Monday, May 18, 2020

ఎవ్వరూ కూడా ధనబలం ఉన్నదని, మందిబలం ఉన్నదని, యౌవనబలం ఉన్నదని గర్వంతో విర్రవీగరాదు. ఎందుకంటే అవేవీ శాశ్వతం కాదని తెలుసుకోవాలి

👌ఎవ్వరూ కూడా ధనబలం ఉన్నదని, మందిబలం ఉన్నదని, యౌవనబలం ఉన్నదని గర్వంతో విర్రవీగరాదు. ఎందుకంటే అవేవీ శాశ్వతం కాదని తెలుసుకోవాలి👌

ధనమెక్కిన మధమెక్కున్, మదమెక్కిన మనసుజచ్చున్ అని ఎప్పుడో వేదాల్లో చెప్పబడివుంది. ఈ ప్రపంచంలోని మన కంటికి కనపడే వస్తువులు, సంపదలన్నీ అశాశ్వితమైనవని, అవి మనలను భ్రమలో భ్రాంతిలి కలిగించేవని. ఇవన్నీ క్షణికమైనవని అందరూ తెలుసు కోవాలి. అశాశ్వతమైన ఈ సంపదలను చూచుకొని మనిషి గర్విస్తున్నాడు. అహంకరిస్తున్నాడు. ఇవన్నీ శాశ్వతమనుకొని భ్రమ పడతున్నాడు. ఎందుకంటే ఉన్నదానితో తృప్తి పడక ఇంకా తరతరాలకు సరిపడా సంపాదించాలి అనుకొంటూ ఉదయం లేచిన దగ్గర నుండి తిరిగి రాత్రి పడుకునేంత వరకు సంపదలను కూడబెట్టడం కోసం ఒకటే ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

ఇంకొందరికి ధన, జన, యౌవన గర్వం పెరిగి పోతున్నది. కొందరికి తమ వద్ద కావలసినంత ధనం ఉన్నదని, ఇళ్ళూ, స్థలాలు, తోటలు, భూములు, వాహనాలు బ్యాంకు బ్యాలెన్సులూ ఉన్నాయని, నేను ఎవరి దగ్గరా చేయి చాపనవసరం లేదని, గర్విస్తారు. వీటిని చూసుకొని కళ్లు నెత్తికెక్కు తున్నాయి. ధన పిశాచి పట్టిన వాడికి భార్యా, పిల్లలు, బంధువులు, మిత్రులు, ఇరుగు, పొరుగు అనే ప్రేమభావం ఉండదు. అతడు చేసే ప్రతి ఆలోచన, ప్రతి పనిలో డబ్బు సంపాదనకే ప్రాధాన్యత నిస్తుంటారు. వారి చూపులు అంతా డబ్బునే చూస్తుంటాయి. వారికి డబ్బున్నవారే మిత్రులు, డబ్బులేని వారిని శతృవులుగా చూస్తుంటారు. అన్నింటిని డబ్బుతోనే విలువ కడతారు.

ఇంకొందరికి జనగర్వం. తన వెనుక ఎంతో మంది జనం ఉన్నారనుకుంటారు. తనవల్ల ఏదో ప్రయోజనం పొందాలని తనను నాశ్రయించిన వారందరూ తనవారేనని భ్రమ పడుతూ ఉంటారు. అందరూ తన శ్రేయోభిలాషులే అనుకుంటారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఈ కోవలోకే వస్తారు. తన అధికారాన్ని చూచి తన చుట్టూ చేరిన వారిని చూచి గర్విస్తారు. కాని ‘అధికారాంతము నందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నట్లు అధికారం పోయినప్పుడు తెలుస్తుంది. తన నిజమైన శ్రేయోభిలాషులెవరో. నిజానికి నీ డబ్బును చూసి కాకుండా, నిన్ను నిన్నుగా ప్రేమించేవారే నీకు అసలైన శ్రేయోభిలాషులు.

