PRATIKULA VEDAM
36 minutes ago (edited)
మనల్ని నాశనం చేసింది నిజంగా బ్రిటిష్ వాళ్ళా?
మన తెలుగు రాష్ట్రాల్లో, ఒక మాట పదే పదే వినిపిస్తూ ఉంటుంది. ఈ బ్రిటిషోడు వచ్చి మన విద్యావ్యవస్థను నాశనం చేశాడు.. ఆ Macaulay గాడు మనల్ని కేవలం గుమస్తాలుగా మార్చేశాడు.. ఇప్పుడు మనం Western Science అని ఆశ్చర్యపోతున్నమేవైనా, మన ప్రాచీన వేదాలు, ఉపనిషత్తుల కంటే గొప్పవా? అని.
కానీ, ఒక్క క్షణం ఆగి, కాస్త లాజికల్ గా ఆలోచించండి.
"మన ప్రాచీన గ్రంథాలు చాలా గొప్పవి, విదేశీయులొచ్చి వాటిని నాశనం చేశారు" అని చొక్కాలు చించుకునే వాళ్లందరినీ ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. మీరు గొప్పగా చెబుతున్న ఆ వేదాలు, మీ జీవితంలో ఎప్పుడైనా చదివారా? పోనీ, ఉపనిషత్తుల్లో ఏముందో కనీసం ఒక్క పేజీ అయినా చదివి అర్థం చేసుకున్నారా?
మీ లోపల ఉన్న నిజాయితీని అడిగితే వచ్చే సమాధానం... 'లేదు, చదవలేదు'.
మరి చదవనప్పుడు, అసలు ఆ పుస్తకంలో ఏముందో తెలియనప్పుడు, అవి ప్రపంచంలోనే గొప్పవని మీకెలా తెలుసు? ఎవరో Youtube లో అరచి చెబుతుంటే వినా? లేక సోషల్ మీడియాలో వచ్చిన forward messages చూసా? ఏ విషయమూ తెలియకుండా, మన చరిత్ర ఎంతో గొప్పది అని ఎవడో Youtube లో చెప్పిన ఒక వీడియో చూసి, ఒక గుడ్డి వ్యామోహంతో "మాదే గొప్ప" అని భుజాలు చరుచుకోవడం ఎంతవరకు లాజికల్? అసలు ఇలా గుడ్డిగా నమ్మడమే మన విద్యావ్యవస్థ ఫెయిల్యూర్ కి అతిపెద్ద ఉదాహరణ కాదా? ఇదంతా కేవలం మీ Ego ని తృప్తి పరుచుకోవడానికి ఆడుతున్న నాటకం కాదా?
ఇక అసలు విషయానికి వద్దాం.
మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్నది ఏంటి? గల్లీకో Corporate College, అగ్గిపెట్టెల్లాంటి క్లాస్ రూములు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పిల్లల మెదడును పిండేస్తున్నాం. పిల్లల్ని ఒక జైలులో పెట్టి, Physics, Maths ఈక్వేషన్లను వాళ్ళతో "బట్టీ పట్టించే" ఈ రాక్షస విధానాన్ని తీసుకొచ్చింది ఏ బ్రిటిష్ వాడు? ఏ విదేశీయుడు వచ్చి విజయవాడలో, హైదరాబాద్ లో ఈ కార్పొరేట్ ర్యాంకుల ఫ్యాక్టరీలను స్థాపించాడు?
ఎవరూ చేయలేదు. మనమే చేసుకున్నాం.
But మనం ఎప్పుడూ ఒక External force ని నిందించడానికి ఇష్టపడతాం. ఎందుకంటే, తప్పు ఎదుటివాడిది అంటే, మనం హాయిగా పడుకోవచ్చు. బాధ్యత నుండి పారిపోవచ్చు.
కానీ వాస్తవం ఏంటి? 1947 లో మనకు స్వాతంత్య్రం వచ్చింది. సుమారు 80 ఏళ్లు కాబోతోంది. మనం సార్వభౌమాధికారం ఉన్న దేశం. మన విద్యాశాఖ మంత్రులను మనమే ఎన్నుకుంటున్నాం. మరి ఇంత స్వేచ్ఛ ఉన్నప్పుడు, ఒకవేళ మన సిలబస్ నిజంగానే బానిసల సిలబస్ అయితే, దాన్ని మార్చకుండా మనల్ని ఎవరు ఆపారు? Climate change గురించి, Artificial Intelligence గురించి మన పుస్తకాల్లో లేకపోతే, దానికి కూడా ఆనాటి విదేశీయులే కారణమా?
