Sunday, August 17, 2025

 *నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి...!!*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

*శ్రీ కృష్ణాష్టమి పండుగ విశిష్టత ఏంటి ?  విధానం ఏంటి ?*

కృష్ణుడి జీవితమే ఒక మానవ జీవన అనుభవసారం.. మూర్తీ భవించిన వ్యక్తిత్వ వికాసం.. 
శ్రీకృష్ణుని రూపం నల్లనిది.. మనసు మాత్రం వెన్న పూసలా తెల్లనిది..  దేనికీ భయపడని వ్యక్తిత్వంతో చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధించాడు.. నమ్మిన వారికి కొండంత అండగా నిలిచాడు.
అసలు కృష్ణుడంటేనే అలౌకిక ఆనందానికి ప్రతిరూపం..  సచ్చిదానంద రూపం.. సత్‌చిత్ ఆనంద స్వరూపం.. పాపాల్ని నాశనం చేసేదే కృష్ణ తత్వం.. 

కృష్ఱుడి పేరు తలుచుకుంటేనే అమరత్వం సిద్ధిస్తుంది.. జవసత్వాలు ఉట్టి పడతాయి.. కృష్ణ నామం కర్ణపేయంగా ఉంటుంది..

శ్రీకృష్ణుడు, హిందూమతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు యొక్క పది అవతారాలలో ఎనిమిదవ అవతారము. 

నందన నామ సంవత్సర దక్షిణాయాన వర్ష బుుతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాలుగో పాదాన గురువారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల దంపతులకు శ్రీకృష్ణుడు జన్మించాడు.

అందరికి అన్ని తానే అయ్యి...
మన పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాధలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సాంప్రదాయాల లోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు. 

చిలిపి బాలునిగాను, పశువుల కాపరిగాను, రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గొపికల మనసు దొచుకున్నవాడిగాను,

యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోప దేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి. 

కాని ఆ శ్రీకృష్ణుని గురించి ఇంకా ఎన్నో విశేషాలు తెలుసుకో వలసినవి మిగిలిపోతూనే ఉంటాయి, ఉన్నాయి.

       *వెన్న ముద్దల దొంగ..*

ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్న ముద్దలు దొంగిలిస్తూ వెన్న దొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్న ముద్దల దొంగతనంలోమానవులకు అందని దేవరహస్యం ఉందట. వెన్న జ్జానికి సంకేతంగా చెపుతుంటారు మన పెద్దలు.

శ్రీకృష్ణుని తత్వం చాలా గొప్పది. బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. వెన్న ముద్దలు ఎక్కువ, ఇష్టంగా తినేవాడు. 

వెన్న జ్ఞానానికి సంకేతం. వెన్న నల్లని కుండలలో కదా ఉండేది. ఆజ్ఞానికి సంకేతం నల్లని కుండ, వెలుగుకు, విజ్ఞానానికి చిహ్నం తెల్లని వెన్న.తన భక్తుల మనసులోని ఆజ్ఞానమనే చీకటిని తోలగించి, జ్ఞానమనే వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు.

*అంతా క్రిష్ణమయం..*

ఎందుకు మహిళలు కృష్ణ తత్వం ఎక్కువ ఇష్టపడతారంటే అందులో ప్రతీదీ సున్నితత్వం, ఆరాధనే దాని తత్త్వం.కృష్ణ తత్వం చదివిన వారికి నిజమైన ప్రేమ తత్వం తెలుస్తుంది. గోపాలుడు ఎక్కడా మహిళలతో పరుషముగా మాట్లాడినట్లు మనము చూడము. 

రుక్మిణి దేవి యొక్క భక్తి ఆరాధనను, సత్యభామ యొక్క గడసరి తనం, శక్తివంతమైన మహిళగా ఆమెపట్ల కూడా అదే సున్నితత్వం కనబరచడం లాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు. 

అందుకే మహిళలు ఎప్పుడు అచలంచల ప్రేమతో అత్యంత సహనంతో జయించే కృష్ణ తత్వంను ఇష్టపడతారు. ప్రజల దృష్టిలో ఎంత వీరుడు ధీరుడు మహా దేవుడు అయినా కూడ ఏ ప్రత్యేకత లేకుండా ఇంట్లో అత్యంత సాధారణంగా ఉండగలగడం ఆ కృష్ణ పరమాత్మకే చెల్లింది.

