Monday, June 1, 2026

 ఆనందంగా ఉండటం అంటే ఏంటి? సుఖంగా ఉండటం అంటే ఏంటి? ఈ రెండు ఒక్కటి మాత్రం కాదు. తేడా ఏంటో చక్కటి ఉదాహరణ తో తెలుసుకుందాం.

ఆనందంగా ఉండటం వేరు. సుఖంగా ఉండటం వేరు. ఇవి రెండూ ఒకటే అనుకుంటాం.
కానీ కాదు.ఒక్క ఉదాహరణ చెప్తాను — నా జీవితం నుండి.
మా చిన్నప్పుడు నీళ్ళు తేవాలంటే ఒకటిన్నర కిలోమీటర్ దూరం నడవాలి. ఊరి మధ్యలో పెద్ద బావి ఉంది. తెల్లవారుజామున లేచి కావిడి భుజాన వేసుకుని బయలుదేరేవాళ్ళం. ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళేవాళ్ళం. ఒకళ్ళు తోడితే ఒకళ్ళు మోసేవాళ్ళం. ఇంటికి వచ్చి పెద్ద గాబుల్లో పోసేవాళ్ళం. మనుషులకే కాదు — పశువులకూ నీళ్ళు మోసేవాళ్ళం.
అది కష్టం. కానీ ఆ కష్టంలో ఏదో ఉంది.

కాలం మారింది. బావికి రాళ్ళతో గట్టు కట్టారు. పుల్లి వేశారు. తర్వాత వాటర్ ట్యాంక్ వచ్చింది. మోటర్ వచ్చింది. తర్వాత మిషన్ భగీరథ వచ్చింది. ఇప్పుడు కిచెన్ లో నల్లా తిప్పితే నీళ్ళు వస్తాయి. ఇది సుఖం.

మరి ఆనందం?ఆ కావిడి వేసుకుని నడిచిన దారిలో — పక్కన నడిచిన మనుషులు, చీకట్లో కబుర్లు, బావి దగ్గర నవ్వులు, నీళ్ళు మోసి ఇంటికి వచ్చినప్పుడు తల్లి ముఖంలో సంతోషం — అది ఆనందం.
టాప్ తిప్పితే నీళ్ళు వస్తాయి. కానీ ఆ నవ్వులు రావు. ఆ కబుర్లు రావు. ఆ అనుభవం రాదు.
ఇప్పుడు తేడా అర్థమైందా? సుఖం అంటే — కష్టం లేకుండా దొరికేది. ఆనందం అంటే — కష్టపడి సాధించినప్పుడు లోపల కలిగేది.

మరొక ఉదాహరణ చూద్దాం.
మిఠాయి కొనాలని అనిపించింది. దుకాణానికి వెళ్ళే దారిలో మనసు ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. కొని నోట్లో పెట్టుకున్న క్షణం — అదే peak. ఆ స్వీట్ నోట్లో కరిగే వరకు ఆనందం ఉంటుంది. మింగిన తర్వాత? మళ్ళీ మామూలే.

దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు అంతే. టికెట్ బుక్ చేసుకోవడం, సామాను సర్దుకోవడం, బస్సు ఎక్కడం, క్యూ లో నిలబడటం — ఇవన్నీ కష్టమే. కానీ ఆ కష్టమంతా చేసి దేవుడిని చూసిన క్షణం — అది వేరే స్థాయి. ఆ ఒక్క క్షణంలో అన్ని కష్టాలు మర్చిపోతాం.
అదే ఆనందం.

పెద్దలు ఏమంటారు అంటే —
సంస్కృతంలో రెండు పదాలు ఉన్నాయి. ప్రేయస్ అంటే ఇప్పుడు బాగుందనిపించేది — అది సుఖం. శ్రేయస్ అంటే చివరికి మేలు చేసేది — అది ఆనందం. కఠోపనిషత్తులో యముడు నచికేతుడికి అదే చెప్పాడు. ప్రేయస్ ని వదిలి శ్రేయస్ ని ఎంచుకున్న వాడే జ్ఞాని అని. సుఖం ప్రేయస్. ఆనందం శ్రేయస్.

ఆధునికంగా చూస్తే —
Psychology లో దీన్ని Hedonic vs Eudaimonic అంటారు. Hedonic అంటే pleasure — తింటే కలిగేది, నిద్రపోతే కలిగేది. Eudaimonic అంటే meaning — ఏదో సాధించినప్పుడు కలిగేది, ఎవరికైనా మేలు చేసినప్పుడు కలిగేది.
Hedonic సుఖం. Eudaimonic ఆనందం.

కావిడి వేసుకుని నీళ్ళు తెచ్చినప్పుడు — సుఖం లేదు, ఆనందం ఉంది. టాప్ తిప్పితే నీళ్ళు వచ్చినప్పుడు — సుఖం ఉంది, ఆనందం తక్కువే. అందుకే పెద్దవాళ్ళు అన్నారు —
కష్టపడి సంపాదించిన అన్నం తీపిగా ఉంటుంది.అందుకొని తీన్న అన్నం తినాలని అనిపించదు. 
సుఖం దొరుకుతుంది. ఆనందం సాధించాలి. అదే తేడా.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏

No comments:

Post a Comment