*శ్రావణ పూర్ణిమ, జంథ్యాల పూర్ణిమ,రాఖీ పండుగ, విఖనస జయంతి.*
తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజును రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటాం.
వ్యాస భగవానుడు రచించిన విష్ణు పురాణం ప్రకారం రాఖీ పౌర్ణమిని 'బలేవా' అని కూడా పిలుస్తారు. ఇందుకు ఓ కారణముంది. బలి చక్రవర్తి మహా విష్ణు భక్తుడు. బలి చక్రవర్తి తన అపారమైన భక్తితో విష్ణుమూర్తిని తన వద్దే ఉంచేసుకున్నాడంట!దాంతో విష్ణుమూర్తి లేని వైకుంఠం వెలవెలబోయింది. ఇందుకు ఏమి చేయాలా అని అలోచించి శ్రీమహాలక్ష్మి రాఖీ పౌర్ణమి రోజు బలిచక్రవర్తికి రాఖీ కట్టిందంట! లక్ష్మీదేవి రాఖీ కట్టగానే బహుమతిగా ఏమి కావాలో కోరుకోమన్నాడంట బలి చక్రవర్తి. అప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తిని తనతో వైకుంఠానికి పంపించామని అడగగానే బలిచక్రవర్తి విష్ణుమూర్తిని లక్ష్మీ దేవితో వైకుంఠానికి పంపించాడంట! అలా అప్పటి నుంచి రాఖీ కట్టే సంప్రదాయం మొదలైందని ఒక కథనం.
వివిధ పేర్లతో రాఖీ పౌర్ణమి
రాఖీ పౌర్ణమిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో జరుపుకుంటారు. ఉత్తర భారతంలో రక్షా బంధన్‌గా పిలిచే ఈ పండుగను సావనీ, సలోనా అని కూడా అంటారు. గుజరాత్ లో పవిత్రోపనా, మహారాష్ట్రలో నరాళి పూర్ణిమ, దక్షిణ భారతంలో నారికేళ పౌర్ణమి అని పిలుస్తారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఘూలాన్ పూర్ణిమగా జరుపుకుంటారు.
దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు
ఒకప్పుడు ఉత్తర భారతానికి పరిమితమైన రాఖీ వేడుకలు క్రమంగా దేశమంతటా వ్యాపించాయి. అన్నా చెల్లెళ్ళ మధ్య అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధాన్ని దృఢ పరచుకోడానికి, బాల్య స్మృతులు గుర్తు చేసుకోవడానికి రాఖీ పండుగ ఓ మంచి అవకాశం.
శ్రావణ పౌర్ణమి రోజున శక్తివంతమైన జ్యోతిష యోగం ఏర్పడుతుంది. రక్షాబంధన్, శ్రావణ నక్షత్రం రోజున గురు పుష్య యోగం ఏర్పడనున్నది. ఈ రోజు మూడు ప్రధాన గ్రహాలైన చంద్రుడు, గురువు, శని వారి సొంత రాశుల్లో సంచరిస్తారు. ఆయా గ్రహాలు తమ సొంత రాశుల్లో ఉండడం వల్ల వాటి ప్రభావం గరిష్టంగా ఉంటుంది. దాంతో శుభఫలితాలుంటాయని పండితులు పేర్కొంటున్నారు...🙏
No comments:
Post a Comment