం చేస్తుందట బామ్మ?"రెచ్చగొట్టింది సుమిత్ర.
"అవును. కానీ, అడిగితే ఇవ్వదు. అన్న, దున్న అనుకుంటూ గోల చేస్తుంది . అందుకే తెలీకుండా ఆ గదిలోకి వెళ్లి తీసేద్దాం. అక్కడే మంచంకి గోడకు మధ్య పెడుతుంది తన ట్రంకు పెట్టె."
"మరి నీ కోడలు లగేజీ ఆ గదిలోనే పెట్టుకుందిగా, మనం చీర తీస్తుంటే అటు వచ్చి చూసేస్తుందేమో?"
"మనం ఆ గదిలోకి వెళ్లే ముందే టీ పెట్టమని ఆ పిల్లకి చెప్తా, అది వంటింట్లో ఆ పనిలో ఉంటుంది. ఈ లోపు మనం ఆ బెడ్రూంలోకి వెళ్ళి చీర తెచ్చేద్దాం." అంటూ...
అలమరాల నిండా ఖరీదైన పట్టు చీరలు ఉన్న ఇద్దరూ ఆ ఎనభై ఏళ్ల ముసలావిడ తన అన్న గుర్తుగా దాచుకున్న ఒక్కగానొక్క పట్టుచీరను దొంగిలించడానికి ఉద్యుక్తులయ్యారు.
అనుకున్న ప్లాన్ ప్రకారం, పద్మజను టీ పెట్టమని, బామ్మ హాల్లో చుట్టాలతో మాట్లాడుతుండగా, వంటింటికీ- రెండో బెడ్రూంకి కలిపి ఉన్న బాల్కనీ ద్వారా ఆ బెడ్రూంలోకి వెళ్ళి, హాల్లో ఉన్న బామ్మ కన్నుగప్పి, మెల్లిగా ఆ గదికీ , హాల్ కీ మథ్య ఉన్న తలుపు వేశారు.
సుమిత్ర కబడ్డీ ప్లేయర్ లాగా ఒక్క దూకు మంచం మీదకు దూకి, మంచం సందులోని పెట్టెను తీస్తోంది.
అమరేశ్వరి ఆనందంతో మురిసి పోతోంది.
"చంద్రకాంతం రంగు పట్టచీర కడతావా అత్తా?
పైగా ముది మనవడి బారాసాలలో!
ఇప్పుడు కట్టు ఏం కడతావో!
నీ చీర పిన్నికి పెట్టేస్తా,
పట్టుచీర పెట్టేంత ప్రేమ వాళ్ళ మీద ఉన్న దానిలా బాబాయ్ దగ్గర పేరు తెచ్చుకుంటా.
ఇంటికి వచ్చిన వారికి పట్టుచీరలు పెట్టగలిగే అంత గొప్ప దానిగా నా ఐశ్వర్యం చూపించి, ఆ భాగ్యం పిన్ని కడుపు మండేట్లూ చేస్తా.
ఒక్క దెబ్బకి రెండు, కాదు మూడు పిట్టలు" అనుకుని మురిసిపోతూ తనలో తనే నవ్వుకుంటోంది అమరేశ్వరి.
"అమ్మా!" అంటూ దీన స్వరంతో పిలుస్తున్న సుమిత్ర గొంతుతో ఈ లోకంలోకి వచ్చింది అమరేశ్వరి.
"ఆ, తీసావా? కనిపించిందా? చంద్ర కాంతం రంగు పట్టుచీరా" అంటూ ఆత్రంగా అడిగింది అమరేశ్వరి.
"ఏంటి తీసేది? ముసలిది ఏం చేసిందో చూడు" అంటూ పెట్టెను చూపించింది సుమిత్ర.
బామ్మ తన పెట్టెకు వేసిన తాళం కప్ప తళతళా మెరుస్తూ తల్లీ కూతుళ్ళను వెక్కిరిస్తోంది.
"ఆ ! అయ్యో అయ్యో! చూసావే మీ బామ్మ అఘాయిత్యం, ఇంట్లోనే తాళం వేసుకుంటుందా? ఎంత స్వార్థ పరురాలు?"
"అయినా ఈవిడ గారి ఆస్తులు దోచుకెళ్ళే దొంగలు ఇక్కడ ఎవరున్నారని ఈవిడ ఉద్దేశ్యం?
