Sunday, August 17, 2025

 *ముకుందా! ముకుందా!!* 

*"కృష్ణుడు అందగాడు. గోపికల మనసుల్ని దోచిన వెన్న దొంగ, రాధతో దోబూచులాడే కొంటెవాడు"... అనుకుంటూ భక్తి పారవశ్యంలో నాట్యం చేస్తూ గొంతెత్తి హరి నామాన్ని ఆలపించే భక్తాగ్రేసరులకు వందనాలు. వారెంతో ధన్యులు. కానీ ఆధునిక యుగంలో ఈ 'రాధాకృష్ణ' ప్రేమ తత్త్వానికి పెడర్థాలు జొప్పించి, గంతులు వేస్తూ, కేకలు పెట్టడం ఏమాత్రం బాగాలేదు.*

*శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు అన్న విషయం మరిపించే ఈ 'రాసలీల' వర్ణన గురించి స్వామి వివేకానంద ఇలా అన్నారు: "హృదయంలో లవలేశమైనా కామవాసన ఉన్నంతవరకు ప్రేమకు తావులేదు. మహాత్యాగధనులైన పురుషశ్రేష్ఠులే ఆ దివ్యప్రేమకు అధికారులు. ఆ మహోత్తమమైన ప్రేమాదర్శాన్ని సామాన్యప్రజానీకానికి బోధిస్తే అది వారి హృదయాలలో ఆధిపత్యం చేస్తున్న కాముకత్వాన్నే తెలియకుండా రేకెత్తిస్తుంది... ప్రస్తుతం మన జాతి యొక్క స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే అటువంటి* *ప్రయత్నం వల్ల కలిగిన ఫలితమేమిటో చూడండి. ఆ ప్రేమను నలుదిక్కులా బోధించడం వల్ల జాతి పూర్తిగా ఆడంగితనానికి వచ్చింది.*

*"తపస్వులు, జ్ఞానులు, పండితులు, కర్మాచరణ తత్పరులు - వీరందరి కంటే 'యోగి' గొప్పవాడు. అందుకే నువ్వు యోగివి అవ్వు" అని అర్జునుడికి ఇచ్చిన గీతా ప్రవచనం మరిచిపోయాం! శ్రీకృష్ణుడి వ్యక్తిత్వం మన జీవితాలకు 'ఉద్దీపనా శక్తి'. ఒక్కసారి మాయతెరను (రాసలీల) తొలగించుకొని ఆ పరమాత్ముని జీవితంలోకి తొంగిచూద్దాం!*

*ఉత్తమ సాధకుడుగా శ్రీకృష్ణుడు ఏ కొంచెం తలనొప్పి వచ్చినా ఆ రోజు మనం ఆధ్యాత్మిక సాధనలకు స్వస్తి చెప్తాం. కానీ మన గీతాచార్యుడి అకుంఠిత దీక్షను పరికించండి.*

*రాయబారానికి కురుసభకు వెళుతున్నాడు కృష్ణభగవానుడు. సంధ్యా సమయం. నది దగ్గర రథాన్ని ఆపి, కాళ్ళు చేతులు కడుక్కొని ధ్యానానికి కూర్చున్నాడు. ఇది అంత గొప్పగా అనిపించకపోవచ్చు మనకు.*

*మహాభారత యుద్ధం - అభిమన్యుడి మరణం వలన అర్జునుడి శోకానికి అంతులేదు. సాయం సమయం. అర్జునుడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో నాతో కూర్చొని ధ్యానం చేయి. ఇలా అంటాడు: "ఇది విలపించవలసిన సమయం కాదు. జరిగిపోయినదాని గురించి, రేపు చేయవలసినదాని గురించి తరువాత మాట్లాడుకుందాం.”*

*శ్రీకృష్ణుని వినయశీలత :- ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగానికి పాండవులు శ్రీకృష్ణుణ్ణి నియమించారు. ఆయన మాత్రం అతిథుల కాళ్ళు కడగటంలో నిమగ్నులయ్యారు. అలాగే 'కుచేలోపాఖ్యానం'... ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకృష్ణుని వినయశీలతను తెలిపే సన్నివేశాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో!*

*కాబట్టి మనం కూడా ఎంత ఉన్నత స్థాయికి చేరినా వినయాన్ని కలిగివుందాం. ఎన్ని విధుల్లో తలమునకలై ఉన్నా ధ్యాన సాధనలు అభ్యసించి యోగులమవడానికి ప్రయత్నిద్దాం! పరమాత్ముని 'విశ్వరూప' దర్శనానికి 'యోగ్యత' సంపాదిద్దాం!*

*┈┉┅━❀꧁హరేకృష్ణ꧂❀━┅┉┈*
        *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🕉️🌺🚩 🙏🕉️🙏 🚩🌺🕉️

No comments:

Post a Comment