Monday, March 2, 2026

 *తాంబూల పరిమళం*
భారతీయుల విందుభోజనాలు తాంబూల సేవనంతో పరిసమాప్తం అవుతాయి. ప్రాంతాలవారీగా పదార్థాలు మారుతుంటాయి గాని, కొసమెరుపు మాత్రం తాంబూలానిదే! ఈ అలవాటు వెనక ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. ‘ఉదర విశేష సౌఖ్యకరము, ఉద్ధతదోష బల ప్రహారి, సమ్మదజనకంబు... వాతపిత్తాది దోషాలను పోగొట్టి ఉదరానికి సుఖాన్ని, మనిషికి ఆనందాన్ని ఇస్తుంది’ అన్నాడు చారుచర్య గ్రంథంలో అప్పనమంత్రి. కాబట్టే తాంబూలం మన భోజనంలో భాగమైంది. అంతేకాదు, ‘మదన పునర్భవీకరణ మంత్రము తమ్ములము మానవతీ పరిభోగ వేళలన్‌... స్త్రీ సంగమవేళ కామోద్దీపనకు తాంబూలం మంచి దోహదకారి’ అని చారుచర్య వివరించింది. ‘రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురవిడెము...’ కవిత్వ సిద్ధికి ఉత్ప్రేరకం అవుతుందన్నాడు అల్లసానిపెద్దన. కూపోదకం(నూతినీరు) వటచ్ఛాయ(మర్రిచెట్టు నీడ), తాంబూలం, మూడింటికీ- ‘శీతకాలే భవేత్‌ ఉష్ణం, ఉష్ణకాలేతు శీతలం’ చలికాలంలో వెచ్చదనాన్ని, వేసవిలో చల్లదనాన్ని పుట్టించే లక్షణాలున్నాయని శాస్త్రం చెబుతోంది. అందుకే ‘గుడిసెయు మంచము కుంపటి విడియమ్ము(తాంబూలం) కలిగిన చలి ఎక్కడిదప్పా?’ అని అడిగాడు కుందవరపు కవి చౌడప్ప. అసలు తాంబూల నిర్మాణమే సొగసైన ప్రక్రియ. రంభ నలకూబరుడికి చుట్టి ఇచ్చినట్లుగా ‘తొడిమెయును తుదియును త్రుంచి నడుమ ఈనె దీసి తడియొత్తి మడిచి, ముక్తామణీ చూర్ణము(మంచి ముత్యాలను కాల్చి పొడిచేసిన సున్నం) చంద్రశకల లవంగముల్‌(పచ్చకర్పూర పలుకులు, లవంగ మొగ్గలు) చాల కూర్చి, మదన కదనమునకు మదుపు కాగ...’ భర్తచే సగం కొరికించి ‘అందు అర్ధభాగము అర్ధాంగి గైకొనుట’ ముచ్చటైన దాంపత్య ‘సమ’భోగం. ఈ క్రమమంతా పరిశీలిస్తే ‘అష్టభోగాల్లో తాంబూలం ఒకటి’ అని మహాభారతం ఎందుకు చెప్పిందో తెలుస్తుంది.
మన పెద్దల జీవనశైలి ఎంత కళాత్మకమైనదో, ఎంత శాస్త్రీయమైనదో మనం అర్థం చేసుకోవాలి. కుంకుమపువ్వు జాపత్రి వంటి ఎన్నో శ్రేష్ఠమైన సుగంధ ద్రవ్యాలతో పద్ధతిగా చుట్టిన ఆ రోజుల్లో తాంబూలానికి, రకరకాల రంగుపొడులతో తమలపాకుల పొట్లంలా కట్టే ఈ రోజుల్లో కిళ్ళీలకు తేడా గమనించాలి. అంతేనా! ‘ఆ రోజుల్లో స్త్రీ పురుషులు సేవించే తాంబూలాలు వేరువేరుగా ఉండేవి’ అంది మనుచరిత్ర. గంధర్వకన్య వరూధిని ఆస్వాదించే తాంబూలం ‘మృగమద(కస్తూరి) సౌరభ విభవ ద్విగుణిత ఘనసార(పచ్చకర్పూరం) సాంద్ర వీటీగంధం’తో గుబాళించేదట. అంటే- దానిలో ఒక పాలు కస్తూరి, రెండు పాళ్లు పచ్చకర్పూరం కలిశాయని అర్థం. గాలిలో తేలి వచ్చిన ఆ అద్భుత తాంబూల పరిమళాన్ని బట్టే- తన సమీపంలో ఉన్నది ‘స్త్రీ’ అని ప్రవరాఖ్యుడు వెంటనే గుర్తించగలిగాడు. ‘మగువ పొలుపు తెలుపు ఒక్క మారుత మొలసెన్‌’ అని పెద్దన చెప్పిన మాటకు అర్థం అదీ! మగవారైతే తాంబూలంలో రెండు పాళ్లు కస్తూరి, ఒక పాలు కర్పూరం జోడిస్తారు. ఇందులో రహస్యం ఏమంటే- కస్తూరి బాగా వేడి చేస్తుంది. పచ్చకర్పూరం చలవ చేస్తుంది. తాంబూలాల్లో ఆడ, మగ తేడాలన్న మాటకు ఇంత కథ ఉంది. ముంబయికి చెందిన నౌషాద్‌ ప్రత్యేకంగా రూపొందించే పాన్‌లను సేవించడం ఒక జీవితకాలపు అనుభవంగా తాంబూల ప్రియులు చెప్పుకొంటున్నారు. ‘ది పాన్‌ స్టోరీ’ పేరుతో విక్రయించే రకరకాల తాంబూలాల్లో ‘తాజ్‌మహల్‌ పాన్‌’ వెల అక్షరాలా లక్ష రూపాయలట. తాంబూలాలు ఉంచే పెట్టెను ‘ఆకు పదరం’ అని, ‘అడపం’ అని అంటారు. ‘కుందనపు మిహి వెల్గ అందంద రత్న సంకలితలీల గ్రాలి విస్తారమైన అడపము... రత్నాలు పొదిగిన కాంతులీనే బంగారు భరణి...’ అని వేంకటాచలకవి కౌసల్యా పరిణయంలో వర్ణించిన తరహాలో- ముచ్చటైన పెట్టెలో పెట్టి కవిత్వ ముషాయిరాల్లో హుందాగా సేవించడం- ఉత్తరాదిన తాంబూలానికి దక్కిన గౌరవం!

