Monday, July 11, 2022

ఏది ధర్మం?

  ఏది ధర్మం? 

                    ➖➖➖

 

 శరీరం, మనసు, బుద్ధి ఈ మూడింటి ద్వారా జరిగే వేదశాస్త్ర విహితమైన సత్కర్మను ధర్మంగా పేర్కొనడం భారతీయ తత్వశాస్త్రంలో మనం చూడగలం. తనకు, ఇతరులకు ఏ పని వల్ల కీడు జరగదో, ఏ భావం వల్ల ప్రకృతికి, సకల జీవరాశులకు హాని జరగదో దాన్ని ధర్మంగా పరిగిణించవచ్చు.  


 వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాస పురాణాలు, మహర్షుల ప్రబోధాలు దేశ, కాల , జాతి, కుల, వర్గ, మత విచక్షణలతో నిమిత్తం లేకుండా నిర్వహించి, ఆచరించాలని సూచించేదే ధర్మం. 


 సభ్యత, సంస్కృతి, సంప్రదాయం, ఆచార వ్యవహారాలన్నవి యుగాలు, కాలాలు, ప్రాంతాలు, మతాలు, వర్గాలను బట్టి మారతాయేమో కాని భారతీయ సనాతన ధర్మం ఎన్నిటికీ మారదు. అది శాశ్వతమైనది, స్థిర మైనది. సర్వజీవుల్లోను దైవాన్ని దర్శించి ఆరాధించాలంటుంది సనాతన ధర్మం.  


 మనిషిని మహర్షిగా, అవధూతగా, ప్రవక్తగా తీర్చిదిద్దే మహత్తర శక్తి ధర్మంలో ఉంది. మన ఆధ్యాత్మిక సంపదంతా ధర్మం మీదనే ఆధారపడి ఉంది. 


 దేవ ఋణం, పితృ ఋణం. ఋషి ఋణం ధర్మాచరణలో ప్రధానమైన అంశాలు!  


 వ్రతాలు, నోములు, మొక్కుబడులు, తీర్థయాత్రలు ఇవన్నీ దేవ ఋణానికి సంబంధించినవి. 


 తల్లిదండ్రుల్ని శ్రద్ధాభక్తులతో సేవించడం పితృఋణం అనిపించుకుంటుంది.  


 సద్గ్రంథ పఠనం, ప్రవచన శ్రవణం, ఋషులను సేవించడం ఋషి ఋణం.  


 ఇవేకాక, ప్రతి మనిషీ బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, అతిథియజ్ఞం, భూతయజ్ఞం అనే పంచ మహాయజ్ఞాలను నిర్వర్తించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. 


 నిత్య అనుష్ఠాన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వర్తించడం బ్రహ్మయజ్ఞం, హోమాలు, యుగాల ద్వారా దేవతల్ని తృప్తిపరచడం దేవయజ్ఞం. జీవించి ఉన్నంతకాలం తల్లిదండ్రులకు ఉపచర్యలు చేసి, మరణానంతరం యథావిధిగా శ్రాద్ధకర్మలు చేసి, వారికి ఆత్మశాంతి కలిగించడం పితృయజ్ఞం అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టి అవకాశం లేకపోతే స్వయంపాకానికి సరిపడా ఆహార పదార్థాలనైనా ఇవ్వడం సముచితం. వండిన అన్నంలోంచి ఓ ముద్దతీసి పక్షులకు, జంతువులకు వేస్తే దాన్ని భూతయజ్ఞం అంటారు. 


 రాముడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు. సీత వనవాస సమయంలో రాముణ్ని ‘మనం ఇప్పుడు మునివృత్తిలో ఉన్నాం. ఇంక మీ చేతిలో ధనుర్భాణాలెందుకు?’ అని ప్రశ్నిస్తుంది.  


 రాముడు ‘రాక్షసులు ఏమైనా హాని తలపెడితే మునులను రక్షించాలి కదా! ఇది నా క్షత్రియ ధర్మం. అదుకే ధనుస్సు ధరించాను’ అని బదులిస్తాడు.  


 ఆయన ధర్మవర్తనమంతా పరిశీలిస్తే రాముణ్ని ధర్మం అనుసరించిందా, ధర్మాన్ని రాముడు అనుసరించాడా?’ అని మనకు అనిపిస్తుంది. 


 ధర్మవ్యాధుడు అనేవాడు మాంసాన్ని విక్రయించడమే వృత్తిగా పెట్టుకున్నాడు. అది అతడి వృత్తిధర్మం. వృత్తినే దైవంగా భావించేవాడెన్నడూ ధర్మం తప్పడు. అంతటి ధర్మబుద్ధుడు కావడం వల్లనే, కౌశిక మహర్షికి ధర్మప్రబోధం చేసి కనువిప్పు కలిగించాడు.  


 సత్యం, అహింస, ప్రేమ, సేవ, సదాచరణ ధర్మం నుంచే ఆవిర్భవించాయి. మనిషికి మనసు, మస్తిష్కం ఈ రెండూ ప్రసాదించాడు భగవంతుడు. చిత్రమేమంటే, ఇంత శక్తిమంతుడైన మనిషి ధర్మం తప్పుతున్నాడు. సృష్టిలోని పంచభూతాలు, ఇతర ప్రాణులు అన్నీ తమ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నాయి. 


 మనిషి మనసును, బుద్ధిని కేవలం స్వార్థానికే వినియోగించు కుంటున్నాడు. ధర్మాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాడు. లౌకిక సుఖాలకు పెట్టుబడి ధర్మం.  


 భరతజాతికి శ్వాస ధర్మం, ఈ జాతి మనుగడకు ఆశ ధర్మం. జాతి ఇహపర సాధనకు ధర్మాచరణ వినా మరో మార్గం లేదు! ✍️ 


No comments:

Post a Comment