తెలుగు పుస్తక ప్రపంచం:
తెలుగు సాహితీలోకంలో లబ్ధప్రతిష్ఠులు, పండితులు, పరిశోధకులు, ప్రాచీన వాఙ్మయ ప్రియులు అయిన శ్రీ #వేటూరి #ప్రభాకరశాస్త్రి గారు 🙏 తెలుగుదేశంలో బాలబాలికలు పాడే పాటలు, పలికే మాటలు, చెప్పుకునే కథలు కొన్నింటిని సేకరించి 'భారతి' (1930) లో #బాలభాష అనే పేరుతో ప్రచురించారు.
బాలభాషలోని ఈ అమూల్యమైన అచ్చతెనుగు బాలగేయాలను ఆంధ్రభారతి అంతర్జాల పత్రిక వారు ప్రచురించారు. అందులో కొన్ని మీ కోసం..
***********
#వానవల్లప్పలు
(వల్లప్పా! వల్లప్పా! వాన కురుస్తున్నదంటుంది చెల్లెలు. బయటకుపోక చెల్లెలును వాకిట్లోనే ఆడుకోమంటాడు వల్లప్ప. వానలో తిరిగితే కొండమీదినుండి (ఆకాశం నుండి) గుండురాళ్లు (వడగళ్లు) పడి కొక్కిరాయి (అల్లరి పిల్లవాడు) కాలు విరిగింది - కాబట్టి వానలోకి పోవద్దని వల్లప్ప అంటే, కాలు విరిగితే మందు ఏమిటని చెల్లెలు అడుగుతుంది.)
(వేపాకు, పసుపు, వెల్లుల్లిపాయ నూనెలో మడ్డి - ఇవన్నీ కలిపి, నూటొక్క సారిపిండి (ఆవర్తితతైలము) ఆ తైలమును పూట కొకసారి విరిగిన కాలుకు రాస్తే, కూడు కొంటుందంటాడు వల్లప్ప.)
వానా వానా వల్లప్ప!
వాకిలి తిరుగూ చెల్లప్ప!
కొండమీది గుండురాయి
కొక్కిరాయి కాలువిరిగె
దానికేమి మందు?
వేపాకు పసుపూ,
వెల్లుల్లిపాయ,
నూనె లోమడ్డి (నూనెమ్మ బొట్టు,)
నూటొక్కసారి,
పూయవోయి నూరి,
పూటకొక్కతూరి
***********
#ఉగ్గు
ఊఁ ఊఁ ఉంగన్న,
ఉగ్గుపాలు ఇందన్న.
గుంటెడు ఉగ్గు కమ్మన్న,
ఉమ్మక కక్కక మింగన్న.
ఊఁ ఊఁ ఊఁ ఉంగన్న,
లుంగలు పెట్టకు గ్రుక్కన్న.
ఓర్వని సవతుల దిష్టన్న,
ఒప్పుగ మసలర బుచ్చన్న
***********
#జీర్ణం_జీర్ణం వాతాపి జీర్ణం!
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం!
గుఱ్ఱాల్ తిన్న గుగ్గిళ్లరిగి,
ఏనుగుల్ తిన్న వెలక్కాయలరిగి,
అర్జునుడు తిన్న అరటిపళ్లరిగి,
భీముడు తిన్న పిండివంటలరిగి,
గణపతి తిన్న ఖజ్జాలరిగి,
అబ్బాయి తాగిన పాలు ఆముదం అరిగి,
పందల్లే పాకి, కుందల్లే కూర్చుండి,
నందల్లే నడచి, గుఱ్ఱమంత పరుగు,
ఏనుగంత సత్తువు ఉండేటట్టు
సాకుమీ, యీ బిడ్డను సంజీవరాయా!
***********
#చెమ్మచెక్క
చెమ్మచెక్క, చేరెడేసిమొగ్గ,
అట్లుపొయ్యంగ, ఆరగించంగ,
ముత్యాల చెమ్మచెక్క ముగ్గు లెయ్యంగ,
రత్నాలచెమ్మచెక్క రంగు లెయ్యంగ,
పగడాల చెమ్మచెక్క పంది రెయ్యంగ,
పందిట్లో మాబావ పెండ్లి చెయ్యంగ,
చూచివద్దాం రండి, సుబ్బరాయుడు పెండ్లి,
(సూర్యదేవుడి పెండ్లి, చూచివద్దాం రండి,)
మావాళ్లింట్లో పెండ్లి, మళ్లీ వద్దాం రండి,
దొరగారింట్లో పెండ్లి,
దోచుకువద్దాం రండి.
