Monday, June 1, 2026

 ఆత్మ జ్ఞాన ప్రజ్వలనం.( Self enlightenment)

నేను, నాది అనే ఆలోచన మనిషిని అనాదిగా వెంబడిస్తున్న భావం. ఆ భావానికి మరియొక పేరు ‘అహం భావం’. ఆ భావాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనిషి ఋషిగా మారగలడు. ఆ భావాన్ని అపార్ధం చేసుకుంటే మానవుడు దానవుడుగా దిగజారగలడు.

‘ఏదీ నీది?’  అని ఒక్క సారి లోతుకెళ్లి ఆలోచిస్తే, ఈ విశ్వంలో ‘నాది’ అనేది యేది లేదు. మనిషి ఎప్పుడూ దేనినో ఒకదాన్ని పట్టుకుని "ఇది నాది"అని భ్రమిస్తుంటాడు. కానీ నిజానికి ఈ భూమి మీద మనదంటూ ఏదీ లేదు. ఈ ఇల్లు నాది. కొన్ని రోజుల ముందు ఇంకొకరిది. కొన్ని రోజుల తర్వాత మరియొకరిది. వందేళ్ల తరువాత ఈ ఇల్లు అనేదే వుండదు.మరియొక రూపంగా మార్పుచెందుతుంది.

కనీసం మనం బతకడానికి పీల్చే గాలి కూడా మనది కాదు; అది ఒక విశాలమైన ప్రకృతిలో భాగం. "ఈ గాలి లేకపోతే నేను లేను" అన్న చిన్న సత్యం తెలుసుకుంటే మనిషిలో ఉన్న అహంకారం నశించి, వినయం (Humility) పెరుగుతుంది. కృతజ్ఞతా భావం ఎదుగుతుంది . 

ఒక వేళ ప్రకృతిలో గాలి కరువై, గాలి అనేది, అంగటిలో కొనుక్కునే వస్తువై, భూమి మీద మనుషులు ఎక్కువై, గాలి తక్కువై, ఒక్క రోజు బ్రతకటానికి కావాల్సిన గాలికి ఖరీదు కట్టి, అందుకు నీ  ఇల్లు ఇచ్చేస్తావా అంటే, అరనిమిషం కూడా ఆలోచించకుండా దానికి అంగీకరిస్తాం. ఆది జరగడానికి అవకాశం ఉందని, ఈ ఆలోచన నిజం కావచ్చని, కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు నిరూపించాయి.

ప్రకృతి మాత నిన్ను బిడ్డగా భావించి తన చను పాలను గాలిగా మార్చి నీకందిస్తుంది. నీవు శ్వాస తీసుకునేటప్పుడు ప్రకృతిలో నుంచి, నీలోపలకు వచ్చే అతి స్వల్పమైన గాలి మాత్రమే నీది. ఆది కూడా, నీ లోపల ఉండే కొన్ని సెకండ్ల సమయంలో మాత్రమే ఆ గాలి నీది. మరు క్షణం నీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆ గాలి అందరిది. బయట ఉన్న అందరిదైన గాలి మళ్ళీ నీ లోపలకు రాక పొతే ‘నాది’అని భావించడానికి నీ మనసు వుండదు, నీ అహం వుండదు ,నీ దేహం వుండదు, నువ్వే ఉండవు. ఈ చిన్న సుష్మాన్ని గమనిస్తే ఈ విశ్వంలో ‘నాది’ అనేది ఏదీ లేదని మనకి అర్థం అవుతుంది.

మన జన్మ మనది కాదు.ఈ జన్మకు కారణం మనం కాదు. ఈ దేహానికి కారణం నీవు కాదు. మనకు జన్మ మరొకరిచేత  ఇవ్వబడింది. అమ్మానాన్నలు జన్మ ఇస్తే మనం జన్మను తీసుకున్నాం. పుట్టాలని మనం ఎప్పుడూ నిర్ణయించుకోలేదు. అది కేవలం మన తల్లిదండ్రుల నిర్ణయం . మనం పుట్టినప్పుడు కూడా మన పుట్టుక గురించి మనకు  తెలియదు. నీ ఆస్తిత్వం గురించి నీకు తెలియని నిన్ను కని, కంటికి రెప్పలాగా అయిదేళ్లు పెంచితే, అప్పుడు ఇహ లోక లౌకిక (అ)జ్ఞానాన్ని పొంది నేను నాది అని అరవడం, అడగటం కరవడం, మొదలు పెట్టాం. 

అప్పుడు మొదలయిన ‘నేను, నాది’ అనే ఇహ లోక లౌకిక (అ)జ్ఞాన పరంపర, ఈ కట్టె కాలే వరకూ కొనసాగుతూనే ఉంటుంది. ‘నాదీ’ అనే ఈ లౌకిక (అ)జ్ఞాన పరంపరకు అడ్డు కట్ట వేసి, అలౌకిక జ్ఞానమనే, ఆధ్యాత్మికత దారికి  మళ్లించనంతవరకూ, ఈ కట్టె మళ్ళీ మళ్ళీ కాలుతూనే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది.

ఆధ్యాత్మిక అలౌకిక జ్ఞానం నీలో అంకురించినప్పుడు నీ ఆలోచనా విధానమే మారిపోతుంది. ప్రపంచంలోని ప్రతి వస్తువు నీకు ఆధ్యాత్మిక కోణంలో దర్శనమిస్తుంది. అప్పుడు నీకు  “నేను ఇప్పటి దాక నాదీ, నాదీ అనుకున్న ఏదీ నాది కాదు, దానికి ప్రస్తుతానికి నేను ఒక ప్రతినిధిని మాత్రమే” అన్న సత్యం అవగతం అవుతుంది. ఈ దేహం ఒక దేవాలయం, వున్నవి అన్నీ ఈ దేవాలయానికి సంబంధించిన ఆస్తులు మాత్రమే అని బోధపడుతుంది. అవి చెందేది ఈ దేవాలయంలో కొలువై ఉన్న అంతరాత్మకేనని అర్ధమవుతుంది.  ‘నేను’ అనే నీవు ఈ దేవాలయానికి ఒక ధర్మకర్తవనే భావన నీలో స్పురిస్తుంది.

ఆలాంటి ఆత్మ జ్ఞాన ప్రజ్వలన (Self enlightenment) జరగాలంటే ఆధ్యాత్మిక సాధన అవసరం. అ సాధనకు మనం ఉపయోగించ వలసిన సాధనం ధ్యానం. ధ్యానం వల్ల వచ్చే ఫలమే అలౌకిక ఆత్మ జ్ఞాన ప్రజ్వలనం.

ఆచార్య డా అనిల్ ప్రసాద్

No comments:

Post a Comment