Monday, July 11, 2022

కర్మఫలం కర్మానుభవం రెండు రకాలు:- త్రివిధ తాపాలు

 🪷🪷 "33" 🪷🪷

🪷🪷 "కర్మ - జన్మ" 🪷🪷🪷


 కర్మఫలం 

 కర్మానుభవం రెండు రకాలు:-  

                       

  "పదార్థంతో తయారు కాబడ్డ శరీరంతో మనం కర్మలని చేస్తూంటాం. మరణంతో ఈ శరీరం నశిస్తుంది. కాని కర్మలు నశించవు అని కర్మ సిద్ధాంతం." 


  "కాబట్టి మనిషి చేసే కర్మ శరీరం నించి పుట్టింది కాదు. మనిషి చేసే కర్మలకి ఆధారం ఈ శరీరాన్ని ఆవరించుకుని ఉన్న మనసే. కాబట్టి కర్మ ఫలం కూడా మరో శరీరంలోని మనసుతోనే అనుభవిస్తాం." 


 "శారీరకంగా అనుభవించే రోగాలు, అవకరాలు, శీతోష్ణస్థితుల వల్ల కలిగే బాధలు, అధిక శారీరక శ్రమ మొదలైన రూపాల్లోనివి శరీరంతో అనుభవిస్తున్నామని మనం భావించినా, అందులోని మనసుతోనే అనుభవిస్తాం. అవి శరీరానుభవాలుగా భ్రమిస్తామంతే." 


  "శరీరానుభవానికి చెందని మిగిలినవన్నీ మానసిక అనుభవాలే. ప్రమోషన్, ధన నష్టం, ప్రేమ సఫలం అవడం, ప్రేమించేవారి మరణం, ఉద్యోగం పోవడం, రావడం, ఇచ్చిన అప్పు తిరిగి రాబట్టుకోలేక పోవడం, లాటరీ తగలడం, ఆత్మ న్యూనతా భావం, ఎన్నికల్లో ఓడిపోవడం... మొదలైన సవాలక్ష కష్టాలని మనం మానసికంగానే అనుభవిస్తాం. వాటి మీద నించి మనసు తీసేస్తే అప్పుడు ఆ అనుభవం ఉండదు." 


  త్రివిధ తాపాలు 

                    

  "దుష్కర్మలకి ఫలంగా ప్రారబ్ద కష్టాలు మనకి మూడు రకాలుగా ప్రాప్తిస్తాయి అని శాస్త్రం చెప్తోంది. వేదాంతపరంగా వాటిని త్రివిధ తాపాలు అంటారు. త్రయం అంటే మూడు. మూడు రకాల దుఃఖాలకి తాపత్రయాలు అని పేరు. అవి..." 


 1. అధిదైవిక దుఃఖం:-  

                      

  "తుఫాను, భూకంపం, వడకొట్టడం, వరదలు, చలి లాంటి అనేక ప్రకృతి సహజమైన వాటివల్ల, యక్ష, రాక్షస, పిశాచ గ్రహాల వల్ల కలిగే దుఃఖం దీని కిందకి వస్తాయి. ఇవి సామూహికంగా అనుభవిస్తాం. ఎండకి నీడన చేరడం ద్వారా, చలికి కంబళి కప్పుకోవడం ద్వారా, ఇలా ఆ బాధలని నివారించుకోవచ్చును." 


 2. ఆధిభౌతిక దుఃఖం:    

                      

  "ఇది పూర్వజన్మలో చేసిన కర్మ ఫలంగా లభించే దుఃఖం. ఇవి రెండు రకాలు. ఒకటి శారీరకం. రెండోది మానసికం." 


  "మన శరీరంలోని కఫ, వాత, పిత్తాలనే ధాతువులలోని తేడా వల్ల కలిగే అనారోగ్యం అనే దుఃఖం శారీరక దుఃఖం. లేదా ఇతర జీవుల వల్ల అంటే మనుషులు, పశువులు, పక్షులు, పాములు లాంటి ఇతరుల వల్ల కలిగే దుఃఖం కూడా దీని కిందకే వస్తుంది.. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల వల్ల కలిగే మానసిక దుఃఖాలు రెండో రకానికి చెందినవి. శరీరం, మనసుల్లోని ధాతువుల వల్ల ఈ రెండు రకాల దుఖాలు ఏర్పడతాయి. ఇది జీవికి, జీవికి కర్మ ఫలాలని బట్టి మారి వారు ఒంటరిగా అనుభవిస్తారు." 