***********
శ్రీ #సూర్యనారాయణా!
పుట్టేటి భానుడా, పుష్యరాగపుచాయ
శ్రీసూర్యనారాయణా!
పుష్యరాగము మీద పొంగుబంగరుచాయ
శ్రీసూర్యనారాయణా!
జామెక్కి భానుడా, జాజిపువ్వులచాయ
శ్రీసూర్యనారాయణా!
జాజిపూవులమీద సంపెంగపువుచాయ
శ్రీసూర్యనారాయణా!
మధ్యాహ్న భానుడా, మల్లెపూవులచాయ
శ్రీసూర్యనారాయణా!
మల్లెపూవులమీద మంచి వజ్రపుచాయ
శ్రీసూర్యనారాయణా!
మూడ్జాముల భానుడా, మునగపూవులచాయ
శ్రీసూర్యనారాయణా!
మునగపువ్వులమీద ముత్యాలపొడిచాయ
శ్రీసూర్యనారాయణా!
క్రుంకేటి భానుడా, గుమ్మడీపువుచాయ
శ్రీసూర్యనారాయణా!
గుమ్మడీపువుమీద కుంకుం పువుచాయ
శ్రీసూర్యనారాయణా!
ఆయురారోగ్యములు ఐశ్వర్యములనిమ్ము
శ్రీసూర్యనారాయణా!
***********
#చిట్టిపొట్టి_మిరియాలు
చిట్టిపొట్టి మిరియాలు
చెట్టుక్రింద పోసి
పుట్టమన్ను తెచ్చి,
బొమ్మరిల్లు కట్టి,
బొమ్మరింట్లో
బోగం పాప కన్నది.
బిడ్డతలకు చమురులేదు,
నా తలకు నూనెలేదు,
అల్లవారింటికి
చల్లకుపోతే
కలవారి కుక్క
భౌవ్ మన్నది!
నాకాళ్ల గజ్జెలు
ఘల్లుమన్నవి!!
***********
#ఒప్పులకుప్ప
ఒప్పులకుప్పా,
ఒయ్యారిభామ!
సన్నబియ్యం,
చాయపప్పు;
చిన్నమువ్వ,
సన్నగాజు;
కొబ్బరి కోరు,
బెల్లపచ్చు;
గూట్లో రూపాయి,
నీ మొగుడు సిపాయి;
రోట్లో తవుడు,
నీ మొగుడెవడు?
***********
#గుడుగుడుకుంచం...
గుడుగుడుకుంచం గుండేరాగం,
పావడపట్టం పడిగేరాగం,
అప్పడాలగుఱ్ఱం ఆడుకోబోతే,
పేపేగుఱ్ఱం పెళ్లికిపోతే,
అన్నా! అన్నా! నీపెళ్లెపుడంటే
రేపుగాక, ఎల్లుండి.
-- కత్తీగాదు, బద్దాగాదు గప్, చిప్!
***********
#కాళ్లాగజ్జీ...
కాళ్లాగజ్జీ, కంకోలమ్మూ (గంగారమ్మా),
వేగులచుక్కా, వెలగామొగ్గ,
మొగ్గాకాదు, మోదుగనీరు,
నీరూగాదు, నిమ్మలవారి,
వారీగాదు, వావింటాకు (కూర),
కూరాగాదు, గుమ్మడిపండు,
పండూగాదు, పాపడిమీసం,
లింగూలిటుకు, పందిమాల్నిపటుకు,
రాజుగారితోట్లో యేముందంటే,
పువ్వో, మొగ్గో పుచ్చుకుంటే దెబ్బ,
కాల్దీసి కడగాబెట్టు.
***********
#దాగుడుమూతలు
దాగుడుమూతా దండాకోర్,
పిల్లీవచ్చె ఎలుకా దాగె!
ఎక్కడి దొంగా లక్కడే
గప్చిప్ - సాంబారుబుడ్డి.
***********
#కంచికామాక్షమ్మ
కంచికి పోతావా కృష్ణమ్మా!
ఆ - కంచి వార్తలేమి కృష్ణమ్మా?
కంచిలో ఉన్నది అవ్వ;
ఆ - అవ్వ నాకు పెట్టు బువ్వ.
