Tuesday, October 1, 2024

 Vedantha panchadasi:
బోధా దూర్థ్వం చ తద్ధేయం జీవన్ముక్తిప్రసిద్ధయే ౹
కామాది క్లేశబంధేన యుక్తస్య నహి మక్తతా ౹౹51౹౹

51.బ్రహ్మబోధ కలిగిన పిమ్మట కూడా జీవన్ముక్తియందు ప్రతిష్ఠితుడగుటకు ఆ అశాస్త్రీయ ద్వైతమును పరిత్యజింపవలెను. కామక్రోధాది క్లేశములచే బంధితుడైన వానికి ముక్తత లేదు.

జీవన్ముక్తిరియం మా భూత్ జన్మాభావే త్వంహం కృతీ ౹
తర్హి జన్మాపి తేఽ స్త్యేవ స్వర్గ మాత్రాత్కృతీ భవాన్ ౹౹52౹౹

52.ఈ జీవన్ముక్తి లేకపోయిన పోనిమ్ము.ఇక మీద జన్మము లేక పోవుటచే నేను కృతార్థుడనే అనినచో కామాదులు ఉన్నంత వరకు నీకు జన్మము కూడ తప్పదు.స్వర్గముతో మాత్రమే నీవు తృప్తి పడవలెను.విదేహ ముక్తి అసంభవమని ఉద్దేశము.

క్షయాతిశయ దోషేణ స్వర్గో హేయో యదా తదా ౹
స్వయం దోషతయాత్మాయం కామాదిః కిం న హీయతే ౹౹53౹౹

53.స్వర్గసుఖములు క్షయించును,తారతమ్యములు గలవి అగుటచే స్వర్గము త్యాజ్యమైనపుడు దానికి మూలమైన దోషమగు కామక్రోధాదులను ఏల పరిత్యజింపవు?అవశ్యము పరిత్యజింపవలెనని భావము.

కొంత మందికి గురుముఖతః తత్త్వమస్యాది మహావాక్యాలను శ్రవణం చేసినా కూడా దృఢజ్ఞానము కలుగదు. కారణమేమనగా అంతఃకరణములో మలవిక్షేప దోషాలు పూర్తిగా నశింపక పోవుట చేతను,అశాస్త్రీయ ద్వైతమైన జీవబ్రహ్మలు ఎప్పుడూ ఒకటి కాలేరు అని మనస్సులో నిలబడి వుండుట చేతను బ్రహ్మజ్ఞానం అధృఢంగా ఉండి పోతుంది.

ఇటువంటి అధృఢ బ్రహ్మజ్ఞానికి ఫలితం ఏమనగా కామ్యబుద్ధి శేషించి ఉన్న పక్షమున,ఈ దేహాన్ని వదిలిన పిమ్మట ఉత్తమలోకాలు చేరుకొని అచ్చట పుణ్యఫల భోగానంతరం తిరిగి పవిత్రులైన శ్రీమంతుల ఇండ్లలో జన్మించెదరు.

కామ్యబుద్ధి నశించి నిష్కామత్వం గలిగిన వాడైనచో ఈ దేహం వదిలి జ్ఞానుల వంశంలో జన్మిస్తారు.
"భగవద్గీత"యందు ఈ విషయం చెప్పబడినది.

ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వ శాశ్వతీ స్సమాః౹
శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో ఽ భి జాయతే ౹
---భగ-గీ-6-41

అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం౹
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయదీదృశమ్ ౹౹
   --- భగ-గీ-6-42

యోగసిద్ధిని పొందకనే మరణించినవాడు పుణ్యవంతుల కర్హములైన స్వర్గాది లోకములందు చిరకాలము సుఖించి,మీదట పవిత్రులగు భాగ్యవంతుల యింట జన్మించూచున్నాడు.

లేదా ప్రజ్ఞావంతుల యోగుల వంశము నందైనను జన్మించును.

ఈ జీవన్ముక్తి లేకున్నను జన్మలేక పోవుటచే కృతార్థుడనే అనుకున్న,కామాదులు ఉన్నంత వరకు జన్మము కూడా తప్పదు,స్వర్గముతో మాత్రమే తృప్తి పడవలెను కాని విదేహ ముక్తి అసంభవము.

దోషములగు కామక్రోధాదులను పరిత్యజించి,ఈ జీవుడినే ఆ దేవునిగా చూపగలిగిన ఆత్మజ్ఞానాన్ని పొందవలెను.

ఈ ప్రకారము జనన మరణరూప సంసార దుఃఖమును నశింపచేసి పరమానందరూపమును ప్రసాదించు తత్త్వజ్ఞానము యొక్క మహిమ అపారమైనది.      

No comments:

Post a Comment