Tuesday, May 19, 2020

ఎవరు గొప్ప?

ఎవరు గొప్ప?

👉🏼సుగంధపూరిత పరిమళాన్ని అందించే పుష్పం🌺గొప్పదా? అటువంటి పుష్పాన్ని పూయించిన పూలమొక్క గొప్పదా? పూలమొక్క పెరిగి పుష్పించడానికి తోడ్పడిన, సూర్యరశ్మి, గాలి, నీరు, ఎరువు, భూమి మొదలైనవి గొప్పవా?

వైవిధ్యభరితమైన ఈ సృష్టి ఎంత గొప్పది? సుందరమైన సృష్టిని సృజించిన సర్వేశ్వరుని సృజన మరెంత గొప్పదో కదా!
నేనే గొప్ప, నా మతం, నా కులం గొప్ప లాంటి మాటలనడం వల్ల ఎన్నటికీ గొప్పవారు కాలేరు. ఈనాటి మానవుడు ఇతరుల భావాలను కించపరుస్తూ, తన గొప్పతనాన్ని చాటుకోవటానికి అహర్నిశలూ అప్రతిహతంగా కృషి చేస్తాడు. తనదే పైచేయి కావడం కోసం పాపకార్యాన్నయినా చేయటానికి వెనుకాడరు.

కొందరు మేం గొప్పవారమని బీరాలు పలుకుతారు. వృక్ష, జంతు, భూచరాలు, జలచరాలూ, గాలి, నీరు, అగ్ని, మట్టి, ప్రకృతి అన్నీ కేవలం మానవుని సుఖసంతోషాలకే కైంకర్యం అవుతున్నాయి. వీటన్నిటినీ హరించి, భుజించి నేనే గొప్ప అని మిథ్యలో మానవుడు ఉన్నాడు.

నీటికి నీవేమిచ్చావని నీ దాహం తీరుస్తుంది? చెట్లకు ఏమిస్తున్నావని మధుర ఫలాలనిస్తున్నాయి?
ఐదు వేళ్లు ఒకటైతే గానీ ఆహారాన్ని నోటికి అందించలేమే. నోరు, దంతాలు, నాలుక సహకరిస్తే గానీ ఆహారం గొంతునుంచి కిందకి జారదే! లాలాజలం, జఠరాగ్ని ప్రమేయం లేకుండా ఆహారం జీర్ణం కాదే? జీర్ణమైన ఆహారం, రక్తంగా మారే ప్రక్రియ ఎంత గొప్పది? శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే హృదయం గొప్పతనం మాటేమిటి మరి? ఎవరు గొప్ప? శరీరంలో ఎక్కడైనా ఒక భాగానికి గాయమైతే మొత్తం శరీరంలో ఉండే వ్యాధినిరోధక శక్తి ఒక్కటై ఆ భాగం వెంటనే కోలుకోవటానికి ఎంతగా సహకరిస్తుందో. ఆ ప్రక్రియ ఎంత గొప్పది?

కంటికి కనిపించని ఉపకారం చేసే సూక్ష్మజీవులు కోటానుకోట్లు మన దేహంలో ఉంటూ, ఈ దేహాన్ని అనుక్షణం కాపాడే వాటి సంగతేంటి? వాటి గొప్పతనం గురించి ఎన్నడైనా చెప్పాయా?
గొప్పవారెప్పుడూ అందరినీ గొప్పవారిగా చేయాలనే చూస్తారు.

మహాత్ములు, మహాపురుషులు, ధర్మస్థాపకులు వారి చర్యలు, ఆలోచనల ద్వారా సుగంధ పరిమళాలను వెదజల్లుతారు. కానీ ఎవరినీ కించబరచరు. తక్కువ చేయరు.

ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ ‘వెనుక తరాలవారు వారి పరిశోధనల ద్వారా అందించిన పరిశోధనా ఫలాలు నా ప్రయోగానికి ఎంతో ఉపకరించాయి’ అని సవినయంగా చెప్పడం.. ఆయన గొప్పతనమే.
చెట్టు మొక్క వేర్లు గుప్తంగానే ఉంటాయి. కానీ వేళ్లే చెట్టు మనుగడకు మూలాధారం.

మానవుల సుఖమయ జీవితానికి ఎందరో గుప్త సేవ చేస్తున్నారు. వారి సేవ ఎంత గొప్పది? మానవజాతి మనుగడకు క్రిమికీటకాదులు, పశుపక్ష్యాదులు, వృక్ష, జంతుజాతులు.. ఒకటేమిటి ఈ సువిశాల విశ్వంలో పంచతత్వాలు కర్పూరమై కరిగిపోతున్నాయి.

ఇప్పుడు చెప్పండి... ఎవరు గొప్ప?
ఈ మానవ దేహాన్ని నడిపించే పవిత్ర ఆత్మ ఎంత గొప్పది? స్థూలంగా కనిపించే కర్మేంద్రియాల కంటే మనసు గొప్పది. మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. ఆత్మ మూలగుణాలైన శాంతి, శక్తి, ప్రేమ, పవిత్రత, ఆనందం, జ్ఞానం సంతోషం వల్ల.. ఆత్మ దివ్యగుణాలతో శోభిల్లుతుంది.

లోకాసమస్తా శుఖినోభవంతు🙏

No comments:

Post a Comment