బువ్వ ఉన్నదిగాని కృష్ణమ్మా,
నీకు - పప్పు ఎక్కడిదోయి కృష్ణమ్మా?
కోమటి యింటిది అప్పు;
ఆ - అప్పు నాకు పెట్టు పప్పు.
పప్పు ఉన్నదిగాని కృష్ణమ్మా,
నీకు - కూర యెక్కడి దోయి కృష్ణమ్మా?
దొడ్లోను ఉన్నది బీర;
ఆ - బీర నాకు పెట్టు కూర.
కూర ఉన్నదిగాని కృష్ణమ్మా;
నీకు - నెయ్యి యెక్కడిదోయి కృష్ణమ్మా?
కోమటి అక్కెమ్మ చెయ్యి;
ఆ - చెయ్యి నాకుపోయు నెయ్యి.
నెయ్యి ఉన్నదిగాని కృష్ణమ్మా;
నీకు - పెరుగు ఎక్కడిదోయి కృష్ణమ్మా?
ఉన్నయింటి యిరుగుపొరుగు,
ఆ - పొరుగు నాకుపోయు పెరుగు.
బువ్వ తిందువుగాని కృష్ణమ్మా;
నీకు - ఆ వూళ్ళోపనియేమి కృష్ణమ్మా?
అక్కడ ఉన్నది అమ్మ,
నేను - మొక్కివత్తును కామాక్షమ్మ.
***********
#అట్లతద్ది
అట్లతద్దోయ్, అట్లతద్దోయ్!
ముద్దపప్పోయ్, మూడట్లోయ్!
చిప్పచిప్ప గోళ్లు,
సింగరయ్య గోళ్లు;
మా తాత గోళ్లు,
మందాపరాళ్లు!
***********
#చక్కిలిగింతలు
పప్పుపెట్టి, పాయసంపెట్టి,
అన్నంపెట్టి, అప్పచ్చిపెట్టి,
కూరపెట్టి, ఊరుగాయపెట్టి,
నెయ్యివేసి, ముద్దచేసి,
తినిపించి, తినిపించి,
చెయిగడిగి, మూతిగడిగి,
తాతగారింటికి దారేదంటే,
(అత్తవారింటికి దారేదంటే,)
ఇట్లాపోయి, ఇట్లాపోయి,
మోచేతిపాలెం ముందర్నించి,
ఇట్లాపోయి, ఇట్లాపోయి,
ఇదిగో ఇదిగో, వచ్చాంవచ్చాం,
చక్కావచ్చాం, చక్కావచ్చాం,
చక్కిలిగిలిగిలి, చక్కిలిగిలిగిలి!
***********
#తారంగం
తారంగం తారంగం
తాండవకృష్ణా తారంగం
వేణూనాధ తారంగం
వేంకటరమణా తారంగం
వెన్నలదొంగా తారంగం
చిన్నికృష్ణా తారంగం
***********
#కలువరేకుల_కళ్ళు
పిల్లమ్మ కన్నుల్లు బీరపువ్వుల్లు,
అబ్బాయి కన్నుల్లు కలువరేకుల్లు.
కలువరేకులవంటి నీ కన్నులకును,
కాటుకలుపెట్టితే నీకు అందమ్ము.
ఏడువకు ఏడువకు వెఱ్ఱిఅబ్బాయి,
ఏడుస్తె నీకళ్ళు నీలాలు కారు.
నీలాలు కారితే నే జూడలేను,
పాలైన కారవే బంగారు కళ్ళు
***********
#ఏనుగమ్మా_ఏనుగు!
ఏనుగమ్మా ఏనుగు!
ఏ ఊరొచ్చింది ఏనుగు?
మా ఊరొచ్చింది ఏనుగు.
ఏం చేసింది ఏనుగు?
మంచినీళ్లు తాగింది ఏనుగు.
ఏనుగు ఏనుగు నల్లన్న,
ఏనుగు కొమ్ములు తెల్లన్న,
ఏనుగుమీద రాముడు
ఎంతో చక్కని దేవుడు!
***********
#సందెగొబ్బె
సీతమ్మ వాకిటా
చిరుమల్లెచెట్టు
చిరుమల్లెచెట్టేమొ
చితుకచూసింది.
(చిగిరించి పూసె)
చెట్టు కదలాకుండ
కొమ్మవంచండి;
పట్టి పూవులుకోసి,
బుట్ట నింపండి;
అందులో పెద్దపూలు
దండ గుచ్చండి;
దండ తీసుకువెళ్లి
సీత కివ్వండి.