"వయసు వచ్చింది కానీ బుధ్ధి జ్ఞానం లేదు" అనుకుంటూ...
తమకు తగిలే తిట్లు అన్నీ తామే తిట్టుకుంటూ నీరసంగా మంచం మీద కూలబడ్డారు అమ్మా కూతుళ్ళు.
ఎప్పుడూ టీ తాగని అత్తగారు ఈ రోజు టీ పెట్టమంది, తనకి కూడా టీ పెట్టమందా లేక వేరుగా కాఫీ కలపాలా అని అనుమానం వచ్చి, కనుక్కుందామని అత్తగారిని వెతుక్కుంటూ వచ్చిన పద్మజ బాల్కనీలోనుంచే అంతా విని అర్థం చేసుకుని, "అక్కడ ఉన్నది నేను అనుకున్నారా, మీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికీ, మీ కుళ్ళు తెలివితేటలతో గెలవడానికీనూ, తాడిని తన్నే వాడుంటే వాడి తల తన్నేవాడూ ఉంటాడంటే ఇదేనేమో," అనుకుని నవ్వుకుంటూ కిచెన్‌లోకి వెళ్లిపోయింది.
సుమిత్ర వేశాననుకుని హడావిడిలో సరిగా వేయని తలుపు సందులోంచి జరిగేదంతా ఓ కంట కనిబెడుతున్న సూక్ష్మ గ్రాహి ధనలక్ష్మమ్మ..
"ఓసి దొంగ మొహాల్లారా నా చీరకే ఎసరు పెడదాం అనుకున్నారా?"
"ఒసే అమరీ! నిన్ను పుట్టినప్పటినుంచీ చూసిన నీ మేనత్తనే నేను, నీ బుద్ధులూ , నీ కూతురి బుధ్దులూ నాకు తెలీవా, అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నా.
అయినా నీకు తెలిసి చావదు గానీ.. నీకు ఆ చీర నచ్చిందని నాకు తెలుసే. ' కూన అని పెంచితే గండు అయ్యి కరవవచ్చింది ' అన్నట్లు అత్తగారినని నా పై నువ్వు కచ్చ పెట్టుకున్నావు కానీ, చిన్నప్పటి నుండి నిన్ను ఎత్తుకు పెంచిన దాన్ని, నీ పై నా ప్రేమ పోతుందా?
నీకా రంగు అంటే ఇష్టమని నాకు తెలీదా, అందుకే రాబోయే శుక్రవారం నీ పుట్టిన రోజున నీకా చీర ఇచ్చేసి కట్టుకోమందాం అనుకున్నా. నీకు నా ప్రేమ అర్థమై ఏడిస్తేగా.
ముందే ఇస్తే ఆ మంధర నిన్ను బురిడీ కొట్టించి నీకు లేకుండా ఎత్తుకు పోతుందని పుట్టిన రోజు వరకూ నా దగ్గరే ఉంచుకుని ఇద్దాము అని ఉంచా.
దానికి ఎన్ని ఉన్నా పక్కవాళ్ళ వాటి మీదే కన్నాయే! దాని విషయం వచ్చేసరికి నీకూ ఉచ్చం నీచం తెలియవు. మీ ఇద్దరూ కలసి ఇలాంటి ముదనష్టపు పనేదో చేస్తారనే నా పెట్టెకు తాళం వేసి పెట్టుకున్నా "
అనుకుంటూ నవ్వుకుంది.
అయితే అక్కడ బామ్మ, పద్మజ నవ్వుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ నవ్వుతున్న వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు.
ఎవరంటే....
"అంతా అమ్మవారి దయ" అంటూ, మహా భక్తురాలి ఫోజులో, తను చేయబోయిన తప్పుడు పని తాలూకు పాపాన్ని అంతా అమరేశ్వరి ఎవరి మీద అయితే మోపబోయిందో ఆ అమ్మవారు!
"భలే! నీ జాగ్రత్తతో నీ చీర కాపాడుకోవడమే కాక, చెడ్డ వారికీ, చెడ్డ పనులకూ నా తోడు ఉండదని ఆ మూర్ఖురాలికి తెలిసేలా చేశావ్" అని బామ్మను ప్రశంసిస్తూ, ఆ రూమ్ లోని క్యాలెండర్‌లోని ఫోటోలోనుంచి చూస్తూ హాయిగా నవ్వుతున్నారు అమ్మవారు.
Sekarana
No comments:
Post a Comment