మనకు కనిపించేది ఈ దేహము. దీనిని శుద్ధిచేయాలంటే గంగాస్నానము, పవిత్ర జలాలలో స్నానము, పరిశుభ్రంగాఉండటం, పూజలు వ్రతాలు చేయడం మొదలగునవి చేస్తాము. కాని మనసుకు పట్టిన మకిలను వదల్చడానికి విహిత కర్మ ఆచరణ, ఉపాసన, ధ్యానము, యోగము, జ్ఞానము ఇటువంటి సాధనములు ఎన్నో ఉన్నాయి. వాటి అన్నిటిలోకీ జ్ఞానము ముఖ్యమైనది. ఈ జ్ఞానము మన మనసులో ఉన్న అవిద్యను తొలగిస్తుంది. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుందంటే కొనుక్కుంటే రాదు. స్వయమ్ అంటే ఎవరికి వారు సంపాదించుకోవాలి. జ్ఞానం కలగడానికి గురువు, దైవము కేవలం తమ వంతు సాయం అందిస్తారు కానీ జ్ఞానం మాత్రం ఎవరికి వారు సంపాదించుకోవాలి. వచ్చిన జ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకురావాలి. ఇవన్నీ ఎవరికి వారు చేసుకోవాలి. అందుకే స్వయమ్ అనే పదాన్ని వాడారు.
జ్ఞానం సంపాదించడానికి ముందు కర్మయోగమును చక్కగా అవలంబించాలి. నిష్కామ కర్మను అనుష్టించాలి. ఇంద్రియ నిగ్రహము పాటించాలి. చిత్తశుద్ధి కలగాలి. అప్పుడే జ్ఞానం సంపాదించడానికి అర్హుడు అవుతాడు. ఈ జ్ఞానం ఎక్కడపుడుతుంది అంటే ఎవడి హృదయంలో వాడికి జ్ఞానం పుడుతుంది. ఒకరి హృదయంలో పుట్టిన జ్ఞానము మరొకరికి పంచడం కుదరదు. ఎవడికి వాడే జ్ఞానం సంపాదించి అనుభవించాలి.
ఈ జ్ఞానం రావడానికి ఇంత సమయం అని లేదు. ఎంతో కాలం పట్టవచ్చు కొద్దికాలంలోనే రావచ్చు. చిత్మము ఎప్పుడు నిర్మలమై జ్ఞానం సంపాదించడానికి అనువుగా ఉంటుందో అప్పుడే జ్ఞానోదయం అవుతుంది. అది వారు చేసే సాధనలను బట్టి, సాధనల తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంత కాలము సాధన చేసాను. ఇంకా నాకు జ్ఞానం రాలేదే. అని బాధ పడకూడదు. ప్రయత్నం చేయాలి. ఎంతకాలమైనా వేచి ఉండాలి. ఓపికగా ఉండాలి. ఎవరి ప్రయత్నమును బట్టి వారికి ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానోదయం అవుతుంది. కాయ పండాలంటే సమయం కావాలి. తల్లి గర్భంలో శిశువు తొమ్మిది నెలలు ఉంటేగానీ బయటకు రాడు ఇదీ అంతే. మొక్క మాను కావడానికి ఎంతోకాలం పడుతుంది. కాబట్టి ఓర్పుతో, నిశ్చల మనస్సుతో, నిష్కామకర్మలు చేస్తూ, ప్రాణాయామం లాంటి సాధనలుచేసి ఇంద్రియ, మనో నిగ్రహములను పాటిస్తే, హృదయం నిర్మలంగా ఉంచుకుంటే, జ్ఞానము తప్పకుండా కలుగుతుంది.
No comments:
Post a Comment