దాచుకో సీతమ్మ
దాచుకోవమ్మ!
(రాముడంపాడు)
దాచుకోకుంటేను
దోచుకొంటారు;
దొడ్డి గుమ్మములోన
దొంగలున్నారు.
***********
#గుమ్మాడమ్మా...
గుమ్మాడమ్మా గుమ్మాడీ,
ఆకుల్లువేసింది గుమ్మాడీ,
పూవుల్లు పూసింది గుమ్మాడీ,
పండ్లుపండిందమ్మ గుమ్మాడీ,
అందులో ఒకపండు గుమ్మాడీ,
అతి చక్కనీ పండు గుమ్మాడీ,
ఆ పండు యెవరమ్మ గుమ్మాడీ,
మాచిట్టి తండ్రమ్మ, గుమ్మాడీ!
***********
#దీపారాధన
రక్ష రక్ష!
సంధ్య రక్ష!
సర్వ రక్ష!
దీపరక్ష!
దివ్య రక్ష!
చిన్ని నా అబ్బాయికి
శ్రీరామ రక్ష!
(దీపం పెట్టగానే దీపానికి అరచేయి చూపి,
అబ్బాయి కండ్లకు అద్దుతూ ఈ పాట పాడుతారు.)
***********
#జోలపాట
శ్రీరమ్యదేహ లాలీ! మాముద్దు
చిన్నారి కూన లాలీ!
గారాల కూచిలాలీ! మాయప్ప
కంజాతనయన లాలీ!
సకల లోకాధారుడూ! మునిమనో
జలజాత సంచారుడూ,
అకలంక గుణపూరుడూ, మముబ్రోచు
ఆర్యామనోహరుడూ,
ఇందీవరేక్షణుండు, నిజభక్త
బృందారకావనుండు
ఇందిందిరాలకుండూ, మముబ్రోచు
ఇందిరా నాయకుండు.
శ్రీవాగ్మనోధినేత నిజభక్త
చింతితాభీష్టదాత,
దేవేశు డా విధాత నీకు తా
దీర్ఘాయు వొసగు గాత!!
***********
#కూనలమ్మ_పదాలు
('కూనరాగాలు' తీస్తునాడని మధ్యాంధ్రదేశమందున్నూ, 'కూనలమ్మ సంగీతాలు' తీస్తున్నాడని దత్తమండల మందున్నూ వాడుకలో నానుడి పలుకు ఉన్నది. అది ఈక్రింది పదాలనుబట్టి పుట్టినది. ఇట్టి పదము లెన్ని ఉన్నవో తెలియదు. అరవములో అవ్వయార్ పదా లెంత విలువగలవో తెలుగులో కూనలమ్మపదాలు కూడా అంత విలువ గలవే అనవచ్చును.)
జప తపంబులకన్న,
చదువు సాములకన్న,
ఉపకారమే మిన్న,
ఓ కూనలమ్మా!
అన్న మిచ్చినవాని,
నాలి నిచ్చినవాని,
నపహసించుట హాని,
ఓ కూనలమ్మా!
మగనిమాటకు మాటి,
కెదురు పల్కెడు బోటి,
మృత్యుదేవత సాటి,
ఓ కూనలమ్మా!
కాపువాడే రెడ్డి,
గరికపోచే గడ్డి,
కానకుంటే గుడ్డి,
ఓ కూనలమ్మా!
కవితారసపుజల్లు,
ఖడ్గాల గలుగల్లు,
కరణాలకే చెల్లు,
ఓ కూనలమ్మా!
దుర్యోధనుడు భోగి,
ధర్మరాజొక జోగి,
అర్జునుండే యోగి,
ఓ కూనలమ్మా!
భీష్ముడనుభవశాలి,
భీముడే బలశాలి,
కర్ణుడే గుణశాలి,
ఓ కూనలమ్మా!
ఆడితప్పినవాని,
నాలినేలనివాని,
నాదరించుట హాని,
ఓ కూనలమ్మా!
***********
#ఉన్నఊరు
ఉన్నఊరూ విడిచి
ఉండనే లేము;
కన్నతల్లిని విడిచి
ఘడియుండలేము.
ఉన్న ఊరే నాకు
చెన్నపట్ణమ్ము;
కన్నతల్లే నాకు
కల్పవృక్షమ్ము
***********
#శ్రీరాములవారు
ఉత్తముని పేరేమి?
