Thursday, May 7, 2020

పంచకోశాలంటే ఏమిటి ?

పంచకోశాలంటే ఏమిటి ?
మన స్ధూల సూక్ష్మ కారణ శరీరాలను 5 కోశాలుగా విభజించారు. అవే 1. అన్నమయ కోశం 2. ప్రాణమయ కోశం 3. మనోమయ కోశం 4. విజ్ఞానమయ కోశం 5. ఆనందమయ కోశం.
ఆత్మ యదార్ధంగా శుద్ధమైనది; అక్రియమైనది, శాశ్వతమైనది, ఆనందమయమైనది. అట్టి ఆత్మనే నేను. మరి శుద్ధమైన నేను కల్మషమైన వానిగా ఎందుకు అనిపిస్తున్నాను? అక్రియమైన నేను ఎందుకు పనులు చేస్తున్నట్లుగా ఉన్నాను? శాశ్వతమైన నేను ఎందుకు అనిత్యమైన వాడినని భావిస్తున్నాను? ఆనంద స్వరూపమైన నేను ఎందుకు దు:ఖపూరితుడుగా భావించబడుతున్నాను? ఎందుకిలా జరుగుతున్నది? ఇదంతా అనాత్మ సంబంధంవల్లనే. కల్మషమైన, క్రియాత్మకమైన, అనిత్యమైన, దు:ఖపూరితమైన అనాత్మ తాదాత్మ్యం వల్లనే; దేహ తాదాత్మ్యం వల్లనే; -పంచకోశ తాదాత్మ్యం వల్లనే - దీనినే ఉపమాన సహితంగా తెలియజేస్తున్నారు.

శుద్ధమైన స్వచ్ఛమైన స్పటికాన్ని నీలంరంగు గల వస్త్రంపై ఉంచితే ఆ స్పటికం నీలం రంగులో కనిపిస్తుంది. దానిని అక్కడ నుండి తీసి ఎరుపు వస్త్రంపై ఉంచితే ఆ స్పటికం ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇంతకీ ఈ రంగులు వస్త్రాలకు చెందినవే గాని స్పటికానికి చెందినవి కావు. స్పటికం నీలం రంగులో కనిపించినప్పుడు కూడా, అది స్వచ్ఛమైనదే. ఎరుపు రంగులో కనిపించినప్పుడు కూడా అది రంగు లేనిదే. అలాగే పంచకోశాల తాదాత్మ్యం వల్లనే శుద్ధమైన ఆత్మ పంచాకోశ లక్షణాలతో ఉన్నట్లే కనిపిస్తుంది. పుట్టుకగాని, పెరుగుదలగాని, చావుగాని లేని ఆత్మ పుట్టుక, పెరుగుదల, చావు ఉన్న దేహంతో తాదాత్మ్యం వల్ల అలా అనిపిస్తున్నది. దు:ఖం లేని ఆత్మ దు:ఖ స్వరూపమైన మనస్సుతో కూడి దు:ఖమయంగా అనిపిస్తుంది. ఇలాగే పంచ కోశాల ధర్మాలన్నీ ఆత్మపై ఆరోపించబడుతున్నాయి. భ్రాంతిని కలిగించి శాంతిని దూరం చేస్తున్నాయి. మరేం చేయాలి? పంచ కోశాలను దూరం చేసి చూసినప్పుడు ఆత్మ స్వచ్ఛంగా ఉంటుంది. అట్టి స్వచ్ఛమైన ఆత్మనే నేను గాని ఈ పంచకోశాలు నేను గాను.

( i ) కొంత కాలం మాత్రం జీవించి, అనేక మార్పులు చెంది, చివరకు నశించి పోయే ఈ అన్నమయ కోశం (జడ శరీరం) నేనుకాదు. ఇది నా కన్నా వేరుగా ఉన్నది. నేను ఆత్మను
( ii ) ఆత్మనైన నా తేజంతో-చైతన్యంతో కదిలే ప్రాణమయ కోశం (ప్రాణాలు) నేనుకాదు. అవి నా కన్నా వేరైనవి. నేను శుద్ధ చైతన్యమైన ఆత్మను.
( iii ) అన్ని అవస్ధలలోను కనిపించక, దృశ్యంలా కనిపిస్తూ, మార్పులు చెందుతూ సుఖదు:ఖాలు అనుభవించే మనోమయ కోశం (మనస్సు) నేనుకాదు. నేను ఆత్మను.
( iv ) ఏవేవో కోరికలతో ఆలోచనలు చేస్తూ, ద్వంద్వాల మధ్య చెదిరిపోతూ, సర్వజ్ఞత్వం లోపించిన విజ్ఞానమయ కోశం (బుద్ధి) నేనుకాదు. నేను ఆ బుద్ధికి వెనుకనున్న ఆత్మను.
( v ) అజ్ఞానంలో ఉండి, ఏ విషయ జ్ఞానమూ లేని స్ధితిలో, దు:ఖరహిత స్ధితిలో ఉండే ఆనందమయ కోశం నేనుకాదు. నేను ఆ కోశానికి వెనుక నున్న ఆత్మను.

No comments:

Post a Comment