కారణం వాళ్లు కాదు, మనం. మనకు మార్చడం ఇష్టం లేదు. ఎందుకంటే మనుషులను తయారు చేసే విద్య కంటే, మార్కెట్లో అమ్ముడుపోయే మిషన్లను తయారు చేసే విద్యే మనకు లాభదాయకం. తీరా వ్యవస్థ నాశనం అయ్యాక మాత్రం, ఎక్కడో వందల ఏళ్ల క్రితం చచ్చిపోయిన Macaulay మీద పడి ఏడుస్తుంటాం. ఇది హిపోక్రసీ కాదా?
ఇది చదివిన తర్వాత మీలో చాలామందికి కోపం రావచ్చు, మీ నమ్మకాల మీద దాడి జరిగినట్టు అనిపించొచ్చు. అవును. నేను కోరుకుంటున్నది కూడా అదే. ఎవరినో నిందించడం ఆపేసి, ఇప్పుడు నేను అడిగే ఈ ప్రశ్నలకు మీకు మీరే నిజాయితీగా సమాధానం చెప్పుకోండి..
🟠మీరు ప్రాచీన సంస్కృతి, భారతీయ విజ్ఞానం గొప్పది అని బలంగా నమ్ముతున్నారు కదా. మరి మీ పిల్లల్ని ఆ సంస్కృతాన్నో, తత్వశాస్త్రాన్నో చదవమని మీరు ఎప్పుడైనా ప్రోత్సహించారా? లేక బలవంతంగా బైపీసీ, ఎంపీసీ గ్రూపుల్లోనే చేర్పించారా?
⚪పాశ్చాత్య దేశాలు మన విద్యావ్యవస్థను నాశనం చేశాయని, వాళ్ల సంస్కృతి చెత్త అని విమర్శించే మీరు.. మీ పిల్లవాడికి అమెరికాలో ఉద్యోగం వస్తే ఊరందరికీ ఎందుకు గర్వంగా చెప్పుకుంటారు?
🟢జ్ఞానం అంటే మార్కులు కాదని, విషయ పరిజ్ఞానం అని ఒప్పుకునే మీరు.. మీ పక్కింటి వాడికి 98% వచ్చి, మీ పిల్లాడికి 70% వస్తే, ఇంట్లో మీ పిల్లవాడిని ఎందుకు అవమానిస్తారు?
⚪మీరు కోరుకుంటున్నది నిజంగా విజ్ఞానమా? లేక ఆ విజ్ఞానం ముసుగులో డబ్బు, హోదా తెచ్చిపెట్టే ఒక వ్యాపారమా?
🟠ఇదంతా మీరే చేస్తున్నప్పుడు, మీ స్వార్థమే ఈ వ్యవస్థను నడుపుతున్నప్పుడు.. మధ్యలో ఆ బ్రిటిష్ వాడిని నిందించడం, కేవలం మీలోని నేరస్థుడిని కాపాడుకునే ప్రయత్నం కాదా?
వేదాలు, ఉపనిషత్తులు అని గొప్పలు చెప్పే మనమే, పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చి వాళ్ళ బాల్యాన్ని నాశనం చేస్తున్నాం. ఎందుకు? ఎందుకంటే మనకు అసలైన జ్ఞానం అవసరం లేదు. మనకు కావాల్సింది ఒక IIT సీటు, ఆ తర్వాత అమెరికాలో ఒక H1B వీసా, లక్షల డాలర్ల ప్యాకేజీ. మన స్వార్థం కోసం, మన అత్యాశ కోసం మనమే ఈ వ్యవస్థను సృష్టించుకున్నాం. బయటకేమో పాశ్చాత్య సంస్కృతిని తిడతాం, కానీ లోపల మాత్రం మన పిల్లవాడు ఆ పాశ్చాత్య దేశానికే వెళ్లి స్థిరపడాలని కోరుకుంటాం. ఈ Double standards తో బ్రతకడానికి సిగ్గు లేదా?
-PRATIKULA VEDAM 🇮🇳
17
No comments:
Post a Comment