ఊరి పేరేమి?
సత్యపురుషులగన్న
సాధ్వి పేరేమి?
ఉత్తముడు దశరథుడు,
ఊరు అయోధ్య!
సత్యపురుషులగన్న
సాధ్వి కౌసల్య.
ఇల్లాళ్ళు ముగ్గురే
ఈ దశరథునకు;
పిల్లాళ్లు నలుగురే
పేరు గలవారు.
అయ్యోధ్యలో వారు
అంద రున్నారు;
సయ్యోధ్యలో వారు
సరిలేని వారు
శ్రీరామ! జయరామ! శృంగారరామ!
కారుణ్య గుణధామ! కల్యాణనామ!
జగతిపై రామయ్య జన్మించినాడు,
సత్యమ్ము లోకాన స్థాపించినాడు.
తల్లిదండ్రులమాట చెల్లించినాడు,
ఇల్లాలితోపాటు హింసపడ్డాడు,
సీతామహాదేవి సృష్టిలోపలను,
మాతల్లి వెలసింది మహనీయురాలు.
అయ్యోధ్యరామయ్య అన్నయ్య మాకు,
వాలుగన్నులసీత వదినమ్మ మాకు.
రాములంతటివాడు రట్టుపడ్డాడు,
మానవులకెట్లమ్మ మాటపడకుండ!
సీతమ్మ రామయ్య దారిగదిలీతె,
పారిజాతపు పువులు పలవరించినవి.
సీతపుట్టగనేల! లంకచెడనేల?
లంకకు విభీషణుడు రాజుగానేల?
ఏడు ఏడూ యేండ్లు పదునాలుగేండ్లు,
ఎట్టులుంటివి సీత నట్టడవిలోను?
లక్ష్మయ్య నామరిది రక్షిస్తూఉండ,
నాకేమి భయ మమ్మ, నట్టడవిలోను?
దేవునంతటివాడు జననింద పడెను,
మానవుం డెంతయ్య మాటపడకుండ?
అన్నదమ్ములులేక, ఆదరువులేక,
తోడులేకా సీత దూరమైపోయె.
దండమ్ము దండమ్ము దశరథరామ!
దయతోడ మముగావు దాక్షిణ్యధామ!
***********
#ఎందుకురా
ఎండలు కాసే దెందుకురా?
మబ్బులు పట్టే టందుకురా.
మబ్బులు పట్టే దెందుకురా?
వానలు కురిసే టందుకురా.
వానలు కురిసే దెందుకురా?
చెరువులు నిండే టందుకురా.
చెరువులు నిండే దెందుకురా?
పంటలు పండే టందుకురా.
పంటలు పండే దెందుకురా?
ప్రజలు బ్రతికే టందుకురా.
ప్రజలు బ్రతికే దెందుకురా?
స్వామిని కొలిచే టందుకురా.
స్వామిని కొలిచే దెందుకురా?
ముక్తిని పొందే టందుకురా
***********
#మంచిమాటలు
ఒంటికణతా నొప్పి
ఒరగాలితీపు
పంటిపోటూ వద్దు
పగవానికైన.
విద్య లేకుంటేను
విభవమ్ము రోత;
వినయమ్ము లేకుంటె
విద్యలూ రోత.
నిదురలో ప్రాణమ్ము
అదరునో యేమొ;
నిష్ఠురా లేలమ్మ
కష్టజీవులపై?
ఓ చేడెకూ తగిలె
మోచేతిదెబ్బ;
అత్తింటి సౌఖ్యమని
అంగలార్చింది.
మారుతల్లీ చేత
మాటపడలేక,
సారంగధరుడమ్మ
చావు కొప్పాడు.
కృష్ణమ్మ వంటి వాడు
కొడు కొకడు పుడితే
కష్టాలు కడతేరు
కన్నతల్లులకు.
బియ్యమ్ము తెల్లన్న, పిండి తెల్లన్న,
వరుస తప్పినవాని వలికి తెల్లన్న,
వరుసగానీదాన్ని వరుసలాడేవు
పాపాత్మ! నీశిరసు పక్కున్న పగులు.
కాలినిండా గుడ్డ వెయ్యంది రోత,
కానివాళ్ల కన్నెత్తి చూచింది రోత,
మంచిగంధపుచెక్క సాననే చీకు,
మంచాలిదేహమ్ము మనసులో చీకు.
ఆయుస్సు మూడినను
ఆకు చిరిగినను,
బ్రతికించువా రెవరు?