ఇకొందరికి యౌవన గర్వం. వీరు తమ యవ్వనం శాశ్వతం అనుకుంటూ విర్రవీగుతూ ఉంటారు. తన శరీరంలోని బిగువులు ఎల్లప్పుడూ శాశ్వతంగా ఇలాగే ఉంటాయని అతడు భ్రమలో ఉండి గర్వపడుతున్నారు. ఆ గర్వంలో అతడు మంచి చెడూ గమనించడు. కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తాడు. అహంభావంతో ఉంటాడు. విచెక్షణను కోల్పోయి ముసలి వాళ్ళను ఎగతాళి చేస్తాడు. తన చివరి క్షణాల్లో తనకు అదేగతి పడుతుందన్న సత్యాన్ని గ్రహించలేక పోతాడు.

హరతి నిమేషాత్కాలః సర్వం అని తెలుసుకోవాలి. తాను శాశ్వతం అనుకుంటన్నవన్నీ మొత్తం ఒక్క క్షణంలో హరించిపోతాయి అని తెలిసుకోలేడు. ఒక్క10 సెకండ్ల కాలం భూమి కంపించి భూకంపం వస్తే చాలు నీ ఇళ్ళూ, బంగళాలు, స్థలాలు పొలాలు, ధనసంపదలూ, వస్తువులు, వాహనాలు అన్నీ నేలమట్టమై భూగర్భలోకి చేరి పోతాయి. నాకేం? కోట్ల ఆస్తి ఉంది. బ్రహ్మాండమైన భవనం ఉంది అని గర్వించినవాడు చివరికి అన్ని పోగొట్టుకొని బికారి లాగా, ఏకాకై రోడ్డున పడతాడు. అలాంటి సమయంలో ఒక్కపూట ఆకలి తీర్చుకోవడానికి ఎవరో దయతలిచి పంపించే ఆహారపొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది. మరి ఇప్పుడేమయింది అప్పటి ఆ గర్వం? నీ ధనం నిన్ను రక్షిస్తుందా? నీ జనం నిన్ను రక్షిస్తారా? అలాగే నీ యౌవనం నిన్ను రక్షిస్తుందా? ఇవన్నీ కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేవి కాదు. వృద్ధాప్యం అనేది మన నెత్తిన ఎక్కి కూర్చొని గడిచే ప్రతిక్షణం నీవు నాకు దగ్గరౌతున్నావంటూ నీకు ప్రతిక్షణం గుర్తు చేస్తూ నిన్ను ఎక్కిరిస్తూ ఉంటుంది. కానీ నీ తాత్కాలిక అందాన్ని అద్దంలో చూసుకుని మురిసిపోతూ నీ నెత్తిన ఎక్కి కూర్చొని ఉన్న ఆ వృద్ధాప్యాన్ని గుర్తించలేక పోతున్నారు

కాబట్టి మిత్రులారా ! ఇదంతా మాయాజాలం అని, క్షణికమైనవని తెలుసుకో. అంటే వాటన్నింటినీ అనుభవించు తప్పులేదు. కాని అవన్నీ శాశ్వతం అనుకుంటూ వాటిలో కూరుకుపోకు. అశాశ్వతమైన వాటి కోసం ఆరట పడక శాశ్వత ఆనందాన్ని పొందే మార్గాన్ని అన్వేషించు. దానికి మార్గం "మానవ సేవే మాధవ సేవ " అని తెలుసుకోవాలి. స్వార్థంతో నీ కోసం కాకుండా నిస్వార్థంగా అందరి కోసం పాటుపడు. అందరికీ నీ చేతనైన సహాయాన్ని అందించు. నీ సాయాన్ని పొందిన వారి ఆనందమే నీ ఆనందం. అంతకు మించిన శాస్వతానందం మరొకటి లేదని తెలుసుకుని అందరూ ఆ మార్గంలో పయనిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ..*

No comments:

Post a Comment