    *_రంగులమయం._*

నెమలి పింఛంలో ఏడు రంగులు ఉంటాయి. ప్రకృతిలో కనిపించే రంగులన్నీ ఈ ఏడు వర్ణాల సమాహారమే. అంతేకాదు లోకమంతా విస్తరించి ఉన్న ఆకాశం పగటి వేళ నీలవర్ణంతో, రాత్రివేళల్లో నల్లనివర్ణంతో ప్రకాశిస్తుంది. 

ఇన్ని రంగుల సమాహారమే ఆకాశం. సూర్యోదయంలో ఒక రంగు, సూర్యాస్తమయంలో మరొక రంగు కనిపిస్తుంది. ఈ రంగులన్నీ కాలానికి సంకేతం. కృష్ణపక్షం, శుక్లపక్షం అనే విభాగాలుగా చూసినా, కాలమంతా రంగులమయంగా కనిపిస్తుంది. 

ఇవన్నీ నెమలి పింఛంలో కనిపిస్తాయి. ఆ కాలానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు నెమలి పించాన్ని ధరిస్తాడు.


        *వేణుమాధవుడు...*

కన్నయ్య వేణువును విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేడు. వేణువు, మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే...చివరకు గోపికలు కూడా వేణువును చూసి అసూయపొందారు. కన్నయ్య తమ కన్నా వేణువునే ఎక్కువగా ఆదరిస్తున్నాడని అలిగారు. 

వాళ్ళందరు కలిసి వేణువుని అడిగితే ఇలా అందట... ‘నన్ను నేను గోపయ్యకు అర్పించు కున్నాను. నాలో ఏమీ లేదు. అంతా డొల్ల’ అంది. నిజమే! వేణువు అంతా శూన్యం. అంటే, పరిపూర్ణతకు చిహ్నం.

తనకంటూ ఏమీ లేదు మనసులో ఏ మాలిన్యమూ, ఏ భావమూ, వికారమూ లేదు. తన సర్వస్వాన్నీ పరమాత్మకు అర్పించుకుంది. నేను, నాది అనే భావాలు వేణువుకు లేవు. ఏది తనదో అదే పరమాత్మకు ఇచ్చేసింది.

ఇప్పుడిక వేణువు, మాధవుడు ఇద్దరు కాదు... వేణుమాధవుడు మాత్రమే. మానవుడు అందు కోవాల్సిన మహత్తరమైన ఆధ్యాత్మిక సందేశాన్ని వేణువు అందిస్తుంది.

నేను, నాది అనే వాటికి మనిషి దూరం కావాలి. తాను తానుగా మిగలాలి. తన స్వచ్ఛమైన మనస్సును మాధవుడికి అర్పించాలి. అలాంటి మనసున్న మనుషుల్ని పరమాత్మ అక్కున చేర్చుకుంటాడు.


         *కృష్ణమేఘం..*

ఏ చిత్రాన్ని చూసినా, ఏ శిల్పాన్ని పరికించినా – కృష్ణుని సమ్మోహన దరహాసమే. ఉట్టిమీది పాల మీగడలు దొంగిలిస్తున్నప్పుడూ, అంతెత్తు గోవర్ధనగిరిని అమాంతంగా ఎత్తిపట్టు కున్నప్పుడూ, కాళీయుడి తలల మీద తకధిమి తకధిమి నాట్యం చేస్తున్నప్పుడూ, కంసచాణూరాది రాక్షసుల్ని వరుసబెట్టి వధిస్తున్నప్పుడూ, రణక్షేత్రంలో భీతహరిణంలా వణికిపోతున్న అర్జునుడికి గీతాబోధ చేస్తున్నప్పుడూ...అసలెప్పుడూ కృష్ణుడి మొహం మీద చిరునవ్వు చెదరలేదు.

 వ్యాసమహర్షి శ్రీభాగవతంలో రుతువర్ణన చేస్తూ...‘కృష్ణమేఘం’ అన్న మాట వాడారు. ఆ మేఘం వెంట వచ్చే మెరుపు కృష్ణయ్య చిరునవ్వేనట!


*మధురాధిపతే అఖిలం మధురం!*

కృష్ణుడు మధురకే కాదు,  ప్రేమ మాధుర్యానికీ అధిపతి.
మొత్తం మీద చెప్పాలంటే శ్రీకృష్ణుడు అంటే:

❤️ ఆనందతత్వం
❤️ ప్రేమతత్వం
❤️ స్నేహతత్వం
❤️ ప్రకృతితత్వం
❤️ నాయకత్వం

నీవే తల్లివి దండ్రివి  
నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా!