అతుకువారెవరు?
***********
#చదువుసందెలు
విఘ్నమ్ము లేకుండ
విద్య నియ్యవయ్య
విఘ్నేశ్వరుడ నీకు
వేయిదండాలు.
ఉంగరమ్ములు పెట్టి, ముంగురులు దువ్వి,
ఒద్దపెట్టుకు తల్లి ముద్దులాడింది;
పలక బలపములిచ్చి, పద్యాలుపాడి,
సరసపెట్టుకు తండ్రి చదువు నేర్పాడు.
చదువుకో నాయన్న! చదువుకో తండ్రి!
చదువుకొంటే నీకు సౌఖ్యమబ్బేను!
ఆడుకో నాయన్న! ఆడుకో తండ్రి!
ఆడుకొంటే నీకు హాయి కలిగేను!
పిల్లలందరు రండి
బళ్లోకిపోయి
చల్లన్ని గాలిలో
చదువుకుందాము.
విసరూ విసరూ గాలి
విసరవే గాలి
మల్లెపూవుల గాలి
మామీద విసరు.
అరటిపండూ తీపి, ఆవుపాల్ తీపి
మాచిన్ని అబ్బాయి మాటల్లు తీపి.
చదువంటె అబ్బాయి
చండికేశాడు
బద్దెపలుపా రావె
బుద్ధిచెప్పాలి.
చదువంటె అబ్బాయి
సంతోషపడును
అగసాలి రావయ్య
నగలు చెయ్యాలి.
పొరుగు పిల్లలతోను
పోట్లాడబోక;
ఇరుగు పిల్లలతోను
యేట్లాడబోక.
చక్కగా నీ చదువు
చదువుకో తండ్రి!
చదువుకొంటే నీకు
సౌఖ్యమబ్బేను
***********
#వెన్నెల_గుజ్జులు
వెన్నెల రాత్రులందు పసిబిడ్డలను ఎత్తుకొని చందమామ ముచ్చట్లు
చెప్పుతూ ఆరబైట అన్నము తినిపించడము తల్లులకు అలవాటు.
"అమ్మా, చూడు. చందమామలో ఒక ముసలమ్మ పొయిమీద
కుండపెట్టుకొని అన్నము వండుకొంటూ కూర్చున్నది! చూచావా!
అదుగో! నల్లగా కనపడు తున్నది!" అంటారు. ఈ పదము చెప్పుతారు.
***********
#చందమామ_రావె! జాబిల్లిరావె!
కొండెక్కిరావె! గోగుపూలు తేవె!
ఒలవనిపండు ఒళ్లోఉంచుకొని,
ఒల్చినపండు చేత బుచ్చుకొని,
వెండిగిన్నెలో వెన్న పెట్టుకొని,
పమిడిగిన్నెలో పాలు పోసుకొని,
అమ్మా, నువ్వూ తిందురుగాని!
అట్టా అట్టా రావె!
చందమామా!
ఇంకా ఈ పద్యములు కూడా చెప్పుతారు...
వెండిగిన్నెలోన వెన్నయు నెయి పోసి,
పమిడిగిన్నెలోన పాలు పోసి,
చందమామరావె! జాబిల్లిరావె! మా
చిన్నిబిడ్డతో భుజింతుగాని.
జేజేలకును బువ్వ! శివునియౌదల పువ్వ!
జాబిల్లి రాగదే చందమామ!
మెండుచీకటి దొంగ! మెఱయుచుక్క బొజుంగ?
జాబిల్లిరాగదే చందమామ!
చిగురుకైదువుకామ చెలగురావుతుమామ!
జాబిల్లిరాగదే చందమామ!
చిన్నయన్నకు శ్రీరఘుశేఖరునకు
వెండిగిన్నియలోపల వెన్నపోసి,
పమిడిగిన్నియలోపల పాలుపోసి,
చాల దినిపించి పోగదే చందమామ!
***********
#దొంగబువ్వ
అన్నము పెట్టేవాళ్లు ముద్దలు కలిపి కన్నులుమూసుకొని
ఒక్కొక్క ముద్దఎత్తి పట్టుకొని ఇట్లు చెప్పుతారు.
కుక్కే వచ్చి తింటుందో, నక్కేవచ్చి తింటుందో!
యెలికే వచ్చి తింటుందో, చిలకే వచ్చి తింటుందో!
పిల్లే వచ్చి తింటుందో, బల్లే వచ్చి తింటుందో!
