Sunday, August 17, 2025

ఏది మర్చిపోవాలి~~ఏది జ్ఞాపకం పెట్టుకోవాలి

 ఏది మర్చిపోవాలి~~ఏది జ్ఞాపకం పెట్టుకోవాలి

మన ఈ జన్మలో ఎన్నో చేశాము, 
ఎన్నో అనుభవించాము. 
కొన్ని సంవత్సరాలు గడిచాక మనకి ఏవి గుర్తుకు రావు, 
వాటిలో కొన్నింటిని పదే పదే మనం జ్ఞాపకం చేసుకుంటే తప్ప. 
అంటె మనకి మరుపు సహజం. 

అన్ని మర్చి పోతాము, 

ఒక్క పగ తప్ప. 
మనకి ఇతరులు చేసిన మేలు మర్చిపోతాము, 

కీడు మాత్రం మరవం, 
మాటి మాటికి జ్ఞాపకం తెచ్చుకుంటాము. 

మనము ఇతరులకి చేసిన హాని మర్చిపోతాము, మేలు మాత్రం గుర్తు చేసుకోవడమే కాకుండా, 
వీలైతే ప్రతిఒక్కరికి రోజు చెప్పికుంటాం. 

ఇది మరుపు, జ్ఞప్తి కి సంభందించిన విషయము. 

మరుపు గొప్ప వరం అంటారు.
నిజమే, 
కానీ మనకి ఇతరులు చేసిన కీడు మర్చిపోతే,
అది వరం. 

మనకు జరిగిన బాధాకరమైన విషయం మర్చిపోతే అది వరం, 
ఇతరులకి చేసిన మేలు మర్చిపోతే అది వరం, ఇతరుల పై పగ పెంచే విషయాలను మర్చిపోవడం ఒక వరం. 

అయితే చేసున్న పని లో మరుపు రావడం మాత్రం దుర్మార్గం. 
ఇదేంటి, ఇదేలా సాధ్యం అంటున్నారా, 
ఒక పని చేస్తూ, మనస్సు వేరే దాని గురించి ఆలోచించడం మరుపు. 

ఇది ఎరుక లేని స్థితి. 
ఇది మహా ప్రమాదకరమైనది. 
మరుపు తమో గుణ లక్షణం అయితే 
ఎరుక సత్వ గుణ లక్షణము.

ఏవి మరవాలి ప్రయత్న పూర్వకంగా అంటె,

1) మనకి ఏ మాత్రం అవసరం లేనివి, 
ఇతరులు తమకు అక్కరలేదని పారేసినవి మనం గుర్తు పెట్టుకోకూడదు. 

ఇదేంటి అంటున్నారా. 
వారు వారికి అక్కరలేనిది పని కట్టుకొని,  మన చెవిలో రోజు నూరి పోస్తారు, అదేమో వారు మర్చిపోతారు మనం జ్ఞాపకం పెట్టుకుంటాము.

2) జీవితంలో మనకి జరిగిన ప్రతికూల ఘటనలు మర్చి పోవాలి, వీటిని జ్ఞాపకం పెట్టుకోవడం వల్ల మనలో ప్రతికూలత స్వభావం పెరగడం తప్ప వేరే లాభం లేదు.

3) మనకు ఇతరులు చేసిన కీడు, అన్యాయం, నష్టం, అవమానం ఇవన్నీ మర్చి పోవాలి

ఎందుకంటే ఇవి మనలో పగ పెంచుతాయి తప్ప ఇంకేమి ఉపయోగం లేదు.

సరే మరి ఏవి ప్రయత్న పూర్వకంగా జ్ఞాపకం పెట్టుకోవాలి అంటె

1) మన వృత్తిలో కావాల్సిన నైపుణ్యం కి సంబందించిన జ్ఞానము గుర్తు పెట్టుకోవాలి.

2) లౌకిక జ్ఞానం కి సంబందించిన విషయాలు, బాహ్య జీవితానికి కావాల్సిన కనీస సమాచారం ఎప్పుడు గుర్తుకు ఉండాలి

3) నేను ఈ దేహాన్ని కాదు, నాకు అహంకారము  ఉండాల్సిన పని లేదు. 

అన్ని నాకు చెప్పే చెయ్యాలి, 
నేను చెప్పినట్టు జరగాలి, 
నాకు ఇష్టం లేనిది ఎవ్వరు చేయకూడదు, 
నాకు ఇష్టమైనది మాత్రమే చేయాలి, 
నేను తప్ప అందరికి దిక్కు లేదు, 
నేను చేసిన మేలు, 
మేలు పొందిన వాడు మరువకూడదు, 
ఇదిగో ఇలా ఉంటుంది అహంకారము.

4) దేని పైనా మమకారం ఉంచుకోకూడదు అన్నది గుర్తుకి ఉండాలి. 

మమకారం బంధం అని, 
మమత్వం బదులు, 
బాధ్యత అని గుర్తుకి ఉండాలి. 
మమకారం మనకు వస్తువుల పట్ల, 
వ్యక్తుల పట్ల, 
సంపదల పట్ల, 
ప్రదేశం పట్ల ఉంటుంది. 

ఈ మమకారం మనకి బంధమే తప్ప ఇంకేమి లాభం లేదు. 
వీటి పట్ల నిర్లిప్తతతో మన కర్తవ్య నిర్వాహణ బాధ్యత అనిపించుకుంటుంది,

అంతే కాని,  
అవి భవిష్యత్తులో మనకి ఉపయోగ పడతాయి అన్న ఊహ మమకారానికి కారణం అవుతుంది. 

ఇవి లేక పోతే,  నా జీవితం లేదు అనుకుంటే మమకారముకి కారణం అవుతుంది. 
అవి దూరం కాకూడదు,  
అన్న భావం మమకారానికి కారణం అవుతుంది.

5) పరమాత్మని మరవకూడదు, 
మనము తీసుకునే ప్రతి శ్వాసలో ఆయనతో అనుసంధానం కావలి

వీలైతే ఆయనని నామ రూప గుణ రహితుడుగా, 
సర్వ వ్యాప్తి గా, 
ప్రేమ మూర్తి గా, 
మౌన ప్రియుడు గా 
గుర్తు పెట్టుకోవాలి. 

ఇదే మనకి ఎప్పుడు స్మృతి పదం లో మెలగాలి. 

ఇలా వీలు కాకపోతే, 
ఆ పరమాత్మకి,  ఎదో మనకి నచ్చిన రూపము, (వీలైతే ఇంతకు ముందే ప్రాచుర్యము పొందిన రూపము, ) 
ఆ రూపానికి ఉన్న నామం గుర్తు పెట్టుకోవాలి. 

ఈ రూపం, నామము మాత్రం మార్చకూడదు. 

ఇలా మనం ఏర్పర్చుకొన్న పరమాత్మ స్వరూపము మన వ్యక్తిగతం. Personal god. 
ఇది అందరూ ఆమోదించాలి అన్న మూర్ఖత్వం మాత్రం ఉండకూడదు.

సేకరణ 

🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺

No comments:

Post a Comment