కృష్ణం వందే జగద్గురుమ్. సృష్టికర్త అయిన మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీ కృష్ణుడిగా ఎనిమిదవ అవతారమున జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి" , "గోకులాష్టమి"లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు.

ఈ సంవత్సరం ఆగస్టు 19 శుక్రవారం  ఈ రోజున శ్రీ కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు...


      *స్మార్తులు (వైష్ణవలు)*

తిధితో పండగ జరుపుకుంటే , వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని పుజిస్తారు. 

శ్రీ కృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు.

మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలకు ) నిద్ర లేచి , తలస్నానము చేసి మడి బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి, గడపకు పసుపుకుంకుమ , గుమ్మానికి తోరణాలు , పూజా మందిరములో ముగ్గులు వేయాలి.


        *ఉపవాస దీక్షలు*

కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి , సాయం కాలం శ్రీ కృష్ణుని పూజిస్తారు. 

శ్రావణ మాసంలో లభించే పళ్ళు , శొంఠి , బెల్లం కలిపిన వెన్న , పెరుగు , మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు , కీర్తనలు పాడతారు.

వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. 
అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ' లేదా ‘ఉట్ల తిరునాళ్ళు' అని కూడా పిలుస్తారు.

*పసుపు , కుంకుమ , గంధము , పుష్పాలతో*

పూజకు ఉపయోగించే పటములకు పసుపు , కుంకుమ గంధము , పుష్పాలతో అలంకరించుకోవాలి.

పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ , ప్రతిమను ఉంచాలి.  ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు , కదంబ పుష్పములు , తులసి మాల , సన్నజాజులతో మాల , నైవేద్యానికి పానకం , వడపప్పు , కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి.


       *దీపారాధాన*

తదనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరినూనె పోసి , ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి.

 దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి , తూర్పు దిక్కున తిరిగి , 'ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. 

భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం , కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది.

కలియుగంలో కల్మషాల్ని హరించి , పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.

        *దీక్షతో దక్షత*

కృష్ణాష్టమి రోజున ఒంటి పూట భోజనం చేసి , శ్రీకృష్ణునికి పూజ చేసి , శ్రీకృష్ణ దేవాలయాలు , మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ , కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి , అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని , ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం చెబుతుంది.సంతానం లేని వారు , వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది. 

*ఓం నమో నారాయణాయ , నమోభగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు !*

*ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ రుక్మిణీ శాయ నమః !*

*ఓం అచ్యుతా అచ్యుతాహరే పరమాన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవభగవాన్ అనిరుధ్య శ్రీపతే శమయ దుఃఖమశేషం నమః !*

ఈ మంత్రముతో ఈరోజు ఎవరైతే 108 సార్లు ధ్యానం చేస్తుంటారో వారి , దుఃఖం హరించిపోతుంది.

గోకులాష్టమి దినాన ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలముతో పాటు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందజేస్తే.. సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం.

హిందూ సంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణునిగా , చిన్నవారికి చిలిపి కృష్ణునిగా , స్త్రీలకు గోపికా వల్లభునిగా ,పెద్దలకు గీతాకారునిగా. ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు...

అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం.

కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని సూచిస్తారు. 
కృష్ణునికి పొన్నచెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది. 

ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగుపూలతో పూజించినా శుభమే ! కృష్ణాష్టకమ్‌ , కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ ,పరిమళభరితమైన పుష్పాలతో ఆయనను అర్చించాలి.కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే ! 

ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం , భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ , కొలుస్తూ , భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. 
కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి , కొందరు రాత్రివేళ్లే కృష్ణపూజ చేస్తారు. 

అలా కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి.... దాని మీద ఒక కుండని పెడతారు. 
ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమను ఉంచి , పూజని నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకుని చంద్రునికి , కృష్ణునికి అర్ఘ్యమిస్తారు...ఆ రోజు పూజ సంపూర్ణ అయినట్లు..స్వస్తీ...

*శ్రీ కృష్ణార్పణమస్తు...స్వరం..*

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

No comments:

Post a Comment