మా అమ్మాయే తింటుందో!
మా అబ్బాయే తింటాడో!
యెవరు వచ్చి తింటారో,
యెవరు వచ్చి తింటారో!!
ఇట్లా చెపుతూ చెయ్యి అటూ ఇటూ తిప్పుతూ ఎరుగనట్టు బిడ్డ ముఖముదగ్గరకు
తీసుకొనిపోతే, తాను కానట్టు గటుక్కున మ్రింగును.
ఇట్లు అంతా తినిపించిన తర్వాత,
"చాకలి వాళ్ల కుక్క వచ్చి చల్లా అన్నం తినిపోయింది, పో ...
అమ్మాయి (అబ్బాయి) యింక నీకేది? నీకు లేదులే..."
అని ముగించి మూతి, చెయ్యి కడుగుతారు.
***********
#ఈశ్వరుడు
లోకమ్ము వారికీ రొండు కన్నుల్లు;
లోకరక్షక, నీకు వేయికన్నుల్లు!
ఇద్దరుపెండ్లాలు, ఈశ్వరుడ నీకు;
పలువరుస చక్కనిది పార్వతీదేవి!
కన్నుల్లు చక్కన్న కనకదుర్గకును,
ఇద్దరుపెండ్లాము లేలయ్య నీకు?
ఎద్దెక్కి తిరిగేవు ఈశ్వరుడ నీవు,
బిచ్చమెత్తిందాక బిడ్డలకు లేదు!
అడిగి తెచ్చిందాక ఆలికే లేదు!!
***********
#గచ్చకాయలు
ఒక్కటి ఓ చెలియా,
రెండూ రోకళ్లు;
మూడూ ముచ్చిలికా,
నాలుగు నందన్నా;
అయిదుం బేడల్లు,
ఆరుంజవ్వాజి;
ఏడూ యెలమంద,
ఎనిమిది మనమంద;
తొమ్మిది తోకుచ్చు,
పది పటనేడు
***********
#బలాబలాలు
చెన్నపట్నం, చెరుకుముక్క,
నీకోముక్క, నాకోముక్క;
భీముడుపట్నం, బిందెలజోడు,
నీకో బిందె, నాకో బిందె;
కాళీపట్నం, కాసులజోడు,
నీకోకాసు, నాకోకాసు
***********
#నెత్తిమీద_గోరింక
ఓఅ(బ్బా)మ్మాయి నెత్తిమీద గోరింక;
చెప్పకు చెప్పకు చెడిపోతావు,
చెప్పితే నీ ముక్కు తెగ్గోస్తా,
దూలంమీంచీ దూకిస్తా,
పందిరిమీంచీ పాకిస్తా,
కంచం అన్నం తినిపిస్తా,
కడివెడునీళ్లు తాగిస్తా!
***********
#మేలుకొలుపు
చిన్నారి పొన్నారి చిట్టినా తల్లి!
చుక్కల్లో చంద్రుడూ చూడవచ్చాడు.
తెల్లవారొచ్చింది కోడి కూసింది,
చూచేటిఅక్కల్లు చూడరారమ్మ.
ఆడేటి అక్కల్లు ఆడరారమ్మ,
ఆడుకోరారమ్మ అక్కల్లు మీరు.
ఆడేటివారికి అచ్చావుపాలు,
పాడేటివారికి పాలు పంచదార
***********
#జడుపు
(పసిబిడ్డను ముందు కూర్చుండబెట్టుకుని యీ క్రింది పదము చెప్పుతూ చివరకు కళ్లలో "ఉఫ్" అని ఊదితే బిడ్డ కళ్లు మూస్తుంది. "అదుగో జడిసినావులే" అని గేలి చేస్తారు. అందాకా "జడవను, జడవను" అని బదులు చెప్పుతుంది.)
నూకలు పెడతాను మేకలు గాస్తావు?కాస్తా!పెద్దపులివస్తే జడవవుగద?జడవను!చిఱతపులివస్తే జడవవుగద?జడవను!ఎలుగుబంటివస్తే జడవవుగద?జడవను!సివంగివస్తే జడవవుగద?జడవను!తోడేలువస్తే జడవవుగద?జడవను!అన్నింటికీ "జడవను" అని చెప్పును.నే వస్తే జడవవు కద?(ఇది చెప్పి కళ్లలో ఊదవలెను;
బిడ్డ కన్నులు మూసుకొనును.)
