🍁 *ఘన వైద్యులు-భవరోగ వైద్యులు*🍁
🌷భవరోగ వైద్యులు కావాలంటే సర్వజీవుల పట్ల ప్రేమను వర్షింపగలగాలి. ఓర్పుగా, స్వార్థ చింతన లేక త్యాగ బుద్ధితో యజ్ఞార్థకర్మనుచేస్తూ క్రమశిక్షణాయుతమైన జీవనం గడుపుతూ జీవించగలగాలి. తాను చెప్పబోవునది ఆచరించి చూపి ఇతరులకు ఆదర్శవంతంగా ఉండగలగాలి. తనచుట్టూ గల వ్యక్తుల యందలి లోపాలను ఎన్నుట మాని వారియందు గల మంచి లక్షణములను గ్రహిస్తూ, వారికి యజ్ఞార్థ కర్మలయందు ఆసక్తి కలుగునట్లుచేసి వారు దానిని ఆచరించేటట్లు చేయాలి.
మాస్టరుగారు తన చుట్టూగల సోదరబృందం యొక్క భవ రోగాలకు వైద్యం చేయడానికి ప్రతి సంవత్సరం జనవరి 11, 12, 13 తేదీలలో నిర్వహించే గురుపూజల కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించేవారు. ఒకసారి సింహాచలంలో గురుపూజలు జరుగుతున్నప్పుడు ఒక సోదరుడు భోజనం కోసం విస్తళ్ళు వేయగనే తనకు వచ్చిన విస్తరిని పైకి ఎత్తి అది ఇచ్చిన సోదరుడితో, "ఈ విస్తరికి చాలా కంతలు ఉన్నాయి. మరొకటి ఇవ్వండి" అని అడిగాడు. అప్పుడే అటు వస్తున్న మాస్టరుగారు ఆ సోదరుని నుండి ఆ విస్తరిని లాక్కొని “మనలో ఉన్న లోపాలు గుర్తించడం చేతకాని మనం, గురుపూజలకు వచ్చికూడ విస్తరికి కంతలను పరిశీలిస్తున్నాం" అని ఆ విస్తరి తాను తీసుకుని అతని ప్రక్కనే కూర్చుని భోజనం చేసి వెళ్ళారు.
ఆ సన్నివేశంతో ఆ సోదరుడు గురుపూజలంటే అందరిలో ఉన్న లోపాలను వెతకడం మాని అందరితో కలసి జీవించడం కోసం మాస్టరుగారు ఏర్పాటుచేసిన యజ్ఞార్థ కర్మ అని గుర్తించాడు......
🌷 మరో సారి గురుపూజలకు ఒక సోదరుడు ఆ సంవత్సరమే మొదటిసారిగా వచ్చాడు. బయటకు వెళ్ళి కాస్త మందు పుచ్చుకుని వచ్చాడు. దానిని సేవించినట్లు సోదరబృందంలో ఎవరికీ తెలియదు. ఆరోజే మాస్టరుగారు ఆకస్మాత్తుగా వచ్చి ఆ సోదరుని ప్రక్కన కూర్చుని భోజనం చేస్తూ అతనిని మాట్లాడించటం మొదలుపెట్టారు. ఆ సోదరునికి కళ్ళనీళ్ళు తిరిగి తానెంత పొరపాటు చేసిందీ గమనించుకుని ఇకముందు అట్టి తప్పు చేయరాదని నిర్ణయించుకుని తన భవరోగాన్ని పదిలించుకున్నాడు.
గురుపూజలలో విధిగా ప్రతి సోదరుడు బ్యాడ్జి పెట్టుకొనుట, క్యూలో నిలబడి భోజనానికి వెళ్ళడం చేయవలసిందిగా మాస్టరుగారు సూచించేవారు. మాస్టరుగారు తాము మొదట బ్యాడ్జిని విధిగా ధరించేవారు. తాను అందరితోపాటు క్యూలో నిలుచోనక్కరలేదు అనుకొనే కొందరి భవరోగమునకు సరియైన వైద్యం జరిగేది.
ప్రతిరోజూ ఉదయం, సాయంకాలము 6 గంటలకు మాస్టరు గారు క్రమశిక్షణతో విధిగా ప్రార్థన చేసేవారు. ఒకసారి శ్రీకాకుళం హోమియో శిక్షణా తరగతులలో సాయంత్రం 6 గంటలకు మాస్టరుగారు రావడం ఆలస్యమైంది. మాస్టారు రాలేదని సోదర బృందం 6 గంటలకు ప్రార్థన చేయకుండా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. 6.05 ని॥లకు వచ్చిన మాస్టరుగారు అక్కడి సోదర బృందానికి 6 గంటలకే ప్రార్థన చేయడం చేతకాని వాళ్ళు ఆపదలో ఉన్న రోగార్తులకు వైద్యం ఏం చేస్తారు? ప్రార్ధన చేయడం వల్ల మన Mind Higher Plan లో ఉండే మాస్టారుగారి మైండ్ తో Link up అవుతుందని, దానివలన రోగార్తులకు అవసరమగు ఔషధం మాస్టర్ సి.వి.వి.గారే మనకు స్ఫురింపచేస్తారని తెలిసి. మాస్టరుగారు "నేను ఇక క్లాసులను ఆపి విశాఖపట్నం వెళ్ళిపోతున్నాను.” అని వేదిక నుంచి లేచారు. ఆ సన్నివేశంతో సోదరబృందం తమ తప్పు తెలుసుకుని మాస్టరు గారిని క్షమింపమని కోరగా మాస్టరుగారు తిరిగి యథావిధిగా శిక్షణా తరగతులను నిర్వహించారు. అప్పటి నుండి అక్కడి సోదరబృందం ప్రార్ధన విషయంలో ఏమరుపాటు లేక ప్రవర్తించడం సాధన చేశారు.
తమకు అత్యంత సన్నిహితుడయిన ఒక సోదరుని ఇంటికి మాస్టరుగారు ప్రతిరోజు ఉదయం 6 గం॥లకు ప్రార్ధన నిమిత్తం వెళుతూ ఉండేవారు, ఒకరోజు ఆ సోదరుడు మాస్టరుగారు వచ్చే సమయానికి నిద్ర లేవలేదు. మాస్టరుగారు తలుపు తట్టగా అతను లేచి వెళ్ళి స్నానాదికాలు ముగించుకుని వచ్చేసరికి, మాస్టరుగారు ఆ సోదరుడు పరుండిన పక్క బట్టలను మడిచి ప్రక్కన పెట్టి ఇల్లు తుడిచి దీపారాధన చేసి, అగరువత్తులను వెలిగించి ప్రార్థనకు ఏర్పాట్లు చేశారు. అది చూసిన ఆ సోదరుడు మాస్టరుగారి పాదాలకు నమస్కరించి ఇక నుండి ఇట్డి పొరపాటును రానివ్వనని చెప్పి నేటి వరకు అలాగే ఆచరిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసికున్నాడు.
ఈ వ్యాసం మాస్టరుగారి సంకల్పం వలననే వ్రాయడం జరిగింది.....✍🏻
సేకరణ 🌹
No comments:
Post a Comment