Thursday, August 7, 2025

 https://youtube.com/shorts/Wq6NIvWmH-4?si=cXAkKHjLuu11iAD2

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️
*క్షమిస్తే... పోయేదేముంది*

క్షమాగుణం అనేది భగవంతుడు మనిషికి ప్రసాదించిన అత్యుత్తమ వరం. అత్యున్నత ఆధ్యాత్మిక గుణం. సంప్రదాయ, ధార్మిక, మానసిక, సామాజిక కోణాలలో చూడాల్సిన గొప్ప శక్తి. క్షమ మనిషి హృదయ ఔన్నత్యానికి ప్రతీక. మనకు ఎవరైనా బాధ కలిగించినా, అవమానించినా, అన్యాయం చేసినా అవేవీ మనసులో పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా మన్నించడమే క్షమాగుణం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ దైవీగుణాలలో ఒకటిగా చెబుతూ క్షమాగుణం భక్తుడి లక్షణం అంటాడు.

రాముడు ఎంతటి శత్రువునైనా తన ధర్మానికి భంగం కలుగకుండా క్షమించాడు. ఏడు రోజులు భీకరంగా యుద్ధం చేసి రావణుడు పడిపోయాడు. అతడికి అంతిమ సంస్కారం చేయమని విభీషణుణ్ని ఆదేశించాడు శ్రీరాముడు. రావణుడి లాంటి దుర్మార్గుడికి అంత్యక్రియలు చేయడానికి తనకు మనసు రావడం లేదన్నాడు విభీషణుడు. వెంటనే రాముడు స్నేహితుడి సోదరుడు తనకూ సోదరుడితో సమానమని విభీషణుడు కాకపోతే తానే ఆ పనిచేస్తానని చెబుతాడు. అదీ శ్రీరాముడు మనకు బోధించిన ధర్మం. ఒక వ్యక్తి జీవించి ఉండగా ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా ప్రాణం పోగానే ఆ వైరం కూడా సమసిపోతుందన్న రాముడి ప్రబోధం క్షమాగుణం విశిష్టతను తెలుపుతుంది. బుద్ధుడు క్షమని అహింసకు మార్గంగా చూశాడు. జైనులు ఏటా ‘క్షమాపణ పర్వం’ జరుపుకొంటారు. ఆ సందర్భంగా ప్రతి ఒక్కరు తనవల్ల ఎవరికైనా కలిగిన బాధకు క్షమాపణ చెబుతారు. క్షమ మనసుకు శాంతినిస్తుంది. మదిలో ద్వేషాన్ని నింపుకోవడం అంటే చేతిలో నిప్పును పట్టుకున్నట్లే. మన్నించడంవల్ల మనసు తేలికపడి ప్రశాంతత వస్తుంది. ప్రతీకారం రక్తపాతానికి దారితీస్తే, క్షమాగుణం సమాజాన్ని శాంతి దిశగా నడిపిస్తుంది. ‘క్షమ అనేది బలహీనత కాదు. బలమైనవాడి లక్షణం’ అన్నారు మహాత్మాగాంధీ. తప్పు చేసినవారిని శిక్షించేకన్నా, మన్నించి ప్రేమిస్తేనే వారి మనసులు మారతాయన్నారు స్వామి వివేకానంద. క్షమ, తపస్సులతోనే భగవంతుణ్ని సులభంగా పొందగలం అని యజుర్వేదం చెబుతోంది. 
సాధన ద్వారా క్షమాగుణాన్ని మనం సాధించాలి. మన్నించగలగడం మన ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం. దానివల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. నిద్ర మెరుగుపడి, మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. క్షమాగుణం ఒక్కసారిగా వచ్చేది కాదు. ప్రవచనాలు వినడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ధ్యానం తదితరాల ద్వారా సాధన చెయ్యాలి. శివపురాణంలో చెప్పినట్లుగా క్షమయే పరమధర్మం. అదే అంతిమ శాంతి మార్గం. క్షమాగుణం కలవారిని భగవంతుడు అనుగ్రహిస్తాడని శివపురాణం విశదీకరించింది. క్రోధాన్ని వదిలి క్షమాగుణాన్ని భూషణంగా ధరించిన భక్తుడు భగవంతుడికి ప్రీతిపాత్రుడు అవుతాడు.🕉️🚩🕉️

No comments:

Post a Comment