జడిసినావులే అమ్మా జడిసినావు!!
***********
#బండిపాట
బండోయమ్మ బండి
బండికి కుచ్చులు తెండి
సుబ్బారాయుడు పెండ్లి,
చూచివత్తాం రండి
అమ్మ నాకు బువ్వ,
అరచేతిలో గవ్వనీళ్ల మీద నిప్పు,
అల్లరి పిల్లల ఒప్పు
చేయబోకు తప్పు,
చేస్తే కాలిచెప్పు
************
#బొమ్మలపెండ్లి
(బాలికలు చందనపు బొమ్మలకు పెండ్లితంతు నడిపింతురు. అప్పుడీ పదము పాడుదురు.)
చిట్టిబొమ్మల పెండ్లి చేయవలెననగా,
శృంగారవాకిళ్లు సిరితోరణాలు;
గాజుపాలికలతో, గాజుకుండలతో,
అరటి స్తంభాలతో అమరె పెండ్లరుగు.
చిన్నన్న పెట్టెనే వన్నెచీరల్లు,
పెద్దన్నపెట్టెనే పెట్టెల్లసొమ్ము,
నూరుదునె బొమ్మ, నీకు నూటొక్కకొమ్ము,
పోతునే బొమ్మ నీకు పొన్నేఱునీళ్లు.
కట్టుదునె బొమ్మ, నీకు కరకంచుచీర,
తొడుగుదునె బొమ్మ, నీకు తోపంచురవిక,
ఒడిబియ్యం పెడుదునే, ఒడిగిన్నె పెడుదు,
అత్తవారింటికీ పోయి రమ్మందు.
అత్తచెప్పినమాట వినవె ఓ బొమ్మ!
మామచెప్పినపనీ మానకే బొమ్మ!
రావాకుచిలకమ్మ ఆడవే పాప!
రాజుల్లు నీచెయ్ది చూడవచ్చేరు.
ప్రధానపుంగరం పమిడివత్తుల్లు
గణగణగ వాయిస్తు గంటవాయిస్తు,
గజంబరాయడూ తల్లి రాగాను,
తల్లి ముందరనిలచి యిట్లన్ని పలికె.
అన్న అందలమెక్కి, తాగుఱ్ఱమెక్కి,
గుఱ్ఱమ్ముమీదను పల్లమున్నాది,
పల్లమ్ముమీదను బాలుడున్నాడు,
బాలుడి ముందరికి కూతుర్నిదేరె,
కూతురిసిగలోకి కురువేరు దేరె,
నాకొక్క ముత్యాలబొట్టు దేరమ్మ!
బొట్టుకు బొమ్మంచు చీర దేరమ్మ!
చీరకు చిలకల్ల రవికె దేరమ్మ!
రవికకు రత్నాలపేరు దేరమ్మ!
పేరుకు పెట్టెల్ల సొమ్ము దేరమ్మ!
చిన్నన్న దెచ్చాడు చింతాకుచీర,
పెద్దన్న తెచ్చాడు పెట్టెల్ల సొమ్ము,
రావాకు చిలకతో ఆడబోకమ్మ,
రాజుల్లు నీచెయిది చూడవచ్చేరు.
వీధిలో ముడివిప్పి ముడువబోకమ్మ,
పల్లెత్తి గట్టిగా పలుకబోకమ్మ,
పొరుగిళ్లకెప్పుడూ పోవకేబొమ్మ,
నలుగురీ నోళ్లల్లో నానకేబొమ్మ!
(ఈ బొమ్మల పెండ్లిళ్లలో వియ్యాల వారి విందులు, అలకలు, మొదలుగాగల పెండ్లి మర్యాదలన్నీ నడుపుదురు. ఇది భావికాలమందు వాస్తవముగా జరుగబోయే విషయములకు అభ్యాసకృత్య మనవచ్చును; యాజ్ఞికుల శుష్కేష్టుల వంటిది. దీనిచే పసితనముననే బాలికలకు, కులాచార సంప్రదాయములందు ప్రవేశ మేర్పడును. ఈ యలవాటుచే నటు తర్వాత వానిని చక్కగా
జరుపుకోగల్గుదురు.)
ఎండావానా పెళ్లాడే,
ఎడవల్లప్పయ్య యాజ్ఞీకుడు!
(ఎండ కాస్తుండగానే, వాన కురుస్తున్నప్పుడు పాడే పాట)
No comments:
Post a Comment