Friday, May 15, 2020

జ్ఞాన క్షేత్రం

జ్ఞాన క్షేత్రం:-

జ్ఞ అంటే 'తెలుసుకోవటం', జ్ఞాన క్షేత్రం అంటే తెలుసుకునే క్షేత్రం. ఈ సృష్టి అంతా "తెలుసు-తెలియదు" అన్న చట్రంలో ఉంది. ఈ తెలుసు-తెలియదు అన్నతనం నుంచి తెలుసుకుంటూ ఉండటమే జ్ఞాన క్షేత్రం అంటే. మనకు సంగీత జ్ఞానం లేదు కానీ, ఏది మంచి సంగీతమో మనకు తెలుసు. ఇతను సరిగ్గా పాడటం లేదు, వీడి కన్నా వాడే బాగా పాడుతున్నాడు అన్న జ్ఞానం మనకు ఉన్నది కదా! దీనినే తెలుసు-తెలియనితనం అంటారు.
మనం జ్ఞానాన్ని సమీకరించటానికి, జ్ఞానాన్ని అభివృద్ధి వరచుకోవటానికి మనకు జ్ఞానేంద్రియాలు ఉపయోగపడతాయి. జ్ఞానేంద్రియాలు ఐదు. అవి చెవి ద్వారా శబ్దం, కళ్ళ ద్వారా దృశ్యం, ముక్కు ద్వారా వాసన, నాలుక ద్వారా రుచి, చర్మం ద్వారా స్పర్శ జ్ఞానాలను పొందుతాము. ఇవియే కాక మనస్సు, బుద్ధి ద్వారా కూడా జ్ఞానాన్ని సమీకరించుకుంటాము. ఉదాహరణకు ఎక్కువ తింటాం ఆయాసం వస్తుంది, తక్కువ తింటాం ఆకలేస్తూంటుంది. మధ్యస్థంగా తింటాం - ఆకలి లేదు, ఆయాసం లేదు; చక్కగా బాగుంది అని అనిపిస్తుంది. ఇది శరీరానికి సంబంధించినది కాదు, అనుభూతికి సంబంధించినది. అనుభూతి అనునది 'మనస్సు'కు సంబంధించినది. మధ్యస్థంగా తింటేనే బాగున్నది అని అనిపించేది 'బుద్ధి'కి. ఇదంతా వెరసి జ్ఞానక్షేత్రం అని అనబడుతుంది.
మనం వాస్తవానికి ఆత్మపదార్థాలం. ప్రతి ఆత్మ కూడానూ... అనంతంగా, ఈ జ్ఞాన సంపద కోసం అలా ప్రయాణం చేస్తూనే వుంటుంది. ఆత్మ ప్రయాణంలో
మొదటి కారణం నేర్చుకోవడం కోసం,
రెండవ కారణం భోగం కోసం. (Enjoy)
ఈ రెండూ సరిసమానమైన క్షేత్రాలే. ఆత్మ అనునది నేర్చుకునేది భోగం కోసమే. ఆత్మ అనునది ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ భోగంలో వుంటుంది, ఎంత ఎక్కువ భోగంలో వుంటే అంత ఎక్కువ నేర్చుకోగలిగిన శక్తిని తిరిగి కలిగి వుంటుంది. భోగం ద్వారా ఒకానొక మనిషికి తృప్తి వస్తుంది, ఆ తృప్తి వున్నపుడు ఇంకొంచెం ఎక్కువ ఏకాగ్రత తో నేర్చుకుంటాడు, ఇంకొంచెం నేర్చుకున్నప్పుడు జ్ఞానం ఇంకా ఎక్కువ అవుతుంది, అప్పుడు ఇంకొంచెం ఎక్కువగా ఎంజాయ్ చేస్తూంటాం.
జ్ఞానాలను రెండు రకాలుగా విభజిస్తే అవి లౌకిక జ్ఞానం మరియు ఆత్మజ్ఞానం అని చెప్పుకోవచ్చు. ఈ రెండు రకాల జ్ఞానాలు ఉండాలి మనకు. ఈ జ్ఞాన క్షేత్రంలో అనంతమైన శాఖలున్నాయి. మాట్లాడటం నేర్చుకోవాలి, ఆలోచించటం నేర్చుకోవాలి, నిద్రపోవటం నేర్చుకోవాలి, తినటం నేర్చుకోవాలి, వంట చేయడం నేర్చుకోవాలి, వడ్డించటం నేర్చుకోవాలి, సభామర్యాదలు తెలిసి వుండాలి. సంఘంలో సరియైన పౌరుడిగా ఉండాలి. స్వతంత్రంగా జీవించగలిగే జ్ఞానం ఉండాలి. అందరితో కలసిమెలసి జీవించే జ్ఞానముండాలి. ప్రత్యేక సందర్భాలలో, ఒక్కొక్కసారి కోరికలను తగ్గించుకునే జ్ఞానముండాలి. ఎన్ని రకాల జ్ఞానాలో! లెక్కలేదు. కంప్యూటర్ జ్ఞానముండాలి, ఇంటర్నెట్ జ్ఞానముండాలి, డ్రైవింగ్ జ్ఞానముండాలి! కొండ ఎలా ఎక్కాలి? ప్రతిదీ జ్ఞానమే!
జ్ఞాన సమీకరణలో అవిరామ పరిశ్రమ ఉండకూడదు. సవిరామ పరిశ్రమ మాత్రమే ఉండాలి అనగా విశ్రాంతి తీసుకుంటూ పరిశ్రమిస్తూ ఉండాలి.
ఈ జ్ఞాన క్షేత్రం అన్నది నేర్చుకునే క్షేత్రం. మరి జ్ఞానాన్ని విస్తరింప చేసుకునే క్షేత్రం. దీనికి మౌలికమైన క్షేత్రం 'ధ్యానం'. మనస్సు శూన్యంగా వుంటేనే ఏదైనా గ్రహించవచ్చు. కనుక జ్ఞానక్షేత్రానికి మూలమైనది ధ్యాన క్షేత్రం. ధ్యానం వల్లనే జ్ఞానం లభిస్తుంది. ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత ఎక్కువ జ్ఞానం లభిస్తుంది. ఎంత జ్ఞానం వస్తుంటే అంత ముక్తి వస్తూంటుంది. ధ్యాన క్షేత్రం అన్నది చాలా చాలా సింపుల్, 'కేవలం శ్వాసతో వుండండి... మనస్సు శూన్యమయిపోతుంది'. అంతే! కానీ జ్ఞానక్షేత్రం ... అన్నది ఓ విస్తారమైన , సువిస్తారమైన క్షేత్రం. ప్రతీదీ తెలుసుకుంటూ వుండాలి. ప్రతి ఒక్కరికీ నేర్పిస్తూ ఉండాలి.

"శ్రద్ధావాన్ లబతే జ్ఞానం " అన్నారు కదా భగవద్గీతలో, అనగా శ్రద్ధ ఉన్నవారికే జ్ఞానం లభిస్తుందని అర్ధం. మరియు 'జ్ఞానాన్ ముక్తి' అని గీతలో ఉన్నది కదా, అనగా జ్ఞానులకే జీవన్ముక్తి లభిస్తుందన్నమాట.

No comments:

Post a Comment