  "మొదటి రకం దుఃఖ నివారణ ఔషధం తీసుకోవడం ద్వారా, రెండో , రకం దుఃఖం వైరాగ్యం ద్వారా నివారించబడతాయి. యంత్ర, తంత్ర, మంత్రాల ద్వారా కూడా ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చు." 


 3. ఆధ్యాత్మిక దుఃఖం:-  

                      

  "నేనెవర్ని? ఈ జన్మ ఎందుకు వచ్చింది? నా గతేమిటి? నేనీ జనన మరణ చక్రంలోంచి ఎలా బయట పడతాను అనే విచారమే ఆధ్యాత్మిక దుఃఖం. కొంత ఆథ్యాత్మిక జ్ఞానం ఆర్జిస్తే కాని సాధారణంగా ఇది కలగదు. భగవంతుడ్ని ప్రార్ధించడం ద్వారా, సద్గురువు ప్రాప్తి ద్వారా ఈ తాపం ఈ నశిస్తుంది." 


 "అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే!  

 ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవేనమః!!" 

                                    - గురు గీత


  భావం:-  

          

  "అనేక జన్మల నించి పోగుచేసుకున్న కర్మ బంధాలని నాశనం చేసుకునే మార్గాన్ని చూపించి, ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించే గురువుకి నమస్కారాలు." 


 "అజ్ఞాన తిమిరాంధస్య, జ్ఞానాంజన శలాకయా!  

 చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవేనమః!!" 


  భావం:-  

           

  "అజ్ఞానం అనే అంధకారంలో అలమిటించే మన కళ్ళకి జ్ఞానం అనే అంజనాన్ని ప్రసాదించే గురువుకి నమస్కారం," 


  "ఒకేసారి పాప పుణ్యానుభవాలు":  


  దుర్లభం సదా సుఖం = "ఎల్లప్పుడూ సుఖం లభించడం దుర్లభం. అలాగే ఎప్పుడూ దుఃఖానుభవమే రాదు." 


  "ఎందుకంటే సాధారణంగా దుఃఖాన్ని మాత్రమే ఇచ్చే పాపకర్మనే లేదా సుఖాన్ని మాత్రమే ఇచ్చే పుణ్యకర్మనే మనిషి అనుభవించడం అరుదు. రెండూ కలిసి ఒకే సమయంలో అనుభవిస్తాడు. ఇందుకు ఉదాహరణ - కర్నాటక రాష్ట్రంలో, కొల్లూరులోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఓ కుంటి బిచ్చగాడు." 


  "అతను ఉదయం ఆరు నించి రాత్రి పది దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటాడు. తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వెయ్యరని సాధారణ బిచ్చగాడి జీవితమే గడుపుతున్నాడు. రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకొంటాడు. మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్నే తింటాడతను. చిరిగిన దుస్తులే ధరిస్తాడు." 


  "ఆ వృత్తిలో నెలకి పదివేలకి తక్కువ సంపాదించడు. సంపాదించేది సుకర్మని, కాని అదే సమయంలో కటిక దారిద్ర్యాన్ని అనుభవించే దుష్కర్మని, ఒకేసారి అతను ఈ జన్మలో అనుభవిస్తూ తన సంపాదనతో అతని ఇద్దరి కొడుకులని ఎం.బి.బి.ఎస్ చదివిస్తున్నాడు. ఆ విధంగా వారి ఋణానుబంధాన్ని కూడా అలా తీర్చుకుంటున్నాడు." 


  జీవితమే కర్మల సూచిక:- 

                          

 "మనిషి జీవితాన్ని బట్టి అతని సంచిత కర్మల్లోని పాప పుణ్యాలని అంచనా వేయచ్చు. ఎవరి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుందో వారికి పాపానికి సంబంధించిన కర్మలు తక్కువ, పుణ్యానికి సంబంధించిన కర్మలు ఎక్కువ వున్నాయని భావించవచ్చును." 


 "ఎవరి జీవితంలో కష్ట సుఖాలు సమానంగా ఉన్నాయో వారు గత జన్మలో పుణ్య పాపాలు సమానంగా చేసారని భావించవచ్చు. ఎవరికైతే పేదరికం, కష్టాలు, రోగాలు అధికంగా ఉన్నాయో వారి సంచిత కర్మల్లో దుష్కర్మల శాతం అధికంగా వున్నాయని ఊ హించవచ్చును." 

           🌼🪷🌼🪷🌼

                 🌼🕉🌼

No comments:

Post a Comment