సంప్రదాయం – సైన్స్‌ 
మన సంస్కృతిలో తాంబూలానికి (తమలపాకు)కు ఎంతో ప్రాధాన్యం ఉంది. దేవుళ్లకి తమలపాకులు తప్పకుండా అర్పిస్తాము. వివిధ శుభ కార్యాలు, నోములు, వ్రతాలు, జరిగినప్పుడు తాంబూలం ఇవ్వడం తప్పనిసరి . తమలపాకులను ఇలా ఇవ్వడం వలన శుభం చేకూరుతుంది. ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే, తమలపాకు మన ఆరోగ్యానికి చాలా మేలుచేస్తుంది. ఎముకలకు మేలు చేసే ‘‘ఎ’’ , ‘‘సి’’ విటమిన్‌ లు, కాల్షియం, ఫోలిక్‌ యాసిడ్‌ తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా తాంబూలంలో రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత శక్తి ఉంది. తమలపాకులో వుండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది.

∙షడ్రసోపేతమైన భోజనం చేశాక పచ్చ కర్పూరం, లవంగాలు, యాలకులు, సోంపు కలసిన తాంబూలం వేసుకుంటే, తిన్న ఆహారం తొందరగా వంటికి పడుతుంది. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ∙పాము విషంతో సహా అనేకరకాలయిన విషాలను హరించగల ఔషధ గుణాలు తమలపాకుకి ఉన్నాయట. చిన్న పిల్లలకి జలుబు చేసినపుడు తమలపాకు రసం ఒకటి రెండు చుక్కలు పాలతో రంగరించి ఇస్తే జలుబు, దగ్గు దూరమవుతాయి. తమలపాకుతో సున్నం కలిపి వేసుకొంటే శరీరంలో కాల్షియం సమపాళ్ళలో ఉండేలా చూస్తుంది. ఎముకలు అరిగిపోకుండా చూస్తుంది.                           

No comments:

Post a Comment